Devotional

పెండ్లిళ్లు, శుభ‌కార్యాల స‌మ‌యంలో కంక‌ణం ఎందుకు క‌డ‌తారు?.- TNI ఆధ్యాత్మికం

పెండ్లిళ్లు, శుభ‌కార్యాల స‌మ‌యంలో కంక‌ణం ఎందుకు క‌డ‌తారు?.- TNI ఆధ్యాత్మికం

1. శుభకార్యం సమయంలో కంకణాన్ని మణికట్టుకు ధరించాలని ధర్మశాస్త్రం చెబుతున్నది. ఒక సంకల్పానికి, ధర్మానికి కట్టుబడి ఉండటం కోసం కంకణ ధారణ ఆచారం ఏర్పడింది.
వివాహ వ్రత యజ్ఞేషు శ్రాద్ధే హోమేర్చనే జపే
ఆరబ్ధే సూతకం నస్యాద నారబ్ధేతు సూతకం॥
వివాహం, యజ్ఞం, వ్రతాదులు ‘సంకల్ప కంకణ ధారణ’తోనే మొదలవుతాయి. కంకణ ధారణ చేసిన తర్వాత ఆ శుభకార్యం పూర్తయ్యే వరకు సూతకం వంటి ఏ దోషాలూ కంకణం కట్టుకున్నవారికి వర్తించవు. అందుకే వివాహం, యజ్ఞాలు, ఇతర శుభకార్యాలు చేసినప్పుడు కంకణాన్ని ధరించడమనే నియమం ఏర్పడింది. సర్వేశ్వరుడైన సుదర్శనుడు ఆ శుభకార్యానికి రక్షగా ఉంటాడని విశ్వాసం. సంకల్పించిన శుభకార్యాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి కంకణ ధారణ సహకరిస్తుంది. కంకణ దారం మూడు పోగులతో గానీ, ఐదు పోగులతో గానీ (బేసి సంఖ్య) ఉండాలి. దానిని మామిడి ఆకుతో గానీ, తమలపాకుతో గానీ, పసుపు కొమ్ముతో గానీ అలంకరించి పూజిస్తారు. ఈ కంకణాన్ని కట్టుకునేటప్పుడు ప్రశాంత మనసు, దృఢ సంకల్పం, నిర్మల భక్తి కలిగి ఉండాలి. కంకణాన్ని పురుషులు కుడిచేతికి, స్త్రీలు ఎడమచేతికి ధరించాలి.

2. ఆత్రేయపురం వెంకన్న హుండీల ఆదాయం రూ.44.92లక్షలు
కోనసీమ తిరుపతి వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలోని హుండీల కానుకలను దేవదాయ శాఖ పర్యవేక్షణాధికారులు శింగం రాధ, చింతలపూడి సత్యనారాయణ పర్యవేక్షణలో బుధవారం లెక్కించారు. 28రోజులకు ప్రధాన హుండీల ద్వారా రూ.38,58,821, అన్నప్రసాదం హుండీలద్వారా రూ.6,33,795 లభించింది. 11గ్రాముల బంగారం, 113గ్రాముల వెండి లభించినట్టు ఈవో ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. విశ్వేశ్వరస్వామి హుండీల ఆదాయం రూ.88,268 లభించింది. హుండీల లెక్కింపులో ఆలయ చైర్మన్‌ రమేష్‌రాజు, ధర్మకర్తలు సురేష్‌రాజు, కనకారావు, సత్యనారాయణ, భాను, బ్యాంకు సిబ్బంది, పోలీసులు, గ్రామస్తులు, సిబ్బంది పాల్గొన్నారు.

3. ములవాడ రాజన్న హుండీ ఆదాయం రూ.2.30 కోట్లు
వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం ఖజానాకు 2 కోట్ల 30 లక్షల పై చిలుకు హుండీ ఆదాయం సమకూరింది. గత 25 రోజుల వ్యవధిలో భక్తులు స్వామివారి హుండీలలో సమర్పించిన నగదు, ఆభరణాలు ఇతర కానుకలను ఆలయ ఓపెన్‌ స్లాబ్‌ ప్రాంగణంలో బుధవారం లెక్కించారు. 2 కోట్ల 30 లక్షల 69 వేల 807 రూపాయల నగదు, 428 గ్రాముల 370 మిల్లీ గ్రాముల బంగారం, 23 కిలోల 330 గ్రాముల వెండి సమకూరినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎల్‌.రమాదేవి తెలిపారు.

