Devotional

ఏప్రిల్ 2న శ్రీ పద్మావతి ఆలయంలో ఉగాది వేడుకలు – TNI ఆధ్యాత్మికం

ఏప్రిల్ 2న శ్రీ పద్మావతి ఆలయంలో ఉగాది వేడుకలు – TNI  ఆధ్యాత్మికం

సిరుల తల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏప్రిల్ 2వ తేదీ ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా ఉదయం 4.30 గంటలకు సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామ అర్చన, నిత్యార్చ‌న‌ నిర్వహిస్తారు. మ‌ధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు పుష్ప పల్లకిలో అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి 8 నుండి 8.30 గంటల వరకు పంచాంగ శ్రవణం, ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు. అదేవిధంగా శ్రీ సూర్య‌నారాయ‌ణ స్వామివారి ఆల‌యంలో ఉగాది సంద‌ర్భంగా ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు.ఇందులో భాగంగా ఉద‌యం 7 నుండి 7.45 గంట‌ల వ‌ర‌కు శ్రీ సూర్య‌నారాయ‌ణ స్వామివారి ఉత్స‌వ‌ర్ల‌కు అభిషేకం, సాయంత్రం 5 నుండి 5.30 గంట‌ల వ‌ర‌కు ఆస్థానం నిర్వ‌హించ‌నున్నారు. ఈ సందర్భంగా విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాలు, ఆర్జితసేవలైన ఊంజ‌ల్‌ సేవను టిటిడి రద్దు చేసింది.

