Devotional

యాదాద్రిలో ప్రసాదం తయారీకి సాంకేతిక వ్యవస్థ ఇదే!

యాదాద్రిలో ప్రసాదం  తయారీకి   సాంకేతిక  వ్యవస్థ ఇదే!

యాదాద్రిలో ల‌డ్డూ ప్ర‌సాదం త‌యారీకి వాడుతున్న మెషిన‌రీ గురించి ఈ విష‌యాలు తెలుసా
యాదాద్రికి వెళ్లడం ఓ అదృష్టం. నూతన భవ్యమందిర దర్శనం ఓ దివ్యానుభూతి. లక్ష్మీనరసింహుడి సన్నిధికి చేరుకోవడం జన్మజన్మల పుణ్యం. కొత్త కోవెల అణువణువూ చూసి తరించిన భక్తులకు కొసమెరుపు.. ప్రసాదం రూపంలో స్వామి అనుగ్రహం! వేలాది మంది భక్తులు తరలి వచ్చినా, తరగని విధంగా ప్రసాదం అందుబాటులో ఉంచడానికి నూతనంగా ‘పోటు’ నిర్మించారు. రోజుకు లక్ష లడ్డూలు, అదే సంఖ్యలో పులిహోర ప్యాకెట్లు అందించే సామర్థ్యంతో నూతన పోటును నిర్మించారు.యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులందరికీ స్వామివారి లడ్డూ, పులిహోర ప్రసాదాలు అందివ్వాలన్నది వైటీడీఏ సంకల్పం. ఇక నుంచీ భక్తుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నందున రోజుకు సుమారు లక్ష లడ్డూలను అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వాటి తయారీ కోసం రూ.13.8 కోట్లతో అధునాతన యంత్రాలను కొనుగోలు చేశారు.
yadadri1
****అధునాతన యంత్రాలు
ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ప్రసాదాల తయారీ, విక్రయశాల ఒకేచోట ఉండేలా నాలుగు అంతస్తుల భవనం నిర్మించారు. ప్రధానాలయం ముందుభాగంలో ఉన్న శివాలయం వెనుక వైపు ఈ భవనం ఉంది. హరేకృష్ణ మూవ్‌మెంట్‌-హైదరాబాద్‌ ఆధ్వర్యంలో ఈ లడ్డూల తయారీ జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనలతో తిరుమల తరహాలో ప్రసాదాలు సిద్ధం చేసేందుకు చెన్నై, పుణె, ముంబై, రాజమండ్రి నుంచి అధునాతన యంత్రాలను తెప్పించారు. బూందీ, పాకం తయారీ యంత్రాలు శరవేగంతో పనిచేస్తాయి. లడ్డూలు కట్టేందుకు, పులిహోర కలిపేందుకు కూడా యంత్రాలనే వినియోగిస్తారు. ముడి పదార్థాలను యంత్రాల్లో వేయడం వరకే సిబ్బంది పని. మిగతా ప్రక్రియ మొత్తం యంత్రాలే నడిపిస్తాయి. సిద్ధమైన ప్రసాదాలు కన్వేయర్‌ బెల్టు ద్వారా విక్రయ కౌంటర్లకు చేరవేస్తారు. లడ్డూలను నిల్వ చేసే పాత్రలను శుభ్రం చేసేందుకు సైతం ప్రత్యేక యంత్రాలను అమర్చారు.
yadadri2
***గంటల్లో లక్షల్లో..
లడ్డూ తయారీ యంత్రం వందమంది నలభీములకు సమానం. 16 గంటల వ్యవధిలో సుమారు 500 కిలోల పప్పును పిండిగా పట్టి, బూందీగా కొట్టి, పాకం పెట్టి, జీడిపప్పు, కిస్మిస్‌, యాలకుల పొడి దట్టించి, లడ్డూ కట్టి ఏకంగా యాభై వేల నుంచి లక్ష లడ్డూలను సిద్ధం చేస్తుంది. ఇక పులిహోర విషయానికి వస్తే.. భారీ ఆవిరి యంత్రాల్లో బియ్యం వేస్తే చాలు. నలభై నిమిషాల్లో మల్లె పువ్వుల్లాంటి అన్నం సిద్ధమవుతుంది. ఈ అన్నాన్ని మిక్సింగ్‌ బ్లెండర్‌ సాయంతో పులిహోరగా కలుపుతారు. వడల తయారీకి కూడా ప్రత్యేక యంత్రాలు ఏర్పాటు చేశారు. హరేకృష్ణ మూవ్‌మెంట్‌ నిర్వాహకులు లడ్డూ తయారీకి సంబంధించిన బాధ్యతలు తీసుకున్నారు. పోటులో పనిచేసే ఉద్యోగులకు ప్రసాదాల తయారీలో ప్రత్యేక శిక్షణ ఇచ్చామని హరేకృష్ణ మూవ్‌మెంట్‌ ఏపీ, తెలంగాణ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస చెప్పారు. యాదాద్రికి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనంతో అలౌకిక ఆనందాన్ని, ఆలయ సందర్శనంతో ఆశ్చర్యా నుభూతిని పొందడంతోపాటు.. ప్రసాదం రుచికి మైమరచిపోతారు! ఆత్మీయులకూ, బంధు మిత్రులకూ పంచి మురిసిపోతారు. తీపి లడ్డూతో పాటు యాదాద్రి దేవుడి భక్తి మాధుర్యాన్ని కూడా!