Politics

యూపీ ప్రజలకు సీఎం యోగి భారీ ఆఫర్‌ – TNI రాజకీయ వార్తలు

యూపీ ప్రజలకు సీఎం యోగి భారీ ఆఫర్‌ – TNI రాజకీయ వార్తలు

* ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీల్లో భారీ విజయాన్ని అందుకున్న అధికార బీజేపీ పార్టీ శుక్రవారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంగా రెండోసారి యోగి ఆదిత్యనాథ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే 52 మందిలో కేబినెట్‌ను విస్తరించారు. ఇదిలా ఉండగా శనివారం మంత్రి మండలి మొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం యోగి కీలక నిర్ణయం తీసుకున్నారు. యూపీలో ఉచిత రేషన్‌ పథకాన్ని మరో మూడు నెలలపాటు పొడిగిస్తున్నట్టు తెలిపారు. కాగా, యూపీలో రెండోసారి బీజేపీ అధికారంలోకి రావడానికి ఈ పథకమే కీలక పాత్ర పోషించింది. ఇక, సీఎం యోగి నిర్ణయంతో యూపీలో ఉన్న దాదాపు 15 కోట్ల పేదలకు ఈ పథకం ద్వారా ఉచిత రేషన్‌ దనుంది.అయితే, కరోనా సమయంలో పేద ప్రజలకు ఉచిత రేషన్‌ పథకాన్ని కొనసాగించిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం బ్రిజేశ్‌ పాఠక్‌ మాట్లాడుతూ.. పేద‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని, కేంద్ర‌-రాష్ట్ర ప్ర‌భుత్వాల ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు అందాల‌న్‌ఉది త‌మ ఉద్దేశ‌మ‌ని వెల్లడించారు. సీఎం యోగి నిర్ణయంతో యూపీలో ఉన్న దాదాపు 15 కోట్ల పేదలకు ఈ పథకం ద్వారా ఉచిత రేషన్‌ అందనుంది. మూడు నెలల ఉచిత రేషన్‌ అందిస్తున్నందుకు గాను ప్రిభుత్వం రూ. 3,270 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య పేర్కొన్నారు.

*పవన్ కళ్యాణ్ పై అనవసరపు వ్యాఖ్యలు మానుకోవాలి- జనసేన మండల అధ్యక్షులు కోన రాజశేఖర్
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై బిఎస్పీ నేతలు అనవసరపు వ్యాఖ్యలు చేశారని, మా నాయకునిపై అర్ధరహిత వ్యాఖ్యలు చేయటం మానుకోవాలని జనసేన పార్టీ ఘంటసాల మండల అధ్యక్షులు కోన రాజశేఖర్ హితవు పలికారు. శనివారం ఘంటసాలలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ గురువారం హైదరాబాదు మాదాపూర్ లోని శిల్పకళావేదికలో నేతాజీ గ్రంథ సమీక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారని, జై హింద్ అనే నినాదం ఇచ్చింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని చెప్పారన్నారు. స్వాతంత్ర సమర యోధుడిగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ బొమ్మను వందరూపాయల నోటుపై ముద్రించాలని అన్నారన్నారు. భారత దేశంలో ప్రతి ఒక్క వ్యక్తికి భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఉందని, నేతాజీ సుభాష్ చంద్రబోస్ పట్ల ఉన్న అభిమానంతో వంద రూపాయల నోటుపై బొమ్మను ముద్రించాలని అన్నారని, ఆ మాటలను బీఎస్పీ నేతలు వక్రీకరించడం దారుణమన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అంటే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు అత్యంత గౌరవం ఉందని, ఆ రాజ్యాంగంలోనే ప్రతి వ్యక్తికి భావప్రకటన స్వేచ్ఛ ఉన్నట్లు బిఎస్పి నేతలు గుర్తించాలన్నారు. బిఎస్పీ నేత గుంటూరు నాగేశ్వరరావు, మండల శాఖల అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాట్లాడిన విషయాలను వేరే దృక్కోణాల్లో ఆలోచించడం సబబు కాదన్నారు. అర్థం..పర్థం లేని వ్యాఖ్యలతో రాజకీయ లబ్ధి కోరుకోవాలనుకోవడం బీఎస్పీ నేతలకు తగదన్నారు. స్థాయికి మించిన మాటలు మాట్లాడటం మంచిది కాదని, పవన్ కళ్యాణ్ పై మరోసారి అర్థరహితంగా మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా బీఎస్పి నేతలు వ్యవహరిస్తున్నారని, గుంటూరు నాగేశ్వరరావు తన స్థాయి మరచి మాట్లాడడం భావ్యం కాదన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేస్తుందని, నూతన రాజకీయ ఒరవడికి పవన్ కళ్యాణ్ ముందుకు అడుగులు వేస్తుంటే అనవసరపు ప్రేలాపనలు తగవని హితవు పలికారు. దళిత నేతలన్నా, రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్ గారన్నా పవన్ కళ్యాణ్ కి అత్యంత గౌరవం ఉందని, రాజకీయ లబ్ది పొందేందుకు, ఉనికిని చాటుకునేందుకు విమర్శలు చేయడం తగదన్నారు. దళితులు అంటే గౌరవం ఉండబట్టే దామోదరం సంజీవయ్య స్మారక స్థూపానికి కోటి రూపాయలు విరాళం పవన్ కళ్యాణ్ ప్రకటించారని తెలిపారు. ఈ సమావేశంలో పూషడం అంకం మారుతీరావు, కే.సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

