Editorials

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం – TNI 23 కధనాలు.

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం – TNI 23 కధనాలు.

1. రష్యా, ఉక్రెయిన్‌ వ్యవహారంలో ఒకే వైఖరితో భారత్‌, చైనా, పాక్‌ : నాగేశ్వర్‌
అంతర్జాతీయ వ్యవహార సూత్రాలను భారత్‌ సహా మిగతా దేశాలేవీ పాటించడంలేదని మాజీ ఎమ్మెల్సీ, సామాజిక విశ్లేషకుడు ఆచార్య కె.నాగేశ్వర్‌ వ్యాఖ్యానించారు. బలప్రయోగం ద్వారా ఒక దేశ సరిహద్దును మార్చడమంటే అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అన్నారు. రష్యా, ఉక్రెయిన్‌ దేశాల మధ్య ఘర్షణను అమెరికా అమితంగా కాంక్షిస్తుందని, ప్రస్తుత పరిస్థితి వల్ల అమెరికా వాణిజ్య, వ్యాపార వృద్ధి మరింత ముందుకు సాగనుందని వివరించారు. ‘‘ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీలో రష్యా తీరును ఐదు దేశాలు సమర్థిస్తే, 141 దేశాలు వ్యతిరేకించాయి. మరో 35దేశాలు తటస్థంగా ఉంటే, అందులో భారత్‌, చైనా, పాకిస్థాన్‌ ఒకే వైఖరి తీసుకోవడం విశేషమని’’ అన్నారు. ఇలాంటి పరిస్థితిలో భారత్‌ డిప్లొమసీతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు.

2. విద్యార్థుల తరలింపునకు రష్యా సహకారం కోరండి : ఉక్రెయిన్
ఆఫ్రికా, ఆసియా దేశాల విద్యార్థులను తమ దేశం మూడు దశాబ్దాలుగా స్వాగతిస్తోందని, నేడు రష్యా యుద్ధం వల్ల వారు ఇబ్బందులు అనుభవిస్తున్నారని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ఆదివారం ఓ టెలివైజ్డ్ మెసేజ్‌లో చెప్పారు. విదేశీ విద్యార్థులు సురక్షితంగా ఉక్రెయిన్ నుంచి బయటకు వెళ్ళడానికి సహకరించాలని రష్యాను కోరాలని తెలిపారు. 30 ఏళ్ళ నుంచి ఆఫ్రికా, ఆసియా దేశాల నుంచి వేలాది మంది విద్యార్థులకు ఉక్రెయిన్ స్వాగతం పలుకుతోందన్నారు. వారికి తమ దేశంలో ఎన్నడూ, ఎటువంటి సమస్యలు ఎదురవలేదన్నారు. వారంతా కలిసి మెలిసి ఉండేవారని చెప్పారు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత సైతం చాలా మంది తమ దేశంలోనే ఉండిపోతున్నారన్నారు. రష్యా యుద్ధం వల్ల ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని తెలిపారు. ఉక్రెయినియన్లతోపాటు విదేశీ విద్యార్థులు కూడా ఇబ్బందులు అనుభవిస్తున్నారన్నారు. రష్యా విచక్షణారహితంగా కాల్పులు జరుపుతోందని, బాంబులు కురిపిస్తోందని చెప్పారు. ముట్టడిలో ఉన్న నగరాల నుంచి విద్యార్థులు సురక్షితంగా బయటకు వెళ్ళడానికి వీలుగా కాల్పులను ఆపడం ఒక్కటే రష్యా చేయగలిగిన మంచి పని అని తెలిపారు. ఖార్కివ్, సుమీల నుంచి విదేశీయులను తరలించడం కోసం తాము కొన్ని రైళ్ళను ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యార్థులకు అన్ని విధాలుగా అవసరమైన సహాయాన్ని అందజేయడం కోసం హాట్‌లైన్స్ ఏర్పాటు చేశామని, ఎంబసీలతో సన్నిహితంగా పని చేస్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం సాద్యమైనంత అత్యుత్తమ స్థాయిలో కృషి చేస్తున్నట్లు తెలిపారు. కాల్పుల విరమణకు రష్యా అంగీకరిస్తే, విద్యార్థులందరినీ సురక్షితంగా తరలించవచ్చునని తెలిపారు. భారత్, చైనా, నైజీరియా దేశాలకు చెందిన విద్యార్థులు ఖార్కివ్, సుమీ నగరాల్లో చిక్కుకున్నారని, ఆ దేశాలు రష్యాతో మాట్లాడాలని కోరారు. కాల్పులను ఆపాలని, ఉక్రెయిన్ నుంచి విద్యార్థులు వెళ్ళిపోవడానికి సహకరించాలని కోరాలని తెలిపారు. విద్యార్థులను ఉక్రెయిన్ బందీలుగా ఉంచిందని, వారి హక్కులను ఉల్లంఘిస్తోందని, వారి పట్ల వివక్ష చూపుతోందని ఆరోపిస్తూ ఈ దేశాల సానుభూతిని పొందేందుకు రష్యా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ‘‘30 ఏళ్ళ పాటు మీ విద్యార్థులకు నిజమైన ఇల్లుగా ఉక్రెయిన్ ఉంది. రష్యా కాల్పుల సమయంలో కూడా ఇది కొనసాగుతుంది. ఓ దేశం ఓ రోజులో మారిపోబోదు’’ అని తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఫిబ్రవరి 24న ప్రారంభమైనప్పటి నుంచి ఎక్కువ ప్రభావితమైన నగరాల్లో ఖార్కివ్, సుమీ ఉన్నాయి. ఖార్కివ్‌ నుంచి భారతీయులందరినీ తరలించామని భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. సుమీ నగరంలోని భారతీయులను తరలించడంపై దృష్టి పెట్టినట్లు తెలిపింది. వీరిని తరలించేందుకు వీలుగా కాల్పులను విరమించాలని రష్యా, ఉక్రెయిన్లను కోరినట్లు తెలిపింది.

