DailyDose

టీడీపీ హయాంలో పెగాసెస్‌ కొనలేదు

టీడీపీ హయాంలో పెగాసెస్‌ కొనలేదు

టీడీపీ హయాంలో పెగాసెస్‌ కొనలేదని మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పెగాసెస్‌ను కొనలేదని డీజీపీ కార్యాలయమే చెప్పిందని గుర్తుచేశారు. పెగాసెస్‌ పట్ల తనపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. పెగాసెస్‌ వల్ల ప్రజల్లో అభద్రతా భావం కలుగుతోందని పేర్కొన్నారు. ప్రజల భయాన్ని పోగొట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో నిఘా చీఫ్‌గా ఉన్నందున తనకు పూర్తి సమాచారం ఉందని, మే 2019 వరకు ఏ ప్రభుత్వ సంస్థ పెగాసెస్‌ కొనలేదని తెలిపారు. మే 2019 తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని చెప్పారు. లేనిపోని అపోహలతో ప్రజల్లో భయాందోళన కలిగించవద్దని సూచించారు. కొందరు కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారని ఏబీ వెంకటేశ్వరరావు ఎద్దేవాచేశారు.

గత ప్రభుత్వ హయాంలో ఎవరి ఫోన్లు ట్యాప్‌ కాలేదని తెలిపారు. తనపై అనేక ఆరోపణలు చేశారని, సీఎస్‌ ఆఫీస్‌కు మూడు వినతిప్రతాలు ఇచ్చానని చెప్పారు. తనపై విచారణ త్వరగా ముగించి తుది నిర్ణయం తీసుకోవాలని కోరానని పేర్కొన్నారు. ఏపీ నుంచి కొన్ని పత్రాలు రాలేదని కేంద్రం చెబుతోందన్నారు. తన సస్పెన్షన్‌ విషయం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని వెంకటేశ్వరరావు తెలిపారు.
‘‘ఏ విచారణ నుంచి నేను తప్పించుకోలేదు. నాపై విచారణ సమయంలో కొన్ని పత్రాలను ఫోర్జరీ చేసేందుకు విఫలయత్నం చేశారు. 2021 ఏప్రిల్‌లో అడిగినా ఇప్పటివరకు చలనం లేదు. నాపై అసత్యాలు, అన్యాయమైన ఆరోపణలు చేస్తున్నారు. కొందరిపై పరువు నష్టం దావా వేసేందుకు అనుమతివ్వాలని కోరా. నా సస్పెన్షన్‌పై కోర్టులో చాలెంజ్‌ చేశా. నాపై బురద చల్లడం, వ్యక్తిత్వ హననం ఎంతవరకు కరెక్ట్‌. ఇదంతా అబద్ధమని నాకు తెలుసు.. ఏ విచారణకైనా వెనకడుగు వేయలేదు. నిజానిజాలు త్వరగా తేల్చాలని మాత్రమే అడుగుతున్నా. 30 ఏళ్లపాటు వృత్తి ధర్మం పాటించా.. దేశద్రోహిని ఎలా అవుతా?. నాపై రాసిన అసత్య వార్తలు చదివి బంధువులు, మిత్రులు ఏమనుకుంటారు?. పెగాసెస్‌ పట్ల కూడా నాపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అసత్యాలు ప్రచారం చేస్తే రేపు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఎలా పనిచేస్తారు?.’’ అని ఏబీ వెంకటేశ్వరరావు ప్రశ్నించారు.

‘‘ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నానని..ఇష్టానుసారం అబద్ధాలు ప్రచారం చేస్తారా?. నాకు సిగ్గు లజ్జ ఉన్నాయి..ముందు మనిషిని, తర్వాతే ఉద్యోగిని. పది జిల్లాల్లో పని చేశా..ఎక్కడైనా అవినీతి నిరూపించమనండి. నా క్యారెక్టర్ కాపాడుకుంటూ పనిచేస్తే ఇప్పుడు ఆరోపణలా?. బెదిరింపులకు భయపడి పారిపోవాలా?. నేను నిఘా చీఫ్‌గా ఉన్నంతకాలం పెగాసెస్ కొనుగోలు జరగలేదు. ఈ విషయంలో ఇదే ఫైనల్. 2019 మే వరకు మాత్రం పెగాసెస్‌ కొనలేదు, వాడలేదు. ఆ తర్వాత సంగతి ఇప్పటి ప్రభుత్వమే చెప్పాలి. పెగాసెస్ విషయంలో ఎవరికీ అనుమానాలొద్దు. తమ ఫోన్లు ట్యాప్‌ చేశారని వైవీ సుబ్బారెడ్డి, సజ్జల కోర్టులో కేసులు వేశారు. ఫోన్ ట్యాపింగ్ కరెక్ట్ కాదని నేను నోటీసులకు జవాబిచ్చా. ప్రభుత్వం మారిన 6 నెలల తర్వాత వైవీ సుబ్బారెడ్డి కోర్టు కేసు వాపస్ తీసుకున్నారు. ఎందుకు అలా చేశారో నాకు తెలియదు. సజ్జల వేసిన కేసును హైకోర్టు డిస్మిస్ చేసింది. 6 నెలలకోసారి చీఫ్ సెక్రటరీకి వివరాలు ఇచ్చాక.. వారు సంతృప్తి చెందితే పోస్ట్ ఇస్తారు. నేను ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్నంతకాలం అంతా సవ్యంగా ఉంది. సస్పెన్షన్ ఏడాది దాటకూడదని ఉంది. రెండో ఏడాది కూడా కొనసాగిందంటే ఏ కారణాలు చూపించారో. నాకు అన్యాయం జరిగినా..నేను చేసేదేమీ లేదు. కొన్నిసార్లు నిబంధనల ప్రకారం నడుచుకోవడమే. నాపై రాజకీయ పరమైన విమర్శలు చేశారు. 35 మంది కమ్మ సామాజికవర్గానికి ప్రమోషన్లు ఇచ్చారన్నారు. నేను తప్పు చేయలేదు..అన్నింటికీ సమాధానం చెబుతా. నేను ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు. కొందరి ఆరోపణలపై మాట్లాడుతున్నా. ప్రభుత్వం అనుమతిచ్చాకే..కోర్టులో పరువు నష్టం దావా వేస్తా.’’ అని ఏబీ వెంకటేశ్వరరావు హెచ్చరించారు.