DailyDose

భారతదేశానికి భౌగోళిక కేంద్ర బిందువు ఏది?

భారతదేశానికి భౌగోళిక కేంద్ర బిందువు ఏది?

ఒక చోట నుంచి మరొక చోటకు ప్రయాణించాలన్నా, దూరం ఎంతో చెప్పాలన్నా ఇప్పుడు చాలామంది జీపీఎస్‌పైన, గూగుల్ మ్యాప్స్ పైన ఆధారపడుతున్నారు. కానీ, ఒకప్పుడు ఇలాంటి మ్యాప్స్ కేవలం రెవెన్యూ అధికారుల వద్దే ఉండేవి. వీటిని చూసేందుకు కూడా చాలామందికి అవకాశం లభించేది కాదు.ఒక కలెక్టర్ ఏదైనా ప్రాంతానికి ప్రయాణించాల్సి వస్తే తొలుత ఆ ప్రాంతానికి సంబంధించిన మ్యాప్‌ను పరిశీలించేవాళ్లు. తర్వాతి కాలంలో రెవెన్యూ కార్యాలయాల్లో ఈ మ్యాప్‌లను ప్రజలందరికీ తెలిసేలా ప్రదర్శించారు. ఇప్పటికీ చాలా రెవెన్యూ కార్యాలయాల్లో ఆ కార్యాలయ పరిధిని, సరిహద్దులను తెలిపే మ్యాపులు గోడలపై కనిపిస్తూ ఉంటాయి.

‘‘వాస్తవానికి ఇదంతా బ్రిటిష్ ఇండియా కాలంలో మొదలైంది. 17వ శతాబ్దం మొదట్లో ఈస్టిండియా నౌకలు భారతదేశానికి వచ్చాయి.1611వ సంవత్సరంలో బంగాళాఖాతం నుంచి ఆంధ్ర ప్రాంత తీర పట్టణం అయిన మచిలీపట్నం (అప్పట్లో ముసులీపట్నం అని పిలిచేవాళ్లు) చేరుకున్నాయి. 200 ఏళ్ల నాటికి చాలా ప్రాంతాలపై బ్రిటిష్ ఇండియా పట్టు సాధించి, తన పాలన కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే తన వ్యాపార, పరిపాలన, భద్రతా అవసరాల రీత్యా దేశం మొత్తాన్ని శాస్త్రీయంగా సర్వే చేయించాలని 1802వ సంవత్సరంలో నిర్ణయించింది’’ అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సీనియర్ సర్వే అధికారుల్లో ఒకరిగా పేరొందిన చిలమకూరి వెంకట సుబ్బారావు బీబీసీతో అన్నారు. ఆంధ్రప్రదేశ్ సర్వే ట్రైనింగ్ అకాడెమీ జాయింట్ డైరెక్టర్‌గా కూడా ఆయన పనిచేశారు.త్రికోణమితి పద్ధతిలో కన్యా కుమారి నుంచి ఎవరెస్ట్ వరకూ సర్వే చేసిన ఈ గ్రేట్ ట్రిగనామెట్రికల్‌ సర్వే (జీటీఎస్) దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ జీటీ స్టేషన్ల (ప్రామాణికంగా ఏర్పాటు చేసిన సర్వే గుర్తులు)ను ఏర్పాటు చేసిందని వెంకట సుబ్బారావు తెలిపారు. ఎత్తైన కొండలపైన ఏర్పాటు చేసిన ఈ గుర్తులు సర్వేలకు చాలా ముఖ్యమైనవి.