3. ఉక్రెయిన్‌లో ఉన్న విద్యార్థుల కోసం కేంద్రమంత్రితో డీఎంకే ఎంపీల కమిటీ భేటీ
ఉక్రెయిన్‌లోని తమిళ విద్యార్థులను స్వస్థలాల తరలించే పనులను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎంపీల కమిటీ ఢిల్లీలో కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జయశంకర్‌తో భేటీ అయింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకూ రాష్ట్రానికి చెందిన 777 మంది విద్యార్థులను స్వస్థలాలకు తరలించారు. ఈ నేపథ్యంలో యుద్ధవాతావరణంలో ఆహారం లేకుండా అలమటిస్తున్న వేలాదిమంది తమిళ విద్యార్థులను సురక్షితంగా స్వస్థలాలకు తరలించే పనులను పర్యవేక్షించేందుకు డీఎంకే ఎంపీలు తిరుచ్చి శివ, కళానిధి వీరాస్వామి, అబ్దుల్లా, శాసనసభ్యుడు టీఆర్‌పీ రాజా, ఐఏఎస్‌ అధికారులు కమల్‌కిశోర్‌, ఎం.ప్రదీప్‌కుమార్‌, అజయ్‌ యాదవ్‌, గోవిందరావు, ప్రవాస తమిళుల సంక్షేమ బోర్డు అధికారి జెసిథా లాజరస్‌తో ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ శనివారం ఉదయం ఢిల్లీలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్‌ను కలుసుకున్నారు. ఉక్రెయిన్‌ సరిహద్దుల్లోని తమిళ విద్యార్థులు స్వస్థలాలకు తీసుకెళ్లే విమానాల కోసం ఎదురు చూస్తున్నారని, సుమీ ప్రాంతాల్లో వంద మంది తమిళ విద్యార్థులు ఆహారం లేక అలమటిస్తున్నారని, వీరిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఈ కమిటీ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసింది. పోలండ్‌, రుమేనియా, హంగేరి వెళ్లేందుకు తమకు తగు సదుపాయాలు సమకూర్చమని కూడా కోరారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జయశంకర్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉక్రెయిన్‌పై రాష్యా తాత్కాలిక యుద్ధ విరమణ ప్రకటించడంతో అక్కడి తమిళ విద్యార్థులను వీలైనంత త్వరగా స్వస్థలాలకు తరలించగలమని హామీనిచ్చారు. ఈ పరిస్థితుల్లో కమిటీ సభ్యులు రష్యా, ఉక్రెయిన్‌ దేశాలకు వెళ్ళాల్సిన అవసరం ఉండకపోవచ్చని తెలిపారు.
*తిరిగొచ్చిన పొన్నేరి విద్యార్థిని…
ఉయిన్‌ నుంచి పొన్నేరికి చెందిన వైద్య విద్యార్థిని రిత్తికా క్షేమంగా స్వస్థలానికి చేరుకుంది. ఉక్రెయిన్‌లో రిత్తికా మూడేళ్లుగా ఎంబీబీఎస్‌ చదువుతోంది. పడమటి ఉక్రెయిన్‌లో ఉన్న రిత్తికా గత వారం రోజులుగా ఆహారం లేక అలమటించింది. చివరకు రాష్ట్ర ప్రభుత్వ చొరవతో కేంద్ర ప్రభుత్వం పంపిన విమానంలో తాను క్షేమంగా తిరిగొచ్చినట్లు ఆమె తెలిపింది. శనివారం ఉదయం చెన్నై విమానాశ్రయంలో అడుగుపెట్టిన రిత్తికాకు ఆమె తల్లిదండ్రులు జగన్‌నాగజ్యోతిఇతర కుటుంబసభ్యులు స్వాగతం పలికారు.
18-10
4. మోదీకి ఉక్రెయిన్ మంత్రి విజ్ఞప్తి
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ఆదివారం ఓ టెలివైజ్డ్ మెసేజ్‌లో ఓ విజ్ఞప్తి చేశారు. యుద్ధం అందరి ప్రయోజనాలకు వ్యతిరేకమేనని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌కు వివరించాలని కోరారు. సామాన్య భారతీయులు కూడా తమకు మద్దతివ్వాలని కోరారు. ఫిబ్రవరి 24న ప్రారంభమైన యుద్ధం సోమవారం 11వ రోజు కూడా కొనసాగుతోంది. ఓ ప్రశ్నకు సమాధానంగా దిమిత్రో కులేబా మాట్లాడుతూ, రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌‌తో మాట్లాడాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తాము విజ్ఞప్తి చేశామని చెప్పారు. యుద్ధం అందరి ప్రయోజనాలకు వ్యతిరేకమేనని వివరించాలని కోరామని చెప్పారు. ఈ యుద్ధం పట్ల ఆసక్తి ఉన్నది ఈ భూమండలం మీద ఉన్న ఏకైక వ్యక్తి కేవలం వ్లదిమిర్ పుతిన్ మాత్రమేనని తెలిపారు. రష్యా ప్రజలకు ఈ యుద్ధం మీద ఆసక్తి లేదన్నారు. సామాన్య భారతీయులు కూడా తమకు మద్దతివ్వాలని కోరారు

