DailyDose

ఈ రాక్షస చేప నోట్లో వందల పళ్లు

ఈ రాక్షస చేప నోట్లో వందల పళ్లు

అనగనగా ఒక భారీ చేప. దాని నోటిలో వందల సంఖ్యలో రంపపు దంతాలు. అంతేకాదు ఆ పళ్లు వేగంగా పెరుగుతాయి. అంతేవేగంగా ఉడిపోతాయి. ఎందుకు? ఇదేదో జానపద పొడుపు కథలా ఉందే!! అని అనుకుంటున్నారా..? కథ కాదు ఇలలోనే…! ఈ రాక్షస చేప విశేషాలు మీకోసం..

ఆ చేప పేరు పసిఫిక్‌ లింగ్‌కాడ్‌. దాని నోటిలో 555 పదునైన దంతాలు ఉంటాయి. రోజుకు 20 పళ్లు చొప్పున ఊడిపోతాయి. మళ్లీ కొత్తవి పెరుగుతూ ఉంటాయి. ఐతే ఈ చేప దంతాలు మనుషుల దంతాలంత సైజులో కాకుండా చాలా చిన్నగా, పదునుగా ఉంటాయి. ఇలాంటి చేపలు సాధారణంగా నార్త్‌ పసిఫిక్‌ సముద్రంలో కనిపిస్తాయి. పసిఫిక్‌ లింగ్‌కాడ్‌ చేప యుక్తవయస్సులో 50 సెంటీమీటర్లు పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో 1.5 మీటర్ల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు అధ్యయనాలు వెల్లడించాయి. అంతేకాకుండా ఈ రకమైన చేపలకు పైన, కింద రెండు దవడలు ఉంటాయి. వీటిని ఫారింజియల్ దవడలు అంటారు. మనుషులు దవడపళ్లతో నమిలినట్లే చేపలు కూడా ఆహారాన్ని నమలడానికి ఉపయోగిస్తాయని లైవ్‌సైన్స్ నివేదిక తెల్పింది.

యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్‌లో జీవశాస్త్రంలో పీహెచ్‌డీ చేస్తున్న కార్లీ కోహెన్, ఈ నివేదిక ప్రధాన రచయిత ఎమిలీ కార్ ఈ చేపల దంతాలపై అధ్యయనం చేశారు. పసిఫిక్ లింగ్‌కోడ్ చేపల దంతాలు మైక్రోస్కోపిక్ పరిమాణంలో ఉన్నందువల్ల వీటిని మామూలు పద్ధతుల్లో లెక్కించడం కుదరదు. అందువల్ల ప్రయోగశాలలో 20 పసిఫిక్ లింగ్‌కోడ్ చేపలను ఒక ట్యాంక్‌లో ఉంచి, నీళ్లలో ఎరుపు రంగును కలిపారు. ఫలితంగా చేపల దంతాలు కూడా ఎరుపు రంగులోకి మారాయి. ఆ తర్వాత ఈ చేపల పళ్లపై మరకలు పడేలా పచ్చ రంగుకలిపిన మరో ట్యాంక్‌లోకి తరలించారు.

ఎమిలీ కార్ లైవ్ సైన్స్‌తో మాట్లాడుతూ.. ‘ఈ చేపల పళ్లను లెక్కించడానికి ఒక చీకటి గదిలో పని చేయాల్సి వచ్చింది. మైక్రోస్కోప్‌లో పళ్లను లెక్కించాను. ఒక్కోచేపకు దాదాపుగా వెయ్యికి పైగా పళ్లున్నాయ’ని వెల్లడించారు. చేపలకు ఎక్కువ ఆహారం ఇవ్వడం వల్ల వాటి దంతాల రిప్లేస్‌మెంట్‌ సైకిల్‌లో ఏవైనా మార్పులు వస్తాయేమోననే కోణంలో కూడా పరిశోధకులు ప్రయత్నించారు. ఐతే ఎటువంటి మార్పులు సంభవించలేదు. అందువల్ల పసిఫిక్‌ లింగ్‌కాడ్‌ చేప పళ్లకు సంబంధించిన వింత ఇప్పటికీ రహస్యంగానే ఉండిపోయింది.