Politics

దేశంలో తెలంగాణ భాగం కాదనే విధంగా కేంద్రం తీరు – TNI రాజకీయ వార్తలు

దేశంలో తెలంగాణ భాగం కాదనే విధంగా కేంద్రం తీరు  – TNI రాజకీయ వార్తలు

*దేశంలో తెలంగాణ భాగం కాదనే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని టీఆర్ఎస్ ఎంపీ నామానాగేశ్వరావు ఎద్దేవా చేశారు. ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన బియ్యం కొనుగోలు విషయంలో కేంద్రం అనుసరిస్తున్నతీరుపై తీవ్రంగా స్పందించారు. ఏరాష్ట్రంలో లేనంతగా ఎక్కువ పంట తెలంగాణలో పండిందని కానీ కేంద్రం కొనకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందన్నారు.తెలంగాణలో ఎలా పండుతుందంటూ కేంద్రం వితండవాదం చేస్తోందన్నారు. కేంద్రం గడిచిన ఎనిమిదేళ్లలో తెలంగాణకు ఒక్క నవోదయా పాఠశాల కూడా ఇవ్వలేదని నామా ఆరోపించారు.తెలంగాణ రైతాంగాన్ని తెలంగాణ ప్రజలను కేంద్ర మంత్రులు అవమానకరమైన రీతిలో మాట్లాడుతున్నారని, తెలంగాణలో ముందు మీరు నూకలు తినండంటూ కేంద్ర మంత్రి అవమానిస్తున్నారు. రైతాంగ సమస్యల పై చివరివరకూ పోరాడదామని కేసీఆర్ చెప్పారు. దేశ వ్యాప్తంగా నవోదయ పాఠశాలలను ఇచ్చి తెలంగాణ కు ఎనిమిదేళ్ళుగా ఒక్క పాఠశాల ఇవ్వలేదు.కేంద్రం తెలంగాణ పట్ల దుర్మార్గంగా కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. కేంద్రం పై రాజీలేని రీతిలో పోరాటం చేస్తామని నామా ప్రకటించారు.

* ఉగాది త‌ర్వాత నూక ఎవ‌రో.. పొట్టు ఎవ‌రో తేలుస్తాం : మంత్రి పువ్వాడ‌
తెలంగాణ‌లో పండించిన ధాన్యం సేక‌ర‌ణ విష‌యంలో నిర్ల‌క్ష్యంగా వ‌హిస్తోన్న కేంద్రంపై రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ క‌లిసి తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడారు.ఈ సంద‌ర్భంగా మంత్రి పువ్వాడ అజ‌య్ మాట్లాడుతూ.. ఉగాది తర్వాత ఉగ్ర తెలంగాణను చూస్తార‌ని పేర్కొన్నారు. ఉగాది వరకు ప్రశాంతంగా కేంద్రానికి నిరసనలు, వినతులు తెలుపుతామ‌న్నారు. ఉగాది త‌ర్వాత నూక ఎవ‌రో, పొట్టు ఎవ‌రో తేలుస్తామ‌ని తేల్చిచెప్పారు. సికింద్రాబాద్ ప్ర‌జ‌ల‌కు కిష‌న్ రెడ్డి నూక‌లు తినిపించి చూడాలి. లేదా పీయూష్ గోయ‌ల్‌తో తెలంగాణ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పించాల‌ని అజ‌య్ కుమార్ డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు సమస్యను అర్ద్రతతో కూడిన హృదయంతో చూడాలన్నారు. రాజకీయ కోణంలో, రాజకీయ కక్ష్యతో తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాం అని భావిస్తే అది శునకానందమే అవుతుందని మంత్రి పువ్వాడ స్ప‌ష్టం చేశారు.

