DailyDose

తెలంగాణ అసెంబ్లీ నుంచి బీజెపి ఎమ్మెల్యేల సస్పెన్షన్…- TNI రాజకీయ వార్తలు

తెలంగాణ అసెంబ్లీ నుంచి బీజెపి ఎమ్మెల్యేల సస్పెన్షన్…- TNI రాజకీయ వార్తలు

* బడ్జెట్ ప్రసంగానికి అడ్డుతగులుతున్నారని భాజపా ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ లను ప్రస్తుత సెషన్ పూర్తి అయ్యేవరకు సస్పెండ్ చేసిన తెలంగాణ అసెంబ్లీ.

*13 రాజ్యసభ స్థానాలకు మార్చి 31న ఎన్నికలు: ఈసీ
దేశంలోని 6 రాష్ట్రాలకు చెందిన 13 రాజ్యసభ స్థానాలకు ఈనెల 31వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషన్ సోమవారంనాడు ప్రకటించింది. అసోం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, నాగాలాండ్, త్రిపుర నుంచి రాజ్యసభ సభ్యులు ఏప్రిల్ 2న రిటైర్ కానుండగా, పంజాబ్‌ నుంచి ఐదుగురు సభ్యులు ఏప్రిల్ 9న రిటైర్ కానున్నారు. రిటైర్ కానున్న వారిలో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఏకే ఆంటోని, ఆనంద్ శర్మ ఉన్నారు.జ్యుడిషియల్ కస్టడీకి నవాబ్ మాలిక్”పంజాబ్ నుంచి ఖాళీ కానున్న ఐదు సీట్లలో మూడు సీట్లు ఒక ఎన్నికల్లో, మరో రెండు స్థానాలు మరో ఎన్నికలో పూర్తి చేస్తాం” అని కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ మార్చి 14న జారీ చేస్తామని, 31న ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొంది. యథాప్రకారం ఓటింగ్ జరిగిన రోజే సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుందని ఈసీ తెలిపింది.పదవీకాలం ముగుస్తున్న రాజ్యసభ సభ్యులలో ఏకే ఆంటోనీ (కేరళ), ఆనంద్ శర్మ (హిమాచల్ ప్రదేశ్), ప్రతాప్ సింగ్ బజ్వా, నరేష్ గుజ్రాల్ (పంజాబ్) వంటి ప్రముఖులు ఉన్నారు. రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ, రాజ్యసభలో కాంగ్రెస్ డిప్యూటీ మంత్రి ఆనంద్ శర్మ, బజ్వాలు కాంగ్రెస్‌కు చెందిన వారు కాగా, గుజ్రాల్.. శిరోమణి అకాలీదళ్‌కు చెందిన వారు. పంజాబ్‌ నుంచి 5 సీట్లు ఖాళీ అవుతుండగా, కేరళలో 3, అసోంలో 2, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, త్రిపురల నుంచి ఒక్కో సీటు ఖాళీ కానుంది.

* బీఏసీ భేటీలో అచ్చెన్నపై సీఎం జగన్ ఫైర్
బీఏసీ భేటీలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం సరికాదన్నారు. గవర్నర్ ఏ ఒక్క పార్టీకి చెందినవారు కాదని తెలిపారు. వయసును కూడా గౌరవించకుండా అవమానించారన్నారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని బీఏసీ సమావేశంలో సీఎం జగన్ అన్నారు. కాగా… ఈరోజు ఉదయం ఏసీ అసెంబ్లీలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగాన్ని టీడీపీ సభ్యులు అడ్డుకున్న విషయం తెలిసిందే. గవర్నర్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అంతే కాకుండా ప్రసంగం ప్రతులను టీడీపీ సభ్యులు చించివేశారు. దీంతో సభలో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.

