Devotional

యాదాద్రి లక్ష్మినరసింహ స్వామి పంచకుండాత్మక యాగం – TNI ఆధ్యాత్మికం

యాదాద్రి లక్ష్మినరసింహ స్వామి పంచకుండాత్మక యాగం – TNI  ఆధ్యాత్మికం

లక్ష్మీ నరసింహస్వామి బాలాలయంలో మహాపంచకుండాత్మక యాగం ప్రారంభమైంది. సోమవారం నుంచి ఏడు రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. తర్వాత భక్తులకు గర్భగుడిలో స్వామివారిని దర్శించుకునే భాగ్యం లభించనుంది. 108 పారాయణ దారులు, ఆలయ అర్చక బృందంతో ఈ క్రతువు జరుగుతోంది. ఆలయ గోపురాల కలశాలన్నింటికీ సంప్రోక్షణ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం నుంచి 28వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో బాలాలయంలో పూజా కార్యక్రమాలు జరుగుతాయి. 28న సంప్రోక్షణ అనంతరం బాలాలయంలోని స్వామివారి ఉత్సవమూర్తులను శోభాయాత్రగా ప్రదానాలయంలోకి తరలిస్తారు. అన్ని పూజలు పూర్తయిన తర్వాత భక్తులకు దర్శనం కల్పించనున్నారు. యాదాద్రిలో స్వామివారి దర్శనం ఒకెత్తయితే అక్కడ కాలు పెట్టింది మొదలు, ఇంటికి తిరుగు పయనమయ్యేదాకా అడుగడుగునా పునర్‌నిర్మాణ. ఆలయ విస్తరణ పనుల శోభతో యాదాద్రి వైభవం మనసును కట్టిపడేసే తీరు మరో ఎత్తు. అబ్బుపరిచే కృష్ణరాతి శిల్పాలు.. ఆకట్టుకునే సప్తరాజగోపురాలు.. సింహరూప యాలీ పిల్లర్లు, 12 మంది ఆళ్వారుల విగ్రహాలు, రాత్రివేళ ఆలయాన్ని బంగారు రంగులో మెరిపించే విద్యుత్తు ధగధగలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

2. అరసవల్లి సూర్యనారాయణ స్వామి హుండీ ఆదాయం రూ.7.62 లక్షలు
అరసవల్లి సూర్యనారాయణ స్వామివారికి ఆదివారం రూ.7,62,800 ఆదాయం లభించినట్టు ఈవో హరిసూర్యప్రకాష్‌ తెలిపారు. టిక్కెట్ల రూపేనా రూ.4,76,800, విరాళాల ద్వారా రూ.66,000, ప్రసాదాల ద్వారా రూ.2,20,00 ఆదాయం సమకూరినట్టు ఈవో స్పష్టం చేశారు. విశాఖకు చెందిన కె.శ్రీనివాసరావు, సుధారాణి దంపతులు స్వామివారిని, రూ.1,00,000 విరాళాన్ని ఈవో హరిసూర్యప్రకాష్‌, సూపరింటెండెంట్‌ చక్రవర్తి అందజేశారు. అరకు ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.

3. 24 నుంచి శ్రీశైలంలో స్వామివారి స్పర్శదర్శనం
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలమహాక్షేత్రంలో ఈ నెల 24 నుంచి 30 వరకు భక్తులందరికీ మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం కలుగనుంది. ఈసారి ఉగాది ఉత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వారం రోజుల ముందే భక్తులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది. దీంతో స్పర్శ దర్శనం కారణంగా స్వామివారి దర్శనానికి 5 నుంచి 10 గంటల సమయం పట్టే అవకాశం ఉందని ఆలయ ఈవో లవన్న తెలిపారు

4. తిరుమలలో అన్నదానానికి 30 లక్షల విరాళందేవాన్ష్‌ పుట్టిన రోజుకు బాబు కుటుంబం వితరణ
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్‌ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం తిరుమలలో అన్నదాన కార్యక్రమం జరగనున్నది. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద వితరణకు రోజూ రూ.30 లక్షలు ఖర్చవుతుంది. ఏటా దేవాన్ష్‌ పుట్టిన రోజు అన్నదాన వితరణకు అయ్యే ఆ మొత్తం వ్యయాన్ని విరాళంగా ఇవ్వడం చంద్రబాబు కుటుంబానికి ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే తమ విరాళంతో తిరుమల సందర్శకులకు ఈ రోజు అన్నప్రసాదాలను వడ్డించాలని టీటీడీని చంద్రబాబు కుటుంబం కోరింది.

5. శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల వేంకటేశ్వరస్వామిని ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు పండిట్‌ రవిశంకర్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఆదివారం దర్శించుకున్నారు. ఉదయం బ్రేక్‌ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న పండిట్‌ రవిశంకర్‌కు వేదపండితులు ఆశీర్వచనం, టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి లడ్డూప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం సమీర్‌శర్మ దంపతులకు జవహర్‌రెడ్డి లడ్డూ ప్రసాదాలు అందజేశారు. యుద్ధం ఆగాలని, విశ్వశాంతి జరగాలని కోరుకున్నట్టు రవిశంకర్‌ మీడియాకు తెలిపారు

6. రికార్డు స్థాయిలో.. తిరుమలకు భక్తులు
తిరుమల శ్రీవారిని శనివారం రికార్డుస్థాయిలో భక్తులు దర్శించుకున్నారు. శనివారం వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు 80,429 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 2020 మార్చి తర్వాత 80 వేల మంది దర్శించుకోవడం ఇదే మొదటిసారి. ఇక, హుండీ ద్వారా రూ.5.13 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే 38,182 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని పేర్కొంది.

7. శ్రీశైలంలో స్వామివారి స్పర్శదర్శనం
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలమహాక్షేత్రంలో ఈ నెల 24 నుంచి 30 వరకు భక్తులందరికీ మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం కలుగనుంది. ఈసారి ఉగాది ఉత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వారం రోజుల ముందే భక్తులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది. దీంతో స్పర్శ దర్శనం కారణంగా స్వామివారి దర్శనానికి 5 నుంచి 10 గంటల సమయం పట్టే అవకాశం ఉందని ఆలయ ఈవో లవన్న తెలిపారు.

8. శ్రీవారి లడ్డూల తయారీకి కొత్త చిక్కు.. వినూత్న ఫార్ములాతో చెక్ పెట్టిన టీటీడీ
తిరుమల శ్రీవారి లడ్డూ తెలియని వారుండరంటే అతిశయోక్తికాదు. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన తిరుమల లడ్డూల తయారీకి కొత్తచిక్కు వచ్చి పడింది టీటీడీకి.తిరుమల శ్రీవారి లడ్డూ(Srivari Laddu) ప్రసాదాలను అర్చకులు నిర్ణయించిన దిట్టం ప్రకారం తయారు చేస్తుంది టీటీడీ. ప్రతిరోజూ 4 లక్షల లడ్డూలు శ్రీవారి ఆలయపోటులో తయారవుతాయి. లడ్డూల తయారీలో శనగపిండి, చక్కెర, యాలకలు, ఎండు ద్రాక్ష, జీడిపప్పుతోపాటు నెయ్యిని వాడుతారు. వీటిలో నాణ్యమైన వాటిని గుర్తించి టీటీడీ కొనుగోలు చేస్తుంది. ప్రసాదాల తయారీకి రోజుకు 4 వేల నుండి 5వేల కేజీల వరకు బద్ద జీడిపప్పు అవసరమవుతుంది. కొద్దికాలంగా టీటీడీకి బద్ద జీడిపప్పు కొరత ఏర్పడింది. పలుసార్లు టెండర్లు పిలిచినా నాణ్యమైన బద్ద జీడిపప్పు దొరకడం లేదు. దీంతో భవిష్యత్‌ అవసరాల కోసం ఏం చెయ్యాలన్న దానిపై టీటీడీ కొత్త ఆలోచన చేసింది. కేరళ(Kerala)లో జీడిపప్పు గుండల్‌ను బద్దజీడిపప్పుగా మార్చే ప్రక్రియను తెలుసుకున్న టీటీడీ.. కేరళకు ప్రత్యేక బృందాన్ని పంపి అధ్యయనం చేయించింది. బద్ద జీడిపప్పు కొనుగోలుకు ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా కేరళ విధానాన్ని అనుసరించాలని..జీడిపప్పును బద్దలుగా మార్చుకుంటేనే బాగుంటుందని అధికారుల బృందం టీటీడీకి సూచించింది. అందుకు టీటీడీ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. కేరళలో ప్రసాదానికి బద్దజీడిపప్పు తయారీ ప్రక్రియను టీటీడీలోనూ అమలు చేస్తూ సమస్యను అధిగమించింది. దీంతో సొంతంగా జీడిపప్పు బద్దలను తయారు చేసుకునే వెసులుబాటు కలిగిందని చెబుతున్నారు టీటీడీ అధికారులు. ఇక శ్రీవారి లడ్డూల తయారీకి ఏ ఆటంకం లేదని స్పష్టం చేస్తున్నారు.

9. ఉత్సవమూర్తులకు తెప్పోత్సవం
దిగువ అహోబిలం ఉత్సవమూర్తులైన ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు ఆదివారం వేదపండితులు తెప్పోత్సవం నిర్వహించారు. ముందుగా కోనేటిలో తెప్పను వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు. అనంతరం ఉత్సవమూర్తులను గంధంతో అలంకరించి, పంచామృతాభిషేకం చేశారు. తర్వాత ఉత్సవమూర్తులను తెప్పపై ఆశీనులను చేశారు. కార్యక్రమంలో పీఠాధిపతి రంగనాథయతీంద్ర మహాదేశికన్‌, ప్రధాన అర్చకుడు వేణుగోపాలన్‌, నంద్యాల మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి, ఈవో నరసయ్య తదితరులు పాల్గొన్నారు.