*ఇదేనా ముఖ్య‌మంత్రి… మ‌హిళ‌ల‌కు మీరిచ్చే భ‌ద్ర‌త‌?: Lokesh
రాష్ట్రాన్ని రావణకాష్టం చేయడానికి వైసీపీ అధినేత జగన్ రెడ్డి, ఆయన పార్టీ నేతలు కంకణం కట్టుకున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌జ‌లు అధికారం ఇచ్చింది..క‌బ్జాలు, దోపీడీలు, అడ్డుప‌డిన‌వారిని చంప‌డానికి లైసెన్సు అన్న‌ట్టు దారుణాల‌కు తెగ‌బ‌డుతున్నారని మండిపడ్డారు. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం కొంగావారిపల్లికి చెందిన గాజుల వ్యాపారి రమణమ్మని ఆర్థిక వ్య‌వ‌హారాల‌లో ఏర్ప‌డిన వివాదంతో వైసీపీ నేత ఎన్. వెంకట్రమణారెడ్డి అతి దారుణంగా కొట్టి చంప‌డం రాష్ట్రంలో వైసీపీ దండుపాళ్యం గ్యాంగ్ అరాచ‌కాల‌కి ప‌రాకాష్ట‌ అని ఆయన వ్యాఖ్యలు చేశారు.జ‌గ‌న్‌రెడ్డి దిశ వాహ‌నాలకు జెండా ఊపి ప్రారంభించి మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కి నాది భ‌రోసా అని మాయ‌మాట‌లు చెప్పి మూడురోజులు కాలేదు… వైసీపీకి చెందిన వెంకట్రమణారెడ్డి ఓ మ‌హిళ‌ను అత్యంత పాశ‌వికంగా కొట్టి చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా ముఖ్య‌మంత్రి మ‌హిళ‌ల‌కు మీరిచ్చే భ‌ద్ర‌త‌? అని ప్రశ్నించారు. అండ‌గా నిల‌వాల్సిన‌ ప్ర‌భుత్వమే అంత‌మొందిస్తుంటే, న్యాయం చేయాల్సిన పోలీసులు అన్యాయంగా వ్య‌వ‌హ‌రిస్తుంటే..రాష్ట్ర‌ ప్ర‌జ‌ల ప్రాణాల‌కి దేవుడే దిక్కు అని లోకేష్ అన్నారు.

