DailyDose

బ్లాక్ టిక్కెట్ల దందాపై బిజేవైఎం నిరసన

బ్లాక్ టిక్కెట్ల దందాపై బిజేవైఎం నిరసన

టికెట్ కౌంటర్ లో ఇవ్వరు… ఆన్ లైన్ లో లభించవు… అగ్ర హీరోల సినిమాలు విడుదలయిన మొదటి వారం రోజుల పరిస్థితి ఇంతే. అడిగితే అభిమాన సంఘాలకు ఇచ్చామని చేతులు దులుపుకుంటారు థియేటర్ల యాజమాన్యాలు. ఒక వేళ టికెట్ కావాలంటే రెండు రెట్ల ఎక్కువ ధరకు బయట విక్రయిస్తుంటారు. ఆగ్ర హీరోల చిత్రాలు విడుదలయినప్పుడల్లా ఇదంతా మామూలే. ఎవ్వరు కూడా కాదనలేని వాస్తవం. తాజాగా RRR చిత్రం రెండు రోజుల క్రితం విడుదలైంది. ఈ చిత్రం టిక్కెట్ల విషయంలో కూడా అదే పరిస్థితి.
బ్లాక్ టిక్కెట్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన నెల్లూరుజిల్లా భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షులు యశ్వంత్ సింగ్ ఠాకూర్ ఏకంగా నెల్లూరులోని ఎస్ – 2 థియేటర్ లోనే నిరసనకు దిగారు. బిజేపి కార్యకర్తలతో కలిసి థియేటర్ లో బైటాయించారు. కౌంటర్ లో టిక్కెట్లు అసలు ధరకు విక్రయించకుండా బయట బ్లాక్ లో ఎలా విక్రయిస్తారని ప్రశ్నించారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళన విరమింపజేశారు. అనంతరం యశ్వంత్ సింగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ అగ్ర హీరోల సినిమాలు విడుదలైన ప్రతీ సారి థియేటర్ల యాజమాన్యాలు టికెట్లు కౌంటర్ లో ఇవ్వడం లేదని ప్రశ్నిస్తే అభిమాన సంఘాలపై సాకులు చెబుతున్నారని అన్నారు. బయట రెండు రెట్లు అధిక ధరకు టిక్కెట్లు విక్రయిస్తున్నారని మండిపడ్డారు. అలాగే మల్టీఫ్లెక్స్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేయరాదని ప్రభుత్వ స్పష్టమైన ఆదేశాలు ఉన్నా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారన్నారు. వాటర్ బాటిల్, కూల్ డ్రింక్స్, ఇతర తినుబండారాలు కూడా అధిక రేట్లకు విక్రయిస్తున్నట్లు ఆరోపించారు. థియేటర్ పై అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేదంటే బిజేవైఎం తరపున పోరాటం చేస్తామని హెచ్చరించారు.