Devotional

ధ్వజారోహణంతో కోదండరాముని బ్రహ్మోత్సవాలు ప్రారంభం..- TNI ఆధ్యాత్మికం

ధ్వజారోహణంతో కోదండరాముని బ్రహ్మోత్సవాలు ప్రారంభం..- TNI ఆధ్యాత్మికం

తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కంకణబట్టార్ శ్రీ ఆనందకుమార దీక్షితులు ఆధ్వర్యంలో ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, భక్తుల గోవిందనామస్మరణ, రామనామ జపముల మధ్య ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపైకి అధిష్టింపచేశారు.అంతకుముందు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారిని, ధ్వజపటము, చక్రతాళ్వారులకు తిరువీధి ఉత్సవం నిర్వహించి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంల‌తో అభిషేకం చేశారు. రాత్రి 8 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు పెద్దశేష వాహన సేవ జ‌రుగ‌నుందని అర్చకులు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో పార్వతి, ఆగ‌మ స‌ల‌హాదారు విష్ణుభ‌ట్టచార్యులు, ఏఈవో దుర్గరాజు, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

1. శ్రీశైలంలో వైభవంగా ఉగాది మహోత్సవాలు ప్రారంభం
శ్రీశైలం శ్రీభ్రమరాంబికామల్లికార్జున స్వామి దేవాలయంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగశాల ప్రవేశం చేసి ఉగాధి మహోత్సవాలను ఈఓ లవన్న, చైర్మన్ చక్రపాణి రెడ్డి, అర్చకులు, వేదపండితులు ప్రారంభించారు. సాయంత్రం శ్రీశైలం పురవీధులలో బృంగివాహనంపై భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామివారి గ్రామోత్సవం జరుగనుంది. మహాలక్ష్మీ అలంకారంలో శ్రీశైలం భ్రమరాంబాదేవి అమ్మవారి భక్తులకు దర్శనమిస్తున్నారు. మరోవైపు శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి 8 గంటలు సమయం పడుతోంది.

2. మావుళ్లమ్మ హుండీ ఆదాయం రూ.29.04 లక్షలు
మావుళ్లమ్మ హుండీ ఆదాయం మంగళవారం లెక్కించగా రూ. 29,04,734 ఆదాయంగా వచ్చిందని దేవస్థానం సహాయ కమిషనర్‌ దాసరి శ్రీరామ వర ప్రసాద్‌ తెలిపారు. 36 రోజులకు లెక్కించగా నగదుతో పాటు 56 గ్రాముల బంగారం, 180 గ్రాముల వెండి లభించిందన్నారు. దేవదాయ ధర్మదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌ వి.వెంకటేశ్వరరావు పర్యవేక్షించారని, ఆలయ సిబ్బందితోపాటు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఉద్యోగులు పాల్గొన్నారని తెలిపారు.

3. కొమురవెల్లి మల్లికార్జునస్వామి హుండీ ఆదాయం రూ.1.28 కోట్లు
సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో మంగళవారం హుండీ లెక్కింపు చేపట్టారు. ఈవో బాలాజీశర్మ ఆధ్వర్యంలో ఆలయ ముఖ మండపంలో లెక్కింపులు నిర్వహించగా రూ.1,28,17,745 నగదు, 300 గ్రాముల బంగారం, 16.60 కిలోల వెండి మిశ్రమం, 56 విదేశీ కరెన్సీ నోట్లు, 4.40 క్వింటాళ్ల ఒడిబియ్యం లభ్యమయ్యాయి. ఉదయం ప్రారంభమైన హుండీ లెక్కింపు రాత్రి వరకు కొనసాగింది. డిసెంబరు నెలాఖరులో నిర్వహించిన స్వామివారి కల్యాణంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాల నుంచి భక్తులు భారీగా తరలివస్తూ మొక్కుబడుల రూపంలో పెద్దఎత్తున కానుకలు సమర్పిస్తున్నారు. కాగా ఈ నెల 5 తేదీ నుంచి 28వ తేదీ వరకు కేవలం 24 రోజుల్లోనే రికార్డుస్థాయిలో కోటికి పైనే ఆదాయం సమకూరడం గమనార్హం.