5. పుతిన్‌కు ఎలన్‌ మస్క్‌ భారీ షాక్‌!
స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలన్‌ మస్క్‌ రష్యాకు భారీ షాకిచ్చారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలస్కీతో మంతనాలు జరిపారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అదే సమయంలో జెలస్కీ..,ఎలన్‌ మస్క్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్‌ చేయడం ఆసక్తికరంగా మారింది. రష్యాతో యుద్ధం జరుగుతున్న ఈ క్లిష్ట సమయంలో జెలెన్‌ స్కీ..ఎలన్‌ మస్క్‌తో జూమ్‌ కాల్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా జెలెన్‌ స్కీ తమదేశానికి రావాలంటూ ఎలన్‌ మస్క్‌ను ఆహ్వానించారు. దీంతో పాటు ఇతర అంశాలపై చర్చసలు జరిపారు. ఈ సంభాషణల సమయంలో రష్యా వార్తా వనరులను నిరోధించాలని స్టార్‌లింక్‌ను కొన్ని ప్రభుత్వాలు (ఉక్రెయిన్ కాదు) కోరాయని ఎలన్‌ మస్క్‌ తెలిపారు.

6. మోదీజీ యుద్ధం ఆపమని పుతిన్‌కి చెప్పండి!
భారత్‌ ప్రయోజానాల దృష్ట్యా యుద్ధం ఆపమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌కి చెప్పండి అని ఉక్రెయిన్‌ భారత ప్రధాని నరేంద్ర మోదీని అభ్యర్థించింది. ఈ మేరకు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించాలని రష్యాను కోరండి అని ప్రధాని మోదీకి పిలుపునిచ్చారు. ఇది అన్ని దేశాల ఉత్తమ ప్రయోజనాల కోసమేనని స్పష్టం చేశారు.యుద్ధం ముగిస్తే గనుక అన్ని దేశాలకు మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు ఉక్రెనియన్‌ వ్యవసాయ ఉత్పత్తుల అతిపెద్ద వినయోగదారులలో భారత్‌ ఒకటి అన్నారు. ఈ యుద్ధం కొనసాగితే కొత్త పంటలకు విత్తనాలు వేయడం మాకు కష్టమవుతుంది కాబట్టి భారత ఆహార భద్రత పరంగా కూడా ఈ యుద్ధాన్ని ఆపాడం ఉత్తమం అని చెప్పారు. ఈ యుద్ధం అందరి ప్రయోజనాలకు విరుద్ధం” అని వ్లాదిమిర్ పుతిన్‌కు విజ్ఞప్తి చేయాలని రష్యాతో ప్రత్యేక సంబంధాలను నెరుపుతున్న భారత్‌తో సహా అన్ని దేశాలను డిమిట్రో కులేబా కోరారు.పైగా రష్యా పై మరిన్ని ఆంక్షలను విధించాలని డిమాండ్‌ కూడా చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాలను ఉల్లంఘిస్తుందని ఆరోపించారు. విదేశీ పౌరులను తరలించే వరకు కాల్పలు నిలిపివేయాలని కోరారు. విదేశీయుల తరలింపు కోసం ఉక్రెయిన్‌ రైళ్లను ఏర్పాటు చేయడమే కాక రాయబార కార్యాలయంతో పనిచేస్తోందని కూడా చెప్పారు. పైగా ఉక్రెయిన్‌ ప్రభుత్వం కూడా తనవంతుగా కృషి చేస్తుందని అన్నారు
03062022113527n93
7. విమానాలు నిలిపేసిన ఏరోఫ్లోట్‌
రష్యాకు చెందిన దిగ్గజ విమానయాన సంస్థ ఏరోఫ్లోట్‌ అన్ని రకాల అంతర్జాతీయ విమానాలను ఈ నెల 8నుంచి నిలిపివేస్తున్నట్లు శనివారం ప్రకటించింది. బెలారస్‌కు మాత్రం తమ విమానాల రాకపోకలు సాగుతాయని తెలిపింది. విదేశీ విమానాలను అద్దెకు తీసుకునే రష్యా వైమానిక సంస్థలు ప్రయాణికుల, సరుకుల రవాణాను కొన్నాళ్లు నిలిపివేయాలని ఇటీవలే రష్యా విమానయాన నియంత్రణా సంస్థ రోసావైట్సియా సూచించింది. రష్యాపై ఆంక్షలు విధించడంతో లీజుకిచ్చిన విదేశీ విమానాలను వెనక్కు స్వాధీనం చేసుకునే అవకాశాలున్నాయని తెలిపింది. ఇందుకనుగుణంగానే ఏరోఫ్లోట్‌ తాజా నిర్ణయాన్ని ప్రకటించింది. ఇప్పటికే టికెట్లు బుక్‌ చేసుకున్నవారికి నగదు రిఫండ్‌ చేస్తామని కంపెనీ తెలిపింది. ఇప్పటికే రష్యాకు చెందిన ఎస్‌7 సంస్థ అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

8. ఉక్రెయిన్‌ పోర్టులో చిక్కుకున్న 21 మంది భారత నావికులు
ఉక్రెయిన్‌లోని మైకోలైవ్‌ పోర్టులో 21 మంది భారత నావికులు చిక్కుకుపోయారు. ఓ వాణిజ్య నౌకలో పనిచేస్తున్న వీరంతా కొన్నిరోజులుగా ఓడరేవులోనే ఉండిపోయారు. ఇప్పటికిప్పుడు బయటకు వచ్చే అవకాశం కనిపించడం లేదని అంటున్నారు.ప్రస్తుతం నావికులంతా క్షేమంగానే ఉన్నారని, తరచుగా కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నారని షిప్‌ మ్యానింగ్‌ ఏజెన్సీ సీఈఓ సంజయ్‌ చెప్పారు. మరికొన్ని భారత నౌకలు కూడా మైకోలైవ్‌ పోర్టులో ఉన్నాయని తెలిపారు. ఈ ఓడరేవు నుంచి ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ 500 కిలోమీటర్లు, పోలండ్‌ సరిహద్దు 900 కిలోమీటర్ల దూరంలో ఉంది.

