DailyDose

పద్మావతి నిలయంలో కలెక్టరేట్ ఏర్పాటుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ – TNI తాజా వార్తలు

పద్మావతి నిలయంలో కలెక్టరేట్ ఏర్పాటుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ – TNI తాజా వార్తలు

* తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన పద్మావతి నిలయంలో కొత్తగా కలెక్టరేట్ ఏర్పాటుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లా కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌పై జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలపై స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ.. తాత్కాలికంగా కలెక్టర్ కార్యాలయం ఏర్పాటుకు అభ్యంతరం ఎందుకని న్యాయస్థానం పిటిషనర్‌ను ప్రశ్నిస్తూ.. ఈ కేసును కొట్టివేసింది.
కాగా పద్మావ‌తి నిల‌యంలో క‌లెక్ట‌రేట్ ఏర్పాటు వ‌ద్దంటూ దాఖ‌లైన పిటిష‌న్‌ను విచారించిన ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి పిటిష‌న‌ర్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం ఈ తీర్పును స‌వాల్ చేస్తూ హైకోర్టు డివిజ‌న్ బెంచ్‌ను ఆశ్రయించింది. విచారణ జరిపిన డివిజన్ బెంచ్… ప‌ద్మావ‌తి నిల‌యంలోనే క‌లెక్ట‌రేట్ ఏర్పాటుకు అనుమ‌తి ఇస్తూ తీర్పు వ‌చ్చింది. ఈ తీర్పును బీజేపీ నేత భాను ప్ర‌కాశ్ రెడ్డి స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

* కొత్త జిల్లాల అవతరణకు మహూర్తం ఖరారు
ఏప్రిల్‌ 4 ఉదయం 9:05 నుంచి 9:45 మధ్య కొత్త జిల్లాల అవతరణ. ఏప్రిల్‌ 6న వాలంటీర్ల సేవలకు సత్కారం. ఏప్రిల్‌ 8న వసతి దీవెన కార్యక్రమం. ఆయా కార్యక్రమాలను ప్రారంభించనున్న సీఎం వైయస్‌.జగన్‌.

*ప్రధాని మోదీని వైసీపీ ఎంపీలు కలిశారు. బీసీ జనగణన చేపట్టాలని ప్రధానికి వైసీపీ ఎంపీలు వినతిపత్రం అందజేశారు. జనాభా లెక్కలలో బీసీ జనగణన చేయాలని కోరారు. దేశంలో 53 శాతం మంది బీసీలు ఉన్నారని వారు మోడీకి తెలిపారు. అయినప్పటికీ బీసీలను ను రెండవ తరగతి పౌరులుగా పరిగణిస్తున్నారని వారు పేర్కొన్నారు. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉన్నా, చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం లేదన్నారు. ఓబీసీల అభివృద్ధికి, ప్లానింగ్ కోసం ఖచ్చితమైన బీసీ జనాభా లెక్కలు అవసరమని వారు అన్నారు. పార్లమెంటు శాసనసభ న్యాయవ్యవస్థలో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని వారు కోరారు. మోదీని కలిసిన వారిలో ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్ , మోపిదేవి వెంకటరమణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు.

*ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్‌ ఉత్పత్తి దిగ్గజం ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ)లో కేంద్రం రూ. 1.5 శాతం వాటాలు విక్రయించాలని నిర్ణయించింది. తద్వారా రూ. 3,000 కోట్లు సమీకరించనుంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) విధానంలో షేర్ల విక్రయం ఉండనుంది. మార్చి 30, 31 తారీఖుల్లో ఓఎఫ్‌ఎస్‌ నిర్వహించనున్నట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు కంపెనీ తెలియజేసింది.
ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కోసం ఫ్లోర్‌ ధరను షేరు ఒక్కింటికి రూ. 159గా నిర్ణయించినట్లు పేర్కొంది. మంగళవారం బీఎస్‌ఈలో స్టాక్‌ ముగింపు ధర రూ. 171.05తో పోలిస్తే ఇది 7 శాతం డిస్కౌంటు. ఓఎన్‌జీసీలో ప్రభుత్వానికి 60.41 శాతం వాటాలు ఉన్నాయి. ఓఎఫ్‌ఎస్‌ కింద కనీసం 25 శాతం షేర్లను మ్యూచువల్‌ ఫండ్స్‌.. బీమా కంపెనీలకు, 10 శాతం షేర్లను రిటైల్‌ ఇన్వెస్టర్లకు కేటాయించనున్నారు.ఓఎన్‌జీసీ ఉద్యోగులు తలో రూ. 5 లక్షల విలువ చేసే షేర్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఓఎఫ్‌ఎస్‌ కింద విక్రయిస్తున్న 0.075 శాతం షేర్లను అర్హులైన ఉద్యోగులకు కటాఫ్‌ ధరకు కేటాయించనున్నట్లు కంపెనీ వివరించింది.

*దేవ‌రుప్పుల మండ‌లం చిన్న మ‌డూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు రాంపెల్లి శ్రీ‌నివాస్ టిఆర్ఎస్ లో చేరారు. హైద‌రాబాద్ లోని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు క్యాంపు కార్యాల‌యంలో ఆయ‌న స‌మ‌క్షంలో శ్రీ‌నివాస్ గులాబీ కండువా కప్పుకున్నారు. మంత్రి ఆయ‌న‌ను పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో ఇత‌ర కార్య‌క‌ర్త‌ల్లాగేశ్రీ‌నివాస్ కు కూడా స‌ముచిత గౌర‌వం ఉంటుంద‌ని మంత్రి చెప్పారు. కాగారాష్ట్రంలో సీఎం కేసిఆర్‌నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు చేప‌డుతున్న అభివృద్ధి సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు ఆక‌ర్షితుడినై తాను కాంగ్రెస్ ను వీడి టిఆర్ఎస్ లో చేరుతున్న‌ట్లు శ్రీ‌నివాస్ చెప్పారు.

* స్టేష‌న్ ఘ‌న్‌పూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య మాతృమూర్తి ల‌క్ష్మి(87) క‌న్నుమూసింది. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ల‌క్ష్మి.. హ‌నుమ‌కొండ‌లోని రాజ‌య్య మ‌ల్టీ స్పెషాలిటీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ బుధ‌వారం సాయంత్రం 4 గంట‌ల‌కు తుదిశ్వాస విడిచింది. త‌ల్లి మ‌ర‌ణ వార్త తెలుసుకున్న రాజ‌య్య తీవ్ర దిగ్ర్భాంతికి గుర‌య్యాడు. ఎమ్మెల్యే కుటుంబంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

*టీఎస్ ఐసెట్-2022 నోటిఫికేష‌న్‌ను కాక‌తీయ విశ్వవిద్యాల‌యం బుధ‌వారం విడుద‌ల చేసింది. ఏప్రిల్ 6 నుంచి జూన్ 27వ తేదీ వ‌ర‌కు అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. రూ. 250 అప‌రాధ రుసుంతో జులై 11వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. జులై 27, 28 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఐసెట్ ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. ఆగ‌స్టు 4న ఐసెట్ ప్రాథ‌మిక కీ, ఆగ‌స్టు 22న తుది ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు.

*జనసేన కార్యకర్తకు రూ. లక్ష ఆర్ధిక సాయం అందింది. గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త షేక్ ఖాదీర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ ఆర్ధిక పరిస్థితి సరిగా లేనందున వైద్య ఖర్చులకు కూడా ఇబ్బంది పడుతున్నాడు. దీంతో ఖాదీర్ వైద్య ఖర్చుల నిమిత్తం జనసేన పార్టీ తరఫున లక్ష రూపాయల ఆర్ధిక సాయాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అందించారు. హైదరాబాద్ ప్రశాసన్ నగర్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో లక్ష రూపాయల చెక్‌ను ఖాదీర్ సోదరుడు ఖాజావలికి నాదెండ్ల మనోహర్ అందజేశారు.