*జే బ్రాండ్ల మద్యంపై పోరుకు వెబ్‌సైట్‌: టీడీపీ
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మకాలు మొదలైన జే బ్రాండ్ల మద్యం వల్ల ప్రజల ఆరోగ్యం నాశనం అవుతోందని ఆరోపిస్తున్న తెలుగుదేశం పార్టీ వాటిపై పోరాటానికి ఒక వెబ్‌ సైట్‌ ఏర్పాటు చేసింది. కిల్లర్‌జేబ్రాండ్స్‌.కామ్‌ పేరుతో ఏర్పాటు చేసిన ఈ వెబ్‌సైట్‌ను శనివారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు నక్కా ఆనందబాబు, అశోక్‌ బాబు, ఆచంట సునీత ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జే బ్రాండ్ల వివరాలు, వాటి నాణ్యతకు సంబంధించి లాబ్‌ రిపోర్టులు, చనిపోయిన వారి వివరాలను ఇందులో పెట్టారు. ప్రజలు తమ వద్ద ఇంకా ఏదైనా సమాచారం… చనిపోయిన వారి వివరాలు ఉంటే వాటిని ఈ వెబ్‌ సైట్‌కు పంపాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రజలు, యువత తమకు తెలిసిన సమాచారం అందచేసి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి సహకరించాలని ఆయన కోరారు. ‘‘జగన్‌రెడ్డి ప్రభుత్వం మద్యం రేట్లు విపరీతంగా పెంచడం, నాసిరకం మద్యం సరఫరా చేయడంతో రాష్ట్రంలో లక్షల సంఖ్యలో పేద కుటుంబాలు ఆర్థికంగా నాశనం అయ్యాయి. అనేక మంది మహిళల తాళిబొట్లు తెగిపోయాయి’’ అని పార్టీ మహిళా నేత ఆచంట సునీత విమర్శించారు.

* దళితులు ఆర్ధికంగా అభివృద్ధి సాధించాలి : మంత్రి త‌ల‌సాని
రాష్ట్రంలోని ప్ర‌తి ద‌ళితుడు ఆర్థికంగా అభివృద్ధి సాధించాల‌నే ల‌క్ష్యంతోనే ద‌ళిత బంధు ప‌థ‌కానికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టార‌ని రాష్ట్ర ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ స్ప‌ష్టం చేశారు. సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో ఏర్పాటు చేసిన దళిత బంధు లబ్ధిదారుల అవగాహన సదస్సులో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని ప్ర‌సంగించారు.దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 74 సంవత్సరాలు దాటినా దళితులు అభివృద్ధికి నోచుకోలేదని త‌ల‌సాని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దళితులను అత్యున్నత స్థాయికి చేర్చాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. దళిత బంధు కింద‌ ఒక్కొక్కరికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామ‌ని తెలిపారు. లబ్ధిదారులు ఎంచుకున్న రంగంలో అవసరమైన శిక్షణ ఇచ్చి ఆయా రంగాలలో రాణించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. మొదటి దశలో ఒక్కో నియోజకవర్గ పరిధిలో 100 మందికి దళితబంధును ప్రభుత్వం అమలు చేస్తున్నదని చెప్పారు. రెండో విడతలో ఒక్కో నియోజకవర్గ పరిధిలో 1500 మందికి ఈ కార్యక్రమం వర్తిస్తుంద‌ని త‌ల‌సాని స్ప‌ష్టం చేశారు. ఇంతటి సాహసోపేత కార్యక్రమం దేశంలో ఎక్కడా అమలు కావడం లేదు. అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రామ్ ఆశయాల సాధన కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ఉద్ఘాటించారు.