9. రష్యా హెలికాప్టర్‌ను కూల్చి.. పైలట్‌ను పట్టుకున్నాం: ఉక్రెయిన్‌ రక్షణశాఖ
తమ వైమానిక రక్షణ దళ నిపుణులు రష్యా హెలికాప్టర్‌ను శనివారం కూల్చేశారని ఉక్రెయిన్‌ రక్షణ శాఖ ట్విట్టర్‌లో వెల్లడించింది. చెర్నిహివ్‌ నగర శివారులో ఈ సంఘటన జరిగిందని పేర్కొంది. రష్యా హెలికాప్టర్‌లో ఒక పైలట్‌ మరణించాడని, అతడిని మేజర్‌ క్రివోలాపోవ్‌గా గుర్తించినట్లు తెలిపింది. మరో పైలట్‌ క్రస్నోయర్టెసెవ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు వివరించింది. ఈ మేరకు సంబంధిత వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేసింది.ఇదిలా ఉండగా, చెర్నిహివ్‌ ప్రాంతం లో రష్యా వైమానిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక్కడి శిథిలాల నుంచి 22 మృతదేహాలను వెలికి తీసినట్లు ఉక్రెయిన్‌ అధికార యంత్రాంగం తెలిపింది. రెండు పాఠశాలలు, ప్రైవేట్‌ ఇళ్లపై జరిగిన రష్యా దాడుల్లో కనీసం 9 మంది చనిపోయారని చెర్నిహివ్‌ స్థానిక గవర్నర్‌ చెప్పారు.

10. రష్యా-ఉక్రెయిన్‌ డిజిటల్‌ వార్
రష్యా నుంచి భీకరమైన దాడుల్ని అడ్డుకోవడానికి తమ ముందున్న అన్ని మార్గాలను ఉక్రెయిన్‌ పూర్తి స్థాయిలో వినియోగించుకుంటోంది. సైబర్‌ యుద్ధాన్ని ముమ్మరం చేసింది. ఆ దేశానికి చెందిన వందలాది మంది హ్యాకర్లు డిజిటిల్‌ యుద్ధం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. డిజిటల్‌ ఆర్మీగా ఏర్పాటై రష్యా దాడుల్ని నిలువరిస్తున్నారు. ‘‘మాది ఒక రకంగా సైన్యమే, స్వీయ నియంత్రణలో ఉన్న సైన్యం’’ అని డిజిటిల్‌ ఆర్మీ సభ్యుడైన 37 ఏళ్ల వయసున్న రోమన్‌ జఖరోవ్‌ చెప్పారు. వీరంతా రష్యాకు చెందిన వెబ్‌సైట్లను బ్లాక్‌ చేయడం, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయకుండా అడ్డుకోవడమే కాకుండా రష్యా సైనికులు ఏయే ప్రాంతాల్లో ఉన్నారో గుర్తించి ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు.రష్యా దాడి చేస్తున్న ప్రాంతాల్లో క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించడానికి కావాల్సినన్నీ పంపడం వంటివన్నీ ఈ డిజిటల్‌ ఆర్మీ దగ్గరుండి చూస్తోంది. స్టాండ్‌ఫర్‌ఉక్రెయిన్‌ హ్యాష్‌ట్యాగ్‌తో సామాజిక మాధ్యమాల్లో అందరి మద్దతు కూడదీస్తోంది. డిజిటల్‌ ఆర్మీలో చేరడానికి ముందు జఖరోవ్‌ ఆటోమేషన్‌ స్టార్టప్‌ను నడిపేవారు. ఆయన కింద సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు, మార్కెటింగ్‌ మేనేజర్లు, గ్రాఫిక్‌ డిజైనర్లు, ఆన్‌లైన్‌ యాడ్‌ బయ్యర్లు పని చేస్తుంటారు. ఇప్పుడు వీరంతా సైబర్‌ యుద్ధంలో పాలుపంచుకుంటున్నారు. అంతేకాదు రష్యా చేసే సైబర్‌ దాడుల నుంచి ఆత్మ రక్షణగా తమ ఇంటర్నెట్‌ వ్యవస్థ కుప్పకూలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
03062022142332n25
11. ఉక్రెయిన్‌పై దాడి.. యూరప్‌ భద్రతపై దాడే
ఉక్రెయిన్‌ విషయంలో రష్యా నాయకత్వం తీరుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌పై దాడి కేవలం ఆ ఒక్క దేశంపైన జరుగుతున్న దాడి కాదని.. మొత్తం ఐరోపా ఖండం భద్రత, ప్రపంచ శాంతి, స్థిరత్వంపై జరుగుతున్న దాడేనని తేల్చిచెప్పారు. ‘నాటో’ సభ్యదేశాల రక్షణకు అమెరికా కట్టబడి ఉన్నట్లు పునరుద్ఘాటించారు. శ్వేతసౌధంలో ఫిన్‌లాండ్‌ అధ్యక్షుడు సౌలీ నీనిస్ట్‌తో బైడెన్‌ భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం, రష్యాపై ఆంక్షలు, వాతావరణ మార్పులు, నాటో ఓపెన్‌ డోర్‌ పాలసీ తదితర అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ సందర్భంగా బైడెన్‌ మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్‌లో సాగుతున్న రక్తపాతానికి రష్యాను జవాబుదారీగా చేసే విషయంలో ఇరుదేశాలు ఒకేతాటిపై ఉన్నాయని తెలిపారు. జో బైడెన్‌ తాజాగా పోలండ్‌ అధ్యక్షుడు అండ్రెజ్‌ డుడాతో ఫోన్‌లో మాట్లాడారు. ఉక్రెయిన్‌పై దండెత్తుతున్న రష్యా పట్ల తమ ప్రతిస్పందన ఎలా ఉండాలన్న దానిపై వారిద్దరూ చర్చించుకున్నట్లు వైట్‌హౌస్‌ తెలిపింది.