4. శ్రీగిరిలో ఉగాది మహోత్సవాలు ప్రారంభం
శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజులపాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. బుధవారం ఉదయం స్వామివారి యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు మొదలయ్యాయి. మొదటిరోజు స్వామిఅమ్మవార్లకు భృంగివాహన సేవ నిర్వహించారు. రాజగోపురం నుంచి గంగాధర మంటపం మీదుగా వీరభద్రస్వామి ఆలయం వరకు గ్రామోత్సవం జరిపారు. భ్రమరాంబదేవి మహలక్ష్మీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. చతుర్భుజాలు కలిగిన ఈదేవి పైరెండు చేతులలో పద్మాలను, కింది చేతులలో కుడివైపు అభయహస్తం, ఎడమ వైపు వరముద్రతో దర్శనం ఇచ్చారు. కాగా, ఉగాది మహోత్సవాల్లో రెండోరోజైన గురువారం స్వామిఅమ్మవార్లు కైలాసవాహనంపై ఊరేగనున్నారు. మహాదుర్గ అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారు.

5. ప్రసన్న వేంకటేశ్వరస్వామికి అభరణాల బహుకరణ
ఢిల్లీలోని ప్రసన్న వేంకటేశ్వరస్వామి, పద్మావతీ దేవి, గోదాదేవిలకు బుధవారం బంగారు తాపడం చేసిన ఆభరణాలు కానుకగా అందాయి. టీటీడీ ఢిల్లీ స్థానిక సలహా మండలి చైర్‌పర్సన్‌ ప్రశాంతిరెడ్డి ఈ ఆభరణాలను బహుకరించారు. మకర తోరణం, శంఖం, చక్రం,కిరీటం, అభయ వరద హస్తాలు, సూర్యకఠారి, పద్మపీఠాలు వీటిలో వున్నాయి.ఉగాది రోజున ఈ ఆభరణాలను ఉత్సవమూర్తులకు అలంకరించనున్నారు.

6. నేటి నుంచి ఆఫ్‌లైన్‌లో శ్రీవారి ఆర్జిత సేవలు
దాదాపు రెండేళ్ల తర్వాత శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవల్లో భక్తులు పాల్గొనేలా అవకాశాన్ని కల్పించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. కొవి డ్‌ కేసులు తగ్గిపోయిన క్రమంలో తిరుమలలో పాతపద్ధతులను ఒక్కొక్కటిగా అమలుచేస్తు న్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే 2020 మార్చి 20వ తేదీన రద్దు చేసిన ఆర్జిత సేవలకు శుక్రవారం నుంచి భక్తులను తిరిగి అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ఏప్రిల్‌ నెలతో పాటు మే, జూన్‌ నెలలకు సంబంఽధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన, నిజపాద దర్శన ఆర్జిత సేవా టికెట్లను మార్చి 20వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌ కోటాను విడుదల చేశారు. ఆఫ్‌లైన్‌లోనూ డిప్‌ విధానం ద్వారా సేవ లు కేటాయించే విధానాన్ని కూడా మొదలుపెట్టాలని నిర్ణయించిన టీటీడీ.. తిరుమలలోని సీఆర్వో కార్యాలయంలో కౌంటర్లను సిద్ధం చేస్తోంది. శుక్రవారం నుంచి ఆర్జితసేవలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ముందురోజు అంటే గురువారం ఉదయం 11 నుంచి 5గంటల దాకా భక్తులు తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు ఎలక్ర్టానిక్‌ డిప్‌ ద్వారా భక్తులకు సేవను కేటాయిస్తారు. వీరి వివరాలను కౌంటర్ల వద్ద ఏర్పాటుచేసే ఎల్‌ఈడీ డిస్‌ప్లేలో చూపుతారు. అడ్వాన్స్‌ బుకింగ్‌లో ఆర్జితసేవలు పొందిన భక్తులు రాకపోతే ఆ టికెట్లను కరెంట్‌ బుకింగ్‌ కోటాకు మళ్లించి రాత్రి 8.30 గంటలకు రెండవ డిప్‌ ద్వారా భక్తులకు కేటాయిస్తారు. వీరు రాత్రి 11 గంటలలోపు టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
*నూతన దంపతుల కోసం..
వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవంలో కొత్త దంపతులు పాల్గొనే అవకాశాన్ని కూడా టీటీడీ శుక్రవారం నుంచి కల్పించనుంది. వివాహపత్రిక, లగ్నపత్రిక, ఫొటో గుర్తింపుకార్డుల ద్వారా ఈ టికెట్లను కేటాయించనున్నారు. మొదటవచ్చినవారికి మొదట కింద కల్యాణోత్సవ టికెట్లను కేటాయించనున్నారు. వివాహమైన ఏడు రోజులలోపు మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది. శ్రీవారి ఆలయంలో నిర్వహించే అంగప్రద క్షిణ (పొర్లుదండాలు) సేవను కూడా ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. ఈ మేరకు భక్తులకు రోజుకు 750 టోకెన్లను కేటాయించనున్నారు. అయితే శుక్రవారం అభిషేకం ఉన్న క్రమంలో వీరికి శ్రీవారి దర్శనాన్ని రద్దు చేశారు.

