NRI-NRT

మాతృభూమి ప్రగతికీ కృషి చేయండి

మాతృభూమి ప్రగతికీ కృషి చేయండి

*ప్రవాస భారతీయులకు జస్టిస్‌ రమణ పిలుపు
*ఘనంగా సన్మానించిన దుబాయి తెలుగు సంఘం
అరబ్బుల మనస్సులో ప్రవాస భారతీయులు తమకంటూ ఒక ప్రశంసనీయమైన చోటు సంపాదించుకోవడం తనకు అమిత ఆనందాన్ని కలిగించిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు. స్వదేశానికి బయలుదేరడానికి ముందు శనివారం దుబాయిలోని తెలుగు సంఘం ఏర్పాటుచేసిన సన్మాన సభలో ఆయన మాట్లాడారు. తన మూడు రోజుల పర్యటనలో యునైటెడ్‌ అరబ్‌ ఏమిరేట్స్‌ వ్యాప్తంగా తనతో సమావేశమైన స్ధానిక అరబ్బు న్యాయమూర్తులందరూ భారతీయుల కృషిని, నిబద్ధతను ప్రశంసించారని చెప్పారు. చిత్తశుద్ధి, నిబద్ధత ఉంటే అభివృద్ధి ఏవిధంగా సాధ్యమో ఏమిరేట్స్‌ను చూస్తే తెలుస్తుందని అన్నారు. దుబాయిని అభివృద్ధి చేసినట్లుగా అదే సంకల్పంతో మాతృభూమిని అభివృద్ధి చేయడానికి కూడా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇరుదేశాల మధ్య ఖైదీల బదిలీ, నేరస్ధుల అప్పగింత ఒప్పందాలపై తాను యు.ఏ.ఇ అధికారులతో చర్చించానని తెలిపారు. వేతన బకాయిలు చెల్లింపు విషయమై న్యాయస్ధానాలు ఇచ్చే తీర్పుల అమలులో జరుగుతున్న జాప్యాన్ని కూడా ప్రస్తావించానని అన్నారు. విదేశాల్లోని తెలుగు వారందరూ తమ సంస్కృతిని కాపాడుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా తెలుగు సంఘం ప్రతినిధులు జస్టిస్‌ రమణ దంపతులను ఘనంగా సన్మానించారు.