NRI-NRT

నేలకు దిగొస్తున్న విమాన చార్జీలు.. ప్రవాసులు చాలా చీప్‌గా స్వదేశానికి రావొచ్చు..!

నేలకు దిగొస్తున్న విమాన చార్జీలు.. ప్రవాసులు చాలా చీప్‌గా స్వదేశానికి రావొచ్చు..!

దాదాపు రెండేళ్ల తర్వాత భారత్ ఈ నెల 27 నుంచి విదేశాలకు తిరిగి విమాన సర్వీసులను ప్రారంభించింది. కరోనా కారణంగా ఇన్నాళ్లు పరిమిత సంఖ్యలో విమాన సర్వీసులు నడవడంతో భారతీయ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్వదేశంలో చిక్కుకున్నవారు యూఏఈ వెళ్లలేక, అక్కడ ఉన్నవారు స్వదేశానికి రాలేక నానా కష్టాలు పడ్డారు. ఎట్టకేలకు తిరిగి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కావడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక భారత్-యూఏఈ మధ్య ఏప్రిల్ ప్రారంభం నుంచి పూర్తి స్థాయిలో విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయని ట్రావెల్ ఏజెన్సీలు తెలిపాయి. దీనిలో భాగంగా వచ్చే నెల నుంచి వీక్లీ 170 సర్వీసులు నడపనున్నట్లు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ వెల్లడించింది. భారత్‌లోని తొమ్మిది నగరాలకు విమానాలు నడపనున్నట్లు పేర్కొంది.

అలాగే యూఏఈకి చెందిన మరికొన్ని విమాన సంస్థలు కూడా త్వరలోనే పూర్తి షెడ్యూల్‌, సామర్థ్యంతో విమాన సర్వీసులు నడిపించేందుకు సిద్ధంగా ఉన్నాయట. ఇలా పూర్తిస్థాయిలో విమాన సర్వీసులు అందుబాటులోకి రావడంతో ఒక్కసారిగా విమాన చార్జీలు నేలకు దిగొస్తున్నాయని ట్రావెల్ ఏజెన్సీలు పేర్కొంటున్నాయి. రంజాన్ పండుగ కోసం స్వదేశానికి వెళ్లాలనుకునే భారతీయులు చాలా తక్కువ చార్జీలతో వెళ్లొచ్చని ఏజెన్సీలు చెబుతున్నాయి. మార్చి 27 నుంచి భారత్-యూఏఈ మధ్య విమాన సర్వీసులు భారీగా పెరగడంతో విమాన టికెట్ల ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయని దుబాయ్‌ లింక్‌కు చెందిన సీనియర్ హాలిడే కన్సల్టెంట్ మహమ్మద్ కమర్ తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో న్యూఢిల్లీ-దుబాయ్ మధ్య వన్‌వే టికెట్ ధర 1000-1500 దిర్హమ్స్‌గా(రూ.20వేల నుంచి రూ.30వేల వరకు) ఉంటే.. ఇప్పుడు 700-800 దిర్హమ్స్‌కు(రూ.14వేల నుంచి రూ.16వేల వరకు) దిగొచ్చింది. ఇక ముంబై నుంచి ప్రారంభ ధర కేవలం రూ. 12వేలు మాత్రమే. అటు కొచ్చికి మాత్రం వెయ్యి దిర్హమ్స్‌గా(రూ.20వేలు) వరకు ఉంది.