DailyDose

ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రధానికి రఘురామ లేఖ – TNI తాజా వార్తలు

ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రధానికి రఘురామ లేఖ – TNI తాజా వార్తలు

*ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రధాని మోదీకి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ఒక పనికోసం తెచ్చిన అప్పులు ఇతర పనులకు వాడటం రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొన్నారు. రుణాలు ఇచ్చిన బ్యాంకులు, అధికారులపై చర్చలు తీసుకోవాలని ప్రధానిని కోరానని తెలిపారు. సీఎం జగన్, సీతయ్యలాగా వ్యవహరిస్తున్నారని, ఆయన ఎవరి మాట వినరని విమర్శించారు. విజయసాయిరెడ్డి నేతృత్వంలో విశాఖలో స్థలాలకు కన్నాలు వేస్తున్నారని లేఖలో రఘురామకృష్ణరాజు తెలిపారు.
* రాష్ట్ర డీజీపీకి టీడీపీ నాయకుడు వర్ల రామయ్య లేఖ రాశారు. మంత్రి కొడాలి నాని అక్రమాస్తులు, దౌర్జన్యాలపై విచారణ జరపాలని ఆయన కోరారు. గుడివాడను గుప్పిట్లో పెట్టుకొని ప్రత్యేక రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అక్రమ కేసినో నిర్వహణపై తీసుకున్న చర్యలు, నూజివీడు డీఎస్పీ నివేదికను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
*అన్నమయ్య ప్రాజెక్ట్‌ నిరాశ్రయులను ఆదుకోవడంపై ఏపీ హైకోర్టులో విచారణ చేపట్టింది. ఇందుకు సంబంధించి రమేష్‌ నాయుడు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. పిటిషనర్‌ తరపున న్యాయవాది గోపాలకృష్ణ వాదనలు వినిపించారు. నిరాశ్రయులకు తక్కువ పరిహారం ఇచ్చారని పిటిషనర్‌ తెలిపారు. లక్షా 80 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని వాదనలు వినిపించారు. ఎంత మంది నిరాశ్రయులు ఉన్నారో.. నివేదిక ఇవ్వాలని పిటిషనర్‌ను ధర్మాసనం అడిగింది. నష్టపరిహారం చెల్లిస్తున్నామని ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.
*టీఎస్ ఎంసెట్-2022 నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఏప్రిల్ 6 నుంచి మే 28వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని ఎంసెట్ క‌న్వీన‌ర్ సూచించారు. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్య‌ర్థులు రూ. 400, మిగ‌తా కేట‌గిరిల అభ్య‌ర్థులు రూ. 800 చెల్లించి, ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు స‌మ‌ర్పించాలి.
*ఎస్పీ కార్యాలయంలో రాజేశ్వరి అనే మహిళ పురుగుల మందు తాగింది. దుర్గి పోలీసుల వల్ల తనకు అన్యాయం జరుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు తిరిగినా పోలీసులు ఎవ్వరూ తనను పట్టించుకోవడం లేదని మనస్తాపం చెందిన రాజేశ్వరి ఎస్సీ గ్రీవెన్స్‌కు వచ్చి పురుగుల మందు తాగింది. దీంతో అక్కడున్న సిబ్బంది.. ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో మందు వాసనకు లేడీ కానిస్టేబుల్ స్పృహ తప్పి పడిపోయింది. పూర్తి సమాచారం అందవలసి ఉంది.
*విద్యుత్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా బీజేపీ సమర భేరీ మోగించింది. సోమవారం బషీర్‌బాగ్ నుంచి ప్రజా బ్యాలెట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో నగర బీజేపీ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై కమలనాథులు ప్రజాభిప్రాయాన్ని కోరుతున్నారు. గ్రామ పంచాయతీలు, పట్టణాలు, నగరాల్లో ప్రతి ఇంటి నుంచి ప్రజాభిప్రాయాన్ని సేకరించనున్నారు.
*కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ట్విట్టర్ వేదికగా తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. యాదాద్రి పునఃప్రారంభానికి సీఎంవో ప్రోటోకాల్ పాటించలేదని ఆరోపించారు. స్థానిక ఎంపీగా ఉన్న తనను పిలవలేదని అన్నారు. కేవలం అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలను మాత్రమే ఆహ్వానించారని, దేవుడి దగ్గర సీఎం కేసీఆర్ బహు నీచ రాజకీయం చేయడం బాధాకరమని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
*గుంటూరు: జిల్లా కౌన్సిల్‌లో రగడ చోటు చేసుకుంది. సోమవారం వార్షిక బడ్జెట్ కోసం కౌన్సిల్ ప్రత్యేకంగా సమావేశమైంది. ఓడిపోయిన వైసీపీ అభ్యర్థులు కార్పోరేటర్‌లుగా ప్రచారం చేసుకోవడంపై టీడీపీ అభ్యంతరం తెలిపింది. టీడీపీ కార్పోరేటర్‌లుగా ఉన్న డివిజన్‌లలో వైసీపీ అభ్యర్థుల ప్రచారంపై వివాదం నెలకొంది. టీడీపీ – వైసీపీ కార్పోరేటర్‌ల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో టీడీపీ కార్పొరేటర్లకు సర్దిచెప్పి మేయర్ కావటి… మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
*పీఎం పాలెం, గాయిత్రినగర్‌లో వివాదస్పద స్థలాన్ని రెవెన్యూ అధికారులు పరిశీలించారు. తహశీల్థారు రామారావు నేతృతంలో అధికారుల బృందం పరిశీలించింది. ఎంవీవీ బిల్డర్స్ సంస్థపై నిన్న (ఆదివారం) ఇంటెలిజెన్స్ ఎస్పీ మధు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులు లోతైన విచారణ చేస్తున్నారు.
*నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో దీక్ష చేస్తున్న మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడుకు అఖిలపక్ష నాయకులు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మాధవ నాయుడు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. పోలీసులు శనివారం ఆయన దీక్షను భగ్నం చేసి ఆస్పత్రిలో చేర్చారు. మాధవ నాయుడు ఆస్పత్రిలో కూడా దీక్షను కొనసాగించారు. సోమవారం అఖిలపక్ష నాయకులు ఆస్పత్రికి చేరుకుని బండారుకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు
* తెలంగాణ ఆర్టీసీ(టీఎస్‌ఆర్టీసీ) బస్సు ఛార్జీలను పెంచింది. ప్యాసింజర్‌ సెస్‌ పేరుతో ఎక్స్‌ ప్రెస్‌, డీలక్స్‌ బస్సుల్లో రూ.5 చొప్పున..సూపర్‌ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో రూ.10వరకు టికెట్‌ రేట్లు పెరిగాయి. పెరిగిన ఛార్జీలు తక్షణమే అమల్లోకి వస్తాయని టీఎస్‌ ఆర్టీసీ వెల్లడించింది. మరోవైపు అకస్మాత్తుగా ఛార్జీలు పెంచడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇటీవల రౌండప్‌ విధానాన్ని తీసుకొస్తున్నట్లు పేర్కొన్న ఆర్టీసీ.. పల్లెవెలుగు బస్సు టికెట్‌ ధరల్లో దాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. చిల్లర సమస్య కారణంగా టికెట్‌ రేట్లను రౌండప్‌ చేసినట్లు తెలిపింది. రూ.12 ఛార్జీ ఉన్న చోట టికెట్‌ ధర రూ.10గా, రూ.13, రూ.14 ఉన్న టికెట్‌ ఛార్జీని రూ.15గా చేస్తూ ఆర్టీసీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
* శ్రీశైలం పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్ ప్రశంసలు…మూర్చ పోయిన భక్తురాలుకి అత్యవసర సాయం అందించిన శ్రీశైలం పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు.ఆదివారం శ్రీశైలానికి దర్శనానికి వచ్చి రద్దీ వలన ఓ భక్తురాలు మూర్చ పోయింది. అత్యవసర పరిస్ధితులలో ఎమర్జన్సీ గేట్ లాక్ బ్రేక్ చేసి భక్తురాలిని దేవస్ధానం హాస్పిటల్ కు తీసుకెళ్ళి డాక్టర్ల చే సరైన సమయంలో మెరుగైన వైద్యం అందించి కోలుకునే విధంగా చేసిన శ్రీశైలం వన్ టౌన్ ఎస్ఐ వెంకట్ రెడ్డి, శ్రీశైలం 2 టౌన్ కానిస్టేబుల్స్ మద్ది లేటి , నాను నాయక్ మరియు పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్ అభినందించారు.
