NRI-NRT

అమెరికాలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌.. ఏడుగురు భారతీయులపై అభియోగాలు

అమెరికాలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌.. ఏడుగురు భారతీయులపై అభియోగాలు

అగ్రరాజ్యం అమెరికాలో ఏడుగురు భారతీయులు ‘ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌’కు పాల్పడ్డారు. ఇందులో ఆరుగురు తెలుగు వారే కావడం గమనార్హం. అక్రమ పద్ధతుల్లో రూ.7.5 కోట్లకు పైగా లబ్ధి పొందారంటూ వీరందరిపై ఫెడరల్‌ అథారిటీ అభియోగాలు నమోదు చేసింది. రెండేళ్ల కిందట జరిగిన ఈ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. అమెరికా సెక్యూరిటీ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ (ఎస్‌ఈసీ) సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. స్నేహితులైన హరిప్రసాద్‌ సూరె (34), లోకేశ్‌ లగుడు (31), చోటు ప్రభుతేజ్‌ పులగం(29) శాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా కార్యకలాపాలు సాగించే క్లౌడ్‌ కంప్యూటింగ్‌ కమ్యూనికేషన్స్‌ సంస్థ ట్విలియోలో ఉద్యోగులు. 2020లో కొవిడ్‌ వ్యాప్తికి ముందు హరిప్రసాద్‌ మిత్రుడైన దిలీ్‌పకుమార్‌రెడ్డి కముజుల(35)కు, లోకేశ్‌ తన స్నేహితులె సాయి నెక్కలపూడి(30), అభిషేక్‌ ధర్మపురికర్‌ (33)కు ట్విలియోకు సంబంధించిన కార్యకలాపాల సమాచారాన్ని చేరవేశారు. చోటు తన తమ్ముడు చేతన్‌(31)కు ఇదే సమాచారాన్ని తెలిపాడు.

దీనిప్రకారం ట్విలియో ఆప్షన్స్‌ (నిర్ణీత కాలావధి ఉండే సబ్‌ స్టాక్స్‌)ను వీరు ట్రేడింగ్‌ చేశారు. హరిప్రసాద్‌, లోకేశ్‌, ప్రభుతేజ్‌ 2020 మార్చిలో ట్విలియో రెవెన్యూకు సంబంధించిన డేటా బేస్‌ను యాక్సెస్‌ చేసి.. వినియోగదారుల వివరాలను పొందారు. కొవిడ్‌ వచ్చిన అనంతరం ట్విలి యో స్టాక్‌ ధర పెరుగుతుందని అంచనా వేశా రు. ట్విలియో త్రైమాసిక ఫలితాలు ప్రకటించే నాటికి ముందే ఆప్షన్లలో పెట్టుబడులు పెట్టారు.

తెలుగులో చాట్‌ చానల్‌ ఏర్పాటుతో..ట్విలియో ఆప్షన్స్‌కు సంబంధించి తమ మధ్య సంభాషణలకు ఈ ఏడుగురూ తెలుగులో చాట్‌ చానల్‌ను రూపొందించుకున్నారు. 2020 మార్చి తొలి రోజుల నుంచి మే నెల తొలినాళ్ల వరకు వీరి మధ్య చాటింగ్‌ సాగింది. ట్విలియో ఆప్షన్ల వ్యవహారంపై అనుమానం వచ్చిన అమెరికా ఎస్‌ఈసీ విచారణ జరిపింది. సంస్థ రహస్య సమాచారంతో హరిప్రసాద్‌ బృందం ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడినట్లు గుర్తించింది. దీనికి సంబంధించి.. ఎస్‌ఈసీ ఫిర్యాదుతో ఏడుగురు భారతీయులపై ఫెడరల్‌ అధికారులు అభియోగాలు మోపారు. సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజీ యాక్ట్‌ కింద నార్తర్న్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కాలిఫోర్నియా లో ఒక్కొక్కరిపై అభియోగాలు నమోదయ్యాయి.