Devotional

మహాశివరాత్రికి ప్రత్యేక ఏర్పాట్లు – TNI ఆధ్యాత్మిక వార్తలు 25/02/2022

మహాశివరాత్రికి ప్రత్యేక ఏర్పాట్లు – TNI  ఆధ్యాత్మిక వార్తలు  25/02/2022

ఏ.పి.యస్.ఆర్.టి.సి 01.03.2022, మహాశివరాత్రి పర్వ దినము పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్దమై 96 శైవ క్షేత్రాలకు, వివిధ ప్రాంతముల నుండి సుమారుగా 21 లక్షల మంది ప్రయాణికులు వస్తారనే అంచనాతో, 3225 బస్సులలో చేరవేయుటకు తగు ఏర్పాటు చేయడమైనది.
1. గుంటూరు జిల్లా –కోటప్పకొండ కు 410 బస్సులలో 2.75 లక్షల మంది ప్రయాణికులను, కర్నూలు జిల్లా – శ్రీశైలంనకు 390 బస్సులలో 1.25 లక్షల మంది ప్రయాణికులను చేర వేయుటకు ప్రణాళిక సిద్ధము చేయడమైనది. అలాగే కడప జిల్లా – పొలతల, నిత్య పూజ కోన, పశ్చిమ గోదావరి జిల్లా – బలివె, పట్టిసీమల తదితర ప్రముఖ శైవ క్షేత్రములకు బస్సులు నడుపబడును.
2. గత రెండు సంవత్సరములనుండి డీజిల్ ధరలు పెరిగినప్పటికీ డీజిల్ భారము పెరిగినప్పటికీ కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేక బస్సు ప్రయాణ చార్జీలలో ఎటువంటి పెంపు లేకుండా గత సంవత్సర చార్జీలు వసూలు చేయబడును.
3. ఘాట్ రోడ్ ను దృష్టిలో ఉంచుకొని కోటప్పకొండ, శ్రీశైలం ,పొలతల తదితర శైవ క్షేత్రాలకు తిరుమల-తిరుపతి తిరుగు ఘాట్ రోడ్ బస్సులను మరియు క్షుణ్ణoగా తనిఖీ చేసిన ఇతర డిపో బస్సులను నడుపుటకు ప్రణాళిక సిద్దము చేయడమైనది.
అలాగే ప్రత్యేక తర్ఫీదు పొందిన డ్రైవర్లను ఈ ప్రత్యేక బస్సులు నడుపుటకు ప్రణాళిక చేయడమైనది.
4. బస్సులు ఎక్కు ప్రదేశములలో భక్తులకు మౌలిక వసతులగు త్రాగు నీరు, షామియానాలు, విచారణ కేంద్రములు తదితర మౌలిక వసతులతో కూడిన తాత్కాలిక బస్సు స్టేషన్లు ఏర్పాటు చేయడమైనది.
5. కోటప్పకొండ పుణ్య క్షేత్రమునకు ఏకాదశి పర్వ దినమున భక్తుల ప్రయాణ అవసరాలకు అనుగుణoగా బస్సులను ఏర్పాటు చేయడమైనది.
6. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా బస్సులను శానిటైజ్ చేసి త్రిప్పుటకు ఆదేశాలు జారీ చేయబడినవి.
7. ముఖ్యమైన కూడళ్లు మరియు ముఖ్య మలుపుల వద్ద సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్పెక్టర్ లను ఏర్పాటు చేసి భద్రతా ప్రయాణము అందించుటకు ప్రణాళిక చేయడమైనది.
8. శుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ తాత్కాలిక బస్సు స్టేషన్ల వద్ద కూడా బస్సులను శుబ్రపరచుటకు తగు ఆదేశాలు జారీచేయడమైనది.
9. ప్రయాణ అవసరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ అవసరమైన సందర్భములో మరిన్ని అదనపు బస్సులు త్రిప్పుటకు జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు మరియు రీజినల్ మేనేజర్లకు ఆదేశాలు ఇవ్వడము జరిగినది.
10. సమూహముగా పుణ్య క్షేత్రమునకు వెళ్లదలచిన భక్తులు సంబంధిత డిపో మేనేజర్లను సంప్రదించిన యెడల, తగు విధముగా బస్సులు ఏర్పాటు చేయమని అధికారులకు ఆదేశాలు తగు జారీ చేయడమైనది. శివ స్వాములు మరియు ఇతర భక్తాదులందరు కూడా ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సులను ఆదరించి కోవిడ్ నిబంధనలను పాటిస్తూ శైవ క్షేత్రాలను దర్శించ వలసినదిగా కోరడమైనది
*భగవంతుని సేవలో భక్తులు – భక్తుల సేవలో ఏ.పి.యస్.ఆర్.టి.సి. – మేనేజింగ్ డైరెక్టర్ ఏ.పి.యస్. ఆర్.టి.సి.

