DailyDose

అక్కడ మట్టిని కూరల్లో మసాలాగా వాడతారు!

అక్కడ మట్టిని కూరల్లో మసాలాగా వాడతారు!

పర్యాటకులకు ప్రపంచవ్యాప్తంగా అహ్లాదాన్ని అందించే ఐలాండ్స్‌ చాలానే ఉన్నాయి. కానీ తినగలిగే ఐలాండ్‌ గురించి మీకు తెలుసా? అవును అక్కడ మట్టిని బ్రెడ్‌లో సాస్‌లా, కూరల్లో మసాలాగా వాడతారు. ఆశ్చర్యంగా ఉంది కదూ..? ఇరాన్‌ తీరానికి 8 కి.మీ. దూరంలో, పర్షియన్‌ గల్ఫ్‌ సముద్రానికి మధ్యలో కన్నీటి చుక్క ఆకారంలో ఉంటుందది.పేరు హోర్ముజ్‌ ద్వీపం. అగ్నిపర్వత శిలలతో, మట్టి, ఇనుముతో నిండిన ఈ ఐలాండ్‌ చూడటానికి.. పసుపు, ఎరుపు, నీలం వంటి పలు రంగుల్లో ఇంద్రధనస్సులా మెరుస్తుంది. అందుకే దీన్ని రెయిన్‌బో ఐలాండ్‌గా పిలుస్తారు స్థానికులు.

*మొత్తం 42 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ద్వీపంపై 70కి పైగా ఖనిజాలను గుర్తించారు పరిశోధకులు. హోర్ముజ్‌ ఐలాండ్‌.. ఎన్నో కోట్ల సంవత్సరాల కిందట పర్షియన్‌ గల్ఫ్‌ తీరంలో ఉప్పు గుట్టల్లా పేరుకుపోయి.. అగ్నిపర్వత అవక్షేపాలతో కలసి రంగు రంగుల దిబ్బలుగా మారిందని వారి పరిశోధనల సారాంశం. ఈ రంగురంగుల గుట్టలు, ఎర్రటి బీచులు, అందమైన ఉప్పు గుహలకు అక్కడి భౌగోళిక పరిస్థితులే కారణమని తేల్చారు వాళ్లు. కాలక్రమేణా భూమిలోకి కిలోమీటర్ల మేర పాతుకుపోయిన ఈ గుట్టల్లోంచి తేలికైన ఉప్పు పొరలు పెల్లుబకడంతో గోపురాల్లా కనిపిస్తూ పర్యాటకుల్ని మరింతగా ఆకర్షిస్తున్నాయట.ఇక్కడ లభించే ‘గెలాక్‌’ అనే ఎర్రటి మట్టిని.. స్థానిక వంటకాల్లో వాడుతుంటారు. అగ్నిపర్వత శిలల నుంచి పుట్టుకొచ్చిన.. హేమటైట్‌ అనే ఐరన్‌ ఆక్సైడ్‌ వల్ల ఇది ఏర్పడిందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ మట్టి నుంచే ‘సూరఖ్‌’ అనే సాస్‌ని కూడా తయారు చేస్తున్నారు. అది బ్రెడ్‌తో కలిపి తింటే భలే రుచిగా ఉంటుందట. అయితే ఈ మట్టిని వంటకాల్లోనే కాదు.. కాస్మెటిక్స్, డిజైనింగ్స్‌లో కూడా వాడుతున్నారు.

*ఒక్కోవైపు ఒక్కో అందం
ఈ ఐలాండ్‌కు నైరుతిలో బహుళవర్ణాలతో మెరిసే లోయ ఉంటుంది. దాన్నే రెయిన్‌బో వ్యాలీ అంటారు. మొత్తం ఐలాండ్‌ అంతా రంగురంగుల్లో మెరుస్తున్నప్పటికీ ఈ లోయ మరింత ప్రత్యేకం. సూర్య కిరణాల వెలుగుల్లోనే ఈ అందాలను చూడాలనేది పర్యాటకుల మాట. ఆ లోయ పక్కనే మరో లోయ.. శిల్పులు చెక్కిన శిల్పాల్లా ఎన్నో వింత ఆకారాలు దర్శనమిస్తాయి. అయితే వాటిని మనుషులు చెక్కలేదంటే నమ్మబుద్ధి కాదట. వ్యాలీ ఆఫ్‌ స్టాచ్యూస్‌ (విగ్రహాల లోయ)గా పేరున్న ఈ లోయలో.. బర్డ్స్‌లా, డ్రాగన్స్‌లా వింతవింత రూపాలు మనల్ని మైమరిపిస్తాయట. అవన్నీ వేలాది సంవత్సరాలుగా ప్రకృతి కోతతో ఏర్పడిన అద్భుతాలే. ఇక ఐలాండ్‌కి పశ్చిమ దిక్కున కిలోమీటర్‌ మేర విస్తరించిన ఈ లోయలోని ఉప్పు స్ఫటికాలకు వైద్య గుణాలున్నాయని, నెగెటివ్‌ ఎనర్జీని పారదోలే ఉప్పుదేవతని స్థానికులు విశ్వసిస్తారు.