DailyDose

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఏపీ సీఎం జగన్‌ – TNI తాజా వార్తలు

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఏపీ సీఎం జగన్‌  – TNI తాజా వార్తలు

* వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో కీలక సాక్షులు దస్తగిరి, రంగన్నలకు మంగళవారం నుంచి భద్రతలో భాగంగా గన్‌మెన్‌ల సౌకర్యం కల్పించారు. కడప కోర్టు ఆదేశాల మేరకు ఒన్ ప్లస్ ఒన్ గన్ మెన్‌లను పోలీసుశాఖ కేటాయించింది. మరోవైపు ఏ5 నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వరాదంటూ.. వివేకా కుమార్తె డాక్టర్ సునీత రెడ్డి హైకోర్టులో అనుబంధ పిటీషన్ దాఖలు చేశారు. తన వాదనలను వినిపించేందుకు కూడా అవకాశం ఇవ్వాలని హైకోర్టును అభ్యర్థించారు. నిన్న (సోమవారం) జరిగిన వాదనల అనంతరం శివశంకర్ రెడ్డి బెయిల్, సునీత పిటీషన్‌లపై న్యాయస్థానం తదుపరి విచారణ ఏప్రిల్ 6కు వాయిదా వేసింది.

* తనపై నమోదయిన కేసు విషయంలో తెలంగాణ హైకోర్టును ఏపీ సీఎం జగన్‌ ఆశ్రయించారు. 2014లో హుజూర్‌నగర్‌లో తనపై నమోదైన కేసును కొట్టేయాలని జగన్‌ పిటిషన్‌ వేశారు. 2014లో అనుమతి లేకుండా రోడ్‌షో నిర్వహించారని జగన్‌పై అభియోగాలు నమోదయ్యాయి. విచారణకు హాజరుకావాలని జగన్‌కు ఇటీవల ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. దీంతో కోర్టును జగన్‌ ఆశ్రయించారు. జగన్‌ హాజరుపై ఏప్రిల్‌ 26 వరకు తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది.

*గుంటూరు జిల్లాలోని కాట్రపాడు జడ్పీ హైస్కూల్‌లో వాగ్వాదం చోటుచేసుకుంది. విద్యార్థినిల పట్ల ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఉపాధ్యాయుడి ప్రవర్తనపై తమ తల్లిదండ్రులకు విద్యార్థినిలు తెలియజేశారు. ఉపాధ్యాయులతో తల్లిదండ్రుల వాగ్వాదానికి దిగారు. పోలీసులు సర్దిచెప్పడంతో గొడవ సద్ధుమణిగింది. ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేయాలని తల్లిదండ్రుల డిమాండ్ చేశారు.

*కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఎంపీలు కేశినేని నాని, కోమటి రెడ్డిల సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా టీడీపీ ఎంపీ కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ గడ్కరీని, ఎన్‌హెచ్‌ఏ అధికారులను కలిశామన్నారు. విజయవాడ-హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి సిక్స్ లైన్ ప్రాజెక్టుకు సంబంధించిన అంశంపై చర్చలు జరిపినట్లు చెప్పారు. 6 లైన్ ప్రకటించడానికి ఒక నెలలో నిర్ణయం తీసుకుంటామని నితిన్ గడ్కరీ చెప్పినట్లు తెలిపారు. త్వరలో ప్రాజెక్ట్ ప్రారంభమవుతుందన్నారు. జీఎంఆర్ కింద విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి ఉందని, అయితే కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయన్నారు. ఇబ్రహిపట్నం, అమరావతి ఎన్‌హెచ్ 30 జాతీయ రహదారి విస్తరణకు అనుమతి ఇవ్వాలని కోరామన్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ సర్వీసు రోడ్లు, మహానాడు నుంచి ఎయిర్ పోర్టుకు మూడు ఫ్లైఓవర్లు ఏర్పాటు చేయాలని కోరామన్నారు. వీటన్నిటిపై నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారని కేశినేని నాని తెలిపారు.

