DailyDose

జూన్ 30 నుంచి అమర్‌నాథ్ యాత్ర – TNI తాజా వార్తలు

జూన్ 30 నుంచి అమర్‌నాథ్ యాత్ర  – TNI తాజా వార్తలు

* జూన్ 30 నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. 43 రోజుల పాటు కొనసాగనున్న ఈ యాత్రలో భక్తులు కోవిడ్ గైడ్‌లైన్స్ పాటించడం తప్పనిసరి చేశారు. లెఫ్టెనెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శ్రీ అమర్‌నాథ్ ఆలయ కమిటీ బోర్డ్ ప్రతినిధులతో సమావేశానంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత 2019 ఆగస్ట్‌లో అమర్‌నాథ్ యాత్రను అర్ధాంతరంగా నిలిపివేశారు. గత రెండు సంవత్సరాలుగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నామమాత్రంగా నిర్వహించారు. హిమాలయాల్లో దక్షిణ కశ్మీర్‌ కొండల్లో 3,880 మీటర్ల ఎత్తులో మంచు ఆకారంలో పరమశివుడు కొలువై ఉంటారు. ప్రతి ఏడాదీ రక్షాబంధన్ రోజు అమర్‌నాథ్ యాత్ర ప్రారంభించడం ఆనవాయితీ.
*కడప ఎయిర్‌పోర్టు నుంచి మళ్లీ విమానాలు ఎగురుతున్నాయి. విజయవాడ-కడప విమాన సర్వీసు ప్రారంభించారు. వారంలో 4 రోజులు ఇండిగో సంస్థ విమానం నడపనుంది. ఆది, సోమ, బుధ, శుక్రవారాల్లో ఇండిగో విమాన సర్వీసులు నడుస్తాయి. విజయవాడ నుంచి ఉదయం 11:45 గంటలకు విమాన సర్వీసు నడుపుతారు. అంతేకాకుండా కడప నుంచి హైదరాబాద్‌, విజయవాడ, చెన్నైతో పాటు తొలిసారిగా విశాఖపట్నం, బెంగళూరుకు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. గతంలో ఉడాన్‌ పథకంలో భాగంగా ట్రూజెట్‌ సంస్థ కడప నుంచి విమానాలను నడిపేది. అయితే పథకం గడువు ముగియడంతో హైదరాబాద్‌, చెన్నై, విజయవాడ సర్వీసులు నిలిచిపోయాయి. కొద్ది రోజుల పాటు కడప హైదరాబాద్‌, కడప బెల్గాంలకు సర్వీసు నడిపింది. చివరి సారిగా గత ఏడాది నవంబర్‌ 11న కడప నుంచి బెల్గాంకు సర్వీసు నడిపింది. తర్వాత సాంకేతిక కారణాల వల్ల నిలిపేసింది. అప్పటి నుంచి విమానాల రాకపోకలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం ఇండిగోతో, ఏపీ ఎయిర్‌పోర్టు డెవలప్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌తో ఇప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఈ నెల 27 నుంచి విమాన రాకపోకలు మొదలయ్యాయి
*ఏపీలో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను బెంబేలెత్తిన్నాయి. శనివారం రాత్రి చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. మళ్లీ చిత్తూరు జిల్లాలోనే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం ముంగిలిపట్టులో రోడ్డుప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ను ఢీకొని మినీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. తిరుపతి నుంచి దామలచెరువుకి నిశ్చితార్థానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు చెబుతున్నారు. బాధితులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు ప్రాణాపాయం లేదని రుయా వైద్యులు తెలిపారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
*పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రచారానికి వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి భద్ర కల్పించిన 14 మంది పంజాబ్ పోలీసులకు ‘డీజీపీ ప్రశంసా పురస్కారం’ లభించింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనవరి 5న ఫిరోజ్‌పూర్‌లో నిర్వహించే ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొనాల్సి ఉంది. అయితే రైతు నిరసనల నేపథ్యంలో మోదీ కాన్వాయ్ ముందుకు కదలలేకపోయింది. ఆ సమయంలో ప్రధానికి, ఆయన సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పంజాబ్‌కు చెందిన కొంత మంది పోలీసులు రక్షణ కల్పించారు. ఇదే సమయంలో మోదీ భద్రత అంశంపై పంజాబ్ పోలీసులు తీవ్ర విమర్శలు గురయ్యారు.
*భారత ఆర్మీ మరో క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి గాలిలోకి ప్రయోగించగల మీడియం రేంజ్ గగనతల రక్షణ క్షిపణిని ఆదివారం విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని బాలాసోర్‌ తీరంలోని డీఆర్‌డీఓ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఉదయం పదిన్నరకు జరిపిన ఈ ప్రయోగంలో క్షిపణి కచ్చితమైన లక్ష్యాన్ని సాధించినట్లు డీఆర్‌డీఓ వెల్లడించింది. సుదూరంలోని లక్ష్యాన్ని నేరుగా తాకినట్లు చెప్పింది. ఇది భారత ఆర్మీకి మరింత శక్తినివ్వనుంది.