*ప్రధాని మోదీని వైసీపీ ఎంపీలు కలిశారు. బీసీ జనగణన చేపట్టాలని ప్రధానికి వైసీపీ ఎంపీలు వినతిపత్రం అందజేశారు. జనాభా లెక్కలలో బీసీ జనగణన చేయాలని కోరారు. దేశంలో 53 శాతం మంది బీసీలు ఉన్నారని వారు మోడీకి తెలిపారు. అయినప్పటికీ బీసీలను ను రెండవ తరగతి పౌరులుగా పరిగణిస్తున్నారని వారు పేర్కొన్నారు. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉన్నా, చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం లేదన్నారు. ఓబీసీల అభివృద్ధికి, ప్లానింగ్ కోసం ఖచ్చితమైన బీసీ జనాభా లెక్కలు అవసరమని వారు అన్నారు. పార్లమెంటు శాసనసభ న్యాయవ్యవస్థలో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని వారు కోరారు. మోదీని కలిసిన వారిలో ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్ , మోపిదేవి వెంకటరమణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు.

* తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్న లుకలుకల నేపథ్యంలో.. సీనియర్లకు పార్టీ కీలక నేత రాహుల్‌ గాంధీ అపాయింట్‌మెంట్‌ దొరికింది. బుధవారం సాయంత్రం ఐదు గంటలకు ఢిల్లీలో రాహుల్‌తో టీ కాంగ్‌ సీనియర్లు భేటీ కానున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలతో పాటు ధాన్యం కొనుగోలు.. ఇతర అంశాలపై చర్చించనున్నారు.

* లఖింపూర్‌ ఖేరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు అశిష్‌ మిశ్రా బెయిల్‌ను రద్దు కోసం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయాలంటూ రిటైర్డ్‌ జడ్జి కమిటీ ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వాన్ని సదరు జడ్జి ప్రతిపాదనపై స్పందించాలంటూ కోరింది సుప్రీం కోర్టు. అంతేకాదు ఈ స్పందన కోసం ఏప్రిల్‌ 4వ తేదీని గడువుగా విధించింది.

* ఏపీలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు. కేటగిరీలు రద్దుచేసి కొత్తగా ఆరు స్లాబులు. ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపు. 30 యూనిట్ల వరకు యూనిట్ కు 45 పైసలు పెంపు. 31-75 యూనిట్ల వరకు యూనిట్ కు 91 పైసలు పెంపు. 76-125 యూనిట్ల వరకు యూనిట్ కు రూ. 1.40 పైసలు పెంపు. ఉదాహరణకు 1000 రూపాయలు వచ్చే బిల్లు ఏప్రిల్ నుండి 1350 రూపాయల వరకు వస్తుంది.

*పట్టణాల్లో వార్డు అడ్మిన్‌, గ్రామ సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శులకు ఎల్లో ట్యాగ్‌, డిజిటల్‌ అసిస్టెంట్లకు రెడ్‌ ట్యాగ్‌, హెల్త్‌ సెక్రటరీకి వైట్‌ ట్యాగ్‌, మహిళా పోలీసులకు ఖాకీ ట్యాగ్‌, వీఆర్వోలకు బ్రౌన్‌ ట్యాగ్‌, అగ్రికల్చర్‌/హర్టికల్చర్‌ కార్యదర్శులకు గ్రీన్‌ ట్యాగ్‌, ఎడ్యుకేషన్‌ కార్యదర్శికి ఆరెంజ్‌ ట్యాగ్‌, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లకు గ్రే ట్యాగ్‌ తప్పనిసరి చేశారు.

* మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీరేట్లను కేంద్రప్రభుత్వం సవరించింది. ఏపీ, తెలంగాణలో రోజువారీ కూలీని రూ.245 నుంచి రూ. 257కు పెంచింది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి సంస్థ నోటిఫికేషన్ జారీ చేసింది.

*రాష్ట్రంలో ఈ నెల 1 నుంచి 28వ తేది వరకు 1,000 నమూనాలకు మైక్రో టెస్ట్‌లు నిర్వహించగా, అందులో 99 శాతం బీఏ.2 ఒమైక్రాన్‌ లక్షణాలున్నాయని తెలిసింది. అమెరికా, జపాన్‌, ఆసియా తదితర దేశాల్లో కొత్త రకం కరోనా అల వ్యాప్తి చెందుతోంది. బీఏ.2 రకం రూపాంతరం చెందిన ఒమైక్రాన్‌ ఈ తాజా అలకు కారణంగా వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణలో ఉన్నా, ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో 99 శాతం ఈ వైరస్‌ కనిపిస్తోందని వైద్యవర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో నవంబరు, డిసెంబరు నెలల్లో డెల్టా రకం కరోనా వైరస్‌ క్రమక్రమంగా నియంత్రణలోకి వచ్చే సమయంలో ఒమైక్రాన్‌ వ్యాప్తి ప్రారంభమైంది. జనవరిలో ప్రారంభమైన మూడో అలకు బీఏ.2 రకం ఒమైక్రాన్‌ కారణంగా ఉంది. ఆఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తి ద్వారా రాష్ట్రంలో తొలి ఒమైక్రాన్‌ కేసు నమోదైంది. ప్రస్తుతం బీఏ.2 రకం ఒమైక్రాన్‌ రాష్ట్రంలో ప్రబలుతోంది.

*10 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. కేసీఆర్‌తో పాటు ఆయన సతీమణి శోభ సైతం వెళ్లనున్నారు. ఢిల్లీలో అనారోగ్య సమస్యలకు చికిత్స చేయంచుకోనున్నారు. అలాగే ధాన్యం కొనుగులుపై కేంద్ర మంత్రిని కలిసే అవకాశం ఉంది. అవసరం అయితే ప్రధానమంత్రి మోదీని సైతం కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలంతా సమావేశం కావాలని మమత బెనర్జీ ఇచ్చిన పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో సీఎం ఢిల్లీ పర్యటనకి ప్రాధాన్యత ఏర్పడింది.

*రెండు రోజుల సమ్మె ప్రభావం సింగరేణి బొగ్గు ఉత్పత్తిపై పడింది. రెండు రోజుల సమ్మెతో 4 లక్షల టన్నులకుపైగా బొగ్గు ఉత్పత్తిని కోల్పోయింది. అసలే ఆర్థిక సంవత్సరం చివరి రోజులు కావడంతో నిర్దేశిత టార్గెట్‌ను చేరుకోవడం కోసం సింగరేణి యాజమాన్యం తంటాలుపడుతోంది. దేశ వ్యాప్తంగా నిర్వహించిన సార్వత్రిక సమ్మె కేవలం సింగరేణిలో మాత్రమే సంపూర్ణంగా సాగింది. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ ఇతర డిమాండ్లతో సింగరేణి కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు కార్మికులు సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. తెలంగాణలో రెండు రోజులపాటు ఒక్క బొగ్గు పెళ్ల కూడా బయటకు రాలేదు. సమ్మెకు మద్దతుగా కార్మికులు ఎక్కడికక్కడ ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. మొత్తం 11 ప్రాంతాల్లోని 25 భూగర్భ, 19 ఓపెన్‌కాస్ట్ గనుల్లో ఉత్పత్తి పూర్తిగా స్తంభించింది.

