Devotional

వివాహంలో ‘గరికె ముంత’ ప్రాధాన్యత ఏమిటో తెలుసా? – TNI ఆధ్యాత్మికం

వివాహంలో ‘గరికె ముంత’ ప్రాధాన్యత ఏమిటో తెలుసా? – TNI ఆధ్యాత్మికం

1. వివాహంలో గరికె ముంత కు చాలా ప్రాధాన్యం ఉంటుంది. అయితే ప్రాంతాన్న బట్టి పిలిచే పేరులో మార్పు ఉంటుంది. కానీ ప్రతి ప్రాంతంలోనూ వివాహ సమయంలో ఈ ఆచారం ఉంది.ఆంధ్ర దేశంలోనూ, రాయలసీమ లోనూ, తెలంగాణాలోనూ, కర్నాటక లోనూ కరగ అనే పేరుతోనూ. తమిళంలో కరగం అనే పేరు తోనూ.ఇతర ఆంధ్ర ప్రాంతాలలో గరికె, గరిక, గరిగ, గరిగె అనే పేర్లతోనూ పిలుస్తారు. ఏ పేరుతొ పిలిచినా ఆచారం మాత్రం ఒకటే.గరికెలను పూజిస్తే అమ్మవారిని పూజించినట్టే అని భావిస్తారు.గరికె అంటే కుండ అని అర్ధం.అసలు ఈ ఆచారం ఎలా వచ్చిందంటే . ద్రౌపది తన వివాహ సమయంలో ఆనందంతో ప్రక్క నున్న కలశాన్ని నెత్తిన పెట్టుకుని చిందులు వేసిందనీ, ఆ విధంగా అది పవిత్రం పొందిందనీ అంటారు.అప్పటి నుంచి వివాహం సమయంలో అన్ని ప్రాంతాలలోను ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు.ఈ గరికె ముంతను పెళ్ళికి ముందు రోజు కుమ్మరి ఇంటికి వెళ్లి కానుకలు చెల్లించి ఇంటికి తీసుకువచ్చి ఒక గదిలో ఉంచి దీపారాధన చేసి పూజలు చేస్తారు.ముందుగా ఈ గరిగెను పూజించటాన్ని గౌరి పూజగా భావిస్తారు.వివాహ సమయంలో గరిగెను దంపతుల ముందుంచి మరల పూజ చేసి, వివాహాన్ని పూర్తి చేస్తారు.వివాహం జరిగినంత సేపూ గరిగె ముంత ఎంతో ప్రాముఖ్యం వహిస్తుంది.వధువు అత్తగారింటికి వెళ్ళే ముందు ఈ గరిగను వధువుతో పంపించి పెండ్లి తరువాత కూడ దానిని పవిత్రంగా చూస్తారు.

2. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమలలో భక్తుల రద్దీ సాధరణంగా ఉంది. కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుండటంతో భక్తులు ఇప్పుడిప్పుడే స్వామివారి దర్శనానికి తరలివస్తున్నారు. సోమవారం శ్రీవారిని 62,956 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.13 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. 32,837 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులను చెల్లించుకున్నారు.

3. వేములవాడ రాజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ
దక్షిణ కాశీ వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం సోమవారం భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు రాజరాజేశ్వరస్వామిని దర్శించుకొని తరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. స్వామివారి కల్యాణం, సత్యనారాయణ వ్రతం వంటి అర్జిత సేవల్లో పాల్గొన్నారు. సోమవారం సందర్భంగా శీఘ్ర దర్శనం అమలు చేశారు. ఆలయ కల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. సోమవారం సుమారు 25 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు.

4. నేటి నుంచి 1 వరకు ‘సమతామూర్తి’ సందర్శన నిలిపివేత
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో భక్తుల సందర్శన ఈనెల 29 నుంచి ఏప్రిల్‌ 1 వరకు నిలిపివేస్తున్నట్లు త్రిదండి చినజీయర్‌స్వామి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నాలుగు రోజులూ మండల అభిషేకాలు, ఆరాధన కార్యక్రమాలను రుత్వికులు నిర్వహిస్తారని, వారికి మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. ఏప్రిల్‌2 (ఉగాది) నుంచి తిరిగి భక్తులకు సందర్శన ఉంటుందని, ఉదయం 11 నుంచి రాత్రి 8గంటల దర్శించుకోవచ్చని పేర్కొన్నారు. ప్రతి బుధవారం సెలవు ఉంటుందని, గతంలో నిర్ణయించిన ప్రవేశ రుసుం మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని, బయట నుంచి తీసుకొచ్చే ఆహారం, పానీయాలకు అనుమతిలేదని ఆయన పేర్కొన్నారు

5. లేపాక్షి ఆలయానికి అరుదైన గుర్తింపు
అనంతపురం జిల్లా లేపాక్షి ఆలయానికి అరుదైన గుర్తింపు లభించింది. యునెస్కో వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో లేపాక్షికి చోటు దక్కింది. భారతదేశం నుంచి మూడు ప్రాంతాలకు తాత్కాలిక జాబితాలో చోటు దక్కగా అందులో లేపాక్షి ఆలయం ఉండటం గమనార్హం. దీంతో ఏపీ నుంచి తాత్కాలిక జాబితాలో మొదటిసారి స్థానం దక్కినట్లైంది. మరో ఆరు నెలల్లో యునెస్కో తుది జాబితా విడుదల చేయనుంది.

6. శ్రీవారి ఆలయంలో ఈరోజు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజన0
తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్‌2వ తేదీన శుభకృత్‌ నామ సంవత్సర ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేస్తారు. ఈ సమయంలో శ్రీవారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పివేస్తారు. శుద్ధి పూర్తయిన తర్వాత నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధంపొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతా ప్రోక్షణం చేస్తారు. తర్వాత స్వామి మూలవిరాట్టుకు కప్పిన వస్ర్తాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్య కార్యక్రమాలను శాస్ర్తోక్తంగా నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.

7. దుర్గగుడిలో మరో వివాదాస్పద ఘటన
ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ సన్నిధిలో మరో వివాదాస్పద ఘటన చోటు చేసుకుంది. ఆలయ ప్రధాన అర్చకులు వారం రోజుల పాటు సెలవు పెట్టగా విధులకు హాజరైనట్లు అటెండెన్స్‌లో రిజిస్టర్ అయి ఉంది. రిజిస్టర్లో ఎవరో సంతకాలు చేసినట్లు ఆలయ ఈవో భ్రమరాంబ గుర్తించారు. ఆలయ ప్రధాన అర్చకుడిగా ఎల్ డి ప్రసాద్ సేవలందిస్తున్నారు. ఆయన ఈనెల 18 నుంచి 23 వరకు సెలవు చీటీని ఈవోకు అందజేశారు. కానీ అవే తేదీల్లో విధులకు హాజరైనట్లు ఎవరో సంతకాలు చేసినట్లు ఈవో గుర్తించారు. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న ఈవో భ్రమరాంబ విచారణ చేపట్టారు.