*గుంటూరు: జిల్లాలోని మంగళగిరిలో మూడు నెలల శిశువు విక్రయం కలకలం రేపుతోంది. కన్న తల్లే శిశువును విక్రయించగా… పదిహేను రోజుల్లోనే ఆ శిశువును ముఠా సభ్యులు మరొకరికి విక్రయించింది. అయితే తన బిడ్డ తనకే కావాలంటూ తల్లి పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ముఠా కోసం గాలింపు చర్యలు చేపట్టి చివరకు వారిని పట్టుకున్నారు. కాసేపట్లో నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశ పెట్టనున్నారు.

* కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఎస్టీల రిజర్వేషన్‌ పెంపు జీవో తీసుకురావాలంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. కేంద్రం అడ్డుకుంటే అడగాలన్న కిషన్‌రెడ్డి.. దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుకునే హక్కు రాష్ట్రాలకు ఉందన్నారు.

*నిరంతరాయ విద్యుత్ ఇచ్చేంత వరకు విద్యుత్ బిల్లులు చెల్లించవద్దని గుజరాత్ రైతులకు ఆప్ పిలుపునిచ్చింది. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా సమయాన్ని తగ్గించడంపై గుజరాత్ ఆమ్ ఆద్మీ పార్టీ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతులకు నిరంతరాయంగా విద్యుత్ అందించాలనిలేదంటే రైతులతో కలిసి ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తామని హెచ్చరించింది.

*కర్నూలు: జిల్లాలోని అవుకు రిజర్వాయర్ సమీపంలోని రిజర్వాయర్ సొరంగ నిర్మాణం జరిగే అటవీ ప్రాంతంలో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. చిరుతల సంచారాన్ని నిర్మాణ పనుల్లో ఉన్న టిప్పర్ డ్రైవర్లు వీడియో తీశారు. ప్రస్తుతం చిరుత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏక కాలంలో రెండు చిరుతపులులు సంచరిస్తుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

*2015 ఐఎఎస్ టాపర్ అయిన టీనా దబీ త్వరలో పెళ్లి కూతురు కానున్నారు. తాజాగా తనకు 2013 బ్యాచ్ ఐఎఎస్ అధికారి ప్రదీప్ గవాండేతో నిశ్చితార్థం జరిగిందని టీనా దబీ ఇన్‌స్టాగ్రామ్‌లో తన చిత్రాలను పంచుకుంటూ పోస్టు పెట్టారు. టీనా దాబీ 2015లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ పరీక్షలో అగ్రస్థానంలో నిలిచారు. అదే సంవత్సరం జమ్మూకశ్మీరుకు చెందిన అథర్ ఖాన్ రెండవ స్థానంలో నిలిచారు.ఇద్దరు ఐఎఎస్ టాపర్ల మధ్య ప్రేమ చిగురించడంతో వారు 2018వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు.అప్పట్లో వారి వివాహానికి ప్రముఖులు, అగ్ర రాజకీయ నాయకులు హాజరయ్యారు.

*టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, కాంగ్రెస్ నేతల మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. తెలంగాణ రైతుల సమస్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌కు ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. దీనిపై స్పందించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్…కవిత ట్వీట్‌కు సెటైర్ విసిరారు. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో పోరాడటం లేదని… సెంట్రల్ హాల్లో కాలక్షేపం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ‘‘ఇకపై ఎఫ్‌సీఐకి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని మీ తండ్రి కేసీఆర్ గత ఆగస్టులోనే ఒప్పందంపై సంతకం చేశారు. మీ తండ్రి నాడు చేసిన సంతకం నేడు తెలంగాణ రైతుల మెడకు ఉరితాడైంది. ఈ వాస్తవాన్ని మీరు మర్చిపోయారు’’ అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

*విజయవాడ నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్‌లో తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పేద మహిళలకు చీరలు, కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఆటోనగర్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు తెలుగు తమ్ముళ్లు బైక్ ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చెన్నుపాటి గాంధీజాస్తి సాంబశివరావును గద్దె రామ్మోహన్ సన్మానించారు
*మహబూబాబాద్: జిల్లాలోని చిన్నగూడురు మండలం గుండంరాజుపల్లిలో క్షుద్రపూజల కలకలం రేగింది. గ్రామ శివారు తొక్కుడుబండ దగ్గర క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. నల్లటి వస్త్రంలో నిమ్మకాయలు, పసుపు కుంకుమ, కొబ్బరి కాయలు, గుమ్మడికాయలు, నల్లకోడితో క్షుద్ర పూజలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.