12. హంగేరీ నుంచి ఇండియాకు పయనమైన ఏపీ విద్యార్థులు
ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన మన విద్యార్థులను యుద్ధ ప్రాతిపదికన ఇక్కడికి తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చూపిన చొరవ సత్ఫలితాలిస్తోంది. ఉక్రెయిన్‌ సరిహద్దు దేశాలకు ప్రత్యేక ప్రతినిధులుగా వెళ్లిన వారు ఇటు కేంద్రం, అటు ఆయా దేశాల్లోని కీలక అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ తరలింపు వేగవంతంగా సాగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రవాసాంధ్రుల ప్రభుత్వ సలహాదారు, ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ అధ్యక్షుడు మేడపాటి వెంకట్‌.. హంగేరిలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హరిదీప్‌సింగ్‌ పూరితో సమావేశమై విద్యార్థుల తరలింపు అంశాల గురించి చర్చించారు.అక్కడి ఎంబసీ అధికారులతో మాట్లాడారు. భారత రాయబార కార్యాలయ అధికారి తుహిన్‌ కుమార్‌తో సమావేశమయ్యారు. తత్ఫలితంగా శనివారం ఒక్కరోజే బుడాపెస్ట్‌ నుంచి 100 మంది మన విద్యార్థులు ఇండియాకు బయలుదేరారు. విదేశీ వ్యవహారాల అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, తెలుగు, భారత అసోసియేషన్లతో మాట్లాడుతూ విద్యార్థుల తరలింపు ప్రక్రియను సమన్వయం చేస్తున్నామని వెంకట్‌ తెలిపారు. మన విద్యార్థులు ఉంటున్న వసతి కేంద్రాలకు వెళ్లి వారితో మాట్లాడామని చెప్పారు. ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులతో వారి పిల్లలను ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడిస్తూ ధైర్యం చెబుతున్నామని తెలిపారు. శనివారం ఒక్క రోజే 1,100 మంది భారతీయులను తరలించగా, అందులో వంద మంది మన ఏపీ విద్యార్థులు ఉన్నారన్నారు.
Aeroflot
13. ఉక్రెయిన్‌ నుంచి విజయవాడకు చేరుకున్న 21 మంది ఏపీ విద్యార్థులు
ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధం కారణంగా విద్యార్థులు సురక్షితంగా స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 21 మంది విద్యార్థులు ఢిల్లీ , బెంగళూరు మీదుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వైద్యవిద్య అభ్యాసం కోసం రాష్ట్ర విద్యార్థులు ఉక్రెయిన్‌లోని జపోరిజయాలో నివాసముంటున్నారు. యుద్ధం కారణంగా అక్కడ ఉన్న విద్యార్థులను, తెలుగు ప్రజలను స్వదేశాలకు పంపిస్తుండడంతో భారతీయ పౌరుల తరలింపులో నిన్న ఏడో రోజు తెలంగాణకు చెందిన 94 మంది, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 66 మంది విద్యార్థులు స్వదేశానికి చేరుకున్నారు.ఈరోజు మరో 21 మంది రావడంతో రాష్ట్రానికి చెందిన వారి సంఖ్య 291 కి చేరుకున్నది. వచ్చిన విద్యార్థులను తిరుపతి, విజయవాడ విమానాశ్రయాల్లో స్వాగతించి వారి స్వస్థలాలకు పంపించేందుకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు చేశారు

14. ఉక్రెయిన్ విద్యార్థుల కోసం నిబంధనలను సడలించాలి : వరుణ్ గాంధీ యుద్దం నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి తిరిగి వస్తున్న విద్యార్థుల కోసం నిబంధనలను సడలించాలని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఆదివారం ట్విటర్ వేదికగా డిమాండ్ చేశారు. ఉక్రెయిన్ సంక్షోభం వల్ల వేలాది మంది విద్యార్థుల మానసిక ఆరోగ్యం ప్రభావితమైందని చెప్పారు. ఓవైపు, యుద్ధ క్షేత్రంలో ఎదురైన చేదు అనుభవాల జ్ఞాపకాలు వారిని వెంటాడుతున్నాయని, మరోవైపు, వారి భవిష్యత్తు ఊగిసలాటలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