* గుంటూరు: జిల్లాలోని అచ్చంపేట మండలం చిగురుపాడు పెళ్ళి వేడుకలో పాట కచేరి వివాదం నెలకొంది. పాట కచేరీకి పర్మిషన్ లేదని పోలీసులు తెలిపారు. పెళ్ళి వేడుకలో పాటకచేరీకి పర్మిషన్ ఏంటంటూ బంధువుల ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులపై బంధువులు, గ్రామస్థులు వాగ్వాదానికి దిగారు. పబ్లిక్ ప్లేసుల్లో, తిరునాళ్ళు ప్రభలపై డాన్స్ కచేరీలకు లేని అభ్యంతరం పెళ్ళి వేడుకలో ఏంటని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
* విశాఖ పాత గాజువాకలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం ఉద్రిక్తతకు దారి తీసింది. విశాఖ బంద్‌లో ఉదయం నుంచి టీడీపీ నేతలు పాల్గొనగా…వైసీపీ నేతలు బంద్‌కు దూరంగా ఉన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై జగన్ వైఖరిని టీడీపీ నేతలు తప్పు బట్టారు. దీనిపై వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తల నుంచి పార్టీ జెండాలనువైసీపీ కార్యకర్తలు లాగిపారేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టారు. వైసీపీకి పోలీసులు కొమ్ముకాస్తున్నారని… వైసీపీ కార్యకర్తలు తాగి వచ్చారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
* శ్రీకాకుళం: నగరంలో కార్మిక సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నిరసనకు దిగారు. డైమండ్ పార్కు నుంచి సెవెన్ రోడ్డు జుంక్షన్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సమ్మెకు దిగారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
*నెల్లూరు నగరంలో బీజేపీ భారీ ర్యాలీ నిర్వహించింది. కలెక్టరేట్ ఎదుట బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. రైతులు పండించే ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ర్యాలీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఏపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. రైతులు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నా కనికరం లేదని మండిపడ్డారు. రైతుల సమస్యలపై త్వరలో పాదయాత్రకు శ్రీకారం చుడతామని సోమువీర్రాజు తెలిపారు.
*అనంతపురం జిల్లాలోని రామగిరి మండలం ముత్యాలమ్మ దేవస్థానం వద్ద దళిత యువకుడు ముత్యాలపై దాడిని నిరసిస్తూ దళిత సంఘాల నేతల ఆందోళనకు దిగారు. దేవస్థానం వద్ద ముత్యాలపై ఆలయ నిర్వాహకులు దాడి చేశారు. ఈఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితుడి బంధువులు, దళితులను లోపలికి అనుమతించేందుకు పోలీసులు నిరాకరించారు. డీఎస్పీ వీరరాఘవరెడ్డితో దళిత సంఘాల నేతలు వాగ్వాదానికి దిగారు. ఎట్టకేలకు ఎస్పీ కార్యాలయంలోకి దళిత సంఘాల నేతలను పోలీసులు అనుమతించారు.