*పిలుపు వస్తే ఢిల్లీ వెళతా: సీఎం
మంత్రివర్గ విస్తరణకు సంబంధించి పార్టీ అగ్రనేతలు ఢిల్లీ రావాలని పిలుపునిస్తే వెళతానని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత రాష్ట్రానికి తిరిగి వచ్చారు. శనివారం హుబ్బళ్లి విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఏప్రిల్‌ 1న బెంగళూరుకు వస్తున్నా విస్తరణ అంశం ప్రస్తావన ఉండదన్నారు. పిలుపు వచ్చాక ఢిల్లీకి వెళతానని అక్కడే చర్చిస్తామన్నారు. బడ్జెట్‌లో కేటాయించిన గ్రాంట్లకు అనుగుణంగా అభివృద్ధిని అమలు చేస్తామని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. హుబ్బళ్లిలో జరిగిన టైకాన్‌ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నవంబరులో జరిగే గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ మీట్‌ ద్వారా ప్రపంచ అగ్ర పారిశ్రామిక దిగ్గజాలను ఆహ్వానిస్తామన్నారు. గడిచిన మూడు త్రైమాసికాలలో విదేశీ పెట్టుబడుల సాధనలో కర్ణాటక తొలి స్థానంలో ఉందన్నారు. అంతకుముందు హావేరి జిల్లా శిగ్గావి తాలూకా తిమ్మాపుర గ్రామంలో 301 ఇళ్లకు జలజీవన్‌ మిషన్‌ కింద ఇంటింటికీ గంగ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు

*ప్రమాదం ఘటన తీవ్ర దిగ్ప్రాంతికి గురిచేసింది: సోము వీర్రాజు
100 అడుగుల లోయలో బస్సు పడి 8 మంది మృత్యువాత పడడం తీవ్ర దిగ్ప్రాంతికి గురిచేసిందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే ఎక్స్ గ్రేషియా విడుదల చేసి.. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. గాయపడిన వారందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. శేషాచలం ఘాట్‌రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. నిశ్చితార్థ వేడుక కోసం అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి తిరుపతికి బయలుదేరిన బస్సు లోయలో పడిపోయింది. బాధితులంతా కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులే! అంతా ఉల్లాసంగా మాట్లాడుకుంటూ ప్రయాణం సాగిస్తుండగా… పీలేరు – తిరుపతి మధ్య ఉన్న భాకరాపేట ఘాట్‌ రోడ్డులో… సుమారు 100 అడుగుల లోయలో బస్సు పడిపోయింది. ఈ ఘటనలో డ్రైవర్‌తోపాటు పది మంది అక్కడికక్కడే మరణించినట్లు సమాచారం. మృతుల సంఖ్యపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రమాద సమయంలో బస్సులో 50 నుంచి 60 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో దాదాపు 40 మందికి గాయాలైనట్లు సమాచారం. వీరిలో పెళ్లికుమారుడు మల్లిశెట్టి వేణు కూడా ఉన్నారు. ఎక్కువ మంది తలలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో పెద్దసంఖ్యలో పిల్లలు ఉన్నారు. శనివారం రాత్రి 9.30 గంటల సమయంలోనే ఈ ఘోరం జరిగింది.

*వైసీపీ నేతలు అఘాయిత్యాలు చేస్తుంటే సీఎం స్పందించరా?: అనిత
వైసీపీ నేతలపై తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆదివారం ఆమె ఇక్కడ మీడియతో మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై.. ఎక్కువ మ౦ది వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలే ఉన్నారని ఆరోపించారు. వైసీపీ నేతలు అఘాయిత్యాలు చేస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించరా? అని ప్రశ్నించారు. అమ్మాయిల కిడ్నాప్‌లో ఏపీ రెండో స్థానంలో ఉందన్నారు. హైదరాబాద్‌లోని వ్యభిచార గృహంలో.. మంత్రి అనిల్ కుమార్ అనుచరులు పట్టుబడిన విషయాన్ని ఈ సందర్భంగా అనిత గుర్తు చేశారు.