*ఆ డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్లిందో లెక్క తేల్చాలి: యనమల
అవకతవకలపై కేంద్రం జోక్యం చేసుకుని సీబీఐతో విచారణ జరిపించాలని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. రాష్ట్రంలో ఆర్టికల్‌ 350 ప్రయోగించి ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించాలని డిమాండ్ చేశారు. రూ.1.78 లక్షల కోట్లు ఖర్చుపెడితే రూ.48 వేల కోట్లకు లెక్కల్లేవన్నారు. లెక్కలు చెప్పలేకపోతే.. ఎవరి జేబుల్లోకి వెళ్లిందో లెక్క తేల్చాలన్నారు. స్పెషల్ బిల్లుల పేరుతో ఖర్చుపెట్టామని ప్రభుత్వం చెబుతోందన్నారు. స్పెషల్ బిల్లులు అనేవి ట్రెజీ కోడ్‌లోనే లేదన్నారు. రాష్ట్ర ఆదాయాన్ని ప్రభుత్వ పెద్దలు దిగమింగుతున్నారని ఆరోపించారు. కేంద్రం ఆదుకోకుంటే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందన్నారు. న్యాయస్థానాల తీర్పులపై చట్టసభల్లో మాట్లాడకూడదనే నిబంధనను వైసీపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. ఏడాదిలో ప్రతిరోజూ వేజ్ అండ్ మీన్స్ కింద అప్పులుతెచ్చారని ఆయన పేర్కొన్నారు. అలానే ప్రతి మూడున్నర రోజులకు ఓడీకింద అప్పులు తెచ్చారని చెప్పారు. అవికాకుండా మార్కెట్ బారోయింగ్స్ కింద రూ.55వేలకోట్లు హాఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కింద రూ.లక్షా 9వేలకోట్లు అప్పులు తెచ్చారని పేర్కొన్నారు.

*విశాఖ రైల్వే జోన్ బీజేపీ వల్లనే సాధ్యమైంది: సోమువీర్రాజు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరాల జల్లులు కురిపించారని బీజేపీ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం ఆయిందని కేంద్ర మంత్రి ప్రకటించారని తెలిపారు. ఏపీ చిరకాల కోరిక విశాఖ రైల్వే జోన్ బీజేపీ వల్లనే సాధ్యమైందని చెప్పుకొచ్చారు. కోనసీమ రైల్వే లైన్‌కు రాష్ట్ర ప్రభుత్వం షేర్ కట్టకపోవడంతో బీజేపీ మాత్రమే ఉద్యమం చేస్తోందని తెలిపారు. అదే విధంగా కడప – బెంగుళూరుకు రైల్వే లైన్‌కు రాష్ట్ర ప్రభుత్వం షేర్ జమ చేయకపోవడంతో పనులు ఆగిపోతాయని ప్రకటించారు అంటే కడప – బెంగుళూరు రైల్వే లైన్ స్టేట్ షేర్ కట్టించేవిధంగా ఉద్యమిస్తామని అన్నారు. ఏపీ రైల్వే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లప్తంగా వ్యవహరించడం వల్ల ఆంధ్రాకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని సోమువీర్రాజు హెచ్చరించారు.

*విద్యార్థులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: మంత్రి అప్పలరాజు
గన్నవరం వెటర్నరీ కాలేజీ విద్యార్థుల నిరసన దీక్ష వద్దకు పశువర్ధక శాఖ మంత్రి సిదిరి అప్పలరాజు చేరుకున్నారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుని…పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వేకెంట్ ఉన్న పోస్ట్లు అన్ని కూడా భర్తీ చేయమని ముఖ్యమంత్రి చెప్పారని అన్నారు. భారీగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉందని తెలిపారు. విద్యార్థులు ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభయమిచ్చారు. మొబైల్ అంబులెన్సులు కాదు… మొబైల్ వెటర్నరీ క్లినిక్‌లు ఉండే విధంగా డిజైన్ చేసినట్లు తెలిపారు. విద్యార్థుల స్టైఫండ్ విషయం ఫైనాన్స్ వారితో కూడా మాట్లాడినట్లు చెప్పారు. విద్యార్థుల సమస్యలు అన్నీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు అన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులకు మంత్రి సిదిరి అప్పలరాజు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.

*రాజధానిని అంగుళం కూడా కదల్చలేరు: దేవినేని ఉమ
రాష్ట్ర రాజధాని అమరావతిని వైసీపీ ప్రభుత్వం ఒక్క అంగుళం కూడా కదల్చలేదని టీడీపీ నేత దేవినేని ఉమా అన్నారు. రాష్ట్రానికి మూడు రాజధానుల అంశంపై అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటనపై ఆయన మండిపడ్డారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాలసీలు మార్చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ నేతలు అహంకారంతో మాట్లాడితే కుదరదని ఆయన మండిపడ్డారు. శాసనసభలో ఏకగ్రీవ తీర్మానంతో రాజధాని ఏర్పాటైందని ఆయన పేర్కొన్నారు.

*టీడీపీ సభ్యుల తీరు అభ్యంతరకరం: వైసీపీ
శాసన సభ, మండలిలో టీడీపీ సభ్యుల ప్రవర్తనని ప్రజలు అసహ్యించుకుంటున్నారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం అమరావతి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రశ్నలు వేసి, సమాధానాలు వినకుండా, రోజూ గోల చేసి, బయటకు పంపించేలా ప్రవర్తించారని ఆరోపించారు. టీడీపీ సభ్యుల తీరుతో సమయం, ప్రజాధనం వృథా అవుతోందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, చట్టసభల హక్కులు హరించుకుపోతుంటే, అధికారాలకు కత్తెర పడుతుంటే, చట్టసభలను కాపాడుకోవాల్సిన సమయంలో తెలుగు డ్రామా పార్టీ నేతలు దానిగురించి పట్టించుకోకుండా స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘చంద్రబాబుకు సిగ్గులేదు.. పారిపోయాడు. లోకేశ్‌ తాళిబొట్లు పట్టుకుని వచ్చాడు. టీడీపీ సభ్యుల తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉంది’’ అని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. మహిళల్ని అవహేళన చేసేలా లోకేశ్‌ తాళిబొట్లు పట్టుకుని సభకు రావడం దారుణమని ఎమ్మెల్సీ పోతుల సునీత మండిపడ్డారు.

*ధైర్యం ఉంటే నన్ను జైల్లో పెట్టండి : ఉద్ధవ్‌
జైల్లో పెట్టి అధికారంలోకి రావాలనుకుంటే..తనను జైల్లో పెట్టాలంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే బీజేపీకి సవాల్‌ విసిరారు. మనీలాండరింగ్‌ కేసులో బావమరిది శ్రీధర్‌ పటంకర్‌కి చెందిన రూ.6.45 కోట్లను ఈడీ స్వాధీనం చేసుకున్న మూడు రోజుల తర్వాత సీఎం ఈమేరకు శుక్రవారం అసెంబ్లీలో ఈ వ్యాఖ్యలు చేశారు.

*ఉగాది తర్వాత ఉగ్ర తెలంగాణను చూస్తారు: మంత్రి Puvvada
ఉగాది తర్వాత ఉగ్ర తెలంగాణను చూస్తారని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… ఏప్రిల్ రెండు వరకు కేంద్రం స్పందన కోసం చూస్తామని… ఆ తర్వాత ఉగ్ర రూపాన్ని కేంద్రానికి చూపిస్తామని తెలిపారు. రైతులతో పెట్టుకుంటే పొట్టు అవుతారని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు ఉడుకుతున్నారన్నారు. ఆ ఉడుకు ఏంటో ఉగాది తర్వాత చూస్తారని మంత్రి పువ్వాడ వ్యాఖ్యానించారు.

