DailyDose

పెగాసెస్‌పై ఏపీ అసెంబ్లీ కీలక నిర్ణయం – TNI తాజా వార్తలు

పెగాసెస్‌పై ఏపీ అసెంబ్లీ కీలక నిర్ణయం  – TNI  తాజా వార్తలు

* ఏపీ అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది. పెగాసెస్‌పై హౌస్‌ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పెగాసెస్‌పై హౌస్‌ కమిటీ ఏర్పాటు చేయాలని ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఏపీలో పెగాసస్ స్పై వేర్ కలకలం రేపుతోంది. టీడీపీ హయాంలో పెగాసెస్ స్పైవేర్ కొనుగోలు చేశారన్న పశ్చిమ్‌బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కామెంట్లతో ఏపీ రాజకీయాల్లో చర్చ మొదలైంది. పెగాసెస్ స్పైవేర్ ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేయలేదని గతంలో మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. పెగాసెస్ సాఫ్ట్ వేరును ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసిందా అంటూ ఓ ఆర్టీఐ దరఖాస్తుదారు అడిగిన ప్రశ్నకు మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ రిప్లై ఇచ్చారు. తమ హయాంలో పెగాసెస్ స్పైవేర్ కొనుగోలు చేయలేదని ఇప్పటికే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

* హైకోర్టు ఆదేశాలను జగన్ ప్రభుత్వం పాటించి అమరావతిని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ తుళ్లూరు శిబిరం నుంచి సీపీఎం ర్యాలీ నిర్వహించింది. సీఆర్డీఏ కార్యాలయం వరకు సీపీఎం నేతలు ర్యాలీగా వెళ్లారు. అయితే సీఆర్డీఏ కార్యాలయం వద్దకు చేరుకునేందుకు ప్రయత్నిస్తున్న నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. అసెంబ్లీ సమావేశాల కారణంగా 144 సెక్షన్ అమలులో ఉందని కేవలం నలుగురు మాత్రమే వెళ్లి వినతిపత్రం అందజేయాలని తెలిపారు.రాజధాని గ్రామాల్లో రైతుల సమస్యలు తీర్చాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. పేద రైతులకు పెన్షన్ రూ.2,500 నుంచి రూ.5వేలకు పెంచాలన్నారు. అమరావతి అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించాలని, ఆగిపోయిన నిర్మాణాలను పునఃప్రారంభించాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు.

*నల్గొండ జిల్లా హాలియా వద్ద సాగర్‌ కాలువలో దూకి ఓ ప్రేమజంట ఆత్మహత్య యత్నం చేసింది. అయితే గమనించిన స్థానికులు వారిని తాడుతో కాపాడడానికి యత్నించారు.అయితే యువతిని కాపాడగా యువకుడు గల్లంతయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పీఏపల్లికి చెందిన బాలకృష్ణ, అతని మరదలు ఇద్దరూ ప్రేమించుకున్నారు. కానీ వారి ప్రేమను పెద్దలు ఒప్పుకోలేదు. దాంతో ఇద్దరూ ఆత్మహత్య చేసుకుందామనుకున్నారు. సోమవారం ఉదయం పీఏపల్లి నుంచి హాలియా వచ్చారు. ఇద్దరూ సాగర్ కాలువలో దూకగా.. అది గమనించిన స్థానికులు తాడు సాయంతో యువతిని కాపాడారు.

యువకున్ని కాపాడేలోగా.. అతను గల్లంతయ్యాడు. అనంతరం స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనాస్థలికి చేరుకున్నారు. యువకుడి కోసం ఈతగాళ్లను రంగంలోకి దింపారు. అతని కోసం గాలిస్తున్నారు. యువతిని ఆమె తల్లిదండ్రులకు అప్పజెప్పినట్టు తెలిసింది.