Region wise details of Holy shrines of Lord Siva
SL
NO Region No Places
1 NEC 6 Gumpa, Paramakonda, Punyagiri, Ramateerdhalu, Ravivalasa, Sabakota
2 VSP 5 Appikonda, Dharamattam, Kalyanapu Lova, Mathsyagundam, R.K Beach
3 EG 10 Addatigala, G.Mulapalem, GBS, Jaggampeta, Kotapadu, Kotipalli, Patapatnam, Rajavommangi, Rampa, Pithapuram,
4 WG 4 Balive, Pattiseema, Taduvai, Veerampalem
5 KRI 7 Ferry, Guttapadu, Iluru, Mukthayala, Neeladri, Pedakallepalli, Sangameswaram KRI
6 GNT 11 Kotappakonda, Amaravati, Aravapalli, Daida, Govada, Mannepalli, Quarry, Satrasala, Terala, Tripurantakam, Tsunduru
7 PKSM 3 Mogilicherla & Sangameswaram, Bramha Kona & Punugodu, Ramateerdham
8 NLR 7 Bhiravakona, Ekasani tippa, Gandavaram, Kotithhertham, Mogilicherla, Mypadu, Pantragam
9 CTR 14 Avanthi Kona, Gudimallam, Gudiyatham, Jhari, Kailasakona, Mallayyakonda, Mallappakonda, Mogili, Peddathirdamkona, Sadasivakona, Siddeswarakona, Srikalahasthi, Talakona, Tavalam
10 KDP 14 Polatala, Lankamala, B.Matam, K.Teedham, S.Devalalu, Jyothi, N.P.Kona, B.Kota, Talakona, G.Kona, Haritala, M.Konda, N.S.Matam, A.Kona,
11 KRNL 11 Srisailam Bhogeswaram, Brahmagundam, Jagannatha gattu, Kolanu Bharathi, Mahanandi, Omkaram, Rudra kodu, Sangameswaram,, Venkatapuram, Yaganti
12 ATP 3 Polathala, Timmama Marrimanu, Hemavati
Total 96
Plan of Spl. buses operations for Mahasivarathri 2022
(01.03.2022-02.03.2022)
S No Region No of Shrines Buses
1 NEC 6 175
2 VSP 6 250
3 EG 10 100
4 WG 4 175
5 KRI 7 225
6 GNT 11 800
7 PKSM 3 275
8 NLR 7 75
9 CTR 14 350
10 KDP 14 325
11 KRNL 11 450
12 ATP 3 25
Total 96 3225

1. మేడారం జాతర హుండీల లెక్కింపు.. తొలిరోజు ఆదాయం ఎంతంటే..?
మేడారం జాతర హుండీల లెక్కింపును బుధవారం ప్రారంభించారు. హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో సమ్మక్క సారలమ్మ జాతర హుండీలను తెరిచి ఆదాయాన్ని లెక్కించారు. మొత్తం 497 హుండీల్లో ఇప్పటివరకు 65 హుండీలను తెరిచారు. ఇప్పటివరకు రూ.1,34,60,000 ఆదాయం రాగా.. అధికారులు బ్యాంకులో జమ చేశారు. మాఘ పౌర్ణమి సందర్భంగా బుధవారం నుంచి శనివారం వరకు నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ జాతరకు కోటి మందికిపైగా తరలించారు.