15. యుద్ధంలో 11,000 మంది రష్యన్ సైనికుల మృతి : ఉక్రెయిన్
ఫిబ్రవరి 24న ప్రారంభమైన యుద్ధంలో 11,000 మందికి పైగా రష్యన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారని ఉక్రెయిన్ సైన్యం ఆదివారం ప్రకటించింది. నల్ల సముద్రం సమీపంలోని మైకోలైవ్ నగరం సమీపంలో భీకర పోరాటం జరుగుతోందని తెలిపింది. నౌకాశ్రయ నగరం మరియుపోల్‌లో శనివారం కాసేపు కాల్పుల విరమణ తర్వాత పెద్ద ఎత్తున బాంబు దాడులు జరిగినట్లు తెలిపింది. ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాల్లో చిక్కుకున్నవారిని తరలించేందుకు మానవతావాద కారిడార్లను అనుమతించాలని ప్రపంచవ్యాప్తంగా డిమాండ్లు వస్తున్నాయి. సాధారణ ప్రజలపై దాడులు జరుగుతున్నాయనే ఆరోపణలను రష్యా ఖండిస్తోంది. అయినప్పటికీ వేలాది మంది ప్రజలు ప్రధాన నగరాలను వదిలిపెట్టి పారిపోతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 1.5 మిలియన్ల మంది దేశం విడిచి వెళ్ళిపోయినట్లు అంచనా.
నల్ల సముద్రం సమీపంలో ఉన్న మరియుపోల్ నగరంలోశనివారం కాసేపు కాల్పుల విరమణ అమలైంది. ఆ తర్వాత రష్యా దళాలు బాంబులతో విరుచుకుపడ్డాయి. ఈ నగరంలో తాగునీరు, విద్యుత్తు సదుపాయాలకు విఘాతం కలిగింది. ఈ పరిస్థితి చాలా దారుణంగా ఉందని ‘డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్’ తెలిపింది.

16. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వైదొలగిన రష్యా
ఉక్రెయిన్‌ పై రష్యా దాడులు కొనసాగుతుండడంతో అమెరికా యూరప్‌తో సహా పలు దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించాయి. అయినప్పటికీ రష్యా తగ్గేదేలే అంటూ కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది. దీంతో పలు అగ్రదేశాలు రష్యా పై ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. అయితే రష్యా మాత్రం తన దూకుడును తగ్గించకుండా అమెరికాకు వరుస హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది.అంతటితో ఆగకుండా ప్రస్తుతం అనుకున్నంత పనిచేసేసింది రష్యా ఇప్పడూ. తాను ముందు నుంచి హెచరిస్తున్న విధంగానే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వైదొలగింది. అంతేకాదు తాను అంతరిక్ష కేంద్రం నుంచి వైదొలగితే ఎదురయ్యే పరిణామాల గురించి రష్యా అంతరిక్ష సంస్థ చీఫ్‌ అమెరికాను ముందుగానే హెచ్చరించారు కూడా. ఈ మేరకు రష్యా తాను అంతరిక్ష కేంద్రం నుంచి డిస్‌కనెక్ట్‌ అవుతున్నట్లు కనిపిస్తున్న వీడియోలను సోషల మీడియాలో పోస్ట్‌ చేసింది. అంతేకాదు అమెరికా ఆంక్షలు విధించిన కొద్ది రోజుల్లోనే ఈ వీడియోని అనూహ్యంగా విడుదల చేసింది.అయితే 47 సెకన్ల నిడివి గల వీడియోలో రష్యన్ వ్యోమగాములు రష్యన్ హాచ్‌ను లాక్ చేసి, ఫ్లయింగ్ అవుట్‌పోస్ట్ నుంచి దూరంగా జ్వెజ్డా మాడ్యూల్‌లో విన్యాసాలు చేస్తున్నట్లు చూపిస్తుంది. మాడ్యూల్ స్టేషన్‌ నివాస గృహాలకు ఇంధనం నింపుకునే సామర్థ్యాన్ని అందిస్తుంది. యూఎస్‌ విభాగంలో జపనీస్, యూరోపియన్ ప్రయోగశాలలు ఉన్నాయి. జ్వెజ్డా మాడ్యూల్ మొత్తం అవుట్‌పోస్ట్‌కు స్పేస్ టగ్‌గా కూడా పనిచేస్తుంది.స్టేషన్‌ను స్పేస్ జంక్ నుండి దూరంగా నడిపించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మాడ్యూల్‌లోని లైఫ్-సపోర్ట్ సిస్టమ్‌ యూఎస్‌ ల్యాబ్, డెస్టినీ లోపల ఉన్న సిస్టమ్‌తో కలిసి పని చేస్తుంది, ఇది మొత్తం అవుట్‌పోస్ట్‌లో కీలకమైన భాగం. ప్రస్తుతం స్పేస్‌ స్టేషన్‌లో అమెరికన్, రష్యన్, యూరోపియన్ సంతతికి చెందిన ఏడుగురు వ్యోమగాములు ఉన్నారు. ఆ స్పేస్‌ స్టేషన్‌ నుంచి రష్యా వైదొలగి ఆ 500 టన్నుల నిర్మాణాన్ని భారత్‌కి, చైనాకి వదిలేసే అవకాశం కూడా ఉంది. వచ్చే ఐదేళ్లలో రష్యా ఇప్పటికే చైనా తరహాలో సొంత స్పేస్‌ స్టేషన్‌ కోసం ప్లాన్ చేస్తోంది కూడా.