4. యాదాద్రిలో భక్తుల కోలాహలం
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో మంగళవారం భక్తుల కోలాహలం నెలకొంది. ప్రధానాలయ ఉద్ఘాటన సంప్రోక్షణ పూజలు ముగియడంతో ఇష్టదైవాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. భక్తజనుల సంచారంతో ప్రధానాలయం, తిరుమాడ వీధులు, ప్రసాదాల విక్రయశాల, దర్శన క్యూ కాంప్లెక్స్‌లో భక్తుల సందడి నెలకొంది. కొండ కింద గండిచెరువు సమీపంలోని కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి ప్రారంభం కావడంతో… భక్తులు తలనీలాలు సమర్పించుకుని లక్ష్మీపుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం దేవదేవుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కొండపైన ప్రసాదాల విక్రయశాల కౌంటర్లను కూడా సంప్రదాయ పూజల అనంతరం అధికారులు ప్రారంభించారు. క్షేత్ర సందర్శనకు విచ్చేసిన భక్తులు ప్రధానాలయంలో సువర్ణ పుష్పార్చన పూజల్లో కుటుంబసమేతంగా పాల్గొన్నారు. ప్రసాదాల విక్రయం ద్వారా రూ.8.17లక్షలు, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ.69వేలు, నిత్య ఆదాయం రూ.10.52 లక్షలు సమకూరినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. ఆలయ ఉద్ఘాటన పర్వాలు పూర్తిచేసిన అధికారులు భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించడంపై దృష్టిసారించారు. దర్శన క్యూకాంప్లెక్స్‌లో మిగిలిపోయిన పనులు పూర్తిచేస్తున్నారు. సెల్‌ఫోన్లు, లగేజీ భద్రపరచుకునే సౌకర్యం ఏర్పాటుచేశారు. కొండపైన దర్శన క్యూకాంప్లెక్స్‌లో రెండు కౌంటర్లలో భక్తులకు దర్శన టిక్కెట్ల విక్రయం, జియో ట్యాగింగ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే పూర్తిస్థాయిలో ప్రోగ్రామింగ్‌ ప్రక్రియ జరగకపోవడంతో భక్తులకు ఉచిత దర్శన టిక్కెట్లను అందజేస్తున్నారు. యాదాద్రి ప్రధానాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ధర్మహుండీని ఏర్పాటు చేసినట్లు ఈవో గీతారెడ్డి తెలిపారు. ఈ నెల 15 నుంచి 28వ తేదీవరకు భక్తులు సమర్పించిన నగలు, నగదును లెక్కించామని, రూ.49.63లక్షల ఆదాయం సమకూరిందని ఈవో చెప్పారు.

5. శ్రీశైలంలో ఈ రోజు నుంచి ఏప్రియల్ 3వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు. శ్రీశైలంలో ఈరోజు జరగనున్న కార్యక్రమాలు
ఉదయం 9.15 గంటలకు యాగశాల ప్రవేశం, పుణ్యాహవాచనం, చండీశ్వరపూజ, ఉత్సవాలలో భాగంగా రుద్రహోమం, రుద్రపారాయణ, శ్రీ అమ్మవారి ఆలయంలో విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, చండీహోమం, సాయంత్రం 5.30గంటల నుండి అగ్నిప్రతిష్ఠాపన, అంకురార్పణ, రాత్రి 7.00గంటలకు శ్రీస్వామిఅమ్మవార్లకు భృంగివాహనసేవ పూజలుఅమ్మవారికి మహాలక్ష్మి అలంకారం రాత్రి 7.30 గంటల నుండి పురవీధుల్లో గ్రామోత్సవం రాత్రి 8.00గంటలకు శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం అనంతరం ఏకాంతసేవ.

