NRI-NRT

ఇప్పటివరకు Golden Visa పొందిన బాలీవుడ్ స్టార్స్ వీరే..!

ఇప్పటివరకు  Golden Visa పొందిన బాలీవుడ్ స్టార్స్ వీరే..!

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ప్రభుత్వం విదేశీయులకు దీర్ఘకాలిక రెసిడెన్సీ కోసం ఇచ్చేదే గోల్డెన్ వీసా. 5, 10 ఏళ్ల కాలపరిమితో యూఏఈ ఈ వీసాలను మంజూరు చేస్తోంది. 2019లో యూఏఈ ప్రభుత్వం ఈ లాంగ్‌టర్మ్ రెసిడెన్సీ వీసాల కోసం ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థ యూఏఈలో విదేశీయులకు నివాసం, పనిచేసుకోవడం, అధ్యయనంకు ఎలాంటి స్పాన్సర్షిప్ అవసరం లేకుండా చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. అలాగే వందశాతం ఓనర్‌షిప్‌తో ఆ దేశంలో సొంతంగా వ్యాపారాలు కూడా నిర్వహించుకోవచ్చు.
2018 కేబినెట్ తీర్మానం నం. 56 ప్రకారం పెట్టుబడిదారులు(కనీసం రూ. 20.50కోట్లు), పారిశ్రామికవేత్తలు, సైన్స్, నాలెడ్జ్, స్పోర్ట్స్ రంగంలోని నిపుణులు, ప్రత్యేక ప్రతిభావంతులకు గోల్డెన్ వీసా ఇవ్వడం జరుగుతోంది. ఇదిలాఉంటే.. భారత్ నుంచి ఇప్పటివరకు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు యూఏఈ ఇచ్చే ఈ గోల్డెన్ వీసాను అందుకున్నారు. వీరిలో బాలీవుడ్‌‌కు చెందిన పలువురు స్టార్స్ ఉన్నారు. ఇలా ఇప్పటివరకు గోల్డెన్ వీసా అందుకున్న 10 మంది బాలీవుడ్ స్టార్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

*రణవీర్ సింగ్..
ఈ బాలీవుడ్ యువ హీరో ఈ నెల 29న అబుదాబిలో గోల్డెన్ వీసా అందుకున్నాడు. రణవీర్‌కు యూఏఈ ప్రభుత్వం పదేళ్ల కాలపరిమితితో గోల్డెన్ వీసా ఇచ్చింది. ఈ సందర్భంగా రణవీర్ దుబాయ్ అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశాడు.

*ఫర్హా ఖాన్..
బాలీవుడ్ కొరియోగ్రాఫర్, దర్శకురాలు, నటి ఫర్హా ఖన్‌కు యూఏఈ గతేడాది నవంబర్‌లో గోల్డెన్ వీసా మంజూరు చేసింది. 10ఏళ్ల కాలపరిమితితో తనకు గోల్డెన్ వీసా లభించడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేసింది. దుబాయ్ ఎక్స్‌పోకు వెళ్లిన సమయంలో గోల్డెన్ వీసా అందుకున్న ఫర్హా.. ఇది తనకు దక్కిన అరుదైన గౌరవంగా పేర్కొంది. ఈ సందర్భంగా దుబాయ్ ఫిల్మ్ అండ్ టీవీ కమిషన్‌తో పాటు అక్కడి అధికారులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసింది.

*వరుణ్ ధావన్..
యూఏఈ నుంచి గోల్డెన్ వీసా అందుకున్న మరో బాలీవుడ్ యువ నటుడు వరుణ్ ధావన్. అతనికి కూడా 10ఏళ్ల కాలపరిమితితోనే యూఏఈ గోల్డెన్ వీసా ముంజూరు చేసింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా వరుణ్ ఆనందం వ్యక్తం చేశాడు. అలాగే యూఏఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాడు. మూవీ షూటింగులకు యూఏఈని గ్రేట్ గమ్యస్థానంగా పేర్కొన్నాడు.