* రూ. 9,091 కోట్ల వ్యయంతో రైతులకు ప్రయోజనం : ఏపీ గవర్నర్‌
ఏపీ ప్రభుత్వం ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్ తెలిపారు. ఏపీ బడ్జెట్ ప్రారంభ సమావేశాల సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. 2021-22లో రూ. 9,091 కోట్ల వ్యయంతో రైతులకు ప్రయోజం చేకూర్చే విధంగా చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.జగనన్న తోడు పథకం ద్వారా చిరు వ్యాపారులకు రూ. 1,416 కోట్ల సాయం, వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర కింద ఆటో, ట్యాక్సీ, డ్రైవర్లకు రూ. 770 కోట్లు . జగనన్న చేదోడు పథకం కింద రజకులు, నాయి బ్రాహ్మణులకు రూ. 583 కోట్ల సాయం అందించిందని తెలిపారు. జగనన్న వసతి దీవెన కింద 18.77 లక్షల మంది విద్యార్థులకు రూ. 2,304 కోట్లు జమ చేసిందని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని వివరించారు.అమ్మఒడి పథకం కింద 44.5 లక్షల మంది తల్లులకు రూ. 13,023 కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు. ‘వైఎస్‌ఆర్‌ చేయూత ద్వారా 45-60 ఏళ్ల మహిళలకు రూ. 9,100 కోట్లు అందించిందన్నారు. వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం కింద ఇప్పటి వరకు రూ. 981. 88 కోట్లు అందించిందని గవర్నర్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

* ఇలాంటి ఉదంతాలు గతంలో ఎప్పుడు జరగలేదు: మంత్రి కన్నబాబు
గవర్నర్ గో బాక్ అంటూ నినాదాలు ఇవ్వడం ద్వారా వారు విజ్ఞతతో వ్యవహరించడం లేదు అని అర్ధమవుతుందని మంత్రి కన్నబాబు అన్నారు. రాజకీయాలు ఎన్ని ఉన్నా సంప్రదాయం పాటించాలని ఆయన సూచించారు. టీడీపీ ఎమ్మెల్యేల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలా వ్యవహరించిన ఉదంతాలు గతంలో ఎప్పుడు జరగలేదన్నారు

* మహిళా సంక్షేమానికి పెద్దపీట : తలసాని
మహిళల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసం వద్ద 71 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ ల క్రింద మంజూరైన ఆర్ధిక సహాయం చెక్కులను అందజేశారు. అనంతరం లబ్ధిదారులతో మంత్రి సెల్ఫీ లు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా పేదింటి ఆడపడుచుల వివాహానికి ఆర్ధిక సహాయం అందించడం లేదని, ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అందిస్తుందని చెప్పారు.ఇప్పటి వరకు 13 లక్షల మందికి పైగా ఆర్ధిక సహాయం అందిందని పేర్కొన్నారు. గర్భిణీ మహిళలను ప్రసవం కోసం ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు, ప్రసవం అనంతరం క్షేమంగా ఇంటికి చేర్చేందుకు 300 అమ్మ ఒడి వాహనాలను ఏర్పాటు చేసిందని చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవం జరిగిన మహిళలకు కేసీఆర్ కిట్ క్రింద తల్లి బిడ్డకు అవసరమైన సామాగ్రితో పాటు ఆడబిడ్డకు పుడితే 13 వేలు, మగబిడ్డ పుడితే 12 వేల రూపాయల ఆర్ధిక సహాయం పంపిణీ చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
*
* రాష్ట్రంలో గుండా, రౌడీ పాలన సాగుతోంది: జగ్గారెడ్డి
ప్రజల పక్షాన మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం బాధాకరమని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వాపోయారు. సీఎం డైరెక్షన్‌లో స్పీకర్ బొమ్మలా నటిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ సభ్యులకే సభలో మాట్లాడకుండా గొంతు నొక్కుతున్నారన్నారు. ప్రజల గొంతు నొక్కినట్లే.. రాష్ట్రంలో గుండా, రౌడీ పాలన సాగుతోందన్నారు. కేసీఆర్ గ్యాంగ్ లీడర్‌గా వ్యవహరిస్తున్నారని.. ఇది తెలంగాణ ప్రజలకు మంచిది కాదని.. ప్రజలే కాంగ్రెస్‌ను కాపాడుకోవాలని జగ్గారెడ్డి సూచించారు.