2. మహాశివరాత్రి జాతరకు ముస్తాబవుతున్న వేములవాడ రాజన్న క్షేత్రం
దక్షిణ కాశీ వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం మహాశివరాత్రి జాతరకు ముస్తాబవుతోంది. ఈ నెల 28వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు మూడు రోజుల పాటు మహాశివరాత్రి జాతర ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోనే అతిపెద్దదైన వేములవాడ పుణ్యక్షేత్రంలో అత్యంత ప్రధానమైన పండుగగా భావించే మహాశివరాత్రి ఉత్సవాల మూడు రోజుల జాతరకు సుమారు రెండు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. జాతర ఏర్పాట్లలో భాగంగా 38 లక్షల రూపాయలతో చలువ పందిళ్లు ఏర్పాటుకు సంబంధించిన పనులు పూర్తి కాగా, పందిళ్ల డెకొరేషన్ పనులు తుది దశకు చేరాయి. 32 లక్షల రూపాయలతో ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను రంగు రంగుల విద్యుద్దీపాలతో అలంకరిస్తున్నారు. జాతర సందర్భంగా రాష్ట్ర సాంస్కృతిక శాఖ సహకారంతో శివార్చన పేరిట సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు 24 లక్షల రూపాయల అంచనా వ్యయంతో గుడి చెరువు స్థలంలో వేదిక, బారికేడింగ్, లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. కళాకారులకు పారితోషికం కోసం మరో 25 లక్షలు వెచ్చించారు. 15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలకు రంగులు వేస్తున్నారు. 10లక్షల అంచనా వ్యయంతో నటరాజ్ విగ్రహం నుండి జనరేటర్ షెడ్డు వరకు గల వీఐపీ రోడ్డును తారు రోడ్డుగా మార్చారు. 5 లక్షల రూపాయలతో ఫ్లెక్సి బ్యానర్లు, 4.50 లక్షలతో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. 4 లక్షలతో మూలవాగులో రోడ్డు నిర్మిస్తున్నారు. 3 లక్షలతో పార్కింగ్ స్థలాలలో బారికేడ్ ్స ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు క్యూలైన్లలో అందించడానికి వీలుగా 1.50 లక్షలతో మంచినీళ్ల ప్యాకెట్లు కొనుగోలు చేస్తున్నారు. జాతరకు సంబంధించిన పనులు 80 శాతం పూర్తయ్యాయని, మరో రెండు రోజుల్లో పనులన్నీ పూర్తి చేస్తామని ఆలయ ఈవో ఎల్.రమాదేవి తెలిపారు.

3. హంస వాహనంపై ఆదిదేవుడి వైభవం
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైలంలో మూడోరోజు గురువారం భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చాడు

4. స్వామివారి ఆభరణాలు
స్వామి రాకుమారుడుగా ధరించిన ఆభరణాలను పందల రాజు , స్వామి తండ్రి అయిన రాజశేఖరుని విన్నపాన్ని అంగీకరించి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతినాడు వాటిని స్వామి విగ్రహానికి అలంకరించడం జరుగుతున్నది ! ఆ ఆభరణాలు వుంచిన మూడు పెట్టెలు పంబల రాజవంశీయుల అధీనంలో ఉంటాయి ! మకర సంక్రాంతినాడు పెట్టెలను ఉత్సవంగా మేళతాళాలతో తలమీద వుంచుకుని బయలుదేరుతారు. ప్రస్తుత రాజవంశం రాజు , అప్పుడు స్వయంగా , అయ్యప్ప ఇచ్చిన కరవాలంతో నగల తో పాటు వస్తారు. ఆ సమయం లోనే ఆకాశమార్గాన పెద్ద గరుడ పక్షి ఎగురుతూ , పెట్టెలకు రక్షణగా , శబరిమల దాకా వచ్చి ఆలయం పై ప్రదక్షణాలు చేసి వెళ్ళి పోతుంది. శబరిమలమీద వున్న భక్తులకు ఆ పక్షి కనబడుతుంటుంది. దాన్ని చూసి ఆభరణాల పెట్టెలు బయలుదేరాయని గ్రహిస్తారు భక్తజనం !

