Devotional

భక్తజన సంద్రం ‘మల్లన్న’ క్షేత్రం – TNI ఆధ్యాత్మికం

భక్తజన సంద్రం ‘మల్లన్న’ క్షేత్రం  – TNI ఆధ్యాత్మికం

1. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జునస్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో పులకించిపోయింది. చివరి ఆదివారం అగ్నిగుండాల కార్యక్రమాల సందర్భంగా 50వేలకు పైగా భక్తులు తరలివచ్చారు. డిసెంబర్‌ మాసంలో ప్రారంభమైన మల్లికార్జునుడి బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది 11వారాల పాటు కొనసాగాయి. శనివారం నుంచే భక్తులు స్వామి వారి క్షేత్రానికి చేరుకున్నారు.ఆదివారం వేకవ జామునే నిద్ర లేచిన భక్తులు పవిత్ర స్నానం అచరించి స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్లలో గంటల పాటు వేచి ఉన్నారు. స్వామి వారి దర్శనం కోసం ఒక్కో భక్తుడు దాదాపు 3గంటల నుంచి 5గంటల పాటు వేచి ఉన్నారు. స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకం, అర్చనలు, చిలుక పట్నం, నజరుపట్నం, మహామండప పట్నాలు వేయించి పూజలు నిర్వహించారు.మరికొంత మంది భక్తులు తలనీలాలు సమర్పించి, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టి కోరికలు తీర్చాలని స్వామి వారిని వేడుకున్నారు. అలాగే స్వామి వారి గుట్ట పై భాగంలో ఉన్న ఎల్లమ్మకు బోనాలు తీసుకుపోయి మొక్కులు తీర్చుకున్నారు.

2. యాదాద్రిలో శాస్త్రోక్తంగా ఉద్ఘాటన పర్వాలు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ప్రధానాలయ ఉద్ఘాటన పర్వాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం బాలాలయంలో కవచమూర్తులను ఆరాధించిన ఆచార్యులు మండపంలో ఉత్సవమూర్తులను దివ్యమనోహరంగా అలంకరించి శాంతిమంత్ర, వేదపఠన పారాయణం చేశారు. యాగశాలలో చతుస్థానార్చన, ద్వారతోరణ, ధ్వజకుంభారాధన, నిత్య లఘు పూర్ణాహుతి నిర్వహించారు. ప్రధానాలయ ముఖమండపంలో ఏకాశీతి(81) కలశాలను ఏర్పాటు చేసి ఆయా దేవతల మూలమంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శిల, లోహ మూర్తులకు పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని హైకోర్టు జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

3. సిద్దిపేట జిల్లా కొమురవెళ్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా చివరి ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. పట్నాలు, బోనాలు సమర్పించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. స్వామివారి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతోంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారి దర్శనానికి అధికారులు అనుమతి కల్పిస్తున్నారు.

4. ఇంద్రకీలాద్రిపై శానిటరీ సిబ్బంది నిర్వాకం.. ఆలస్యంగా వెలుగులోకి..
ఇంద్రకీలాద్రిపై శానిటరీ సిబ్బంది నిర్వాకం బయటపడింది. కొంతమంది ఉద్యోగులు అర్ధరాత్రి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విచారణ జరిపిన ఈవో భ్రమరాంబ 9 మంది తాత్కాలిక ఉద్యోగులను తొలగించారు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది బుధవారం అర్థరాత్రి 12 గంటలకు మహా రాజగోపురం ఎదురుగా కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. విచారణలో వాస్తవమని నిర్ధారణ కావడంతో ఏడుగురు పారిశుద్ధ్య సిబ్బందిని తొలగించారు. ప్రత్యేక భద్రతా విభాగానికి చెందిన కానిస్టేబుల్‌ను అధికారులు నిలిపివేశారు. మరో ప్రైవేటు సెక్యూరిటీ గార్డును తొలగించారు. ఈ అంశాన్ని ఆలయ ఈవో సీరియస్‌గా తీసుకున్నారు.