*కోర్టు ఎన్ని మొట్టికాయలు వేసినా మారని జగన్ ప్రభుత్వం: సయ్యద్ రఫీ
ల్యాండ్ సీలింగ్ యాక్ట్ 36 జీవో పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రజలను పీడించి ఖజానా నింపుకోవాలనుకోటం దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యధ్ రఫీ మండిపడ్డారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కోర్టు ఎన్ని మొట్టికాయలు వేసినా పద్ధతి మార్చుకోకుండా ‎ పన్నుల మీద పన్నులు విధించి జగన్ రెడ్డి ప్రజలపై భారం మోపుతున్నారని విమర్శించారు. 2008లో జీవో 747 ద్వారా రద్దయిన ల్యాండ్ సీలింగ్ యాక్ట్‌ను మళ్లీ 36 జీవో ద్వారా తెరపైకి తెచ్చి ప్రజల ‎ డబ్బులు గుంజేందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం తెగబడిందన్నారు. ఎన్టీఆర్ హయాంలో కట్టిన ఇళ్లకు వన్ టైం సెటిల్ మెంట్ పేరుతో పేదల నుంచి పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు అర్బన్ ప్రాంతాల్లో 36 జీవో ద్వారా మధ్య తరగతి ప్రజలపై పన్ను వసూలుకు పాల్పడుతోందని ఆరోపించారు.

*ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగాన్ని, చట్ట సభలను అపహాస్యం చేస్తున్నారు: కనకమేడల
పార్లమెంటు చేసిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంకు శాసనసభలో సవరణలు చేయలేరని, ఇదే విషయాన్ని ఏపీ హైకోర్టు స్పష్టంగా చెప్పిందని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పార్లమెంట్ చేసిన చట్టాలను కూడా కొట్టేయగల అధికారం న్యాయస్థానాలకు ఉందన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో రాజ్యాంగాన్ని, చట్ట సభలను అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని రాజ్యాంగ సంస్థలను అపహాస్యం చేయరాదన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా పాలించేవారు అరాచకవాదులని అన్నారు. లేని అధికారాన్ని శాసనసభలో చర్చించటం రాజ్యాంగ విరుద్దమని అన్నారు.

*ఏపీ ఆర్థిక పరిస్థితిని సరిదిద్దాలి: ఎంపీ రామ్మోహన్ నాయుడు
ఆర్టికల్ 360 ఉపయోగించాల్సిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌లో దాపురించాయని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయంపై కేంద్రం పరిశీలించి అవసరమైతే ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించి ఏపీ ఆర్థిక పరిస్థితిని సరిదిద్దాలన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి ఏపీలో విధ్వంసకర పాలన సాగుతోందని, ఆంధ్రప్రదేశ్‌కు భవిష్యత్ లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. తాము అనేక సార్లు చెప్పిన విషయాన్ని కాగ్ నివేదిక మరోమారు స్పష్టం చేసిందన్నారు. రూ. 48 వేల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు? ఎలా పెట్టారు? ఏమయ్యాయని?.. ట్రెజరీ కోడ్ ఉల్లంఘించారని కాగ్ పేర్కొందన్నారు.

*డీఎస్సీ నిర్వహిస్తామని జగన్ మాట తప్పారు: వీరాంజనేయాస్వామి
రాష్ట్రంలో 20 వేల ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయకుండా 4,764 ఎస్జీటీ పోస్టులను రద్దు చేయడం హేయమని టీడీపీ నేత డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ… ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తానని మాట ఇచ్చిన జగన్ రెడ్డి మూడేళ్లుగా మాట తప్పారు, మడమ తిప్పారని విమర్శించారు. ఉపాధ్యాయుల చేత మొన్న మద్యం అమ్మించారని, నిన్న రోడ్డు ఎక్కించారని, నేడు పోస్టులు రద్దు చేసి పొట్టుకొట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ బదిలీలను ప్రశ్నించినందుకు లాఠీ చార్జ్ చేయించారన్నారు. నాడు నేడు పనుల ఒత్తిడికి ఉపాధ్యాయులను బలిగొన్నారని అన్నారు.