*చిత్తూరు జిల్లా భాకరాపేట ఘాట్ రోడ్డు ప్రమాదంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లోయలో బస్సు బోల్తా పడి 8 మంది ప్రాణాలు కోల్పోవడం విచారకరమన్నారు. పెళ్ళింట్లో జరిగిన ప్రమాదం ఆ కుటుంబం లో తీవ్ర విషాదం నింపిందని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. మృతుల కుటుంబాలకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
*చిత్తూరు జిల్లా బాకరాపేట బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణాలను, సహాయక చర్యలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీలు సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారని వెల్లడించారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారని సీఎంకు వివరించారు. తిరుపతిలో స్థానిక ఆస్పత్రులు స్విమ్స్, రుయా, బర్డ్‌ ఆస్పత్రుల్లో వీరికి చికిత్స అందిస్తున్నామన్నారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని… గాయపడ్డవారికి రూ. 50 వేల చొప్పున పరిహారం అందించాలన్నారు. అంతేకాకుండా క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. బాధితులు కోలుకునేంతవరకూ అండగా నిలవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
*రెండేళ్ల అనంతరం ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రం నీలగిరి జిల్లా ఊటీలో మే 20 నుంచి 24వ తేది వరకు పుష్ప ప్రదర్శన జరుగనుంది. వేసవి సీజన్‌లో పలు ప్రాంతాల్లో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో పూలు, కాయగూరలు తదితర ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. కరోనా కారణంగా 2020 నుంచి వీటిపై ప్రభుత్వం నిషేధం విధించింది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది వేసవిలో నిర్వహించాల్సిన ప్రదర్శనలపై శుక్రవారం ఉద్యానవన శాఖ, జిల్లా అధికారులు సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్‌ అమ్రిత్‌ మాట్లాడుతూ, కరోనా కారణంగా రెండేళ్లుగా ఎలాంటి ప్రదర్శనలు నిర్వహించలేదన్నారు. ప్రస్తుతం కరోనా నిబంధనలు పాటిస్తూ జిల్లాలోని పలు ప్రాం తాల్లో ప్రదర్శనలు ఏర్పాటుచేశామన్నారు. అందులో భాగంగా 124వ పుష్ప ప్రదర్శన ఊటీ బొటానికల్‌ గార్డెన్‌లో మే 20 నుంచి 24వ తేది వరకు ఐదు రోజులు నిర్వహించనున్నామని తెలిపారు.
*బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి పెద్దిరెడ్డి పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున సీఎం జగన్ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని తెలిపారు. ఇంకా పెంచేందుకు ముఖ్యమంత్రిని అడుగుతానన్నారు. గాయపడిన వారికి ఒక్కొక్కరికీ రూ. 50 వేలు తక్షణ సాయంగా అందిస్తున్నామని చెప్పారు. సంఘటన జరిగిన చోట రోడ్డు రైలింగ్ లేకపోవడంపై ఆదివారం జడ్పీ సమావేశంలో చర్చించి రైలింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. రూ. 1500 కోట్లతో త్వరలో నాలుగు లైన్ల రోడ్డుని ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.
