Business

భారత్‌లోకి జీప్‌ మెరీడియన్‌ – TNI వాణిజ్య వార్తలు

భారత్‌లోకి జీప్‌ మెరీడియన్‌  – TNI వాణిజ్య వార్తలు

* ఆటోమోటివ్‌ గ్రూప్‌ స్టెలాంటిస్‌కు చెందిన జీప్‌ ఇండియా సరికొత్త ఎస్‌యూవీ మెరీడియన్‌ను ఆవిష్కరించింది. జూన్‌ నుంచి డెలివరీలు ఉంటాయని కంపెనీ మంగళవారం ప్రకటించింది. మూడు వరుసల సీట్లతో కంపెనీ నుంచి తొలి ఎస్‌యూవీ ఇదే. భారత మార్కెట్‌ కోసం దీనిని రూపొందించారు. 2.0 లీటర్‌ టర్బో డీజిల్‌ ఇంజన్, 9 స్పీడ్‌ ఆటోమేటిక్, 6 స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్స్‌తో లభిస్తుంది. దేశీయ మార్కెట్‌ కోసం రాంగ్లర్, కాంపాస్‌తోసహా అయిదు మోడళ్ల అభివృద్ధికై రూ.1,900 కోట్లు ఖర్చు చేశామని స్టెలాంటిస్‌ ఇండియా సీఈవో, ఎండీ రోలాండ్‌ బుషే తెలిపారు.
*ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ)లో 1.5ు వరకు వాటాను కేంద్రం విక్రయించనుంది. ఈనెల 30, 31 తేదీల్లో ఓఎఫ్‌ఎస్‌ పద్ధతిన జరగనున్న ఈ వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.3,000 కోట్ల వరకు సమకూరే అవకాశం ఉంది. ఒక్కో షేరు కనీస ధరను రూ.159గా నిర్ణయించారు. మంగళవారం బీఎస్‌ఈలో షేరు ముగింపు ధర రూ.171.05తో పోలిస్తే 7ు డిస్కౌంట్‌తో ఆఫర్‌ చేస్తోంది.
* కార్యాలయ స్థలపరంగా హైదరాబాద్‌ నాలుగో అతిపెద్ద మార్కెట్‌. దేశవ్యాప్తంగా ఉన్న గ్రేడ్‌ ఏ కార్యాలయ స్థలంలో 12.7 శాతం వాటా హైదరాబాద్‌లోనే ఉంది. 2019-21 మధ్య కొత్తగా అందుబాటులోకి వచ్చిన గ్రేడ్‌ ఏ కార్యాలయ స్థలంలో 25 శాతం హైదరాబాద్‌లోనే అందుబాటులోకి వచ్చిందని జేఎల్‌ఎల్‌ వెల్లడించింది. ఈ కాలంలో 3.47 కోట్ల చదరపు అడుగుల స్థలం కొత్తగా అభివృద్ధి చేశారు. ఈ విధంగా బెంగుళూరు తర్వాత హైదరాబాద్‌ రెండో స్థానం లో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో గ్రేడ్‌ ఏ ఆఫీస్‌ స్థలం 9.04 కోట్ల చదరపు అడుగులు ఉంది. 2016-2021 మధ్య 81 శాతం పెరిగిందని వెల్లడించింది. అత్యంత వేగంగా వృద్ధి చెందిన మార్కెట్‌గా హైదరాబాద్‌ నిలిచింది. గ్రేడ్‌ ఏ ఆఫీస్‌ కార్యాలయాన్ని అద్దెకు తీసుకోవడంలో కూడా హైదరాబాద్‌ ముందంజలో ఉంది. 2022 చివరి నాటికి హైదరాబాద్‌ గ్రేడ్‌ ఏ ఆఫీస్‌ కార్యాలయ స్థల మార్కెట్‌ 10 కోట్ల చ.అ స్థాయికి చేరగలదని జేఎల్‌ఎల్‌ అంచనా వేస్తోంది.
* అమెరికాకు చెందిన హెల్త్‌కేర్‌, బీమా దిగ్గజం యునైటెడ్‌హెల్త్‌ గ్రూప్‌ భారీ డీల్‌ కుదుర్చుకుంది. ఎల్‌హెచ్‌సీ గ్రూప్‌ను 540 కోట్ల డాలర్ల (సుమారు రూ.41,000 కోట్లు)కు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. పూర్తిగా నగదు రూపంలో జరగనున్న ఈ ఒప్పందంలో భాగంగా ఎల్‌హెచ్‌సీకి చెందిన ఒక్కో షేరుకు 170 డాలర్లు చెల్లించనున్నట్లు తెలిపింది. ఈ లావాదేవీ ఏడాది ద్వితీయార్ధంలో పూర్తికావచ్చని అంచనా. ఎల్‌హెచ్‌సీ గ్రూప్‌ గాయాలు, అనారోగ్యం లేదా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇంట్లోనే వైద్య, సంరక్షణ సేవలందిస్తుంటుంది. మొత్తం 37 రాష్ట్రాలోని 964 ప్రాంతాల్లో తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. యునైటెడ్‌హెల్త్‌ తన ఆప్టమ్‌ హెల్త్‌ బిజినె్‌సకు ఎల్‌హెచ్‌సీ గ్రూప్‌ కార్యకలాపాలను జోడించనుంది. కరోనా సంక్షోభం ప్రారంభమైన తర్వాత ఆరోగ్య బీమా పాలసీదారులు, వయోజనులు ఇంటివద్దే వైద్య సేవలకు అధికంగా మొగ్గుచూపుతున్న నేపథ్యంలో అమెరికాలో హోమ్‌హెల్త్‌ సేవలకు డిమాండ్‌ గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే యునైటెడ్‌హెల్త్‌ ఎల్‌హెచ్‌సీని కొనుగోలు చేసినట్లు తెలిసింది. అమెరికాలో యునైటెడ్‌హెల్త్‌కు ప్రధాన ప్రత్యర్థి సంస్థల్లో ఒకటైన మెడికేర్‌ అడ్వాంటేజ్‌ ప్రొవైడర్‌ హుమానా తన హోమ్‌ హెల్త్‌ సేవలను విస్తరించేందుకు 570 కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టింది. కాగా యునైటెడ్‌హెల్త్‌కేర్‌ గత 22 ఏళ్లుగా భారత్‌లోనూ కార్యకలాపాలు కొనసాగిస్తోంది.