5. 8.40 లక్షల టికెట్ల కోటా పూర్తి
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి సంబంధించి 8.40 లక్షల టికెట్ల కోటా బుకింగ్ పూర్తయింది. ఫిబ్రవరి నెల అదనపు కోటాతో పాటు, మార్చి నెలకు సంబంధించి మొత్తం 8.40 లక్షల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను కోటాను బుధవారం ఉదయం 9 గంటలకు విడుదల చేయగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు వాటిని బుక్ చేసుకునేందుకు భారీగా పోటీ పడ్డారు. ఈ క్రమంలో బుధవారం రాత్రికి అన్ని టికెట్లను భక్తులు బుక్ చేసుకున్నారు. వీటితో పాటు తిరుపతిలో ఆఫ్లైన్ ద్వారా ఇచ్చే టైంస్లాట్ సర్వదర్శన టోకెన ్ల సంఖ్యను కూడా 20 వేలకు పెంచిన విషయం తెలిసిందే. దీంతో శుక్రవారం నుంచి వేంకటేశ్వరస్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరగనుంది.

6. నేత్రపర్వంగా బ్రహ్మోత్సవాలు.. హంసవాహనంపై ఆది దంపతుల విహారం
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైల క్షేత్రంలో వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చన, శివపంచాక్షరీ జపానుష్టానాలు, రుద్రపారాయణలు, రుద్రహోమం, చండీహోమం నిర్వహించారు. సాయంత్రం హోమాల అనంతరం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలను ప్రత్యేకంగా అలంకరించిన హంసవాహనంపై వేంచేపు చేసి, అక్కమహాదేవి అలంకార మండపంలో షోడశోపచార పూజలు చేశారు. అనంతరం మంగళవాయిద్యాల నడుమ ఆలయోత్సవం, గ్రామోత్సవం నిర్వహించారు.

