NRI-NRT

అమెరికాలో భారతీయ గాయనిపై నోట్ల వర్షం.. నెట్టింట ఫొటోలు వైరల్!

అమెరికాలో భారతీయ గాయనిపై నోట్ల వర్షం.. నెట్టింట ఫొటోలు వైరల్!

రష్యా సైనిక చర్యతో ఉక్రెయిన్‌లో ఎక్కడ చూసినా హృదయవిదారక దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. ఎంతో సుందరంగా ఉండే ఉక్రెయిన్.. ఇప్పుడు రష్యా పోరు కారణంగా పూర్తిగా కళ తప్పింది. కీలక నగరాల్లోని ఎత్తైన సౌధాలన్ని నెలకొరిగాయి. ఇక ఉక్రెయిన్ ప్రజల బాధలు వర్ణనాతీతం. రష్యా యుద్ధం వల్ల ఇలా అన్ని విధాల నష్టాలు చవిచూస్తున్న ఉక్రెయిన్‌కు అనేక దేశాల్లోని ప్రజలు తమవంతు సాయం చేసేందుకు ముందుకువస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికాలో ఉండే ఎన్నారైలు సైతం తమకు తోచిన విధంగా ఆ దేశానికి సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా నిధుల సేకరణ కోసం గుజరాతీ ప్రవాస భారతీయులు ఆదివారం జార్జియా, అట్లాంటాలో లైవ్‌ షోలు నిర్వహించడం జరిగింది.
1b
ప్రముఖ గుజరాతీ జానపద గాయని గీతాబెన్‌ రాబరి.. ‘లోక్‌ దేరో’ పేరుతో రెండు చోట్ల సంగీత కచేరీ నిర్వహించారు. ఈ షోలకు ఎన్నారైలతో పాటు అక్కడి స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ రెండు సంగీత ప్రదర్శనలకు ఎన్నారైలు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గాయనిపై నోట్ల వర్షం కురిపించారు. దీంతో స్టేజీ మొత్తం డాలర్లతో నిండిపోయింది. ఈ షోలకు సంబంధించిన ఫొటోలను గాయని గీతాబెన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. దాంతో ఈ ఫొటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి.
1a
ఇక ఈ రెండు ప్రదర్శనల ద్వారా భారీ మొత్తంలో నిధులు సమకూరినట్లు వీటిని నిర్వహించిన సూరత్ ల్యూవా పటేల్ సమాజ్ (ఎస్ఎల్‌పీఎస్) తెలిపింది. సుమారుగా 3లక్షల డాలర్లు (రూ. 2.25 కోట్లు) వచ్చినట్లు పేర్కొంది. ఈ మొత్తాన్ని ఉక్రెయిన్‌కు అందిస్తామని ఎస్ఎల్‌పీఎస్ వెల్లడించింది. ఇదిలాఉంటే.. యువ గాయని గీతాబెన్‌ రాబరి(26) భారత్‌తోపాటు విదేశాల్లోనూ ఇప్పటివరకు అనేక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఆమెకు విశేష జనాదరణ ఉంది. ఆమె ఎక్కడ కచేరీలు నిర్వహించిన అభిమానులు భారీగా హజరవుతుంటారు. ఇక 2020 ఫిబ్రవరిలో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో కూడా గీతాబెన్ రాబరి ప్రధాని మోదీతోపాటు అప్పటి యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎదుట గాన కచేరీ నిర్వహించిన విషయం తెలిసిందే.