17. షెల్టర్లలో ఉండండి, జాగ్రత్తలు తీసుకోండి… సుమీలోని భారత విద్యార్థులకు సూచన
ఉక్రెయిన్‌లోని సుమీ కాల్పుల మోతతో మారుమోగుతోంది. దీంతో అక్కడున్న భారత విద్యార్థుల క్షేమంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటన జారీ చేసింది. కాల్పుల తీవ్రత వల్ల అక్కడి నుంచి భారత విద్యార్థుల తరలింపును వాయిదా వేసినట్లు తెలిపింది. అయితే కాల్పుల విరమణ కోసం భారత ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని వెల్లడించింది. అప్పటి వరకు విద్యార్థులు బాంబు షెల్టర్ల లోపలే ఉండాలని, ముందస్తు భద్రతా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
కాగా, ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో సుమీ ప్రాంతంలోని భారత విద్యార్థులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. ఆహారం, నీరు లేక అల్లాడిపోతున్నారు. మంచు గడ్డలను మంటతో కరిగించి ఆ నీటిని తాగుతున్నారు. తమను వెంటనే అక్కడి నుంచి తరలించాలని కన్నీళ్లతో వేడుకుంటూ భారత ప్రభుత్వానికి ఎస్‌ఓఎస్‌ వీడియో సందేశాలు పంపుతున్నారు. నేపథ్యంలో కేంద్రం వీటిపై స్పందించింది. సుమీలో కాల్పుల విరమణ కోసం భారత ప్రభుత్వం గట్టిగా ఒత్తిడి తెస్తున్నదని తెలిపింది. కాల్పుల విరమణ ప్రకటించగానే విద్యార్థులను అక్కడి నుంచి తరలిస్తామని పేర్కొంది. ఈ లోపు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, షెల్టర్ల లోపలే ఉండాలని సూచించింది.
students
18. పౌరులపై రష్యా సైనికుల కాల్పులు: ఉక్రెయిన్ తమ దేశంలోని నగరాలను ఖాళీ చేయించడం కోసం పౌరులపై రష్యా సైనికులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ ఆరోపించారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై 11వ రోజుకు చేరుకుంది. ఇరు దేశాల సేనలు యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అమెరికా సెనేటర్లకు ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు సంబంధించిన వివరాలను శనివారం పంపిన జెలెన్‌స్కీ.. తమకు సహాయం చేయాల్సిందిగా కోరారు. ఉక్రెయిన్‌లోని మారియుపోల్, వోల్నోవాఖా, ఇర్పిన్ నగరాల్లో పౌరులపై తీవ్రమైన కాల్పులు జరిగాయని అమెరికాకు తెలిపారు. అయితే ఉక్రెయిన్-రష్యా మధ్య జరుగుతున్న పోరులో మూడో వ్యక్తి ఎవరైనా ప్రవేశిస్తే.. తీవ్ర పరినామాలు ఉంటాయని రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరిస్తున్నారు.

19. కోవిడ్, ఉక్రెయిన్ సంక్షోభాన్ని భారత్‌ విజయవంతంగా నిర్వహించింది: మోదీ
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగుతోంది. 11 రోజులైన ఉక్రెయిన్‌పై పట్టు చిక్కకపోవడంతో ఎయిర్‌స్ట్రైక్స్‌ ఉద్ధృతం చేసింది. ఆధునాతన ఫైటర్‌ జెట్స్‌తో రష్యా సైనికులు రంగంలోకి దిగారు. 11వ రోజుకు చేరుకున్న ఈ యుద్దంలో ఐదార్‌, చెర్నిహివ్ పట్టణాలపై రష్యా మెరుపు దాడులతో విరుచుకు పడుతోంది. కీవ్‌, ఖార్కివ్‌ సహా ప్రధాన నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇటు రష్యా బలగాలపై ఉక్రెయిన్‌ అలుపెరుగని పోరాటం చేస్తోంది. యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగా కార్యక్రమంతో యుద్ధప్రాతిపదికన నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 20 వేల మంది భారతీయులు ఉక్రెయిన్‌ సరిహద్దు దాటారని కేంద్రం వెల్లడించింది.కాగా ఉక్రెయిన్‌ నుంచి తమ పౌరులను తరలించడంలో పెద్ద పెద్ద దేశాలే ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ తాము భారతీయులను విజయవంతంగా స్వదేశానికి తీసుకురాగులుగుతున్నామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెల్లడించారు. కోవిడ్‌ను విజయవంతంగా కంట్రోల్‌ చేశామని, ఇప్పుడు ఉక్రెయిన్‌ నుంచి తమ ప్రజలను సురక్షితంగా తరలిస్తున్నామని పేర్కొన్నారు. ఇదంతా భారత్‌కు పెరుగుతున్న ఆదరణ వల్లే సాధ్యమైందన్నారు. పెద్ద దేశాలు కూడా ఈ విషయంలో ఇబ్బంది పడుతున్నాయని అన్నారు. ఈ మేరకు పుణె యూనివర్సిటీలో మాట్లాడుతూ మోదీ వ్యాఖ్యలు చేశారు.