6. యాదాద్రి సమాచారం
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయాన్ని బుధవారం వేకువజామున 3 గంటలకు తెరుస్తారు. విశేష పూజలు: తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం. అనంతరం విశేష పూజాధికాలు. మధ్యాహ్నం 12 నుంచి 12.45 వరకు స్వామివారికి మధ్యాహ్న రాజభోగం (ఆరగింపు).. ఆలయం మూసివేత. రాత్రి 7 నుంచి 7.30 వరకు తిరువారాధన. 7.30 నుంచి 8.15 వరకు సహస్ర నామార్చన, అమ్మవారికి కుంకుమార్చన. 9.15 నుంచి 9.45 గంటల వరకు రాత్రి నివేదన (ఆరగింపు). 9.45 నుంచి 10 గంటల వరకు శయనోత్సవం.. ఆలయ ద్వారబంధనం. సర్వ దర్శనాలు: 6.30 నుంచి 8 గంటల వరకు. తిరిగి 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. మళ్లీ 12.45 నుంచి 4 గంటల వరకు, ఆపై సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు..చివరిగా రాత్రి 8.15 నుంచి 9.15 వరకు సర్వ దర్శనాలు. వీఐపీ బ్రేక్‌ దర్శనాలు: ఉదయం 8 నుంచి 9 గంటల వరకు. తిరిగి సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు

7. 16 నుంచి నిత్య కల్యాణాలు!
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయంలో వచ్చే నెల 16 నుంచి నిత్య కల్యాణం, సుదర్శన హోమం, బ్రహ్మోత్సవానికి శ్రీకారం చుట్టనున్నట్లు ఆలయ అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఈ పూజలకు సంబంధించి త్వరలో ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నట్లు సమాచారం.

8.యాదాద్రిలో ప్రసాదం కౌంటర్లు ప్రారంభం
శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయానికి తూర్పు దిశలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన 13 ప్రసాదం కౌంటర్ల భవనాన్ని ఆలయ ఏఈవో శ్రావణ్‌ కుమార్‌ మంగళవారం పూజలు చేసి ప్రారంభించారు. కల్యాణ కట్ట వద్ద ఏర్పాటు చేసే సెంట్రల్‌ రిసెప్షన్‌ కార్యాలయం (సీఆర్‌వో) వద్ద టికెట్లు తీసుకుని, కొండపైన శ్రీస్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఈ ప్రసాదం కౌంటర్లలో ప్రసాదం తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. మంగళవారం ప్రసాదం కొనుగోలు ద్వారా ఆలయానికి రూ.817,580 ఆదాయం వచ్చింది.
9. యాదగిరిగుట్టకు 100 మినీ బస్సులు : సజ్జనార్

యాదగిరిగుట్టకు 100 మినీ బస్సులు అందుబాటులో ఉన్నాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. ప్రతి జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ ఉప్పల్ సర్కిల్ నుంచి మినీ బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. జేబీఎస్ నుంచి యాదగిరిగుట్టకు రూ.100 చార్జ్ చేస్తున్నట్టు తెలిపారు. ఉప్పల్ నుంచి రూ.75 రూపాయలని వెల్లడించారు. ప్రతి రోజూ 104 సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. ఇవే కాకుండా ఇతర జిల్లాల నుంచి ప్రత్యేక యాదాద్రి బస్సులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రైవేట్ వాహనాల కంటే ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం సాఫీగా సాగుతుందని సజ్జనార్ పేర్కొన్నారు

10. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.37 కోట్లు ..
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న శ్రీవారిని 54,396 మంది భక్తులు దర్శించుకోగా 29,344 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకుల ద్వారా టీటీడీకి హుండీ ఆదాయం రూ. 4.37 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.పదకవితా పితామహులు శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యులవారి 519వ వర్ధంతి సందర్భంగా మ‌హ‌తి క‌ళాక్షేత్రంలో ఎస్వీ సంగీత నృత్య క‌ళాశాల అధ్యాప‌కులు డాక్టర్ ఎస్. ఉషారాణి కూచిపూడి నృత్యం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో భాగంగా శ్రీ వేంకటేశ్వరస్వామివారి సుప్రభాతం మొదలుకొని, తోమాల, అర్చన, ఏకాంత సేవ, బ్రహ్మోత్సవాలతో పాటు స్వామివారి వైభవాన్ని కీర్తించిన పలు అన్నమయ్య కీర్తనలకు కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకున్నాయి.