* అప్రజాస్వామికంగా సభను నడుపుతున్నారు: భట్టి
అప్రజాస్వామికంగా శాసనసభను నడుపుతున్నారని సీఎల్సీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. బడ్జెట్ ప్రసంగాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బహిష్కరించారు. అనంతరం బయటకు వచ్చిన భట్టి మీడియాతో మాట్లాడుతూ సభలో నిబంధనలు పాటించకుండా రాజ్యాంగాన్ని ఉల్లంగిస్తున్నారని ఆరోపించారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ లేవనెత్తినా మైక్ ఇవ్వలేదన్నారు. సభా గౌరవాన్ని మంటగలిపారని మండిపడ్డారు. అసెంబ్లీ ఏమైనా టీఆర్ఎస్ ఆఫీసా? అని ప్రశ్నించారు. ఇష్టానుసారం సభ నడపడం సరికాదని, సభాపతిని చూసి సిగ్గుపడుతున్నామని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.

* టీఆర్‌ఎస్ కార్యాలయంగా అసెంబ్లీ: Seethakka
తెలంగాణ అసెంబ్లీని టీఆర్ఎస్ కార్యాలయంగా మార్చారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విమర్శలు గుప్పించారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే మాట్లాడుతూ… స్పీకర్‌లు బండ్రోతులా మారుతున్నరా? అని ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రంలో కూడా స్పీకర్‌లు ఇలా ప్రవర్తించ లేదని తెలిపారు. స్పీకర్‌కు ప్రతిపక్షాల మీద చిన్నచూపు ఉందని వ్యాఖ్యానించారు. మిత్రపక్షానికి ప్రతిపక్ష హోదా ఇస్తే గమ్మున కూర్చుందని… పాయింట్ ఆర్డర్ లేవనెత్తి తే కూడా తమ మొహం చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు జరిగిన అవమానంపై పోరాటం చేస్తామన్నారు. ‘‘మా గొంతు నొక్కడం అంటే మాకు ఓట్లేసి గెలిపించిన ప్రజలను అవమానించడమే’’ అని ఎమ్మెల్యే సీతక్క అన్నారు.

* రాష్ట్రంలో మీడియా హక్కులను హరిస్తున్నారు: బుచ్చయ్య చౌదరి
రాష్ట్రంలో మీడియా హక్కులను ప్రభుత్వం హరిస్తోందని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి విమర్శించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబీలోకి నెట్టిందని ఆరోపించారు. రాజ్యాంగ వ్యతిరేక చర్యలను ప్రశ్నించాల్సిన గవర్నర్‌ స్పందించడం లేదని, అందుకే గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నామని బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు.కాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగాన్ని అడ్డుకుంటూ టీడీపీ సభ్యులు సభలో నినాదాలు చేశారు. ప్రసంగ ప్రతులను చించివేసి గాల్లోకి విసిరారు. గవర్నర్ ప్రసంగం మధ్యలోనే సభ నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్ చేయబోయారు. అయితే.. గవర్నర్ తిరిగి వెళ్లే దారిలో టీడీపీ ప్రజాప్రతినిధులు వెళ్లనీయకుండా మార్షల్స్ అడ్డుకున్నారు. మండలికి కూడా వెళ్లకుండా అడ్డుకుంటారా..? అంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ మండిపడ్డారు. సభలో మాట్లాడనివ్వడం లేదని.. కనీసం లాబీల్లో కూడా ఉండనివ్వరా అంటూ కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు

*మూడేళ్లుగా వికేంద్రీకృత పరిపాలన ఉండేలా ప్రభుత్వం కృషి: ఏపీ గవర్నర్
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభంకాగానే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. మూడేళ్లుగా వికేంద్రీకృత పరిపాలన ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందని, వికేంద్రీకరణతో రాష్ట్రాభివృద్ధి జరుగుతోందన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 0.22 జీఎస్టీపీ వృద్ధి జరిగిందన్నారు. సుపరిపాలన లక్ష్యానికి అనుగుణంగా 13 జిల్లాలను 26 జిల్లాలుగా మారుస్తున్నామని, ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలనా వ్యవస్థ ప్రారంభమవుతుందన్నారు.ఉద్యోగులకు ఒకేసారి 5 డీఏలు విడుదల చేశామని గవర్నర్ బిశ్వభూషణ్ తెలిపారు. 11వ పీఆర్సీ అమలు, రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచామన్నారు. తలసరి ఆదాయం 15.87 శాతం పెరిగి రూ.2,04,758కి చేరిందన్నారు. నవరత్నాలు ద్వారా మానవ, ఆర్థిక అభివృద్ధి జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. నాడు-నేడు, ఆరోగ్యశ్రీ, బాలామృతం అమలు చేస్తున్నామని గవర్నర్ తెలిపారు. వైఎస్సార్ రైతు భరోసా ద్వారా మూడు వాయిదాలలో.. రూ.13,500 ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. పారదర్శక, అవినీతి రహిత పాలన అందిస్తున్నామని గవర్నర్ బిశ్వభూషణ్ వ్యాఖ్యానించారు.

* భారత్‌ పలుకుబడి పెరుగుతోంది: మోదీ
 ఉక్రెయిన్‌ నుంచి వేలాది మంది భారతీయ విద్యార్థులను ఆపరేషన్‌ గంగ ద్వారా విజయవంతంగా ఇండియాకు తరలిస్తున్నామని, ప్రపంచ వ్యాప్తంగా భారత్‌కు పెరుగుతున్న పలుకుబడి వల్లే ఇది సాధ్యమైందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పుణెలోని సింబయాసిస్‌ యూనివర్సిటీ 50వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, పుణె మునిసిపల్‌ కార్పొరేషన్‌లో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆదివారం ఆవిష్కరించారు.

*వైఎస్ విగ్రహం పక్కనే అంబేద్కర్ విగ్రహం పెడితే తప్పేంటి?: వీహెచ్
గన్ పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ మౌన దీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పంజాగుట్టలో అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని పోలీసులు కిడ్నాప్ చేసి పోలీస్ స్టేషన్‌లో ఉంచారన్నారు. ఇంకా వీహెచ్ మాట్లాడుతూ.. ‘‘బీజేపీ నాయకులు అంబేద్కర్ విగ్రహం గురించి ఎందుకు మాట్లాడరు? అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ 3 లేకపోతే ఎన్ని త్యాగాలు చేసినా తెలంగాణ వచ్చేదా? వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం పక్కనే అంబేద్కర్ విగ్రహం పెడితే తప్పేంటి? ఈటల రాజేందర్ ఈ విషయాన్ని ఎందుకు మాట్లాడటం లేదు? అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాలి. లేదంటే గ్రామగ్రామాన తిరిగి అంబేద్కర్ విగ్రహాన్ని జైలులో పెట్టిన విషయాన్ని ప్రజలకు తెలియజేస్తాం. ఓవైసీ, జై భీం నినాదాలు మాత్రం చేస్తాడు.. దళితుల సమస్యలపై ఎందుకు స్పందించడు?’’ అని పేర్కొన్నారు.

*టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు కేటాయించే వరకూ పోరాటం కొనసాగిస్తాం: నిమ్మల
పాలకొల్లు నుంచి అమరావతికి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సైకిల్‌ యాత్ర నిర్వహించారు. సైకిల్‌పై అమరావతికి వచ్చి టీడీపీ అధినేత చంద్రబాబును రామానాయుడు కలిశారు. టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు కేటాయించే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. బ్యాంకు రుణాలతో సంబంధం లేకుండా ఉచితంగా అందజేయాలన్నారు. మా పోరాటంతోనే టిడ్కో ఇళ్లపై కాస్తయినా కదలిక వచ్చిందన్నారు. టీడీపీ ప్రభుత్వం కట్టిన ఇళ్లకు రంగులు కాదు.. అర్హులకు అప్పగించాలని నిమ్మల పేర్కొన్నారు.