*ఈ సర్వే వల్ల ఇప్పుడు ఉపయోగం ఏంటి?
ఇప్పుడు దూరాన్ని కొలిచేందుకు జీపీఎస్‌, మొబైల్ యాప్స్‌లోని మ్యాప్స్ వాడుతున్నాం. కానీ, రెవెన్యూ రికార్డుల ప్రకారం కొలతలకు మాత్రం ఇప్పటికీ జీటీ స్టేషన్లే ప్రామాణికంగా ఉన్నాయి.ఒక జిల్లా, తాలూకా, గ్రామం సరిహద్దులను కొలిచి.. వాటిని జీటీ స్టేషన్లకు, తద్వారా గ్రేట్ ట్రిగనామెట్రికల్ సర్వేకు అనుసంధానం చేశారు. ఈ సర్వేను ట్రావెర్స్ సర్వే అని పిలుస్తారు. దీని ప్రకారం ప్రతి గ్రామంలోనూ ఇప్పటికీ సరిహద్దు రాళ్లు ఉంటాయి. ఒకవేళ అవి భౌతికంగా కంటికి కనిపించకపోయినప్పటికీ.. గ్రామ రెవెన్యూ రికార్డుల్లో మాత్రం తప్పకుండా ఉంటాయి.ఆ రాయి ఆధారంగానే గ్రామం చుట్టుపక్కల ప్రధాన ప్రాంతాల్లో కొన్ని సర్వే రాళ్లు ఉంటాయి. వీటి ఆధారంగానే వ్యవసాయ భూములు, నివాస స్థలాలను సర్వే చేస్తారు. ఇరువురు వ్యక్తులు, రైతుల మధ్య గట్టు తగాదాలు, సరిహద్దు తగాదాలు వచ్చినప్పుడు సర్వే అధికారులు సరిహద్దు రాయి నుంచి కొలతలు వేసి ఆ గొడవలకు పరిష్కారం చూపిస్తుంటారు.”ఈ ట్రావెర్స్ సర్వే ఆంధ్రప్రదేశ్‌లో బాగా జరిగింది. కానీ, తెలంగాణలో మాత్రం పూర్తిగా జరగలేదు. ఇది బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, పైగా దీనివల్ల ఆనాటికి ఉపయోగాలు తక్కువ అని ఆనాటి నిజాం పాలకులు భావించడం వల్ల సమగ్రంగా జరగలేదు. అందుకే తెలంగాణలో పలు గ్రామాలకు సరైన రెవెన్యూ రికార్డులు లేవు” అని సుబ్బారావు చెప్పారు. ‘హ్యండ్ బుక్ ఆన్ సర్వే, సెటిల్‌మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఇన్ తెలంగాణ’ పుస్తక రచయితల్లో సుబ్బారావు కూడా ఒకరు.

*కిలోమీటర్లు, మైళ్లు లేకముందు దూరాన్ని ఎలా కొలిచేవాళ్లు?
బెత్తె, జాన, మూర, బార, దండ, కోసు, ఆమడ, యోజనం.. ఇవి ప్రాచీన కాలం నుంచి దూరాన్ని కొలిచేందుకు ఉపయోగిస్తున్న ప్రమాణాలు.బెత్తె అంటే అరచేతి కొలత.. ఇది సుమారుగా నాలుగు అంగుళాలు ఉంటుంది. ఇలాంటి మూడు బెత్తెలు కలిపితే ఒక జాన. చేతి బొటనవేలును, చిటికెన వేలును వీలైనంత దూరంగా జరిపితే.. ఆ రెండింటి చివర్ల మధ్య ఉన్న దూరం జాన.రెండు జానెలు ఒక మూర. చేతి మధ్యవేలి నుంచి చేతి మడమ వరకు ఉండే దూరాన్ని మూర అంటారు. రెండు మూరలు ఒక గజం. మూడు అడుగులు కూడా ఒక గజంతో సమానం.12 అంగుళాలు ఒక అడుగు. ఒక మూర 1.5 అడుగులు.12 గజాలు ఒక బార. రెండు బారలు ఒక దండం. వెయ్యి దండాలు ఒక కోసు. ఐదు కోసులు ఒక యోజనం లేదా ఆమడ.యోజనం, ఆమడ అంటే సుమారు 8 నుంచి 10 మైళ్లు. అంటే సుమారుగా 12.8 కిలోమీటర్ల నుంచి 16.8 కిలోమీటర్ల దూరం.4840 చదరపు గజాలు ఒక ఎకరం.ఒక సాలు లేదంటే నాగలి చాలు అంటే 220 గజాలు. ఇంగ్లీషులో దీనిని ఫర్రో అంటారు. ఒక ఫర్రో దూరాన్ని ఫర్లాంగ్ (ఫర్రో లాంగ్) అని పిలుస్తారు. 8 ఫర్లాంగులు ఒక మైలు. అంటే 1.6 కిలోమీటర్లతో సమానం.క్రికెట్ పిచ్ 22 గజాలు. ఒక ఫర్లాంగులో పదోవంతు.

