DailyDose

నేడు రాజీనామా చేయనున్న పాక్‌ ప్రధాని

నేడు రాజీనామా చేయనున్న పాక్‌ ప్రధాని

విదేశీ నిధుల సేకరణే కారణం…..?
పార్టీ కోసం 133 కోట్ల పాక్‌ రూపాయల సేకరణ…?
రేపు అరెస్టయ్యే అవకాశాలు…..!
అవిశ్వాసానికి ముందే ముందస్తుకు ప్లాన్‌…..
తన యూట్యూబ్‌ చానల్‌ ‘పీఎంవో’ పేరు మార్పు

పాకిస్థాన్‌ ప్రధాని, మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ రాజీనామా చేయనున్నారా…?
ఆదివారం ఇస్లామాబాద్‌లో నిర్వహించనున్న భారీ ర్యాలీలో ఈ మేరకు ప్రకటన చేయనున్నారా….?
ఈ ప్రశ్నలకు పాక్‌ పత్రికలు అవుననే పేర్కొంటూ కథనాలు ప్రచురించాయి….
ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీ పాకిస్థాన్‌ తహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌(పీటీఐ)కి 7.32 లక్షల అమెరికా డాలర్ల మేర నిషేధిత విదేశీ నిధులు అందాయని పాకిస్థాన్‌ ఎన్నికల సంఘం(ఈసీపీ) వెల్లడించడమే ఇందుకు కారణమని స్పష్టం చేశాయి. 349 విదేశీ కంపెనీలు, 88 మంది వ్యక్తుల నుంచి ఈ నిధులు వచ్చినట్లు పేర్కొన్నాయి. సోమవారం పాక్‌ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్‌ఖాన్‌ సర్కారుపై అవిశ్వాస తీర్మానం జరగనున్న విషయం తెలిసిందే. నిషేధిత విదేశీ నిధుల సేకరణ అభియోగాలపై ఆయన సోమవారం అరెస్టయ్యే అవకాశాలున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్‌ఖాన్‌ ఆదివారం రాజీనామా చేసి.. ముందస్తు ఎన్నికలకు వెళ్లే సూచనలున్నాయని పాక్‌ పత్రికలు వ్లెలడించాయి. దీనికి బలాన్ని చేకూరుస్తూ ఆయన తన యూట్యూబ్‌ చానల్‌ పేరు(ప్రధాన మంత్రి కార్యాలయం-పీఎంవో)ను ‘ఇమ్రాన్‌ఖాన్‌’గా మార్చారు. వెన్నంటే ఉంటూ ఇమ్రాన్‌ను గెలిపించిన పాక్‌ సైన్యం కూడా ఆయనపై విశ్వాసాన్ని కోల్పోయిందని, ఇమ్రాన్‌ను గద్దె దించేందుకు సిద్ధమైందని పేర్కొన్నాయి. ముఖ్యంగా సోషల్‌ మీడియా ప్రచారంతో ఆర్మీలో విభేదాలకు ఇమ్రాన్‌ చేసిన ప్రయత్నాలు.. ఆర్మీ చీఫ్‌ జావెద్‌ బజ్వా పదవీ కాలం పొడిగింపుపై 2019 తాత్సారం చేసినప్పటి నుంచే సైన్యం ఇమ్రాన్‌ పై అసంతృప్తితో ఉందని స్పష్టం చేశాయి. కాగా.. బుధవారం ఇమ్రాన్‌ఖాన్‌ మీడియాతో మాట్లాడుతూ..”రాజీనామా చేసే ప్రసక్తే లేదు. అయితే.. విపక్షాలు నివ్వరబోయే ఓ విషయాన్ని ప్రకటిస్తాను” అని వ్యాఖ్యానించారు. ఆదివారం జరిగే ర్యాలీలో రాజీనామా ప్రకటన చేసే ఉద్దేశంతోనే ఆయన ఆ వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ఇమ్రాన్‌ కేబినెట్‌లోని 50 మంది మంత్రులు కనిపించకుండా పోవడం సంచలనంగా మారింది.