20. రష్యా మిత్రదేశం బెలారస్‌పై కఠిన ఆంక్షలు: దక్షిణ కొరియా ఉక్రెయిన్‌పై దండయాత్ర చేస్తున్న రష్యాకు మద్దతు ఇస్తుందనే కారణంతో బెలారస్‌పై ఆంక్షల్ని విధించేందుకు సిద్ధమైనట్లు దక్షిణ కొరియా ఆదివారం ప్రకటించింది. ఎలాంటి ఆంక్షలు విధించబోతున్న విషయాన్ని స్పష్టం చేయనప్పటికీ.. దాదాపుగా రష్యాపై విధించిన ఆంక్షల్నే బెలారస్‌పై కూడా అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. గత నెలలో రష్యాకు ఎగుమతులపై దక్షిణ కొరియా నియంత్రణలను కఠినతరం చేసింది. రష్యన్ బ్యాంకులతో లావాదేవీలను నిలిపివేసింది.
Ukrine-indians
download full size image from instagram
21. ఉక్రెయిన్‌లోని భారతీయులు అత్యవసరంగా సంప్రదించండి… రాయబార కార్యాలయం సూచన
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. దీంతో ఆ దేశంలోని భారతీయులు, భారత విద్యార్థుల తరలింపును భారత ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం ఆదివారం కొత్తగా సూచనలు జారీ చేసింది. ఉక్రెయిన్‌లో ఇంకా ఉన్న భారతీయులు అత్యవసరంగా ఎంబసీని సంప్రదించాలని కోరింది. తమ మొబైల్‌ నంబర్‌ను ఇవ్వడంతో పాటు ఎక్కడ ఉన్నారో అన్నది తెలుపాలని పేర్కొంది. వివరాలను గూగుల్‌ ఫార్మ్‌లో నింపి భారత ఎంబసీకి పంపాలని సూచించింది.కాగా, ఉక్రెయిన్‌లోని భారత విద్యార్థులను విమానాల్లో తరలించేందుకు భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్‌ గంగా చివరి దశకు చేరింది. దీంతో హంగేరేలోని భారత రాయబార కార్యాలయం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. సొంత వసతిలో ఉంటున్న భారత విద్యార్థులు బుడాపెస్ట్‌లోని చిరునామాకు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపు చేరుకోవాలని కోరింది. అలాగే ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపును సమన్వయం చేయడానికి హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లో ఒక కంట్రోల్‌ రూమ్‌ను భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసింది.మరోవైపు హంగేరి-ఉక్రెయిన్ సరిహద్దులో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, 150 కంటే ఎక్కువ మంది వలంటీర్లు తమకు సహాయం అందిస్తున్నారని భారత రాయబార అధికారి రాజీవ్ బోద్వాడే తెలిపారు. ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయంలో విధులు నిర్వహించే ఆయన హంగేరీలో ప్రత్యేక మిషన్‌కు డిప్యూటీ చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. ఉక్రెయిన్‌ నుంచి ఎంత మంది భారతీయులు సరిహద్దులు దాటుతున్నారు, వారికి వసతి, రవాణా వంటి వాటిని పలు బృందాలు పర్యవేక్షిస్తున్నాయని ఆయన వివరించారు.

22. 8 విమానాల ద్వారా 1500 మంది భారత పౌరుల తరలింపునకు చర్యలు: పౌర విమానయాన శాఖ
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్‌లో చిక్కకున్న భారతీయులను స్వదేశానికి తరలించడం కోసం భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగా’ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటి వరకు ప్రభుత్వం ఎంత మంది భారత పౌరులను ఇండియాకు తరలించిందనే విషయంపై పౌర విమానయాన మంత్రిత్వశాఖ కీలక ప్రకటన చేసింది. 11 విమానాల్లో సుమారు 2,135 మంది భారత పౌరులు ఈ రోజు (ఆదివారం) ఇండియాకు చేరుకున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దీంతో ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి చేరిన భారతీయుల సంఖ్య 15,900 దాటినట్లు పేర్కొంది. మార్చి 7న మరో ఎనిమిది విమానాల ద్వారా 1500 మంది భారతీయులను ఇండియాకు తరలించనున్నట్టు చెప్పింది. హంగేరీ రాజధాని బుడాపెస్ట్ నుంచి 5 విమానాలు, సూసెవా నుంచి రెండు, బుకారెస్ట్ ఒక విమానాన్ని నడపనున్నట్టు తెలిపింది.

23. పాక్ యువతికి భారతీయుడి సాయం
రష్యా దాడి నేపథ్యంలో, ఉక్రెయిన్‌లోని భయానక పరిస్థితుల్లోనూ మానవత్వం చాటుకుంటున్నారు చాలామంది. తోటివాళ్లకు వీలైనంత సాయం అందిస్తున్నారు. తాజాగా ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థి ఒకరు పాకిస్తాన్ యువతికి సాయం చేశాడు. ఆమె స్వదేశం వెళ్లడానికి అవసరమైన సహాయం చేసి మానవత్వం చాటుకున్నాడు. అంకిత్ యాదవ్ అనే భారతీయ విద్యార్థి ఈమధ్యే ఉక్రెయిన్ నుంచి ఇండియా తిరిగొచ్చాడు. యుద్ధం నేపథ్యంలో అక్కడున్న పరిస్థితుల్ని వివరించాడు. ఒంటరిగా మిగిలిపోయి, స్వదేశానికి ఎలా వెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతున్న పాక్ యువతికి సాయం చేసినట్లు చెప్పాడు. అంకిత్ తెలిపిన వివరాల ప్రకారం.. యుద్ధం నేపథ్యంలో గత నెల 24 నుంచి కీవ్‌లో చాలా మంది బంకర్లలోనే దాక్కున్నారు. అంకిత్ కూడా స్థానికులతోపాటు ఒక బంకర్‌లో దాక్కున్నాడు. అదే బంకర్‌లో పాకిస్తాన్‌కు చెందిన యువతి కూడా ఉంది. ఉక్రెనియన్లు కాకుండా ఆ బంకర్‌లో ఇండియా, పాక్‌ల నుంచి ఉన్నది వీరిద్దరే. అక్కడే ఆ యువతి తన పరిస్థితి, అంకిత్‌కు వివరించింది. తాను తప్ప, పాకిస్తాన్ నుంచి వేరెవరూ లేరని, తన దేశం ఎలా వెళ్లాలో తెలియడం లేదని ఆ యువతి చెప్పింది. దీంతో ఆమెకు వీలైనంత సాయం చేయాలని అంకిత్ నిర్ణయించుకున్నాడు.