7. శీర్షాసనంలో శక్తీశ్వరుడు
పరమశివుణ్ణి ఆలయాల్లో సాధారణంగా లింగ రూపంలోనే చూస్తూంటాం. కానీ తలకిందులుగా… అంటే శీర్షాసనంలో పరమేశ్వరుడు దర్శనం ఇచ్చే అరుదైన ఆలయం పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి సమీపంలోని యనమదుర్రు గ్రామంలో ఉంది. ఈ ప్రాచీన ఆలయంలో ఒకే పీఠంపై శివుడు, పార్వతీదేవి, కుమారస్వామి కొలువై ఉండడం ఒక విశేషం కాగా… అమ్మవారు మాతృమూర్తిగా బాల సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి తన ఒడిలో చేర్చుకొని లాలిస్తున్నట్టు కనిపించడం మరింత ప్రత్యేకం.
***యనమదుర్రు శ్రీ శక్తీశ్వరస్వామి ఆలయాన్ని క్రీస్తుశకం తొమ్మిదో శతాబ్దంలో వేంగీ రాజ్యాన్ని పాలించిన తూర్పు చాళుక్యుల కాలంలో నిర్మించారు. పన్నెండో శతాబ్దంలో ఢిల్లీ సుల్తాన్లు కాకతీయ సామ్రాజ్యాన్ని జయించి… జరిపిన దాడుల్లో ఈ ఆలయం దెబ్బతిని, శిథిలమై, కనుమరుగైపోయింది. వందేళ్ళ కిందట తవ్వకాల్లో ఈ గుడి మళ్ళీ బయటపడింది. దక్షిణ కాశీగా ప్రశస్తి పొందిన ఈ క్షేత్రానికి పాలకుడు కుమారస్వామి. ఆయన సర్పాకృతిలో ఉంటాడనీ, ఈ ఆలయానికి, చెరువుకు రెండు నాగ సర్పాలు ఇటీవలి కాలం వరకూ కాపలా ఉండేవనీ, రోజూ బ్రహ్మీ ముహూర్తంలో… చెరువులో అవి వలయాకారంలో మూడుసార్లు తిరిగి, స్వామి దర్శనం చేసుకొని వెళ్ళేవనీ స్థానికులు చెబుతారు. భీమవరంలోని పంచారామ ఆలయం కన్నా ఇది పురాతనమైనదనీ, ఆ ఆలయం గురించీ, శక్తీశ్వరుడి గురించీ మహా కవి కాళిదాసు స్తుతించాడనీ, భోజరాజు, కాళిదాసు ఇక్కడకు వచ్చి పూజలు చేశారనీ కథనాలు ఉన్నాయి. శ్రీనాథ మహాకవి ‘కాశీఖండం’ కావ్యంలోనూ ఈ ఆలయ ప్రస్తావన కనిపిస్తుందంటారు.
**మహిమాన్వితం శక్తికుండంశక్తీశ్వరుడి ఆలయానికి ఎదురుగా ‘శక్తికుడం’ అనే చెరువు ఉంది. స్వామివారి అభిషేకాలకూ, నైవేద్యాలకూ ఈ నీటినే వినియోగిస్తారు. ఈ చెరువు చుట్టూ ప్రాకారం నిర్మించాలనే ఆలోచనతో… ఒకప్పుడు ఈ చెరువును ఎండగట్టారట. ఆ సమయంలో స్వామి కైంకర్యం కోసం వేరే చెరువు నీటిని ప్రసాదం తయారీకి ఉపయోగిస్తే… అది ఉడకలేదట. అప్పుడు ఎండగట్టిన చెరువులో అర్చకులు గుంట తవ్వగా నీరు వచ్చిందట. ఆ నీటిని వినియోగించగా… ప్రసాదం వెంటనే ఉడికిందట. అప్పటి నుంచీ స్వామి వారికి నివేదించే ప్రసాదం తయారీకి చెరువు నీటిని మాత్రమే ఉపయోగిస్తున్నారు.. శక్తికుండంలోని నీరు అత్యంత మహిమాన్వితమైనదనీ, దీనిలో స్నానం చేసినవారికి మృత్యుభయం ఉండదనీ, అకాల వ్యాధులు రావనీ, దీర్ఘకాలంగా వ్యాధులతో బాధపడుతున్నవారు ఈ కుండంలో నీటిని సేవిస్తే… రోగాలు నయమవుతాయనీ భక్తుల విశ్వాసం

8. తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. మొన్నటి 30 వేల మంది మాత్రమే శ్రీవారిని దర్శించుకునే వారు. నిన్న ఏకంగా 50 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 53,740 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 26,977 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.21 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

9. భూతవాహనంపైశ్రీకామాక్షిసమేతసోమస్కందమూర్తి…
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజైన గురువారం ఉదయం శ్రీ కపిలేశ్వరస్వామివారు కామాక్షి అమ్మవారి సమేతంగా భూత వాహనంపై అభ‌య‌మిచ్చారు. కోవిడ్ -19 నిబంధ‌న‌ల మేర‌కు వాహ‌న సేవ ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.పూర్వం క్రూరభూతాలు ప్రజలను బాధిస్తున్న వేళ పరమశివుని బ్రహ్మదేవుడు ఆ భూతాల నుంచి లోకాలను కాపాడమని వేడుకున్నారు.ఈ కార్యానికి నిర్జన ప్రదేశాలైన శ్మశానాలను తన ఆస్థానాలుగా చేసుకున్నాడు శివుడు.భూతాలను వశీకరించి శ్మశానాలలో ఉంచి బ్రహ్మసృష్టిని రక్షిస్తున్నాడని, నాటి నుండి ”భూతపతి”గా కీర్తించే జీవులకు భయాలను తొలగించి శివుడు రక్షిస్తున్నాడని భక్తుల విశ్వాసం. అందుకు ప్రతీకగా లయకారుడు భూతవాహనంపై అభయమిచ్చాడు.