* ఇంజనీరింగ్‌, వృత్తి విద్యా కోర్సుల తొలి సంవత్సరం తరగతులు అక్టోబర్‌ 25 నుంచి ప్రారంభమవుతాయని ఏఐసీటీఈ తెలిపింది. ఈ మేరకు 2022-23 విద్యా సంవత్సరాన్ని ఖరారు చేసింది. జులై 30 నాటికి కళాశాలలకు అనుమతుల ప్రక్రియ, ఆగస్టు 31 లోపు యూనివర్శిటీల అనుబంధ గుర్తింపు పూర్తి చేస్తామని తెలిపింది. ప్రస్తుత విద్యార్థులకు సెప్టెంబర్‌ 15 నాటికి క్లాసులు ప్రారంభం కానున్నాయి
* మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ(మనూ)లో దూరవిద్యా కోర్సుల్లో చేరడానికి అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని దూరవిద్యా డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ మహ్మద్‌ రజుల్లాఖాన్‌ తెలిపారు. ఎంఏ, బీకాం, డిప్లొమా ఇన్‌ జర్నలిజం కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
* తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ (టీఎ్‌సడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌), హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌) ఆధ్వర్యంలో కొత్తగా ‘బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ (బీడెస్‌)’ కోర్సును ప్రారంభించినట్లు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొ.ఆర్‌.లింబాద్రి తెలిపారు. 2022-23 విద్యా సంవత్సరం నుంచి సిరిసిల్ల సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల డిగ్రీ కాలేజీలో ఈ కోర్సును ప్రారంభిస్తామన్నారు. ఈమేరకు శనివారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో శాతవాహన యూనివర్సిటీ, టీఎ్‌సడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ మధ్య కోర్సు నిర్వహణ ఒప్పందం కుదిరింది
* సినీ నటుడు అల్లు అర్జున్‌ కారుకు జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు జరిమానా విధించారు. శనివారం జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 36లోని నీరూస్‌ చౌరస్తాలో వాహనాల తనిఖీలు చేస్తున్న పోలీసులు.. అల్లు అర్జున్‌ కారును ఆపారు. ఆయన కారు అద్దాలకు ఉన్న నల్ల ఫిల్మ్‌లను తొలగించి రూ.700 జరిమానా విధించారు. అదే దారిలో వచ్చిన మరో హీరో కల్యాణ్‌ రామ్‌ కారుకూ పోలీసులు ఇదే తరహాలో జరిమానా విధించారు. కాగా.. వాహనాల నంబర్‌ ప్లేట్లపై వంకర టింకరగా అంకెలు రాయడం.. కారు అద్దాలకు బ్లాక్‌ ఫిల్మ్‌ అంటించడం చట్ట విరుద్ధమని హైదరాబాద్‌ సిటీ ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ ఏవీ రంగనాథ్‌ తెలిపారు. నిబంధనలను పాటించని వారికి జరిమానాలు విధించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ట్రాఫిక్‌ పోలీసులు వారం రోజులుగా నగరంలో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. 16,937 కేసులు నమోదు చేశారు. నంబర్‌ ప్లేట్‌ ట్యాంపరింగ్‌ కేసులు 9,387, శబ్దాలు అధికంగా వస్తున్న వాహనాలపై 3,270 కేసులు, బ్లాక్‌ ఫిల్మ్‌ అంటించి తిరుగుతున్న వాహనాలపై 4,280 కేసులు నమోదు చేసినట్లు జాయింట్‌ సీపీ వెల్లడించారు.
* హైస్పీడ్‌ రైల్‌ కారిడార్ల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం (ప్రీ ఫీజిబిలిటీ స్టడీ) చేసేందుకు అనుభవం ఉన్న ప్రముఖ సంస్థల నుంచి హెచ్‌ఎండీఏ-ఉమ్టా ప్రతిపాదనలను ఆహ్వానించింది. రీజినల్‌ రాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ (ఆర్‌ఆర్‌టీఎ్‌స)లో భాగంగా హైదరాబాద్‌-విజయవాడ, హైదరాబాద్‌-వరంగల్‌ కారిడార్లలో సెమీ-హైస్పీడ్‌ రైలు మార్గాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు కారిడార్లలో వేర్వేరుగా సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి పూర్తిస్థాయి నివేదికలను కన్సల్టెన్సీలు అందజేయాల్సి ఉంటుంది. వచ్చే నెల ఒకటో తేదీన ఆసక్తి ఉన్న సంస్థల కోసం ప్రీబిడ్‌ సమావేశం నిర్వహిస్తామని, 18తేదీ లోపు తమ బిడ్‌ దాఖలు చేయాలని టెండర్‌ నిబంధనల్లో స్పష్టం చేసింది. హైదరాబాద్‌లోని రైల్వే మార్గాలు, మెట్రో రైలు మార్గాల కంటే భిన్నంగా హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లను ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సాధ్యమయ్యే ఈ ప్రాజెక్టు ద్వారా తెలుగు రాష్ట్రాల మధ్య మెరుగైన కనెక్టివిటీ ఏర్పడనుంది. భవిష్యత్తులో వచ్చే కారిడార్ల ద్వారా దక్షిణ భారతదేశానికి హైదరాబాద్‌ కేంద్రంగా మారనుంది.
