Devotional

ఉగ్రం.. శాంతం.. సాలగ్రామం

ఉగ్రం.. శాంతం.. సాలగ్రామం

సాలగ్రామ అర్చనకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. దైవానికి ప్రతీకలుగా భావించే సాలగ్రామాలు సహజ సిద్ధంగా ఏర్పడినవి. నేపాల్‌లో గండకీ నదిలో దొరుకుతాయి. వీటిని విష్ణు సంబంధమైనవిగా భావిస్తారు. వీటిలో నరసింహ సాలగ్రామం ప్రత్యేకమైంది. సాలగ్రామలన్నిటిలో పరిమాణంలో ఇవి పెద్దగా ఉంటాయి. వీటిని ఆరాధించేవాళ్లకు శత్రువుల నుంచి రక్షణ లభిస్తుంది. దుష్టశక్తులు కూడా వారి నుంచి దూరంగా ఉంటాయని నమ్ముతారు. సర్వకార్యాల్లో విజయం, అపారమైన సంపద, మంచి ఆరోగ్యం కలుగుతాయని విశ్వసిస్తారు. సాలగ్రామ పూజతో భక్తిమార్గాన్ని, ధర్మమార్గాన్ని తప్పకుండా ఉండగలుగుతారు. ఆధ్యాత్మిక ఉన్నతికి నరసింహ సాలగ్రామ అర్చన మార్గంగా చెబుతారు.నరసింహ సాలగ్రామం ఆకర్షణీయంగా ఉంటుంది. ఎంతో మృదువుగా, పరిపూర్ణమైన రూపంతో కనిపిస్తుంది. సాలగ్రామాన్ని నీళ్లు, ఆవుపాలు, పెరుగు, నెయ్యి, తేనె, వీలునుబట్టి పండ్లరసంతో అభిషేకం చేయాలి. వారానికి ఒకసారి గానీ, రెండు సార్లు గానీ శాస్ర్తోక్తంగా అభిషేకం చేయాల్సి ఉంటుంది. అభిషేకం తర్వాత చందనం, తులసి దళాలు, ధూపం, దీపం, నైవేద్యం ఇలా షోడశ ఉపచారాలతో మూలమంత్రం జపిస్తూ పూజ చేయాలి.

*కపిల నరసింహ:
మూడు లేదా ఐదు బిందువులు ఉంటాయి. మధ్యలో రెండు పెద్ద చక్రాలు, రేఖలు, పెద్ద ముఖంలో దంతాలతో ఉన్నట్టుగా కనిపిస్తుంది. వృత్తాకారంలో లాక్షా వర్ణంలో ఉంటుంది. బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ పూజించడం వల్ల యుద్ధంలో విజయం, కోరికలు తీరడం, పాపాల నుంచి విముక్తి, మోక్షం లభిస్తుంది. నియమాలు ఉల్లంఘిస్తే బాధలు, సమస్యలు ఎదురవుతాయి.
*లక్ష్మీనరసింహ:
పెద్దముఖం ఉంటుంది. ఎడమవైపు రెండు చక్రాలు ఉంటాయి. మూడు లేదా ఐదు బిందువులు, వనమాల కలిగి ఉంటుంది. దీనిని ఆరాధిస్తే ఆనందం, మోక్షం లభిస్తాయి.
*సర్వతోముఖ నరసింహ:
బంగారు వర్ణంలో, ఎక్కువ ముఖాలు, ఏడు చక్రాలను కలిగి ఉంటుంది.
*పాతాళ నరసింహ:
ఎక్కువ సంఖ్యలో ద్వారాలు, చక్రాలు, రంగులు ఉంటాయి. ఆరాధించిన సాధువులకు అమరత్వాన్ని కలిగిస్తాడని ప్రతీతి.
*ఆకాశ నరసింహ:
పెద్ద ముఖం, మధ్యలో పొడుచుకు వచ్చినట్లు ఉండే చక్రం ఉంటాయి. దీనిని రుషులు మాత్రమే ఆరాధిస్తారు.
*అధోముఖ నరసింహ:
మూడు చక్రాలు- పక్కల్లో రెండు, పైన ఒకటి ఉంటాయి. ఆరాధన వల్ల మోక్షం సిద్ధిస్తుంది.
*జ్వాలా నరసింహ:
చిన్న ముఖం ఉంటుంది. రెండు చక్రాలు, వనమాల కూడా ఉంటాయి. ఆరాధన వల్ల ఐహిక ప్రపంచం నుంచి విముక్తి కలుగుతుంది.
*మహా నరసింహ:
రెండు చక్రాలు, రేఖలతో ఎంతో అందంగా ఉంటుంది.