NRI-NRT

ఆస్ట్రేలియాలో భారతీయుల రేంజ్ ఏంటో కళ్లకు కట్టినట్టు చూపించిన నివేదిక..!

ఆస్ట్రేలియాలో భారతీయుల రేంజ్ ఏంటో కళ్లకు కట్టినట్టు చూపించిన నివేదిక..!

విదేశాల్లో భారతీయులు, భారతీయ సంతతి వ్యక్తులు ఎన్నో విజయాలు అందుకుంటున్నారు. వ్యక్తిగతంగా, వృత్తిగతంగా అందలాలు ఎక్కడమే కాకుండా.. తమ మాతృభూమి పేరు ప్రఖ్యాతులు ప్రపంచవ్యాప్తంగా మారు మోగేలా చేస్తున్నారు. అయితే.. ఎన్నారైలు ప్రాభవాన్ని కళ్లకుకట్టినట్టు చూపించే మరో నివేదిక తాజాగా విడులైంది. ఈ నివేదికను ఏకంగా ఆస్ట్రేలియా ప్రభుత్వమే విడుదల చేసింది. ‘ఆస్ట్రేలియాస్ ఇండియన్ డయాస్పొరా.. ఏ నేషనల్ అసెట్’ పేరిట విడులైన ఈ నివేదికలో ప్రభుత్వం భారతీయ సంతతి వారిని జాతీయ సంపద అంటూ కొనియాడింది. దీని ప్రకారం.. భారత్‌లో పుట్టి ఆస్ట్రేలియాలో నివసిస్తున్న వారి సంఖ్య 7.21 లక్షల పైచిలుకే. ఆస్ట్రేలియాలోని ఇతర దేశాల వారితో పోలిస్తే.. భారతీయులు సంఖ్యా పరంగా రెండో స్థానంలో ఉన్నారు. అంతేకాకుండా.. అత్యధిక ట్యాక్స్ చెల్లిస్తున్న వర్గాల్లోనూ భారతీయులది రెండో స్థానం. సాధారణ ప్రజానీకంతో పోలిస్తే.. భారతీయుల సగటు వయసు తక్కువ కాగా.. సంపాదన మాత్రం అత్యధికం. భారతీయుల విద్యార్హతలు కూడా సగటు ఆస్ట్రేలియన్ కంటే మెరుగేనని తేలింది.

గొప్ప నైపుణ్యాలు అవసరమైన టెక్ రంగంలో, సైన్స్, మ్యాథ్స్ రంగాల్లో భారతీయులే అధికంగా ఉన్నారు. ఆస్ట్రేలియా వ్యాపార రంగంలోనూ భారతీయుల ప్రాతినిథ్యం చెప్పుకోదగిన స్థాయిలోనే ఉంది. 2021 నాటి ప్రభుత్వ లెక్కల ప్రకారం.. కనీనం 996 ఆస్ట్రేలియా కంపెనీల్లో భారతీయ సంతతి వారు డైరెక్టర్లు, బోర్డు మెంబర్లుగా ఉన్నారు. ఇక యూనివర్శిటీల్లో లెక్చర్లు, అంతకంటే పైస్థాయి పదవుల్లో భారతీయ సంతతి వారి వాటా పెరుగుతోంది. 2016లో భారతీయుల వాటా 1.75 శాతం కాగా.. 2020 నాటికి ఇది 1.92 శాతానికి చేరింది. అయితే.. ఇలా ముఖ్యమైన ఉత్పాదక రంగాల్లో యవ్వనంలో ఉన్న భారతీయుల వాటా పెరగడం భారత్‌కే కాకుండా.. అంతర్జాతీయంగా అనేక రంగాల్లో ఆస్ట్రేలియా మంచి పోటీని ఇచ్చేందుకు ఉపకరిస్తోందని ఈ నివేదిక తేల్చింది.