Politics

చంద్రబాబును సీఎం చేస్తాం – TNI రాజకీయ వార్తలు

చంద్రబాబును సీఎం చేస్తాం – TNI రాజకీయ వార్తలు

* టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రముఖ సినీ దర్శకుడు రాఘవేంద్రరావు పేర్కొన్నారు. టీడీపీ నాయకుడు కంభంపాటి రామ్మోహన్ నాయుడు రచించిన ‘నేను తెలుగుదేశం’ పుస్తకాన్ని చంద్రబాబునాయుడు ఆవిష్కరించిన కార్యక్రమంలో రాఘవేంద్రరావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా తన మనసులో మాటను బయటపెట్టారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. ‘ నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఎన్టీఆర్ గారు. అయోధ్య రాముడిని రామ చంద్రుడు అని కూడా అంటారు. రాముడు తర్వాత ఈ చంద్రుడు టీడీపీని తన విజన్‌తో ముందుకు నడిపిస్తూ వస్తున్నారు. మీ విజన్‌లో భాగంగా టీడీపీ హయాంలో ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్, ఎస్వీబీసీ చైర్మన్‌గా సేవలందించే భాగ్యం నాకు లభించింది. మీ రుణం ఎప్పటికైనా తీర్చుకుంటా. మీ కోసం ఏం చేయడానికైనా మేం సిద్ధం..

*రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసిన బెంగాల్‌ సీఎం లేఖ
ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికి అధికార బీజేపీ కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందంటూ పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత బెనర్జీ విమర్శించారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న విపక్ష పార్టీల నేతలకు, బీజేపీయేతర సీఎంలకు మంగళవారం మమత లేఖ రాశారు. ఈ లేఖలో విపక్ష పార్టీలన్నీ కలిసొచ్చి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. ప్రజాస్వామ్యంపై బీజేపీ ప్రత్యక్ష దాడులు చేస్తోందని మమత ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ముందుకు వెళ్లే మార్గం గురించి చర్చించడానికి కలిసొచ్చేవారంతా సమావేశమవ్వాలని మమత పిలుపునిచ్చారు. బీజేపీ అణచివేత పాలనపై ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

*సీఎం జగన్ రుణదాహం ఎప్పటికి తీరుతుందో?: రఘురామ
అప్పుల కోసమే ఢిల్లీలో ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తిష్టవేశారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రుణదాహం ఎప్పటికి తీరుతుందోనని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్‌ కోతలు మొదలయ్యాయని, ఏపీ ప్రభుత్వానికి ముందు చూపు కన్నా మందు చూపే ఎక్కువైందని ఎద్దేవా చేశారు. కృష్ణపట్నంలో లోకల్ కోల్‌ను వాడుకోవచ్చు కదా అని సూచించారు. ప్రభుత్వానికి అప్పులపైనే ఆలోచన తప్ప.. ఒక విజన్‌ అంటూ ఏమీ లేదని రఘురామ కృష్ణంరాజు విమర్శించారు.

*ఎన్టీఆర్‌కి భారతరత్న ఇవ్వాలి: ఎంపీ జయదేవ్‌
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌కి భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ గల్లా జయదేవ్‌ డిమాండ్ చేశారు. లోక్‌సభలో ఎంపీ గల్లా మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం జరిగి 40 ఏళ్లు అవుతుందన్నారు. భారత రత్నకి ఎన్టీఆర్‌ అన్ని విధాలా అర్హులన్నారు. గుంటూరుకు చెందిన పవులూరి మంగమ్మకు స్వాతంత్ర్య సమరయోధుల పెన్షన్‌లో ఉన్న అడ్డంకుల తొలగించాలని ఆయన కోరారు. వెంటనే ఆమెకు పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

*అప్పటి టీడీపీ వేరు… ఇప్పుడు టీడీపీ వేరు: సజ్జల
ప్రజాభిమానంతో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎన్టీఆర్ ఉన్న టీడీపీ వేరు.. ఇప్పుడున్న టీడీపీ వేరన్నారు. టీడీపీ 40 ఏళ్లతో అంతిమ దశకు చేరుకుందని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు. అసెంబ్లీ జరగకుండా అడ్డుకోవడానికి టీడీపీ ప్రయత్నించిందన్నారు. ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేస్తున్నది వైసీపీ ప్రభుత్వమేనన్నారు.