*కర్ణాటకకోలార్‌లోని క్లాక్ టవర్‌పై తొలిసారిగా భారత జెండాను ఎగరేశారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య జిల్లా అధికారులు శనివారం జెండా ఎగరేశారు. కోలార్‌లోని క్లాక్ టవర్‌కు దశాబ్దాల చరిత్ర ఉంది. దాదాపు ఏళ్లుగా ఈ టవర్ ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది. అప్పట్నుంచి దీనిపై ఇస్లామిక్ జెండాలు ఎగురుతూనే ఉండేవి. అయితేతకాలంగా ఈ టవర్ విషయంలో వివాదం చెలరేగుతోంది. టవర్ రంగు మార్చాలనిటవర్‌పై ఉన్న జెండాలను తొలగించి మూడు రంగుల భారత జెండా ఎగరేయాలని స్థానిక ఎంపీ మునిస్వామితోపాటు పలువురు డిమాండ్ చేశారు. దీంతో చాలాకాలంగా వివాదం నడిచింది. గత శుక్రవారం కూడా మునిస్వామి ఈ అంశంపై ఆందోళన నిర్వహించారు. ఈ వివాదం నేపథ్యంలో అక్కడ సెక్షన్ విధించాల్సి వచ్చింది. చివరకు గత శనివారం పోలీసుల భద్రత మధ్య టవర్‌కు తెలుపు రంగు వేశారు. టవర్‌పై ఉన్న జెండాలను తొలగించిన అధికారులు మూడు రంగుల భారత పతాకాన్ని ఎగురవేశారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో భద్రతా చర్యలు తీసుకున్నారు. ఇరువర్గాలతో చర్చలు జరిపివివాదం తలెత్తకుండా చూశారు.

*కడప: జిల్లాలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. విద్యార్థులు బయటకు రాకుండా పోలీసులు గేట్లుకు తాళాలు వేశారు. మౌలిక వసతులు లేవంటూ నిన్నటి నుంచి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. రెండు వారాల్లో వసతులు కల్పి స్తామని, ఉండలేకపోతే ఇంటికి వెళ్ళాలని ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ చెప్పారు. ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

* అర్ధరాత్రి ఆడపిల్లలను వాడుకలో లేని శిథిల భవనాలకు తరలింపు దుర్మార్గమని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విటర్ వేదికగా విమర్శించారు. ఇడుపులపాయలో 6500 మంది విద్యార్థినులపై బెదిరింపులకు దిగుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులో కూడా వసతులు లేవంటూ విద్యార్థులను తరలించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఇలాకాలో వసతి, భోజనం కోసం విద్యార్థినులు నిరసనకు దిగారని… మీ పాలనా వైఫల్యానికి ఇది నిదర్శనం కాదా అని దేవినేని ఉమ ప్రశ్నించారు.

* ఇడుపులపాయ ట్రిఫుల్ ఐటీ విద్యార్థినులతో చర్చించేందుకు అమరావతి నుంచి చాన్స్‌లర్ చెంచిరెడ్డి సోమవారం రానున్నారు. రాత్రికి రాత్రే క్యాంపస్ ఖాళీ చేయడంపై అర్థరాత్రి వరకు విద్యార్థినులు నిరసనకు దిగారు. ఇంటికి వెళ్లే ప్రసక్తే లేదని, వసతులు కల్పించేవరకు అక్కడే ఉంటామని విద్యార్థినులు స్పష్టం చేశారు. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు వీసీ వస్తున్నారు.

* బెంగళూరు రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు తక్కువగానే కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 109 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 91 మంది ఉన్నారు. 16 జిల్లాల్లో ఒక్కకేసు కూడా న మోదు కాలేదు. పది జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. మిగిలిన జిల్లాల్లో ఐదులోపు కేసులు నమోదయ్యాయి. 143 మంది కోలుకోగా బెంగళూరు, హాసన్‌లో ఒక్కొక్కరు మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,995 మంది చికిత్సలు పొందుతుండగా అత్యధికంగా బెంగళూరులో 1706 మంది ఉన్నారు.

* ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బంది కోసం బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా, భోధన, ప్రాంతీయ ఆస్పత్రుల్లో బయోమెట్రిక్ విధానం ఉంటుందని తెలిపింది. బయోమెట్రిక్ హాజరు అమలు కోసం ఆస్పత్రుల్లో సీసీటీవీలను ఏర్పాటు చేసింది.డ్యూటీకి వచ్చి పర్మిషన్ లేకుండా బయటకు వెళ్తే సెలవుల్లో కోత ఉంటుందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. డాక్టర్లతో పాటు సిబ్బంది డ్యూటీ సమయంలో ఆస్పత్రిలో ఉండకుండా సొంత పనులపై బయట తిరుగుతున్నారని ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని ప్రభుత్వం పేర్కొంది. దీంతో ఈ అంశంపై దృష్టిపెట్టామని.. అందుకే బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. అటు వైద్య సిబ్బంది తాము ఆస్పత్రిలోనే ఉన్నామని గంట గంటకు సెల్ఫీ సంబంధిత వెబ్‌సైట్‌లో ఫోటోలు అప్‌లోడ్ చేయాలని ఆరోగ్య శాఖ కమిషనర్ కంఠమనేని భాస్కర్ ఇచ్చిన ఆదేశాల పట్ల వైద్య వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.

* ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు (CRPF jawans) గాయపడ్డారు.సుక్మా జిల్లాలోని ఎల్మగుండ క్యాంప్‌పై సోమవారం ఉదయం 6 గంటల సమయంలో మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారని, వారిని దవాఖానకు తరలించామని బస్తర్‌ రేంజ్‌ ఐజీ సుందర్‌రాజ్‌ చెప్పారు. ప్రస్తుతం వారి పరిస్థితి బాగానే ఉందని వెల్లడించారు. సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ఈ మధ్యే ఎల్మగుండలో క్యాంప్‌ ఏర్పాటు చేశారని తెలిపారు.మావోయిస్టుల కాల్పుల్లో సీఆర్‌పీఎఫ్‌ రెండో బేటాలియన్‌కు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ హేమంత్‌ చౌధరి, కానిస్టేబుళ్లు బసప్ప, లలిత్‌ బాఘ్‌ గాయపడ్డారని చెప్పారు. కాగా, ఆ ప్రాంతంలో మవోయిస్టుల కోసం గాలింపు ముమ్మరం చేశామన్నారు.

*టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు జంగారెడ్డిగూడెం బయలుదేరారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ నుంచి ప్రత్యేక బస్సులో జంరెడ్డిగూడెంకు ఎమ్మెల్యేలు పయనమయ్యారు. కల్తీ నాటుసారా మృతుల కుంటుంబాలను టీడీపీ ప్రజాప్రతినిధులు పరామర్శించనున్నారు. పార్టీ తరఫున ఒక్కో కుటుంబానికి రూ.లక్ష పరిహారం ఇవ్వనున్నారు. మొత్తం 27 కుటుంబాలకు రూ.27 లక్షల పరిహారాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు ఇవ్వనున్నారు.

*పడిపోయిన టమాట ధరలతో రైతులు ఆందోళన చెం దుతున్నారు. కొన్నీ రోజులుగా టమాట ధరలు పూర్తిగా పడిపోవడంతో టమాట తోటల ను సాగు చేసిన పలువురు రైతులు కూలీ సైతం గిట్టుబాటు కాకపోవడంతో పశువులకు తోటలను వదిలేస్తున్నారు. ఇంకొందరు ఏరక పోవడంతో తోటలోనే టమాట కుళ్లి పోతోంది. వివరాల్లోకి వెళ్తే.. నారాయణపేట పరిసర గ్రామాల రైతులు టమాటను విక్రయాల కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి నారాయణపేట మార్కెట్‌కు తరలిస్తుంటారు. ఈ క్రమంలో 25 కిలోల బాక్సు కేవలం రూ.50 మాత్రమే పలుకుతోందనిచ రూ.5కిలో ఇస్తున్నా కొనుగోలుకు వ్యాపారులు ముందుకు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు మాత్రం మార్కెట్‌లో రిటేల్‌గా టమాట కిలో పది రూపాయలకు వినియోగదారులకు విక్రయిస్తున్నారు. దీంతో పెట్టిన పెట్టుబడి కూడా చేతికందని పరిస్థితి నెలకొందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

*పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన విద్యార్థి జాక్‌పాట్‌ కొట్టేశాడు. ప్రఖ్యాత అమెజాన్‌ సంస్థలో ఉద్యోగం సాధించి ఏడాదికి అక్షరాలా రూ.44లక్షల జీతం అందుకోనున్నాడు. ఏలూరు కొత్తపేట దాసరి యర్రయ్య వీధిలో నివాసం ఉంటున్న పొట్నూరు విద్యాసాగర్‌ గుంటూరులోని ఆర్‌వీఆర్‌ అండ్‌ జేసీ కాలేజీలో సీఎ్‌సఈ చివరి సంవత్సరం చదువుతున్నాడు. అమెజాన్‌ కంపెనీ చేపట్టిన ప్లేస్‌మెంట్‌ ప్రక్రియలో భాగంగా ఈ నెల 17న సాఫ్ట్‌వేర్‌ డెవల్‌పమెంట్‌ ఇంజనీర్‌గా ఎంపికయ్యాడు.

*ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్‌ సముద్ర పరిసరాల్లో ఉన్న తీవ్ర అల్పపీడనం మరింత బలపడి ఆదివారం ఉదయానికి వాయుగుండంగా మారింది. అనంతరం ఉత్తర ఈశాన్యంగా పయనించి సాయంత్రానికి కార్‌నిరోబార్‌ దీవులకు ఉత్తర ఈశాన్యంగా 200 కి.మీ., పోర్టుబ్లెయిర్‌కు దక్షిణంగా 100 కి.మీ. దూరంలో ఉత్తర అండమాన్‌ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది. ఇది ఉత్తరంగా అండమాన్‌ దీవుల మీదుగా పయనించే క్రమంలో మరింత బలపడి సోమవారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా, రాత్రికి తుఫాన్‌గా మారనుంది. తుఫాన్‌గా మారితే దీనికి ‘అసాని’ అని పేరు పెట్టనున్నారు. ఇదిలావుండగా 1891 నుంచి 2020వ సంవత్సరం వరకు మార్చి నెలలో ఉత్తర హిందూ మహాసముద్రంలో 8 తుఫాన్లు ఏర్పడగా, వాటిలో ఆరు బంగాళాఖాతంలోనే ఏర్పడ్డాయని వాతావరణ శాఖ తెలిపింది.

*ఓబీసీ వర్గీకరణపై జూలై నెలాఖరులోనే నివేదిక సమర్పిస్తామని జస్టిస్‌ రోహిణి కమిషన్‌ వర్గాలు తెలిపాయి. వర్గీకరణపై ఈ నెలాఖరులోపు ప్రాథమిక నివేదిక సమర్పించాలన్న ఆలోచన లేదని, కమిషన్‌కు విధించిన గడువు ప్రకారం జూలై 31లోపే నివేదికను సమర్పిస్తామని సంబంధిత వర్గాలు ఆంధ్రజ్యోతి ప్రతినిధికి తెలిపాయి. ఓబీసీ పరిధిలోకి వచ్చే కులాలను నాలుగు కేటగిరీలుగా విభజించాలన్నది పాత ఆలోచనేనని, ఈ మేరకు తాము కన్సల్టేషన్‌ పేపర్‌ను రూపొందించి 2018లోనే రాష్ట్ర ప్రభుత్వాలకు, ఆయా రాష్ట్రాల్లోని ఓబీసీ కమిషన్లకు పంపించామని పేర్కొన్నాయి.

*రాజధానికి భూములిచ్చినందుకు ప్యాకేజీ కింద తమకు కేటాయించిన ప్లాట్లలో ఎలాంటి మౌలిక సదుపాయాలూ కల్పించనందుకు పరిహారం కోరుతూ పలువురు రాజధాని ప్రాంత రైతులు సీఆర్‌డీఏ కమిషనర్‌కు లీగల్‌ నోటీసులు ఇచ్చారు. అలాగే సకాలంలో అంతర్జాతీయ రాజధానిని నిర్మించకుండా ఉద్దేశపూరక జాప్యం చేసి, భూములిచ్చిన రైతులను మోసం చేసినందున సీఆర్‌డీఏకు పెనాల్టీ విధించాలని ఏపీ రెరా(ఆంధ్రప్రదేశ్‌ రియల్‌ ఎస్టేట్‌ అండ్‌ రెగ్యులేటరీ అథారిటీ)కు ఫిర్యాదు చేశారు. న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌ బాబు ద్వారా రైతు కంచర్ల ఓంకార్‌ సీఆర్‌డీఏకు ఇచ్చిన లీగల్‌ నోటీసు, ఏపీ రెరాకు ఇచ్చిన ఫిర్యాదు ఆదివారం వెలుగులోకి వచ్చాయి.

*వైసీపీ హయాంలో కొత్తగా 20 రకాల మద్యం బ్రాండ్లు మార్కెట్‌లోకి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని అంగీకరించింది. 2019-20లో 20 బ్రాండ్లు కొత్తగా వచ్చాయని ఎక్సైజ్‌ శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌భార్గవ వెల్లడించారు.

