Business

చమురు దెబ్బ..నష్టాల్లో స్టాక్ మార్కెట్లు – TNI వాణిజ్య వార్తలు

చమురు దెబ్బ..నష్టాల్లో స్టాక్ మార్కెట్లు  – TNI వాణిజ్య వార్తలు

*దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మార్కెట్‌ నిపుణులు అంచనా వేసినట్లే దేశీయ మార్కెట్లపై అంతర్జాతీయ అంశాల ప్రభావం పడింది. రష్యా – ఉక్రెయిన్‌ దేశాల సంక్షోభం,చైనాలో తలెత్తిన కరోనా, బ్రెంట్, నైమెక్స్‌ చమురు ధరలు 110 డాలర్ల స్థాయికి చేరడంతో దేశీయ ఇన్వెస్ట్‌ర్లు పెట్టుబడులు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. దీంతో సోమవారం ఉదయం 10.30గంటల సమయానికి సెన్సెక్స్‌ 209 పాయింట్ల నష్టపోయి 57626 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ సైతం 53 పాయింట్లు నష్ట పోయి 17227వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. హిందాల్కో,మారుతి సుజికీ, టాటా స్టీల్‌,ఓఎన్‌జీసీ, జేఎస్‌డ్ల్యూ స్టీల్‌,సన్‌ ఫార్మా, కిప్లా,విప్రో, యూపీఎల్‌,కోల్‌ ఇండియా,టెక్‌ మహీంద్రా షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా..కొటాక్‌ మహీంద్రా, ఏసియన్‌ పెయింట్స్‌,అదానీ పోర్ట్‌,హెచ్‌యూఎల్‌, బ్రిటానియా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.

*భారత ఈక్విటీ మార్కెట్‌ సంస్థాగతంగా పటిష్ఠంగా ఆకర్షణీయంగా ఉన్నందు వల్ల ఎఫ్‌పిఐలు తిరిగి పెట్టుబడులతో వస్తారని బ్రోకరేజి సంస్థ శామ్‌కో సెక్యూరిటీస్‌ అంచనా. వరుసగా గత 5 నెలలుగా ఎఫ్‌పీఐలు మన మార్కెట్లో నికర అమ్మకందారులుగా ఉన్న వాతావరణంలో ఈ తాజా అంచనా ప్రోత్సాహకరంగా ఉంది. వాస్తవానికి రష్యా మార్కెట్లో పెట్టుబడులకు ప్రత్యేకించిన నిధులు కూడా భారత్‌కే మరలిస్తారని పేర్కొంది.

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ 4 కోట్ల టన్నుల ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేసినట్లు ఎన్‌ఎండీసీ ప్రకటించింది. ఒక ఏడాదిలో చేసిన రికార్డు ఉత్పత్తి ఇదే. 2021-22 మొత్తానికి ఉత్పత్తి 4.2 కోట్ల టన్నులకు చేరగలదని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో 3.5 కోట్ల టన్నుల ఇనుప ఖనిజాన్ని కంపెనీ ఉత్పత్తి చేసింది. 2030 నాటికి ఏడాదికి 10 కోట్ల టన్నులకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.

*కర్ణాటకకు చెందిన శ్రీ కృష్ణ మిల్క్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను దొడ్ల డెయిరీ రూ.50 కోట్లకు కొనుగోలు చేసింది. గత ఆర్థిక సంవత్సరానికి శ్రీ కృష్ణ మిల్క్స్‌ టర్నోవర్‌ రూ.67.27 కోట్లు. వ్యాపార కార్యకలాపాల విస్తరణలో భాగంగా శ్రీ కృష్ణ మిల్క్స్‌ కొనుగోలు చేసినట్లు దొడ్ల డెయిరీ వెల్లడించింది. ఒప్పందం కుదుర్చుకున్న నాటి నుంచి రెండు నెలల్లో కొనుగోలు ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది. రూ.50 కోట్లను నగదు రూపంలో చెల్లించి కర్ణాటక కంపెనీని సొంతం చేసుకున్నట్లు దొడ్ల డెయిరీ తెలిపింది.

*భారత మీడియా, వినోద రంగం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మీడియా పరిశ్రమల్లో ఒకటని కేంద్ర సమాచార, ప్రసార (ఐ అండ్‌ బీ) శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర అన్నారు. భారత మీడియా, వినోద రంగ ప్రస్తుత మార్కెట్‌ పరిమాణం 2,800 కోట్ల డాలర్ల (రూ.2,12,800 కోట్లు) స్థాయిలో ఉందని.. 2030 నాటికి 12 శాతం చొప్పున వార్షిక వృద్ధితో 10,000 కోట్ల డాలర్ల (రూ.7.60 లక్షల కోట్లు) స్థాయికి చేరుకోవచ్చన్నారు. దుబాయ్‌ ఎక్స్‌పోలోని ఇండియా పెవిలియన్‌లో మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ వీక్‌ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ పరిశ్రమకు అవసరమైన నిపుణులు, సృజనాత్మక నైపుణ్యం దేశంలో పుష్కలంగా అందుబాటులో ఉందన్నారు. దేశంలో యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, గేమింగ్‌, కామిక్స్‌ (ఏవీజీసీ) విభాగాల అభివృద్ధికి దోహదపడే విధానాల రూపకల్పన కోసం తమ మంత్రిత్వ శాఖ ఈ నెలాఖరు నాటికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనుందన్నారు.

*దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ రుణాలకు డిమాండ్‌ క్షీణత ప్రభావం కనిపిస్తోంది. ఉక్రెయిన్‌-రష్యా యు ద్ధం కారణంగా ఇంధన ధరలు పెరిగిపోయాయి. ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయిల్లో ఎలాంటి తగ్గుముఖం లేకుండా ఉండిపోయింది. కార్పొరేట్‌ ఆదాయాలు ఆశించిన స్థాయిలో పెరగలేదు. రెండు, మూడు త్రైమాసికాల పాటు ఈ ప్రభావం అలాగే ఉంటుందని క్రెడిట్‌ సూయిస్‌ విశ్లేషకులు చెబుతున్నారు. పెరిగిన ఇంధనం, కమోడిటీ ధరల కారణంగా ఆటో, ఎస్‌ఎంఈ, హౌసింగ్‌ విభాగాల్లో రుణ డిమాండ్‌ ఒక మోస్తరుగానే ఉంటుందని వారంటున్నారు. ఆటో రుణాలు కాస్తంత పుంజుకుంటున్నాయన్న వాతావరణంలో ఏర్పడిన అవరోధాల కారణంగా 2024 ఆర్థిక సంవత్సరంలో రుణ డిమాండ్‌ 2-5 ు తగ్గుతుందని అంచనా వేసింది. కాగా ధరల పెరుగుదలతో ఆర్‌బీఐ ద్రవ్య విధానంలో కఠిన వైఖరి తీసుకునే వీలుంది.

*అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి అంచనాను 9.5% నుంచి 9.1 శాతానికి తగ్గిం చింది. ఇంధన ధరల్లో భారీ వృద్ధి, ఎ రువులదిగుమతి బిల్లు పెరగడంతో ప్రభుత్వం పెట్టుబడి వ్యయాలను తగ్గించుకోవాల్సి రావడం జీడీపీని ప్రభావితం చేస్తాయని తెలిపింది.

* డ్రోన్‌ ఆధారిత ఖనిజ అన్వేషణకు ఐఐటీ ఖరగ్‌పూర్‌తో ఎన్‌ఎండీసీ ఒప్పందం కుదుర్చుకుంది. రాగి, రాక్‌ ఫాస్ఫేట్‌, సున్నం, ఇనుప ఖనిజం, టంగ్‌స్టన్‌ వంటి అనేక లోహాల ఖనిజాలను అన్వేషించి ఎన్‌ఎండీసీ వెలికి తీస్తోంది. డ్రోన్‌ల ద్వారా ఖనిజ అన్వేషణకు ఎన్‌ఎండీసీ, ఐఐటీ ఖరగ్‌పూర్‌ కలిసి ప్రత్యేక ఆల్గారిథమ్స్‌, ఇతర సొల్యూషన్లను అభివృద్ధి చేస్తాయి.

*కొవిడ్‌ చికిత్సకు నోటి ద్వారా తీసుకునే ఫైజర్‌ ఔషధం ‘నిర్మట్రెల్‌విర్‌’ జెనరిక్‌ను తయారు చేయడానికి మెడిసిన్స్‌ పేటెంట్‌ పూల్‌ (ఎంపీపీ)తో అరబిందో ఫార్మా సబ్‌-లైసెన్స్‌ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందుకు అనుగుణంగా నిర్మట్రెల్‌విర్‌ ఔషధాన్ని తయారు చేసి భారత్‌తో సహా 95 దేశాలకు సరఫరా చేస్తుంది.

*పెట్టుబడులను సమీకరించే ప్రక్రియకు సంబంధించిన నిబంధనలను సెబీ సవరించింది. సెబీ ఏఐఎఫ్ రెగ్యులేషన్స్ అన్న కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. కాగా… కొత్త నోటిఫికేషన్ నేపథ్యంలో… హెడ్జ్ ఫండ్‌లుపైప్ ఫండ్‌లు తదితర పలు రకాల ఫండ్‌లు కేటగిరీ IIIఏఐఎఫ్‌లుగా నమోదు నమోదు చేశారు. ఇక… కేటగిరీ III ఏఐఎఫ్‌ల గుర్తింపు పొందిన పెట్టుబడిదారుల కోసం భారీ విలువున్న ఫండ్‌లు పెట్టుబడి పెట్టదగిన నిధులలో 20 శాతం వరకు పెట్టుబడిదారు కంపెనీలో పెట్టుబడి పెట్టవచ్చు. నేరుగా, లేదా… ఇతర ఏఐఎఫ్ యూనిట్లలో పెట్టుబడి పెట్టవచ్చు.

*క్షయవ్యాధిరి కొత్త వ్యాక్సిన్‌ అభివృద్ధి, తయారీ, పంపిణీకి స్పెయిన్‌కు చెందిన బయోఫార్మాస్యూటికల్‌ కంపెనీ బయోఫాబ్రితో భారత్‌ బయోటెక్‌ చేతులు కలిపింది. ఇందులో భాగంగా ఆగ్నేయ ఆసియా, ఆఫ్రికాకు చెందిన 70కి పైగా దేశాల్లో కొత్త వ్యాక్సిన్‌ను భారత్‌ బయో మార్కెటింగ్‌ చేస్తుంది.