*తెలుగు ప్రజలు ఉన్నంతకాలం టీడీపీ సజీవంగా ఉంటుంది: దేవినేని
తెలుగు ప్రజలు ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ సజీవంగా ఉంటుందని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. గొల్లపూడిలో టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో దేవినేని పాల్గొని ప్రసంగించారు. 40 సంవత్సరాల మహాప్రస్థానంలో కార్యకర్తలు, నాయకుల త్యాగాలు మరువలేనివన్నారు. త్వరలో నియోజకవర్గం మొత్తం పాదయాత్ర చేసి ప్రతి తలుపు తట్టి ప్రజలను చైతన్యవంతులను చేస్తానని తెలిపారు. ఎందరో అభాగ్యుల కన్నీళ్లు తుడిచిన మహనీయుడు ఎన్టీఆర్ అని దేవినేని ఉమా కొనియాడారు.

*ఎన్టీఆర్ అనేది ఓ వైబ్రేషన్: Ganta srinivas
టీడీపీ 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మాజీ మంత్రి గంటా, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, గండి బాబ్జి, కార్యకర్తలు బీచ్ రోడ్‌లోని స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ… 1982 తెలుగు వారికి మరుపురాని సంవత్సరం అని.. ఆనాడు ఇదే రోజున ఎన్టీఆర్ పార్టీని స్థాపించి తెలుగు వారి సత్తాను ప్రపంచ వ్యాప్తంగా చాటారని అన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతంతో పార్టీ ముందుకు తీసుకొని వెళ్లారని తెలిపారు. ఎన్టీఆర్ అనేది ఓ వైబ్రేషన్ అని.. ఆయన చనిపోయినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్న వ్యక్తి అని అన్నారు. రాజకీయ పార్టీలకు ఆయన ఓ రోల్ మోడల్… ఎన్నో సేవ కార్యక్రమాలు చేసిన ఘనత ఎన్టీయార్ దే అని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.

*‘బ్యాక్‌లాగ్‌’లను మార్చడమేంటి?: పీతల సుజాత
రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు దక్కాల్సిన బ్యాక్‌లాగ్‌ పోస్టులను ఓపెన్‌ కేటగిరిలోకి మార్చడమేంటని మాజీ మంత్రి పీతల సుజాత ప్రశ్నించారు. ‘‘నిబంధనల ప్రకారం ఎస్సీలకు చెందిన పోస్టుల్లో వారినే నియమించాలి. ఆయా పోస్టులకు అన్ని అర్హతలు ఆ వర్గాల్లో లేకపోతే, మూడేళ్లపాటు వేచిచూడాలి. తర్వాత బీసీలకు ప్రాధాన్యమివ్వాలి. వారిలోనూ అర్హులు లేకపోతేనే ఓపెన్‌ కేటగిరిలోకి మార్చాలి’’ అన్నారు.

*దళిత కార్పొరేషన్లకు పైసా ఇవ్వలేదు: జవహర్‌
దళితుల కోసం మాదిగ, మాల, రెల్లి కార్పొరేషన్లు పెట్టడం తప్ప వాటికి జగన్‌ ప్రభుత్వం పైసా కూడా నిధులు ఇవ్వలేదని మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ ధ్వజమెత్తారు. దళితులకు ఇంత వంచన మరే ప్రభుత్వంలో లేదని అన్నారు. కాగా.. రైతుభరోసా కేంద్రాలతో రైతాంగాన్ని ఉద్ధరిస్తున్నామంటున్న జగన్‌రెడ్డి వ్యాఖ్యలపై తాము బహిరంగ చర్చకు సిద్ధమని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి సవాల్‌ చేశారు.

*కాంగ్రెస్‌ బలపడాలి: గడ్కరీ
‘‘కాంగ్రెస్‌ బలపడాలని నిజాయతీగా కోరుకుంటున్నా. ప్రజాస్వామ్యానికి అది అవసరం కూడా. కాంగ్రెస్‌ బలహీనమైతే ప్రాంతీయ పార్టీలు ప్రతిపక్షాలవుతాయి. ఇది మం చి పరిణామం కాదు’’ అని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. ‘కాంగ్రెస్‌ నేతలూ ఓటములతో ధైర్యం కోల్పోవద్దు. పార్టీని వీడొద్దు. నిరాశలోనూ పార్టీ సిద్ధాంతాలను వీడొద్దు’’ అని కూడా పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలను మహారాష్ట్ర పీసీసీ ప్రధాన కార్యదర్శి సచిన్‌ సావంత్‌ స్వాగతించారు. అయితే, బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి ప్రభుత్వాలను దెబ్బతీసేందుకు ఏం చేశారో ప్రధాని మోదీని అడగాలని ఎద్దేశా చేశారు. కాగా.. నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారులపై భద్రతా ప్రమాణాలు పాటించాలని అధికారులను గడ్కరీ ఆదేశించారు