*భూ ఉపరితలం నుంచి గగనతలంపైకి ప్రయోగించే మీడియం రేంజ్‌ బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి(ఎంఆర్‌ఎ్‌సఏఎం-ఆర్మీ)ని డీఆర్‌డీవో బ్రహ్మోస్‌ ఏరోస్పే్‌సతో కలిసి ఆదివారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్‌ తీర ప్రాంతంలో ఉద యం గంటలకు ఈ ప్రయోగాన్ని నిర్వహించామని డీఆర్‌డీవో ట్విటర్‌లో వెల్లడించింది. తీవ్రవేగంతో వెళ్తున్న సుదూర గగనతల లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో క్షిపణి ఛేదించిందనితాము నిర్దేశించిన అన్ని లక్ష్యాలను అందుకుందని డీఆర్‌డీవో పేర్కొన్నది.
*దేశంలో ఒకేసారి 10 అణు విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఈ ప్లాంట్లను స్వదేశీ పరిజ్ఞానంతో 2023-25 మధ్య నిర్మించేందుకు 2017లోనే నిర్ణయం తీసుకున్నట్టు శాస్త్ర, సాంకేతిక రంగాలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీకి అణుశక్తి విభాగం అధికారులు తెలిపారు. ఒక్కొక్క ప్లాంటును 700 మెగా వాట్ల సామర్థ్యంతో నిర్మించనున్నట్టు పేర్కొన్నారు. రూ.1.05 లక్షల కోట్లతో నిర్మించే ఈ ప్లాంట్లను ఐదేళ్లలో పూర్తి చేస్తారు.
*మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.జయసూర్య సూచించారు. గుంటూరు జిల్లా నంబూరు జడ్పీ పాఠశాల ప్లాటినం జూబ్లీ వేడుకలు ఆదివారం ముగిశాయి. సభకు పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ఈమని ప్రతా్‌పరెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్‌ జయసూర్య మాట్లాడుతూ.. 75 ఏళ్ల తర్వాత విద్యార్థులు మళ్లీ కలుసుకోవడం, ఇటువంటి వేడుకలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ వేడుకల నిర్వహణ చూస్తుంటే తమ పాఠశాలకు కూడా ఏదో చేయాలనే సంకల్పం కలుగుతోందన్నారు. మరో న్యాయమూర్తి జస్టిస్‌ ఏవీ శేషసాయి మాట్లాడుతూ.. దేశం మీద, సంస్కృతి మీద దాడి చేసిన వారి నుంచి కాపాడిన వ్యక్తుల పేర్లను ఈ పాఠశాలకు పెట్టడం ఎంతో ఆనందదాయకమన్నారు.
*అగ్రిగోల్డ్‌ బాధితుల బాధ్యత ప్రభుత్వం తీసుకుని న్యాయం చేయాలని, స్థానిక ఆస్తులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాలని అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. విజయవాడలోని దాసరిభవన్‌లో ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణ, ఒడిసా రాష్ట్రాలకు చెందిన అసోసియేషన్ల ప్రతినిధుల సదస్సు ఈవీ నాయుడు అధ్యక్షతన ఆదివారం జరిగింది. సదస్సును ప్రారంభించిన నాగేశ్వరరావు మాట్లాడుతూ.. 2015లో యాజమాన్యం కుట్రలతో మూతపడిన అగ్రిగోల్డ్‌ కంపెనీ కారణంగా.. 32 లక్షల మంది కస్టమర్లు, ఏజెంట్లు ఆర్థికంగా చితికిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఫెడరేషన్‌ అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏలూరు ప్రత్యేక కోర్టులో న్యాయపోరాటం కొనసాగిస్తూ, అవసరమైతే సుప్రీంకోర్టులో కంపెనీకి వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేయాలని తీర్మానించారు.