* దేశీయ ప్రామాణిక ఈక్విటీ సూచీలు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. ముడి చమురు సెగలు కాస్త తగ్గుముఖం పట్టడంతో పాటు రష్యా-ఉక్రెయిన్‌ మధ్య ప్రారంభమైన శాంతి చర్చలు అంతర్జాతీయ స్టాక్‌ మార్కెట్లో ట్రేడింగ్‌ సెంటిమెంట్‌ను మెరుగుపర్చాయి. దాంతో దేశీయ ట్రేడర్లూ కొనుగోళ్లు పెంచడంతో మార్కెట్‌ ర్యాలీ కొనసాగింది. మంగళవారం ట్రేడింగ్‌ ముగిసేసరికి బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 350.16 పాయింట్లు పెరిగి 57,943.65 వద్ద ముగిసింది. నిఫ్టీ 103.30 పాయింట్లు బలపడి 17,325.30 వద్ద క్లోజైంది.
*హైదరాబాద్‌కు చెందిన ఆలోర్‌ డెర్మాస్యూటికల్స్‌లో మిగిలిన 40 శాతం వాటా ను అలెంబిక్‌ ఫార్మాస్యూటికల్స్‌ సొంతం చేసుకుంది. దీంతో ఈ కంపెనీ అలెంబిక్‌ ఫార్మాకు నూరు శాతం అనుబంధ కంపెనీగా మారుతుంది. డెర్మటాలజీ విభాగంలో క్రీమ్‌లు, ఆయింట్‌మెంట్‌లు, నానోపర్టిక్యులేట్‌ ఆధారిత ఉత్పత్తులు మొదలైన వాటిని ఆలోర్‌ డెర్మా అందిస్తోంది. ఇప్పటి వరకూ సంయుక్త సంస్థ అయిన ఆలోర్‌లో 60 శాతం వాటా అలెంబిక్‌ వద్ద, 40ు వాటా ఒర్బిక్యులార్‌ ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీస్‌ వద్ద ఉంది. 2016లో ఈ కంపెనీని ఏర్పాటు చేశారు. భాగస్వామి నుంచి 40 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు అలెంబిక్‌ వెల్లడించింది. విలువను బయటకు వెల్లడించలేదు. ఎన్‌సీఎల్‌టీ, ఇతర నియంత్రణ అనుమతుల మేర కు అలెంబిక్‌లో ఆలోర్‌ విలీనం అవుతుంది.
*బీమా కంపెనీలు కరోనా కవచ్‌, కరోనా రక్షక్‌ పాలసీల విక్రయాలను ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు కొనసాగించేందుకు అనుమతిస్తూ భారత బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ) సర్క్యులర్‌ జారీ చేసింది. కొవిడ్‌ చికిత్సకు తక్కువ ప్రీమియంతో బీమా కవరేజీ కల్పించేందుకు ఈ రెండు పాలసీలను అందుబాటులోకి తెచ్చారు. 2020 జూన్‌లో ప్రవేశపెట్టిన ఈ పాలసీల విక్రయానికి ఐఆర్‌డీఏఐ తొలుత 2021 మార్చి 31 వరకు గడువును నిర్దేశించింది. అయితే, వైరస్‌ పలు దశల్లో విజృంభించిన నేపథ్యంలో గడువును పలుమార్లు పొడిగించింది.
*శ్రీనగర్‌-లద్దాక్‌ మధ్య చలికాలంలో కూడా నిరంతరాయంగా వాహన రాకపోకలకు వీలు కల్పించే విధంగా జోజిలా వద్ద పర్వత శ్రేణులను తొలిచి నిర్మిస్తున్న జోజిలా సొరంగం పనులు సగం పూర్తయ్యాయి. స్వల్పకాలంలోనే 7 కిలోమీటర్ల సొరంగాన్ని నిర్మించినట్లు మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (ఎంఈఐఎల్‌) వెల్లడించింది. ఈ టన్నెల్‌ మొత్తం పొడవు 13 కిలోమీటర్లు. బాల్టాల్‌ వద్ద ప్రారంభమై మీనా మార్గ్‌ వద్ద ముగుస్తుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా జోజిలా సొరంగంతో పాటు మరో రెండో చిన్న సొరంగ మార్గాలను, బ్రిడ్జిలను, రోడ్డును ఎంఈఐఎల్‌ నిర్మిస్తోంది.
*కల్యాణ్‌ జువెలర్స్‌ ఇండియా లిమిటెడ్‌.. మాజీ కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) వినోద్‌ రాయ్‌ను చైర్మన్‌, ఇండిపెండెంట్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా నియమించింది. నియంత్రణా సంస్థలు, వాటాదారుల అనుమతికి లోబ డి ఈ నియామకం అమల్లోకి వస్తుందని తెలిపింది. కాగా కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా టీఎస్‌ కల్యాణరామన్‌ కొనసాగుతారని స్పష్టం చేసింది.