10. రెండో రోజు మేడారం ఆదాయం రూ.2.50 కోట్లు
హనుమకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలో సమ్మక్క, సారలమ్మ జాతర హుండీల లెక్కింపు గురువారం రోజు ప్రశాంతంగా కొనసాగింది. 116 ఐరన్‌ హుండీలను విప్పి లెక్కించగా రెండోరోజు ఆదాయం రూ.2 కోట్ల50 లక్షల 62 వేలు వచ్చినట్టు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. దీంతో మొదటి, రెండోరోజు కలిపి లభించిన మొత్తం ఆదా యం రూ.3కోట్ల 85వేల 22వేలకు చేరుకున్నది. మొద టి రోజు 65 హుండీలను లెక్కించారు. గురువారం లెక్కించిన వాటిని కలుపుకొని మొత్తం హుండీలు 181కి చేరాయి. లెక్కించిన నగదును బ్యాంకు అధికారులకు వెంటనే అప్పగించారు. రెండోరోజు కూడా హుండీల నుంచి బంగారు, వెండి కానుకలు బయట పడ్డాయి. తాలిబొట్లు, గొలుసులు, వెండి కడియాల వంటివి ఉన్నట్టు తెలుస్తోంది. వీటిని సీలువేసిన ఐరన్‌ హుండీలో వేస్తున్నారు. నగదు లెక్కింపు పూర్తయిన తర్వాత వీటి విలువను అప్రేజర్ల సాయంతో మదింపు వేసి బ్యాంకు లాకర్లో భద్రపరుస్తారు. వేరే గుర్తింపు కార్డుతో..హుండీల లెక్కింపు సందర్భంగా ఒక మహిళా వలంటీర్‌ వేరే గుర్తింపు కార్డుతో లోపలికి ప్రవేశించినట్టు తెలిసింది. దీంతో భద్రతా సిబ్బంది ఆ మహిళను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మందలించి బయటకు పంపించి వేసినట్టు సమాచారం. కాగా, హుండీల లెక్కింపులో పాల్గొన్న మరొక మహిళ కొంత నగదును దొంగిలించేందుకు ప్రయత్నించగా భద్రాతా సిబ్బంది గుర్తించినట్టు తెలుస్తోంది. మందలించి వదిలిపెట్టినట్టు కూడా తెలిసింది. అయితే ఈ విషయాన్ని దేవాదాయ అధికారులు ధ్రువీకరించలేదు

11. టీటీడీ కీలక నిర్ణయం
వీఐపీ బ్రేక్‌ దర్శనాలపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, ఇప్పటికే శుక్రవారం వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేశారు. వీఐపీల కోసం కేటాయించిన సమయాన్ని కూడా సామాన్య భక్తులకే కేటాయించాలని టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.

12. మకర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన కపిలేశ్వరస్వామి..
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్రవారం ఉదయం శ్రీకపిలేశ్వరస్వామివారు సోమస్కందమూర్తిగా కామాక్షి అమ్మవారి సమేతంగా మకర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆల‌యంలో కరోనా నిబంధ‌న‌ల మేర‌కు వాహ‌న సేవ‌లు ఏకాంతంగా నిర్వ‌హించారు.అనంతరం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు అర్చకులు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షిదేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి 7 నుంచి రాత్రి 9 గంటల వరకు శేష వాహనంపై స్వామివారు భక్తులకు కనువిందు చేయనున్నారు.

13. సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనంలో ప్రాధాన్యత ఇచ్చేలా శని,అది వారాల్లో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టిటిడి
సర్వదర్శనం భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు శుక్ర,శని,ఆదివారాలలో సిఫార్సు లేఖల పై కేటాయించే విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేయడమైనది.విఐపిల కోసం కేటాయించిన సమయాన్నీ కూడా సామాన్య భక్తులకు కేటాయించేలా నిర్ణయం తీసుకోవడం జరిగింది.శుక్ర,శని,ఆదివారాలలో సర్వదర్శనం భక్తుల సౌకర్యార్దం అదనంగా దర్శన టోకన్లు జారి చేసేందుకు నిర్ణయించడమైనది. ఇప్పటికే రోజుకు సర్వదర్శనం భక్తులకు 30 వేల టోకన్లు జారి చేస్తున్న టిటిడిటిటిడి తాజా నిర్ణయంతో సర్వదర్శన భక్తులకు రోజుకు అదనంగా మరో రెండు గంటల దర్శన సమయం పెరుగుతుంది.