*పెట్రోల్, గ్యాస్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ నగరంలోని సీపీఎం నిరసనకు దిగింది. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర నాయకులు బాబూరావు మాట్లాడుతూ… కరోనాతో దేశ వ్యాప్తంగా ఉపాధి కోల్పోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆదుకోవాల్సిన కేంద్రం గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచేశారని మండిపడ్డారు. యూ.పి ఎన్నికలు అయిపోగానే మోదీ దొంగ దెబ్బ తీశారన్నారు. పెట్రోల్‌పై పన్నుల రూపంలో 26 లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం పేరు చెప్పి నూనె ధరలు పెంచారన్నారు. వంద రోజుల్లో ధరలు తగ్గిస్తామని చెప్పి మోదీ అధికారంలోకి వచ్చారని… ఇప్పుడు రెట్టింపు భారాలతో ప్రజలను దోచుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ఆదేశాలతో జగన్ కూడా పన్నులపై పన్నులు మోపుతున్నారని అన్నారు. ఇంటి పన్ను పెంచడంతో పాటు, చెత్త పన్ను వసూలు చేస్తున్న చెత్త ప్రభుత్వమని విమర్శించారు. రేపు కరెంటు మీటర్లు పెట్టి కొత్త దోపిడీకి జగన్ శ్రీకారం చుట్టారన్నారు. ఈ ఛార్జీలతో ప్రజలకు విద్యుత్ ఛార్జీల షాక్ తగలనుందని తెలిపారు. ఏప్రిల్ 4న దేశ వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నామని బాబూరావు వెల్లడించారు.

*అంతర్జాతీయ విమానసేవలు ప్రారంభమైన తొలిరోజు చెన్నై విమానాశ్రయం నుంచి 10 వేల మంది ప్రయాణించారు. ఈ విషయమై విమానాశ్రయ అధికారులు మాట్లాడుతూ, చెన్నై నుంచి 27కు పైగా అంతర్జాతీయ విమాన సంస్థలు వివిధ దేశాలకు విమానాలు నడుపుతున్నాయి. కరోనాకు ముందు చెన్నై నుంచి ప్రతిరోజు 100 అంతర్జాతీయ విమానాలు నడుపుతుండగా, లాక్‌డౌన్‌ కాలంలో 40 నుంచి 45 విమానాలకు తగ్గాయి. ఈ నెల 27వ తేది నుంచి 22 విమానసంస్థలు అంతరాత్జీయ విమానసేవలు ప్రారంభించగా, మరికొన్ని ఏప్రిల్‌లో ప్రారంభించనున్నాయి. ఈ నెల 26వ తేది చెన్నై విమానాశ్రయం నుంచి 45,348 మంది ప్రయాణించగా, వారిలో 9 వేల మంది విదేశాలకు వెళ్లారని, 27న 49,669 మంది ప్రయాణికుల్లో విదేశాలకు వెళ్లిన వారి సంఖ్య 10 వేలు దాటిందని అధికారులు తెలిపారు

*ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరు నుంచి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి మినహాయింపు లభించింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. 2014లో హుజూర్‌నగర్‌ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ జగన్‌ తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై మంగళవారం జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ విచారణ చేపట్టారు. వాదనలను విన్న న్యాయమూర్తి పోలీసులకు నోటీసులిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్‌ 26కు వాయిదా వేశారు. అప్పటివరకు కేసు విచారణలో జగన్‌కు హాజరు మినహాయింపునిస్తూ ఉత్తర్వులిచ్చారు.

*తెలుగు నూతన సంవత్సరం శుభకృత్‌ నామ సంవత్సర ఉగాది వేడుకలను ఏప్రిల్‌ న ప్రగతి భవన్‌లో నిర్వహించనున్నట్టు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ తెలిపారు. వేడుకలపై మంగళవారం ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రగతిభవన్‌లోని జనహితలో ఏప్రిల్‌ న ఉదయం కు వేడుకలు ప్రారంభమవుతాయనిసాయంత్రంకు రవీంద్రభారతిలో కవి సమ్మేళనం ఉంటుందని వివరించారు.