*రాష్ట్రంలో ఆర్టికల్‌ 360ని ప్రయోగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కేంద్రం విషయాన్ని పరిశీలించి అవసరమైతే ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించి ఏపీ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలి’’ అని ఎంపీ రామ్మోహన్‌నాయుడు అన్నారు. ఆదివారం ఢిల్లీలో మరో ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంసకర పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. అనేక సార్లు తాము చెప్పిన విషయాన్నే కాగ్‌ నివేదిక మరోసారి స్పష్టం చేసిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ట్రెజరీ కోడ్‌ను ఉల్లంఘించిందని కాగ్‌ తేల్చిందని వివరించారు.
* సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎస్టీయూ పిలుపు మేరకు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో ఉపాధ్యాయులు నిరసన ర్యాలీలు నిర్వహించారు. ముఖ్యమంత్రి ప్రజాసంకల్పయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం సీపీఎస్‌ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌. సాయిశ్రీనివాస్‌ తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ర్యాలీలో, ప్రధాన కార్యదర్శి హెచ్‌.తిమ్మన్న కర్నూలు జిల్లా ర్యాలీలో పాల్గొన్నారు
*సీఎం జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఈ నెల 31లోపు సీపీఎ్‌సను రద్దు చేయాలని ఏపీ టీచర్స్‌ ఫెడరేషన్‌ (ఏపీటీఎఫ్‌) డిమాండ్‌ చేసింది. 3,4,5 తరగతులను దూరంగా ఉన్న హైస్కూళ్లలో విలీనం చేయడాన్ని, మీడియమ్స్‌ కుదింపును, సీబీఎస్‌ సిలబస్‌ ప్రవేశపెట్టడాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని కోరింది. ఎస్‌జీటీ పోస్టుల రద్దు ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని, అన్ని కేడర్లకు పదోన్నతులు కల్పించాలని కోరింది. ఆదివారం జరిగిన రాష్ట్ర కార్యవర్గ భేటీ తీర్మానాలను ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయరాజు, కె.కులశేఖర్‌రెడ్డి ఒక ప్రకటనలో వివరించారు. సీపీఎస్‌ రద్దుతో పాటు 11వ పీఆర్సీకి సంబంధించి శాస్త్రీయమైన ఉత్తర్వులను జారీ చేయాలని, అన్ని రకాల బకాయిలను చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఏప్రిల్‌ 5వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని తీర్మానించారు. అలాగే.. దేశవ్యాప్తంగా 28, 29ల్లో చేపట్టిన ఏపీటీఎఫ్‌ సంఘీభావం ప్రకటించారు.
*కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో అండర్‌ గ్రాడ్యుయే ట్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం సీయూఈటీ యూజీ-2022 నోటిఫికేషన్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్టీఏ) విడుదల చేసింది. అభ్యర్థులు ఏప్రిల్‌ 2 నుంచి 30 మధ్య cuet.samarth.ac లో దరఖాస్తులు చేసుకోవచ్చు. సీయూఈటీ యూజీని పలు సెక్షన్లలో నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలతో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(సీబీటీ) ద్వారా సీయూఈటీ-యూజీ నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్ష పూర్తి వివరాలు చూడొచ్చు.
*సీఆర్‌పీఎఫ్‌బీఎ్‌సఎఫ్‌, ఐటీబీపీ, సీఐఎ్‌సఎఫ్‌, ఎస్‌ఎ్‌సబీ తదితర కేంద్ర సాయుధ పోలీసు దళాల(సీఏపీఎఫ్‌) జవాన్లు ఏడాదిలో కనీసం 100 రోజులు కుటుంబంతో గడిపేలా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన ప్రతిష్ఠాత్మక ప్రతిపాదన త్వరలో కార్యరూపం దాల్చనుం ది. 10 లక్షల మంది సాయుధ దళాల సిబ్బంది, అధికారులకు పని ఒత్తిడి తగ్గించడం, ఆనందాన్ని పెంపొందించడం, ఆత్మహత్యలు, తోటి సిబ్బందిని కాల్చిచంపడం వంటివి నివారించడం దీని లక్ష్యం.