*రైతు ద్రోహి ఎవరో పులివెందులలోనే చర్చిద్దాం: మర్రెడ్డి
‘‘రైతులకు ద్రోహం చేసిన పాలకులు ఎవరో సీఎం నియోజకవర్గం పులివెందులలోనే చర్చించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. వైసీపీ నేతలకు దమ్ముంటే ముందుకు రావాలి’’ అని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి సవాల్‌ విసిరారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు జరుగుతున్న అన్యాయంపై తాము ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం చెప్పడానికి చేతగాక టీడీపీ అఽధ్యక్షుడు చంద్రబాబును తిట్టి వైసీపీ మంత్రులు కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు.

*కూల్చడం తప్ప కట్టడం తెలీదు: ఎమ్మెల్యే ఏలూరి
కూలగొట్టడం తప్ప కట్టడం తెలియని బ్యాచ్‌ రాష్ట్రాన్ని పాలిస్తోందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఎద్దేవా చేశారు. ‘‘‘రాజధానిలో కట్టిన ప్రజా వేదికను ఆఘమేఘాలపై కూల్చారు తప్ప రాజధానిని కట్టలేకపోయారు. మూడు రాజధానుల పేరుతో మూడేళ్లు వృఽథా చేశారు. విజన్‌ ఉన్న వాళ్లకు తప్ప విధ్వంసాలు సృష్టించేవారికి రాజధానిని నిర్మించడం చేతకాదు’’ అని విమర్శించారు.

*ప్రజలపై పన్నులు వద్దు: లంకా దినకర్‌
ద్రవ్యలోటును అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రజలపై పన్నులు వేయకుండా రెవెన్యూ లీకేజిని అరికట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ బీజేపీ నేత లంకా దినకర్‌ సూచించారు. స్థూల ఉత్పత్తిపై వైసీపీ ప్రభుత్వం దృష్టి సారిస్తే అదనపు అప్పుల భారం తగ్గుతుందన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిపై హై కోర్టు తీర్పు, కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపును దృష్టిలో పెట్టుకుని సీఆర్‌డీఏ చట్టం ప్రకారం నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు

*కేటీఆర్‌.. రాజీనామా చేస్తారా?: షర్మిల
తెలంగాణలో రైతులకు చేసిందేమీ లేదు కాబట్టి.. రాజీనామా చేస్తారా?.. అని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల మంత్రి కేటీఆర్‌ను ప్ర శ్నించారు. తెలంగాణ కంటే మంచి పథకాలు చూపిస్తే రాజీనామా చేస్తానన్న కేటీఆర్‌ వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా స్పందించారు. రుణమాఫీ చేయడం లేదని రాజీనామా చేస్తారా? అని ఆదివారం ట్విట్టర్‌ వేదికగా షర్మిల నిలదీశారు.రైతులు పంట నష్టపోతే ఆదుకోవడానికి పంట బీమా అమలు చేయడం లేదని రాజీనామా చేస్తారా?.. లేక నష్టపోయిన రైతుకు ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించడం లేదని రాజీనామా చేసారా?.. రైతు బీమా రైతులందరికీ అందించడం లేదని రాజీనామా చేస్తారా? అని నిలదీశారు. ఈ విషయంలో ఇప్పటికే తమ పార్టీ తరపున హైకోర్టులో ప్రజావ్యాజ్యం వేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. రైతు బీమా అమలు విషయంలో హైకోర్టు ఇప్పటికే కేసీఆర్‌ ప్రభుత్వానికి ఆరు వారాల గడువు ఇచ్చినట్టు పేర్కొన్నారు. వాస్తవానికి తెలంగాణలో కౌలు రైతును గుర్తించడం లేదంటూ మండిపడ్డారు.