DailyDose

జ‌ప‌నీయులు వారానికి ఒక్క‌సారైనా ఈ అడ‌వి స్నానం?

జ‌ప‌నీయులు వారానికి ఒక్క‌సారైనా ఈ అడ‌వి స్నానం చేస్తున్నారు.. ఎందుకో తెలుసా

అడవి స్నానమంటే.. అంతెత్తు నుంచి జారిపడే సెలయేరు కిందో, ఉరుకుల పరుగుల నదిలోనో జలకాలాడటం అనుకోకండి. ఆకుపచ్చటి చెట్ల మధ్య పరిసరాలను పరిశీలిస్తూ ప్రశాంతంగా గడపడమే.. ‘ఫారెస్ట్‌ బాత్‌’ లక్ష్యం. జపాన్‌ ప్రజలు ఈ విధానాన్ని ఆనుసరిస్తూ సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతున్నారు. ప్రతి జపనీయుడూ వారానికి ఒక గంటయినా అడవిలో గడుపుతాడట. ఒత్తిళ్ల నుంచి విముక్తికి ‘షిన్రిన్‌- యోకు’ పేరుతో జాతీయ ఆరోగ్య కార్యక్రమమూ మొదలైంది. ఇదే ఫారెస్ట్‌ బాత్‌కు స్ఫూర్తి. అడవిలో అడుగు పెడితే.. రకరకాల వృక్షాలు, వాటి ఆకుల నుంచి కిందికి చొచ్చుకు వచ్చే సూర్యకాంతి, ఒకదానికొకటి పెనవేసుకున్న కొమ్మలు, వాటి మధ్య నుంచి కనిపించే నీలాకాశం, అకస్మాత్తుగా ఎక్కడెక్కడి నుంచో ఎగురుతూ వచ్చే పక్షులు, రంగురంగుల రెక్కలతో ఎగిరే సీతాకోక చిలుకలు.. మనల్ని కొత్త లోకానికి తీసుకెళ్తాయి. దగ్గర్లో ఉన్న ఏ అటవీ క్షేత్రానికో వెళ్తే చాలు.. ఉద్యోగాలు, చదువులు, వ్యాపారాలు, వృత్తి వ్యవహారాల వల్ల కలిగే ఒత్తిళ్లన్నీ మటుమాయం అవుతాయి. అయితే, అక్కడికి వెళ్లినా మళ్లీ గతాన్నే గుర్తుచేసుకుంటే మాత్రం బూడిదలో పోసిన పన్నీరే. కాబట్టి, అడవికి వెళ్లగానే ఏ చెట్టు కిందో సుఖాసనంలో కూర్చోవాలి. కండ్లు మూసుకొని, శ్వాసను గమనిస్తూ ధ్యానంలోకి వెళ్లిపోవాలి. ఆహ్లాదకరమైన గాలిని, ఆకుల సవ్వడిని, పక్షుల కిలకిలలను మనసుతో వినాలి. ఇలా చేస్తే కొన్ని నిమిషాలలోనే ఒత్తిడి దూరమై, మనసుకు సాంత్వన కలుగుతుంది. ఆ ప్రభావం వల్ల గుండె సమస్యలు, రక్తపోటు తగ్గుతాయి. ఒత్తిడి కలిగించే హార్మోన్ల విడుదల ఆగి పోతుంది. చెట్లు ఆక్సిజన్‌ను మాత్రమే కాకుండా ఎన్నో అత్యవసర తైలాలను విడుదల చేస్తాయని ‘వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం’ అధ్యయనం తెలిపింది. మొత్తానికి ‘ఫారెస్ట్‌ బాత్‌’ అలవాటు చేసుకొంటే .. ఒత్తిడి నుంచి విముక్తి, మానసిక ఆనందం రెండూ సొంతం చేసుకోవచ్చు. భావకవి కృష్ణశాస్త్రిలా మనం కూడా ‘ఆకులో ఆకునై.. పూవులో పూవునై/ కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై..’ అని పాడుకుంటూ ఏ నల్లమలలోనో, శేషాచలం అడవుల్లోనో కొంతకాలం సేదతీరిపోతే సరి!