*ఇప్పటికే వివిధ జాతీయ, అంతర్జాతీయ పరిశోధనా సంస్థలకు కేంద్ర బిందువైన హైదరాబాద్‌ నగరంలో మరో కేంద్ర ప్రభుత్వ సంస్థ కొలువుదీరింది. దానిపేరే జీవ వైద్య పరిశోధనా సంస్థ (నేషనల్‌ యానిమల్‌ రిసోర్స్‌ ఫెసిలిటీ ఫర్‌ బయో మెడికల్‌ రిసెర్చ్‌). జీవ వైద్య పరిశోధన, ప్రత్యేకించి జంతు సంబంధిత అంశాలపై అధ్యయనమే దీని ప్రధాన లక్ష్యం. హైదరాబాద్‌ పరిధిలోని జీనోమ్‌ వ్యాలీలో రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో కేంద్ర ఆరోగ్యశాఖ దీన్ని ఏర్పాటు చేసింది.

*టీడీపీ ఆవిర్భావ సభ సందర్భంగా గుంటూరు జిల్లా తెనాలిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీచౌక్‌ వద్ద నిర్వహించిన సభలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ప్రసంగిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌, తాడిబోయిన రమేశ్‌ ఫ్లెక్సీపై వాటర్‌ బాటిల్‌ విసరడం వివాదానికి దారితీసింది. తమ ఫ్లెక్సీలపై రాళ్లు, బాటిల్స్‌ విసిరారంటూ రమేశ్‌ సభకు వచ్చి ఆలపాటికి చెప్పారు. సభ పూర్తయ్యాక మాట్లాడుకుందామని ఆయన చెప్పినా రమేశ్‌ అరుస్తుండటంతో టీడీపీ శ్రేణులు ఆయన్ను పక్కకు నెట్టే ప్రయత్నం చేశాయి. ఈ క్రమ ంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య తోపులాటలు జరిగాయి. అక్కడి నుంచి ఆలపాటి వెళ్లాక.. వైసీపీ శ్రేణులు దూసుకువచ్చి కాళీమాతాలయం దిమ్మెకు కట్టిన ఆలపాటి ఫ్లెక్సీని చించేశారు. దీంతో ఘర్షణ వాతావరణం వేడెక్కి.. ఒకరినొకరు తోసుకోవడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు.

*మొన్న నెల్లూరు.. నిన్న పిఠాపురం.. నేడు కర్నూలు. పన్నుల వసూలు కోసం అధికారుల వేధింపులు ఆగడం లేదు. చెత్త పన్ను, ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజు చెల్లించలేదని కర్నూలులోని డెలివరీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కార్యాలయంలో (కొరియర్‌ సర్వీసు) కార్పొరేషన్‌ సిబ్బంది చెత్త పోశారు. అంతేగాదు కార్యాలయాన్ని మూసేసి.. తాళాలు వేసి సీల్‌ చేశారు. విషయాన్ని హెడ్‌ ఆఫీసుకు చెప్పామని, నాలుగు రోజులు గడువు ఇవ్వాలని సిబ్బంది కోరినా పట్టించుకోలేదు.

*రాష్ట్రంలోని 47 డీఈడీ కాలేజీల గుర్తింపును రద్దు చేస్తూ గతేడాది అక్టోబరులో నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు నిలుపుదల చేసింది. ఆ ఉత్తర్వుల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్రంలోని పలు డీఈడీ కాలేజీలు నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాలు కల్పించారని, పాఠశాల విద్య కమిషనర్‌ దిల్లీలోని ఎన్‌సీటీఈకి లేఖ రాశారు. దాని ఆధారంగా రాష్ట్రంలోని పలు కాలేజీల గుర్తింపుని ఎన్‌సీటీఈని రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఎన్‌సీటీఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ డీఈడీ కాలేజీలు యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకటరమణ, న్యాయవాది మతుకుమిల్లి శ్రీవిజయ్‌ వాదనలు వినిపించారు. ‘నిబంధనలు ఉల్లంఘించిన కాలేజీలకు ముందుగా నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలి. ఆతర్వాతే గుర్తింపు రద్దుపై నిర్ణయం తీసుకోవాలి. అందుకు విరుద్ధంగా వెబ్‌సైట్‌లో నోటీసులు ఉంచి సమాధానం ఇవ్వని కాలేజీల అనుమతిని రద్దు చేశారు. ఎన్‌సీటీఈ సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించింది’ అని వివరించారు. ఆ వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఎన్‌సీటీఈ ఉత్తర్వుల ఆధారంగా తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.

*తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా ఓ 17 ఏళ్ల బాలుడికి ‘ట్రాన్స్‌ క్యాథటర్‌ పల్మనరీ వాల్వ్‌ ఇంప్లాంటేషన్‌ (టీపీవీఐ) శస్త్రచికిత్సను హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రి వైద్యులు నిర్వహించారు. విజయవాడకు చెందిన ఆ బాలుడికి పుట్టుకతోనే ‘టెట్రాలజీ ఆఫ్‌ ఫాలోట్‌’ అనే సైనోటిక్‌ గుండె జబ్బు ఉంది. అపోలో ఆస్పత్రి చీఫ్‌ పీడియాట్రిక్‌ కార్డియాలజిస్టు డాక్టర్‌ కవిత చింతల నేతృత్వంలోని వైద్యబృందం బాలుడికి ఎంతో క్లిష్టమైన టీపీఐవీ శస్త్ర చికిత్స చేసింది. రక్తం భర్తీ కావడాన్ని నిరోధించడానికి కుడి జఠరిక, పల్మనరీ ఆర్టరీ మధ్య కొత్త వాల్వ్‌ను అమర్చారు. శస్త్రచికిత్స చేసిన వైద్య బృందంలో ముత్తుకుమారన్‌, మనోజ్‌ అగర్వాల్‌, రుఫస్‌ డెమెల్‌ ఉన్నారు. బాలుడు పూర్తిగా కోలుకున్నాడని, ఇక దైనందిన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని డాక్టర్‌ కవిత చింతల తెలిపారు.

*నెల్లూరులో భారీగా నకిలీ మద్యం పట్టుబడింది. సెబ్‌ (స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో) అధికారులు ఇందుకూరుపేట మండలం మైపాడు వద్ద 17,808 క్వార్టర్‌ సీసాలను స్వాధీనం చేసుకుని, 8 మందిని అరెస్టు చేశారు. దీంతో గోవా నుంచి తెచ్చిన మద్యం సీసాలపై ఏపీ మద్యం బ్రాండ్ల లేబుళ్లను అతికించి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయిస్తున్న విషయం బట్టబయలైంది. ఎస్పీ సీహెచ్‌ విజయరావు మంగళవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. వింజమూరు మండలం గుండెమడకల గ్రామానికి చెందిన చీమల విజయభాస్కర్‌రెడ్డి నెల్లూరులో ఉంటున్నాడు. సరదా కోసం తరచూ గోవాకు వెళుతున్న అతను అక్కడ తక్కువ ధరకు లభించే మద్యాన్ని నెల్లూరుకు తీసుకొచ్చి అధిక ధరకు విక్రయించవచ్చని ప్లాన్‌ వేశాడు. గోవాకు చెందిన యశ్వంత్‌, మైఖేల్‌ నుంచి మద్యం కొనుగోలుచేసి, విజయ్‌భాస్కర్‌రెడ్డి స్నేహితుడు పవన్‌కుమార్‌కు మైపాడు గ్రామం తూర్పుపాలెంలో గోదాములుండటంతో అక్కడ నిల్వ చేశారు.

*టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో తెలంగాణ ఎక్సైజ్‌ అధికారులపై హైకోర్టులో దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను వెనక్కి తీసుకోలేదని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తరపు న్యాయవాది ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. పిటిషన్‌ ఇంకా హైకోర్టులో విచారణకే రాలేదని చెప్పారు. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తోన్న వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

*పావలా వడ్డీ, వడ్డీ లేని రుణాల చెల్లింపు పథకం కింద బ్యాంకులకు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రీయింబర్స్‌మెంట్‌ సొమ్ము రూ.725.18 కోట్లను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి కోరింది. డిసెంబర్‌ చివరి నాటికి ముగిసిన ఎస్‌ఎల్‌బీసీ త్రైమాసిక నివేదికపై మంగళవారం సమీక్షించింది.

*ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు ఏజెన్సీలను ఎస్సీలకు రిజర్వ్‌ చేసే ప్రక్రియను రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు మంగళవారం కోఠిలోని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో ప్రారంభించారు. టీఎస్‌ఎంఐడీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వాకాటి కరుణ, ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాస్‌ రావు, డీఎంఈ రమే్‌షరెడ్డి, సీఎం ఓఎ్‌సడీ గంగాధర్‌తో కలిసి డ్రా ద్వారా ఎస్సీలకు కేటాయించే ఆస్పత్రులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రుల్లో శానిటేషన్‌, సెక్యూరిటీ, డైట్‌ఏజెన్సీల్లో 16ు కాంట్రాక్టులను దళితులకు కేటాయిస్తున్నామన్నారు.

* ఆంధ్రప్రదేశ్‌లో పగటి ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుతున్నాయి. ప్రస్తుతం రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత 40 డిగ్రీలకు పైగానే నమోదు అవుతోంది. పశ్చిమ వాయువ్య దిశగా వీస్తున్న ఉష్ణగాలుల కారణంగా ఏపీలో పగటి ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుతున్నాయి. రాయలసీమ జిల్లాలైన చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల్లోని అనేక చోట్ల 40 డిగ్రీల కంటే అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. ఇవి సాధారణం కంటే 4 డిగ్రీలు అధికమని వాతావరణశాఖ స్పష్టం చేస్తోంది.

* ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్‌ ఉత్పత్తి దిగ్గజం ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ)లో కేంద్రం రూ. 1.5 శాతం వాటాలు విక్రయించాలని నిర్ణయించింది. తద్వారా రూ. 3,000 కోట్లు సమీకరించనుంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) విధానంలో షేర్ల విక్రయం ఉండనుంది. మార్చి 30, 31 తారీఖుల్లో ఓఎఫ్‌ఎస్‌ నిర్వహించనున్నట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు కంపెనీ తెలియజేసింది.
ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కోసం ఫ్లోర్‌ ధరను షేరు ఒక్కింటికి రూ. 159గా నిర్ణయించినట్లు పేర్కొంది. మంగళవారం బీఎస్‌ఈలో స్టాక్‌ ముగింపు ధర రూ. 171.05తో పోలిస్తే ఇది 7 శాతం డిస్కౌంటు. ఓఎన్‌జీసీలో ప్రభుత్వానికి 60.41 శాతం వాటాలు ఉన్నాయి. ఓఎఫ్‌ఎస్‌ కింద కనీసం 25 శాతం షేర్లను మ్యూచువల్‌ ఫండ్స్‌.. బీమా కంపెనీలకు, 10 శాతం షేర్లను రిటైల్‌ ఇన్వెస్టర్లకు కేటాయించనున్నారు.ఓఎన్‌జీసీ ఉద్యోగులు తలో రూ. 5 లక్షల విలువ చేసే షేర్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఓఎఫ్‌ఎస్‌ కింద విక్రయిస్తున్న 0.075 శాతం షేర్లను అర్హులైన ఉద్యోగులకు కటాఫ్‌ ధరకు కేటాయించనున్నట్లు కంపెనీ వివరించింది.