*నొప్పి నివారణకు వినియోగించే ట్రమడాల్‌ మందులను ఎటువంటి అనుమతులు లేకుండా పాకిస్థాన్‌కు ఎగుమతి చేస్తున్నారనే ఆరోపణలపై తెలంగాణకు చెందిన ల్యూసెంట్‌ డ్రగ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ డైరెక్టర్‌ సహా నలుగురిని అరెస్టు చేశారు. బెంగళూరు ప్రాంతీయ డివిజన్‌ ఎన్‌సీబీ (నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో) బెంగళూరు ముఖ్యులు అమిత్‌ఘావటి శనివారం బెంగళూరులో ఈ విషయాన్ని వెల్లడించారు. సంగారెడ్డిలోని కంపెనీ నుంచి పాకిస్థాన్‌కు ఏటా 25వేల కిలోల ట్రమడాల్‌ డ్రగ్‌ (ట్రమడాల్‌ హెచ్‌సీఎల్‌)ను ఎగుమతి చేసినట్లు గుర్తించామని తెలిపారు.

*తిరుమలకుంటలో ప్రజాప్రతినిధుల రాజీనామాతో టీఆర్‌ఎస్‌ పార్టీ పతనం ప్రారంభమైందని టీపీసీసీ రాష్ట్ర నాయకురాలు సున్నం నాగమణి అన్నారు. త్వరలో నియోజవర్గంలోని పలువురు ప్రజా ప్రతినిధులు రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆధివారం ఎంపీటీసీ తిరుమల ఇంటివద్ద జరిగిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ గత ఎమ్మెల్యేప్రస్తుత ఎమ్మెల్యేలు అభివృద్ధి కోసం పార్టీలు మారామంటూ చెపుతూ సొంత ఆస్తులు కూడబెట్టుకోవడంలో మునిగి తేలుతున్నారన్నారు. సమావేశంలో మండల కాంగ్రేస్‌ అధ్యక్షుడు చెన్నకేశవరావుతుమ్మ రాంబాబు పాండుఎంపీటీసీ తిరుమలబాబామహేష్‌కృష్ణబాల గంగాధర్‌ పాల్గొన్నారు.

* గుంటూరు నగరంలో పాలకొల్లు పాప అనే హిజ్రా ఆగడాలు‌ మితిమీరిపోతున్నాయి. పాలకొల్లు పాపపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి హిజ్రాలు ఫిర్యా చేశారు. గంజాయి ముఠాలతో సంబంధాలు పెట్టుకొని చట్ట వ్యతిరేక పనులు చేస్తోందని తెలిపారు. ఆ హిజ్రాకు సహకరించని వారిపై తప్పుడు కేసులు పెడుతోందని.. సహకరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తోందని చెప్పారు. పోలీసులు పాలకొల్లు పాపపై చర్యలు తీసుకోవాలని హిజ్రాలు కోరుతున్నారు

* బ్లాక్‌ ఫిలింతో, ఎమ్మెల్యే స్టిక్కర్‌లతో తిరుగుతున్న వాహనాలపై సైఫాబాద్‌, జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు కొరడా ఝళిపించారు. ఖైరతాబాద్‌ పరిధిలోని ఇందిరాగాంధీ చౌరస్తా, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, ఫిలింనగర్‌ చౌరస్తా తదితర ప్రాంతాల్లో ఆదివారం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. మూడు ఇన్నోవా కార్లకు ఏపీకి చెందిన ఎమ్మెల్యేల స్టిక్కర్లు ఉండటంతో వాటిని తొలగించారు. సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌కు చెందిన కారుకు బ్లాక్‌ ఫిలిం ఉండటంతో దాన్ని తీయించివేశారు. ఆ సమయంలో కారులో ఎన్టీఆర్‌ లేరు. డ్రైవర్‌ మాత్రమే ఉన్నాడు. మొత్తం 90 వాహనాలకు బ్లాక్‌ ఫిలింను తొలగించి పలువురికి జరిమానాలు విధించినట్లు సైఫాబాద్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ రాంచందర్‌, జూబ్లీహిల్స్‌ సీఐ ముత్తు తెలిపారు.