* పొట్టి శ్రీరా‌ములు తెలుగు విశ్వ‌వి‌ద్యా‌లయం 15వ స్నాత‌కో‌త్స‌వాన్ని ఏప్రి‌ల్‌లో నిర్వ‌హిం‌చ‌ను‌న్నట్టు పరీ‌క్షల నియం‌త్ర‌ణా‌ధి‌కారి ఆచార్య సీ ముర‌ళీ‌కృష్ణ సోమ‌వారం తెలి‌పారు. 2016 నుంచి 2021 వరకు వివిధ కోర్సుల్లో ఉత్తీ‌ర్ణత సాధిం‌చిన విద్యా‌ర్థులు స్నాత‌కో‌త్సవం సంద‌ర్భంగా డిగ్రీ పట్టా పొంద‌డా‌నికి ఏప్రిల్‌ 11 వరకు దర‌ఖాస్తు చేసు‌కో‌వ‌చ్చని పేర్కొ‌న్నారు. దర‌ఖాస్తు పత్రాన్ని www.teluguuniversity.ac.in నుంచి పొంద‌వ‌చ్చని సూచిం‌చారు.

*నోబెల్‌ బహుమతి గ్రహీత ఎస్తెర్‌ డఫ్లో (ఫ్రెంచ్‌-అమెరికన్‌ ఆర్థిక వేత్త) సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డితో భేటీ అయ్యారు. ఆమె 2019 ఆర్థిక శాస్త్రంలో అభిజిత్‌ బెనర్జీ, మైఖేల్‌ క్రీమెర్‌తో సంయుక్తంగా నోబెల్‌ బహుమతి గెలుచుకున్నారు. ప్రస్తుతం ‘అబ్దుల్‌ లతీఫ్‌ జమీల్‌ పావర్టీ యాక్షన్‌ ల్యాబ్‌’ సహ వ్యవస్థాపకురాలిగా వ్యవహరిస్తున్నారు

* రాష్ట్ర ఉపాధి శిక్షణాధికారుల సంఘం(టీపీవో) కెపాసిటీ డెవల్‌పమెంట్‌(సామర్థ్య అభివృద్ధి) ప్రోగ్రామ్‌ ఏప్రిల్‌ 23, 24 తేదీల్లో నెల్లూరులో నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ హేమచంద్రారెడ్డి తెలిపారు. స్థానిక ఎన్‌ఆర్‌ఐ కళాశాలలో సోమవారం ఈ మేరకు ఆయన పోస్టర్‌ విడుదల చేశారు.

*రిజిస్ర్టేషన్‌ శాఖలో 1999వ సంవత్సరానికి ముందు రిజిస్ర్టేషన్‌ అయిన డాక్యుమెంట్లన్నంటినీ డిజిటైజేషన్‌ చేసేందుకు ఎట్టకేలకు ఆ శాఖ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈసీలు కానీ, రిజిస్ర్టేషన్‌ డాక్యుమెంట్లు కానీ 1999 తర్వాత అయినవే ఆన్‌లైన్‌లో లభిస్తున్నాయి. అయితే అంతకుముందున్న డాక్యుమెంట్లను కూడా డిజిటలైజేషన్‌ చేసేందుకు రైటర్‌ బిజినెస్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థను ఇందుకోసం రూ.28కోట్ల అంచనా వ్యయంతో ఎంపికచేశారు. ఆరునెలల్లోపు ఈ సంస్థ పాత డాక్యుమెంట్ల స్కానింగ్‌ పూర్తిచేయాల్సి ఉంటుంది.