**నాగ్‌పూర్‌లో జీరో మైల్ స్టోన్
గ్రేట్ ట్రిగనామెట్రికల్ సర్వేలో భాగంగా చాలా రాష్ట్రాల్లో బ్రిటిష్ సర్వే అధికారులు కొన్ని ప్రాంతాల్లో సర్వే స్టేషన్ల స్థానంలో స్థూపాలు నిర్మించారు. అలాంటి స్థూపాల్లో బాగా ప్రాచుర్యం పొందింది జీరో మైల్ స్టోన్ స్థూపం.నాగ్‌పూర్‌లో ఇసుక రాయితో 6.5 మీటర్లు ఎత్తైన ఈ స్థూపాన్ని నిర్మించారు. అయితే, దీనిని ఎప్పుడు నిర్మించారు అనేదానిపై స్పష్టత లేదు. ఈ స్థూపం పక్కనే ఉన్న షట్కోణ రాయిపై మాత్రం 1907 అని ఉంటుంది. ఆరు కోణాల ఈ రాయి ఆరు మూలలూ ఆరు ప్రాంతాలవైపు ఉంటాయి. ఆ ప్రాంతం ఎంత దూరంలో ఉందో కూడా రాయిపైన పేర్కొన్నారు.ఈ షట్కోణ రాయిపై రాసి ఉన్న ప్రకారం.. దక్షిణ దిక్కులో 62 మైళ్ల దూరంలో కవాథ ఉంటుంటి. ఆగ్నేయంగా 318 మైళ్ల దూరంలో హైదరాబాద్ ఉంటుంది. తూర్పున 125 మైళ్ల దూరంలో చందా, 174 మైళ్ల దూరంలో రాయ్‌పూర్ ఉన్నాయి. ఈశాన్యంగా 170 మైళ్ల దూరంలో జబల్‌పూర్ ఉంది. వాయువ్య దిక్కులో 79 మైళ్ల దూరంలో సియోని, 83 మైళ్ల దూరంలో చింద్వార ఉన్నాయి. పశ్చిమాన 101 మైళ్ల దూరంలో బైటుల్ ఉంది.ఇక్కడే సున్నా మైలు రాయి కూడా ఉంది. దాని ప్రకారం.. హైదరాబాద్ 485 కిలోమీటర్ల దూరంలోను, కన్యా కుమారి 1600 కిలోమీటర్ల, వారణాసి 729 కిలోమీటర్ల దూరంలోను, జబల్‌పూర్ 273 కిలోమీటర్ల దూరంలోను ఉన్నాయి. నాగపూర్‌లోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయం, విధాన సభ సమీపంలో ఈ జీరో మైల్ స్టోన్‌ ఉంది. ఈ పేరుతో ఒక మెట్రో స్టేషన్ కూడా ఉంది. ఈ పేరుతో ఈ ప్రాంతంలో హోటళ్లు, రెస్టారెంట్లు, పలు షాపులు కూడా ఉన్నాయి. అయితే, చారిత్రకంగా ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ రాయిని, ప్రాంతాన్ని నిర్వహించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ఇసుక రాయి స్థూపం వద్ద పగిలిపోయిన బీరు బాటిళ్లు, చుట్టూ పెరుగుతున్న ముళ్ల పొదలు, స్థూపానికి జరుగుతున్న డ్యామేజీ చెబుతున్నాయి.