* కేసులను త్వరితగతిన పరిష్కరించినప్పుడే న్యాయ వ్యవస్థపై ప్రజలకు మరింత విశ్వాసం కలుగుతుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎడవెల్లి రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా నిడమనూరులో కోట్లతో నిర్మించనున్న జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు భవన సముదాయానికి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ శావ్లీ జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ జస్టిస్‌ టీ.వినోద్‌కుమార్‌జస్టిస్‌ కె.లక్ష్మణ్‌తో కలిసి శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సదర్భంగా జస్టిస్‌ రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతుందన్న మాట అపోహ మాత్రమేనని ప్రతీ ఒక్కరికి ఈ వ్యవస్థపై ఎంతో నమ్మకం ఉందన్నారు. కేసుల సంఖ్యకు సరిపడా న్యాయమూర్తులు లేకపోవడం వల్ల విచారణలో కొంత జాప్యం వాస్తవమేనన్నారు. అమెరికా తదితర దేశాల్లో కక్షిదారులకు సత్వర న్యాయం అందుతోందని సింగపూర్‌లో న్యాయవాదులే చాలా కేసులను పరిష్కారిస్తున్నారని ఆయన గుర్తుచేశారు
* విద్య ఉద్యోగం క్రీడలుఅధికారిక పర్యటనలు లేదా వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్లేవారికి కొవిడ్‌- బూస్టర్‌ డోసును ఇవ్వాలని కేంద్రం ప్రభుత్వం యోచిస్తోంది. కేంద్ర ప్రభుత్వ వర్గాలు శనివారం ఈ విషయాన్ని వెల్లడించాయి. ప్రైవేటు కేంద్రాల్లో బూస్టర్‌ డోసు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలా వద్దా అన్నదానిపైనా చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆరోగ్యసేవల సిబ్బందికి, 60ఏళ్లు పైబడిన వారికి మాత్రమే బూస్టర్‌ డోసులను ఇస్తున్నారు. ఆదివారం నుంచి అంతర్జాతీయ విమాన ప్రయాణాలు మొదలుకానున్న నేపథ్యంలో.. పలు దేశాల్లో ఇప్పటికే ఉన్న బూస్టర్‌ డోసు నిబంధనను దృష్టిలో పెట్టుకుని భారత్‌ ఈ దిశగా యోచిస్తోందని అధికారులు తెలిపారు. ప్రజల నుంచి కూడా ఈ విషయంలో విజ్ఞప్తులు వచ్చాయని వివరించారు.
* ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఈ నెల 31వ తేదీ ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రస్తుతం దుబాయ్‌ పర్యటనలో వున్న ఆయన.. రాష్ట్రానికి చేరుకున్నాక మళ్లీ ఢిల్లీ బయలుదేరుతారు. ఆ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పథకాల అమలుకు నిధులు మంజూరు చేయాలని, వరదబాధితులను ఆదుకునేందుకు కోరినంత తగినన్ని నిధులు కేటాయించాలని, జీఎస్టీ బకాయిలను విడుదల చేయాలని కోరనున్నారు. ఆ రోజు రాత్రి ఢిల్లీలోనే బస చేయనున్న సీఎం.. ఏప్రిల్‌ ఒకటిన ప్రధాన ప్రతిపక్షాలకు చెందిన నాయకులతో సమావేశమవుతారు. ఏప్రిల్‌ 2వ తేదీన ఢిల్లీ దీనదయాళ్‌ ఉపాధ్యాయ మార్గ్‌లో నిర్మించిన డీఎంకే పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు.
* ఐఐటీ మద్రాస్‌లో ఎస్సీ మహిళా రీసెర్చ్‌ స్కాలర్‌పై లైంగిక వేధింపుల పర్వం నాలుగేళ్లు కొనసాగింది. పరిపాలనా విభాగానికి ఎన్నిసార్లు ఫిర్యాదుచేసినా నిందితులను అరెస్ట్‌ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. 2016లో రీసెర్చ్‌ స్కాలర్‌గా చేరిన మహిళపై తోటి స్కాలర్‌ పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ సమయంలో ఫొటోలు తీశాడు. అతనికి ఇద్దరు ప్రొఫెసర్లు వంతపాడారు.
*ఆదిలాబాద్‌ మండల కేంద్రంలోని మోడల్‌ స్కూల్‌ గేటు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి క్షుద్రపూజలు నిర్వహించడం కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి మోడల్‌ స్కూల్‌ గేటు ఎదుట మట్టి బొమ్మలకు పసుపు పూసి, నిమ్మకాయలు, గుడ్లు పెట్టి పూజలు చేశారు. శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో విద్యార్ధులు కొంతమంది పాఠశాలకు రావడంతో క్షుద్ర పూజలు చేసిన స్థలాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు.
*శ్రీలంక విదేశీమారక నిల్వలు అత్యంత కనిష్ట స్థాయిలకు దిగజారుతున్నాయి. కనీసం వార్తా పత్రికల ప్రచురణకు న్యూస్‌ ప్రింట్‌ కూడా కొనలేని దుస్థితి! దాంతో రెండు ప్రధాన పత్రికలు ది ఐలాండ్‌ (ఇంగ్లిష్‌), దివయినా (సింహళీ) ప్రచురణను నిలిపేశాయి. ఐలాండ్‌ ఈ–పేపర్‌కు పరిమితమైంది. దీంతో జనాలు ఆన్‌లైన్‌ న్యూస్‌ వెబ్‌సైట్లపై ఆధాపడుతున్నారు. ఇక ఆర్థిక సంక్షోభంతో దేశంలో నిత్యావసరాల ధరలు కూడా చుక్కలంటుతున్నాయి.