*అక్రమంగా నిల్వచేసి అధిక ధరలకు వంటనూనెలు విక్రయిస్తున్న వ్యాపారులపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేసులు నమోదు చేసింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 291చోట్ల సోదాలు జరిపిన విజిలెన్స్‌ అధికారులు 68మంది వ్యాపారులపై కేసులు నమోదు చేశారు.

* ఏపీలో విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రతిపాదనా రాలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు రాజ్యసభలో కేంద్ర మంత్రి కౌశల్‌ కిశోర్‌ తెలిపారు. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి నూతన మెట్రో విధానానికి అనుగుణంగా ప్రతిపాదన పంపాలని 2017 సెప్టెంబరు 1న కేంద్రం రాష్ట్రానికి లేఖరాసిందని పేర్కొన్నారు. కానీ, ఇంతవరకూ రాష్ట్రం నుంచి ఎలాంటి స్పందనా రాలేదన్నారు. ఈ మేరకు రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి కౌశల్‌ కిశోర్‌ సమాధానమిచ్చారు. మెట్రో ప్రాజెక్టుల విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో 23 మెట్రో ప్రాజెక్టులను కేంద్రం రూ.2.51 లక్షల కోట్లతో చేపడుతున్నప్పటికీ ఏపీ ప్రభుత్వం ఆసక్తి కనపరచకపోవడం నిర్లక్ష్యానికి పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. కాగా విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై పునరాలోచించాలని కేంద్ర ప్రభుత్వానికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విజ్ఞప్తి చేశారు. సోమవారం రాజ్యసభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రెండు రోజుల పాటు జరగనున్న దేశవ్యాప్త సమ్మెకు ఏపీ ప్రభుత్వం మద్దతిస్తున్నట్లు తెలిపారు.

*‘‘వైసీపీ కబ్జాకోరులు విశాఖను రాబందుల్లా పీక్కుతుంటున్నారు. కన్నుపడిన ప్రతి గజాన్ని కబ్జా చేస్తున్నారు. విశాఖపట్నాన్ని విషాదపట్నంగా మార్చేస్తున్నారు’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ విమర్శించారు. ‘‘సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఎస్పీకి చెందిన స్థలాన్నే వైసీపీ ఎంపీ ఆక్రమించడం వైసీపీ కబ్జాపర్వంలో సరికొత్త కోణం. స్థలం కబ్జా చేయడమే కాకుండా రివర్స్‌లో ఎంపీ మనుషులు, ఎస్పీకే వార్నింగ్‌ ఇవ్వడం విశాఖలో వైసీపీ ల్యాండ్‌ మాఫియా అరాచకాలకు అద్దం పడుతోంది. బాధితులంతా ముందుకురండి. వైపీపీ కబ్జాకోరల నుంచి విశాఖను రక్షించుకుందాం. మీకు అండగా తెలుగుదేశం పోరాడుతుంది’’ అని ఓ ప్రకటనలో లోకేశ్‌ పిలుపునిచ్చారు. బస్సు ప్రమాద మృతల కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

* రంజాన్‌ పండుగకు అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ, ఎలక్ర్టికల్‌, వాటర్‌ వర్క్స్‌ తదితర శాఖల అధికారులు, సనత్‌నగర్‌ నియోజకవర్గం పరిధిలోని మసీదు కమిటీ సభ్యులతో రంజాన్‌ ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో కార్పొరేటర్లు కొలను లక్ష్మి, టి.మహేశ్వరి, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

* గ్యాంగ్‌స్టర్‌ నయీం బినామీ ఆస్తులను ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ జప్తు చేసింది. యాదాద్రి-భువనగిరి జిల్లాలోని 10 ఆస్తులను అటాచ్‌ చేసింది. ఈ కేసులో 40 బినామీ ఆస్తులను ఐటీ శాఖ గుర్తించింది. ఆ ఆస్తుల డాక్యుమెంట్‌ విలువ రూ.12 కోట్లు ఉండగా.. మార్కెట్‌ విలువ రూ.150 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తోంది. అవన్నీ నయీం బినామీల పేర్ల మీదనే ఉండగా.. బినామీ ఆస్తులను ఐటీశాఖ అటాచ్‌ చేయడం తెలంగాణలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ కేసులో మరింత సమాచారం తెలుసుకునేందుకు మరోసారి నయీం భార్య హసీనా బేగాన్ని విచారించాలని ఐటీ శాఖ నిర్ణయించింది. ఈనేపథ్యంలో ఆమెకు నోటీసులను జారీ చేసింది