*జగన్ సీఎంగా తీసుకునే ప్రతీ నిర్ణయం నేరపూరితమే: Devthoti
ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు ఓపెన్ కేటగిరీలో పెట్టడం రాజ్యాంగాన్ని అతిక్రమించడమే అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… స్వతహాగా నేర స్వభావం ఉన్న జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తీసుకునే ప్రతీ నిర్ణయం నేరపూరితంగానే ఉంటోందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీల అవకాశాలను, హక్కులను, ఆత్మగౌరవాన్ని కాలరాయడంలో వైసీపీ ప్రభుత్వం ముందు నుంచి మొండిగా ముందుకు వెళ్తూనే ఉందని మండిపడ్డారు. 27 దళిత సంక్షేమ స్కీమ్‌లను రద్దు చేసి దళితులకు అన్యాయం చేశారన్నారు. దళితులకు జగన్ రెడ్డి చేస్తున్న ద్రోహాన్ని, మోసాన్ని దళిత యువత, మేధావులు, ఉద్యోగులు, ప్రజా సంఘాలు ప్రజాకోర్టులో దోషిగా నిలబెట్టాలని దేవతోటి నాగరాజు పిలుపునిచ్చారు

*రాజధానిలో క్వార్టర్ల పూర్తికి 2,175 కోట్లు అవసరం: మంత్రి బొత్స
రాజధాని అమరావతి ప్రాంతంలో జడ్జిలు, ఎమ్మెల్యేలు, ఉద్యోగుల క్వార్టర్ల నిర్మాణానికి ఇప్పటివరకూ రూ.1,248 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. టీడీపీ ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్‌, అనగాని సత్యప్రసాద్‌, బెందాళం అశోక్‌, నిమ్మల రామానాయుడు వేసిన ప్రశ్నలకు శుక్రవారం మంత్రి సమాధానం ఇచ్చారు. నిర్మాణాల పూర్తికి ఇంకా రూ.2,175 కోట్లు అవసరం అవుతాయన్నారు.

*కేంద్రం లేకి మాటలు మాట్లాడుతోంది: మంత్రి Niranjan reddy
తెలంగాణను అవమానించిన ఎంతో మంది రాజకీయ భవిష్యత్తు కోల్పోయారని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ…. కేంద్రం నుంచి రాష్ట్రానికి సహాకారం లేదని తెలిపారు. పండిన పంటను కొనాల్సిన బాధ్యత కేంద్రానిదని స్పష్టం చేశారు. కేంద్రం లేకి మాటలు మాట్లాడుతోందని మండిపడ్డారు. రా రైస్, బాయిల్డ్ రైస్ అని కన్ఫ్యూజ్ చేయడం తప్ప కేంద్రం ఏం చేస్తుందని ప్రశ్నించారు. తాము వడ్లు ఇస్తామని.. ఏం చేసుకుంటారనేది కేంద్రం ఇష్టమన్నారు. కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారని.. రైతు ల కష్టాలు పట్టవా అని ప్రశ్నించారు. తాము ఇన్ని సార్లు పియూష్ గోయల్‌ను కలిస్తే.. ఒక్కసారి అయినా కిషన్ రెడ్డి వచ్చారా అని ఆయన నిలదీశారు.కేంద్రం మార్గాలు వెతకాలని…కాలానుగుణంగా మార్పులు రావాలని సూచించారు. ఇథనాల్ ప్రొడక్షన్ 2025 నాటికి 20శాతం పెంచుతామన్నారని..కానీ ఇప్పటి వరకు 5 శాతం దాటలేదని విమర్శించారు. కేంద్రం, రాష్ట్రం మధ్య కేంద్ర రాష్ట్ర సంబంధాలు లేవన్నారు. 28,29న సార్వత్రిక సమ్మె చేస్తామని ప్రకటించారు. ఉగాది తర్వాత ఉధృతమైన ఉధ్యమం చేస్తాం.. ఇప్పటికే కార్యాచరణ సిద్ధం అయిందని చెప్పారు. ఇది దక్షిణ భారతదేశం మొత్తం పాకడం ఖాయమన్నారు. తెలంగాణ రైతులకు బీజేపీ క్షమాపణ చేప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.