*బోనీ కపూర్ ఫ్యామిలీ..
బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఫ్యామిలీ గతేడాది నవంబర్‌లో యూఏఈ ప్రభుత్వం నుంచి గోల్డెన్ వీసా అందుకుంది. 66వ జన్మదిన వేడుకల కోసం దుబాయ్ వెళ్లిన సమయంలో బోనీకపూర్ గోల్డెన్ వీసా అందుకున్నారు. ఆయనతో పాటు ఇద్దరు కూతుళ్లు ఖుషి కపూర్, జాన్వీ కపూర్‌, అన్షులా కపూర్, కుమారుడు అర్జున్ కపూర్ గోల్డెన్ వీసా అందుకున్నారు. ఐదుగురు కుటుంబ సభ్యులకు యూఏఈ సర్కార్ పదేళ్ల కాలపరిమితితో గోల్డెన్ వీసా మంజూరు చేసింది.

*మౌనీ రాయ్..
ఇటీవల యూఏఈకి చెందిన భారతీయ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి మౌనీ రాయ్ కూడా యూఏఈ ఇచ్చే గోల్డెన్ వీసా అందుకుంది. తాజాగా ఆమె వీసా అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇది తనకు దక్కిన అరుదైన గౌరవంగా పేర్కొంది. దుబాయ్ పాలకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. “గోల్డెన్ వీసాను పొందడం నాకు ఎంతో గౌరవంగా ఉంది. ఈ గౌరవాన్ని పొందేందుకు నన్ను అర్హులుగా భావించినందుకు అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు దుబాయ్ సృజనాత్మక ప్రతిభావంతులు వారి కలలను కొనసాగించడానికి అనువైన ప్రదేశం. నా రాబోయే కొన్ని సినిమాలు యూఏఈలో చిత్రీకరణ జరుపుకుబోతున్నాయి” అని చెప్పుకొచ్చింది.

*సంజయ్‌దత్..
బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్‌కు కూడా యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా మంజూరు చేసింది. గతేడాది మే 26న సంజు గోల్డెన్ వీసా అందుకున్నాడు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తన అభిమానులతో సంజు బాబా పంచుకోవడం జరిగింది.

*సునీల్ షెట్టి..
మరో బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ షెట్టి కూడా గోల్డెన్ వీసా అందుకున్న స్టార్స్ జాబితాలో ఉన్నారు. తనకు దక్కిన ప్రత్యేక గౌరవం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ దుబాయ్ పాలకులకు కృతజ్ఞతలు తెలియజేశాడు.

*సోను నిగమ్..
దుబాయ్‌లో తన ఫ్యామిలీతో కలిసి నివాసముండే బాలీవుడ్ గాయకుడు సోను నిగమ్.. యూఏఈ సర్కార్ నుంచి పదేళ్ల కాలపరిమితితో గోల్డెన్ వీసా అందుకున్నాడు. 1994 నుంచి యూఏఈ ఉంటున్న సోను నిగమ్ తనకు యూఏఈ రెండో ఇల్లు లాంటిదని పేర్కొనడం జరిగింది. గోల్డెన్ వీసా అందుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ.. దుబాయ్ అధికారులకు థ్యాంక్స్ చెప్పాడు.అలాగే బాలీవుడ్ స్టార్స్‌తో పాటు మలయాళం నుంచి మోహన్‌లాల్, మమ్ముటీ, పృథ్వీరాజ్ సుకుమారన్, టొవినో థామస్, దుల్కర్ సల్మాన్ ఉన్నారు. వీరితో పాటు గాయని చిత్ర, తమిళ నటి త్రిష క్రిష్ణన్, నటి అమల పాల్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, నటుడు రాంచరణ్ సతీమణి ఉపాసన కూడా యూఏఈ నుంచి గోల్డెన్ వీసా అందుకున్నారు.