*విద్యుత్తు వినియోగదారుల సమస్యలను పరిష్కరించే వేదిక గురించి అవగాహన పెంచాలనివిద్యుత్తు శాఖ దృష్టికి వచ్చిన సమస్యలను కాలపరిమితిలో పరిష్కరించాలని టీఎస్‌ఈఆర్‌సీ చైర్మన్‌ శ్రీ రంగారావు అన్నారు. సోమవారం సింగరేణి భవన్‌ ఈఆర్‌సీ కార్యాలయంలో విద్యుత్తు వినియోగదారుల ఫిర్యాదుల స్వీకరణకు టీఎ్‌సఎస్పీడీసీఎల్‌, ఎన్పీడీసీఎల్‌ అందుబాటులోకి తెచ్చిన సీజీఆర్‌ఎఫ్‌ వెబ్‌ పోర్టల్‌, మొబైల్‌ యాప్‌లను ఆయన ఆవిష్కరించారు. కాగా, పెంచిన విద్యుత్తు చార్జీలను ఉపసంహరించాలని కోరుతూ కాంగ్రెస్‌ నేతలు ఈఆర్‌సీ చైర్మన్‌కు వినతిపత్రం సమర్పించారు.

*ఏపీసీఎం జగన్మోహన్‌రెడ్డికి చెందిన సాక్షి టీవీ చానల్‌కు అనుమతులను రద్దు చేసిన మాట నిజమేనని కేంద్ర సమాచార ప్రసార శాఖ వెల్లడించింది. సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద అడిగిన సమాచారానికి ఆ శాఖ అం డర్‌ సెక్రటరీ విజయ్‌ కౌశిక్‌ అధికారికంగా సమాధానం ఇచ్చారు. అనుమతులు రద్దుచేస్తూ తమ శాఖకు చెంది న మరో అండర్‌ సెక్రటరీ సోనియా ఖట్టర్‌ జారీచేసిన ఉత్తర్వు ప్రతిని ఆయన జతపరిచారు. సాక్షి టీవీ పేరిట వార్తలను ప్రసారం చేసేందుకు ఇందిరా టెలివిజన్‌ లిమిటెడ్‌కు అప్‌ లింకింగ్‌, డౌన్‌ లింకింగ్‌ కోసం 2006 జూలై 7న పదేళ్ల వరకు అనుమతి ఇచ్చామని, ఈ అనుమతిని ఆ తర్వాత పొడిగించలేదని సమాచార శాఖ తన ఉత్తర్వులో స్పష్టం చేసింది. ఆ చానల్‌కు భద్రతాపరమైన అనుమతులు మంజూరు చేసేందుకు కేంద్ర హోం శాఖ నిరాకరించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఆ చానల్‌ను ప్రైవేట్‌ శాటిలైట్‌ టీవీ చానళ్ల జాబి తా నుంచి ఎందుకు తొలగించకూడదో చెప్పాల్సిందిగా కోరుతూ 2011 డిసెంబరు 31న షోకాజ్‌ నోటీసు ఇవ్వగా .. ఇందిరా టెలివిజన్‌ 2022 జనవరి 13న సమాధానమిచ్చినట్లు పేర్కొంది. తమపై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని కోరిందని.. జవాబును క్షుణ్ణంగా పరిశీలించాక.. ఇందిరా టెలివిజన్‌ లిమిటెడ్‌కు సాక్షి టీవీ పేరుతో న్యూస్‌, కరెంట్‌ అఫైర్స్‌ చానల్‌ నడిపేందుకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని నిర్ణయించినట్లు సోనియా ఖట్టర్‌ వెల్లడించారు.