2. వేదాలు ఎప్పటివి?
వేదాలది వేల సంవత్సరాల చరిత్ర. వేదం మాట ‘విద్‌’ అనే ధాతువు నుంచి వచ్చింది. వేదాలు నాలుగు. అవి… ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వ వేదం. ‘ఋక్‌’ అంటే ‘స్తుతించడం’ అని అర్థం. ‘యజుర్వేదం’ అంటే తెలుసుకోవడం… జ్ఞానం గురించి తెలుసుకోవడం. ఈ వేదాలలో ప్రధాన భాగాలు సూక్తాలు, మంత్రాలు. వీటినే ‘సంహితలు’ అంటారు. ప్రతి సంహితకూ అనుబంధంగా బ్రాహ్మణాలు ఉంటాయి. ‘బ్రాహ్మణాలు’ అనే మాటలో ‘బ్రహ్మ’ అంటే ‘మంత్రం’, ‘యజ్ఞం’ అనే అర్థాలు ఉన్నాయి. వేద సాహిత్యానికి అర్థాలు తెలిపేవే ఈ బ్రాహ్మణాలు. ప్రతి బ్రాహ్మణం… అరణ్యకాలు, ఉపనిషత్తులతో కూడి ఉంటుంది. అరణ్యకాలలో… అడవులలో ఉండే వానప్రస్తుల కోసం ఉద్దేశించిన నిగూఢ ధర్మసూత్రాలు ఉంటాయి. ఉపనిషత్తుల్లో తాత్త్విక అంశాలు ఉంటాయి.
*తొలి వేదం…ఋగ్వేదంలోని సంస్కృత భాష చాలా పురాతనమైనది. అది సంస్కృతానికి ప్రారంభ రూపం. క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాల
నుంచి 1000 సంవత్సరాల మధ్య కాలంలో.. ఋగ్వేదం కూర్పు, సంశ్లేషణ (కలపడం) జరిగిందని పురావస్తు శాస్త్ర సాయంతో చరిత్రకారులు నిర్థారించారు. ఋగ్వేదంలో ఇనుము గురించి ప్రస్తావన లేదు. క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల తరువాతనే… ఉత్తర భారతంలో ఇనుము వినియోగంలోకి వచ్చింది. ఋగ్వేదంలో 10 మండలాలు లేదా అధ్యాయాలు ఉన్నాయి. 1,028 సూక్తాలు, 10,414 ఋక్కులు ఉన్నాయి. 1,53,826 శబ్దాలు, 4,32,000 అక్షరాలు ఉన్న ఉద్గ్రంథం ఋగ్వేదం.
*మొదటి సంగీత గ్రంథం…
సామవేదం మూడు పరిష్కృత పాఠాల్లో.. అంటే సంహితలలో లభిస్తుంది. వీటిలో కౌతుమీజ శాఖను అత్యంత ప్రామాణికమైనదిగా పరిగణిస్తారు. సోమపానం, సోమయాగం లాంటి యజ్ఞ నిర్వహణ సమయంలో గానం చేసే మంత్రాలు దీనిలో ఉంటాయి. మంత్రాలను ఎలా గానం చేయాలి? స్వరం, శ్రావ్యత ఎలా ఉండాలి? అనే అంశాలను… అంటే స్వరకల్పనను… దృష్టిలో పెట్టుకొని, ఋగ్వేదం నుంచి సామవేదాన్ని వేరు చేశారు. భారతీయ సంగీత చరిత్రలో మొదటి గ్రంథంగా దీనికి విశిష్టత ఉంది. కానీ దీనిలోని చారిత్రక అంశాలకు ఎలాంటి ప్రాధాన్యం లేదు. సామవేదంలో 75 మంత్రాలను మినహాయిస్తే… మిగిలినవన్నీ ఋగ్వేదం నుంచి స్వీకరించినవే. సామవేదంలో 2,814 మంత్రాలు ఉన్నాయి. ఈ వేదం కూర్పు క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల తరువాతే జరిగింది.
*యజ్ఞ, కర్మలకు నిర్దేశం…
యజుర్వేదం యజ్ఞ యాగాదులకూ, కర్మకాండలకు సంబంధించిన మంత్రాల సంకలనం. సామవేదంలాగానే యజుర్వేదం కూడా ఋగ్వేదం నుంచి అనేక ఋక్కులను స్వీకరించింది. మారుతున్న కాలాన్ని బట్టి కొన్ని కొత్త మంత్రాలను కలిపి, యజ్ఞాలలో ఉపయోగపడడం కోసం ఒక సంహితను రూపొందించారు. దర్శనపూర్వ మాస, అగ్నిష్టోమ, వాజపేయ, రాజసూయ, సౌత్రామణి , అశ్వమేధ, పిత్రు మేధ… ఇలా వివిధ యజ్ఞాలలో పలికే మంత్రాల సంకలనమే యజుర్వేదం. ఈ యజుర్వేదం రెండు భాగాలు. ఒకటి కృష్ణ యజుర్వేదం, మరొకటి శుక్ల యజుర్వేదం. కృష్ణ యజుర్వేదం నాలుగు సంహితలతో ఉనికిలో ఉంది. ఈ సంహితలలో తైత్తరీయ సంహిత ప్రముఖమైనదిగా భావిస్తారు. శుక్లయజుర్వేదంలో వజసనేయ సంహిత మాత్రమే నిలిచి ఉన్నది. వాజసనేయ సంహితలో 40 అధ్యాయాలు, 1,988 ఖండికలు, లేదా మంత్రాలు ఉన్నాయి. ఇది గద్య, పద్యాల మిశ్రమం. కృష్ణ యజుర్వేదం శుక్లయజుర్వేదం కన్నా పురాతన మైనది. కృష్ణ యజుర్వేదం, మైత్రాయణి సంహిత 18-13లో ఇనుముకు సంబంధించిన (శ్యామ) ప్రస్తావన ఉన్నది. కాబట్టి ఇది క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల తరువాతిదేనని తెలుస్తోంది.
*అప్పట్లో వేదాలు మూడే!
అధర్వ వేదంలో శౌనక సంప్రదాయం ప్రకారం 20 అధ్యాయాలు, 731 సూక్తాలు ఉన్నాయి. ఈ వేదంలో కూడా ఋగ్వేదం నుండి తీసుకున్న అనేక సూక్తాలు కనిపిస్తాయి. ఋగ్వేదం చివరిదైన 10వ మండలంలోని సూక్తాలలో సగ భాగానికి పైనే ఈ వేదం స్వీకరించింది. అంటే ఋగ్వేదాన్ని పూర్తిగా కూర్చిన అనంతరమే అధర్వ వేదం కూర్పు జరిగింది. ఈ వేదంలో (3:3.1.7) ఇనుము గురించి ప్రస్తావన ఉంంది. కాబట్టి అధర్వ వేదం క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలకు చెందినదిగా పరిగణిస్తున్నారు.

3. శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకున్న మంత్రి హరీష్‌రావు
శ్రీశైలం భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామివారిని తెలంగాణ ఆర్ధికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు దంపతులు శనివారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హరీష్ రావు దంపతులను ఆలయ మర్యాదలతో ఈవో లవన్న స్వాగతం పలికారు. అనంతరం మంత్రి హరీష్‌రావు దంపతులకు వేదమంత్రాలతో వేదపండితులు, అర్చకులు ఆశీర్వచనాలిచ్చి దీవించారు.

4. అర్చకులకు ఉగాది పురస్కారాలు
ఉగాది సందర్భంగా ఏప్రిల్‌ 2న రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ముగ్గురు అర్చకులు, ఒక వేద పండితుడిని సత్కరించాలని దేవదాయశాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌ అన్ని జిల్లాల సహాయక కార్యదర్శులను ఆదేశించారు. దేవదాయ శాఖ పరిధిలోని 6(ఏ), (బీ), (సీ) ఆలయాల్లో పనిచేస్తున్న 62 ఏళ్ల పైబడిన ముగ్గురు నిష్ణాతులైన అర్చకులను, ఒక వేద పండితుడిని గుర్తించి ఉగాది రోజున కలెక్టర్‌ చేతులమీదుగా సత్కరించాలన్నారు

5. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.4 కోట్లు ..
తిరుమలలోని శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. నిన్న స్వామివారిని 65,418 మంది భక్తులు దర్శనం చేసుకోగా 33,451 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తుల కానుకల రూపేణా హుండీ ఆదాయం రూ. 4.4 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. కాగా రేపు తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 7వ తేదీ వ‌ర‌కు బ్రహ్మోత్సవాలు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అర్చకులు తెలిపారు.

6.యాదాద్రిలో కూడా తిరుమల తరహాలో బ్రేక్‌ దర్శనాలు
యాదాద్రిలో కూడా తిరుమలలో మాదిరిగా బ్రేక్‌ దర్శనాలు, ఆన్‌లైన్‌ దర్శనాలు అమలు చేస్తామని ఆలయ ఈవో గీత తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 28న ఉదయం 11.55 గంటలకు యాదాద్రి ప్రధాన ఆలయాన్ని పునఃప్రారంభిస్తారని చెప్పారు. అదేరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత భక్తులకు స్వయంభువుల దర్శనం కల్పిస్తామని చెప్పారు. యాదాద్రి కొండపైకి భక్తుల వాహనాలను అనుమతించబోమని స్పష్టంచేశారు. కొండ కింద యాగశాల ప్రాంగణంలోని పార్కింగ్‌ స్థలంలో వాహనాలు నిలిపి, దేవాలయం తరఫున నడిపే బస్సుల్లో కొండపైకి వచ్చి దర్శనం చేసుకోవాలని సూచించారు. ప్రతి భక్తుడికీ క్యూఆర్‌ కోడ్‌ను ఇస్తామని, రద్దీకి అనుగుణంగా దేవాలయ బస్సులను నడుపుతామని తెలిపారు. భక్తులు క్యూ కాంప్లెక్స్‌ నుంచే స్వామివారి దర్శనానికి వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు.