Politics

Goa సీఎంగా ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం – TNI రాజకీయ వార్తలు

Goa సీఎంగా ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం  – TNI రాజకీయ వార్తలు

*గోవా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ రెండోసారి సోమవారం ప్రమాణస్వీకారం చేశారు.ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రధాని మోదీతోపాటు ఇతర బీజేపీ నేతలుహాజరయ్యారు.రాష్ట్ర రాజధాని నగరమైన పనాజీ సమీపంలోని డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో గోవా గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లై సావంత్‌తో ప్రమాణం చేయించారు. ప్రమోద్ సావంత్ మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్మ హారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు హాజరయ్యారు.

*సంగం బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు: సీఎం జగన్
నెల్లూరు జిల్లాలోని సంగం బ్యారేజీకి మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరును పెడతామని సీఎం జగన్ అన్నారు. నెల్లూరులో గౌతమ్‌రెడ్డి సంస్మరణ సభకు జగన్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” నా ప్రతి అడుగులో గౌతమ్‌రెడ్డి తోడున్నారు. గౌతమ్‌రెడ్డి నన్ను ఎప్పుడూ ప్రోత్సహించేవారు. గౌతమ్ నాకు మంచి మిత్రుడు” అని ఆయన పేర్కొన్నారు. ఆయన మృతి వారి కుటుంబానికి తీరనిలోటన్నారు. ప్రజల గుండెల్లో గౌతమ్ చిరస్థాయిగా ఉండేందుకు, సంగం బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరుతో నామకరణం చేస్తామని ఆయన ప్రకటించారు. సౌమ్యుడు, వివాదరహితుడు, యువ నాయకుడు, సమర్థుడిగా పేరు తెచ్చుకున్న రాష్ట్ర పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి (50) హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం హైదరాబాద్‌లో గుండెపోటుతో కన్నుమూశారు. కొవిడ్‌తో కోలుకున్న ఆయన ఇటీవలే దుబాయ్‌ ఎక్స్‌పో-2022లో పాల్గొనేందుకు దుబాయ్‌ వెళ్లారు. వారంరోజులపాటు అక్కడ జరిగిన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేర్వేరు దేశాలకు చెందిన ప్రతినిధులతో చర్చలు జరిపారు. తిరిగివచ్చాక ఆదివారం రాత్రి వరకు కుటుంబ సభ్యులు, సన్నిహితులతో ఉత్సాహంగా గడిపారు. అంతలోనే ఇంత విషాదం జరగడంతో రెండు రాష్ట్రాల ప్రజలు, రాజకీయ ప్రముఖులు దిగ్ర్భాంతికి గురయ్యారు.

*వెలంపల్లి పచ్చి అబద్ధాల కోరు: జలీల్ ఖాన్
మంత్రి వెలంపల్లి పచ్చి అబద్ధాల కోరు అని.. విశ్వాసం లేని వ్యక్తని మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ…‘‘మంత్రిగా నియోజకవర్గంలో నువ్వు ఏం చేశావో మా హయాంలో నేను ఏం చేసేనా చర్చకు సిద్ధం. గాలిలో గెలిచింది వెలంపల్లి.. ఎదురుగాలిలో గెలిచింది నేను. మంత్రి వద్ద బ్రోకర్లు కోవిడ్ సమయంలో దోచుకున్నారు. సంపద కోసమే వెల్లంపల్లి రాజకీయాల్లోకి వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవుళ్ల సొమ్మును కాజేస్తున్నారు. నేను ఇండిపెండెంట్‌గా పోటీ చేయడం వలన వెల్లంపల్లి ఎమ్మెల్యే అయ్యాడు… లేకుంటే ఐపి పెట్టి వెళ్లిపోయే వాడు. జూనియర్ కాలేజ్‌ను నేను తెస్తే వెలంపల్లి తెచ్చినట్లు బిల్డప్ ఇస్తున్నారు. సిగ్గులేదా అలా చెప్పుకోడానికి. ముఖ్యమంత్రి, వెల్లంపల్లి అవగాహన లేని వారు. రాష్ట్రాన్ని, విజయవాడ నగరాన్ని జగన్ సర్వ నాశనం చేశారు. వెల్లంపల్లిని మంత్రి వర్గం నుంచి తీసేస్తారు. వైసిపి ప్రభుత్వం నడుస్తుంది మద్యపానం పైనే.. ఇంక మద్యపాన నిషేధం ఎందుకు చేస్తారు.. జగన్ మాట తప్పారు… మడమ తిప్పి మోసం‌ చేశారు’’ అంటూ జలీల్ ఖాన్ వ్యాఖ్యలు చేశారు.

* అప్పుల రాష్ట్రంగా మార్చిన కేసీఆర్‌: షర్మిల
ఆర్థికంగా మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకే దక్కిందని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు. ఆదివారం వైఎస్సార్‌ టీపీ ప్రజా ప్రస్థానం పాదయాత్ర సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలోని తిరుమలగిరి, మాలిపురం, బండ్లపల్లి, గుండెపురి, వెలిశాలలో సాగింది.ఈ సందర్భంగా పలువురు రైతులు, వ్యవసాయ కూలీలతో మాట్లాడారు. అనంతరం ఆమె మాట్లాడుతూ…రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని, నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ప్రతిపక్షాలు మూగబోయాయని, ప్రశ్నించే గొంతుకలను అణిచి వేస్తున్నారని ఆరోపించారు. రైతులు పండించిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే కొనాలన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ ధరలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారన్నారు. దళితులకు 6 లక్షల ఎకరాల భూమి పంచారని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్, వైద్యం, ఇందిరమ్మ ఇల్లు, ఆరోగ్యశ్రీ కల్పించిన ఘనత వైఎస్సార్‌దేనని గుర్తు చేశారు.

*రాష్ట్రపతి పదవి నాకొద్దు: మాయావతి
తనకు రాష్ట్రపతి పదవి ఇస్తామని ఏ పార్టీ ఆఫర్‌ ఇచ్చినా అంగీకరించబోనని బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో తాము అధికారంలోకి వస్తే మాయావతి రాష్ట్రపతి అవుతారంటూ బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్‌ అసత్యప్రచారం చేశారని ఆమె చెప్పారు. తన అభిమానులను తప్పుదారి పట్టించారన్నారు. గతంలో రాష్ట్రపతి పదవిని కాన్షీరాం తిరస్కరించారని, ఆయన శిష్యురాలినైన తాను మాత్రం ఎలా అంగీకరిస్తానని ప్రశ్నించారు. ఒకవేళ అలాగే చేస్తే తమ పార్టీ చరిత్రముగిసిపోయినట్లేనన్నారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా తాను ఎట్టిపరిస్థితుల్లోనూ ఏ పార్టీ ఇవ్వజూపినా రాష్ట్రపతి పదవి చేపట్టనని చెప్పారు. యూపీ ఎన్నికల్లో తమ పార్టీ ఘోర పరాజయానికి కారణాలను విశ్లేషించుకుంటామని మాయావతి పేర్కొన్నారు.

*యడియూరప్పకు సమన్లు
ఐటీ కారిడార్‌ నిర్మాణానికి బెంగళూరులోని బెళ్లందూరు, దేవరబీసనహళ్లి గ్రామాల్లో స్వాధీనం చేసుకున్న 15 ఎకరాల భూముల డీనోటిఫికేషన్‌ వ్యవహారంలో కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పకు ఉచ్చు బిగుస్తోంది. ఈ వ్యవహారంలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన కేసులో ఏప్రిల్‌ 19న స్వయంగా హాజరుకావాలని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు శనివారం ఆయనకు ఆదేశాలు జారీ చేసింది.

*విభజన చట్టాన్ని అసెంబ్లీ సవరించలేదు: కనకమేడల
‘‘పార్లమెంటు ఆమోదించిన ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టాన్ని శాసనసభ సవరించలేదు. ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు స్పష్టంగా చెప్పింది. పార్లమెంటు చేసిన చట్టాలను సైతం కొట్టేయగల అధికారం కోర్టులకు ఉంది. రాష్ట్రంలో రాజ్యాంగాన్ని, చట్టసభలను అపహాస్యం చేస్తున్నారు’’ అని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ విమర్శించారు. లేని అధికారంపై అసెంబ్లీలో చర్చిండం రాజ్యాంగ విరుద్ధమని, ఇది కోర్టు తీర్పులను ధిక్కరించడమేనని స్పష్టం చేశారు.

*చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషనే లక్ష్యం: ఆర్‌.కృష్ణయ్య
చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్‌ కల్పించడానికి పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టించి, ఆమోదించేలా చేయడమే తమ లక్ష్యమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య పేర్కొన్నారు. ఆదివారం విశాఖలో బీసీ సంక్షేమ సంఘం కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు దాటినా బీసీలకు సరైన న్యాయం జరగలేదన్నారు.

*రద్దయిన చట్టం కింద వసూళ్లా?: టీడీపీ
‘‘పట్టణ ప్రాంతాల్లో భూ పరిమితి చట్టం 2008లో రద్దయింది. అప్పటి ప్రభుత్వం 747 జీవో జారీ చేసి ఈ భూముల్లో ఇళ్లు కట్టుకొనే పేదల నుంచి నామ మాత్రంగా కొంత మొత్తం తీసుకొని అవసరమైన మినహాయింపులు ఇచ్చే వెసులుబాటు కల్పించింది. పధ్నాలుగు సంవత్సరాల తర్వాత వైసీపీ ప్రభుత్వం కొత్తగా జీవో నంబరు 36 తెచ్చింది. గరిష్ఠ భూ పరిమితి భూముల్లో ఏనాడో ఇళ్లు కట్టుకొన్న వారిని ఇప్పుడు రూ.లక్షలు చెల్లించాలని నోటీసులు ఇస్తోంది. రద్దయిన చట్టంపై మళ్లీ జీవో ఎలా జారీ చేస్తారు?’’ అని టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్‌ రఫీ ప్రశ్నించారు. ఈ జీవోను ప్రభుత్వం తక్షణం ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో దీనిపై టీడీపీ ఆందోళన చేపడుతుందని రఫీ హెచ్చరించారు.

*ముస్లింలు బీజేపీని ప్రేమిస్తారు: యూపీ మంత్రి అన్సారి
ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ని భారతీయ జనతా పార్టీని ముస్లింలు రాబోయే రోజుల్లో ప్రేమిస్తారని యోగి కేబినెట్ సభ్యుడు, ఐకైక ముస్లిం కమ్యూనిటీకి చెందిన మంత్రి దానిష్ ఆజాద్ అన్సారీ అన్నారు. శుక్రవారం యోగితో పాటు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయనకు ఈ అవకాశం సర్‌ప్రైజ్ అని అన్నారు. యోగి మొదటి ప్రభుత్వ కేబినెట్‌లో మోసిన్ రజా అనే ఏకైక ముస్లిం మంత్రి ఉండేవారు. దానిష్ తాజాగా రజాను భర్తీ చేశారు.ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగమైన ఏబీవీపీలో వివిధ దశల్లో పని చేసిన దానిష్.. కొద్ది రోజుల క్రితం భారతీయ జనతా పార్టీలోకి వచ్చారు. భారతీయ జనతా పార్టీపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేసే సున్నీ వర్గానికి చెందిన వ్యక్తి దానిష్. రజా వర్గం బీజేపీకి కొంత సానుకూలంగానే ఉంటుంది. కాగా, ఆదివారం తన కార్యాలయంలో అధికారిక పగ్గాలు తీసుకున్న అనంతరం దానిష్ మాట్లాడుతూ ‘‘యోగి ప్రభుత్వం అన్ని వర్గాల కోసం పని చేసింది. ఇకపై పని చేస్తుంది. తొందరలోనే సున్నీ వర్గ ఆలోచన విధానం మారుతుంది. మోదీని యోగిని బీజేపీని ముస్లింలు సైతం ప్రేమిస్తారు’’ అని అన్నారు.