7. యాదాద్రిలో వేదాశీర్వచనాలు షురూ మహిమాన్విత స్వయంభు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి సన్నిధిలో వేదాశీర్వచనాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నెల 21వ తేదీ నుంచి 28వరకు బాలాలయంలో సప్తాహ్నిక పంచకుండాత్మక సహిత మహాకుంభాభిషేక మహోత్సవాలను పురస్కరించుకుని ఆలయ అధికారులు ఆర్జిత సేవలను నిలిపివేశారు. మహాకుంభ సంప్రోక్షణ తర్వాత ప్రధానాలయంలో వేదాశీర్వచనాలు, అర్చనలు, అభిషేకాలు, సుప్రభాతసేవ, సువర్ణ పుష్పార్చన సేవలు ప్రారంభించారు. ప్రధానాలయంలో ఇకనుంచి ఆర్జిత సేవలన్నీ భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకున్న యాదాద్రి క్షేత్రాన్ని దర్శించేందుకు భక్తుల సౌకర్యార్థం టీఎ్‌సఆర్టీసీ ప్రత్యేక మినీబస్సులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌ ఉప్పల్‌ నుంచి యాదాద్రి క్షేత్రానికి బుధవారం పలు బస్సు సర్వీసుల రాకపోకలు కొనసాగాయి.యాదాద్రి క్షేత్రాన్ని దర్శించుకునేందుకు విచ్చేసే భక్తులు మండుటెండలకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. భక్తులు దర్శన క్యూ కాంప్లెక్స్‌ల నుంచి ప్రధానాలయ తూర్పు రాజగోపురం ద్వారా గర్భాలయంలోకి ప్రవేశిస్తున్నారు. క్యూ కాంప్లెక్స్‌లో, ప్రధానాలయంలో ఉన్నంత వరకు ఎండల నుంచి భక్తులకు ఉపశమనం పొందుతున్నారు. గర్భగుడిలో స్వామివారి దర్శనానంతరం పశ్చిమంవైపు ఉన్న సప్తతల మహారాజగోపురం, వేంచేపు మండపం నుంచి భక్తులు బయటకు రావాలి. అయితే ఆలయ ప్రాంగణమంతా రాతిబండలు ఉండటంతో ఎండవేడిమికి భక్తులు నడిచేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఆలయ ప్రాంగణంలోని తిరువీధుల్లో మ్యాట్‌ లేకపోవడంతో ఎండలకు రాతిబండలపై నడవలేక ఉరుకులు, పరుగులు తీస్తున్నారు. ఎండల నుంచి ఉపశమనం పొందేలా మ్యాట్‌లను ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. కాగా, కొండపైన నూతనంగా నిర్మించిన ప్రసాదాల కౌంటర్‌ పై భాగంలో ఏర్పాటుచేసిన థర్మకోల్‌ షీట్స్‌ రెండు రోజులకే ఊడి పడుతున్నాయి.

8. శ్రీశైలంలో కన్నడ భక్తుల బీభత్సం
శ్రీశైలంలో అర్థరాత్రి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దేవాలయం పరిసరాల్లో కన్నడ భక్తులు బీభత్సం సృష్టించారు. కురుబల సత్రం టీ కొట్టు దగ్గర వ్యాపారస్తుడితో కర్నాటక భక్తుడు, షాప్ యజమాని మధ్య వాటర్‌ బాటిల్‌ విషయంలో వివాదం చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య మాటమాటా పెరిగడంతో వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఆగ్రహానికి గురైన షాపు యజమాని కర్నాటక భక్తుడిపై గొడ్డలితో దాడి చేశాడు. దాడిలో భక్తుడికి తీవ్రగాయాలయ్యాయి. తనతో ఉన్న మిగతా కన్నడ భక్తులు ఆగ్రహంతో టీషాప్‌ను దహనం చేశారు. సమీపంలోని షాపులపై కూడా దాడి చేసి.. ఫర్నీచర్‌ను కర్నాటక భక్తులు ధ్వంసం చేశారు. ఘటనపై స్థానికులు పోలీసులుకు సమాచారం ఇవ్వడంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి సంఘటనలు జరగకుండా శ్రీశైలం వీధుల్లో పోలీసులు భారీగా మోహరించారు.

9. ప్రసన్న వేంకటేశ్వరస్వామికి అభరణాల బహుకరణ
ఢిల్లీలోని ప్రసన్న వేంకటేశ్వరస్వామి, పద్మావతీ దేవి, గోదాదేవిలకు బుధవారం బంగారు తాపడం చేసిన ఆభరణాలు కానుకగా అందాయి. టీటీడీ ఢిల్లీ స్థానిక సలహా మండలి చైర్‌పర్సన్‌ ప్రశాంతిరెడ్డి ఈ ఆభరణాలను బహుకరించారు. మకర తోరణం, శంఖం, చక్రం,కిరీటం, అభయ వరద హస్తాలు, సూర్యకఠారి, పద్మపీఠాలు వీటిలో వున్నాయి.ఉగాది రోజున ఈ ఆభరణాలను ఉత్సవమూర్తులకు అలంకరించనున్నారు

10. 31 నుంచి టీటీడీలో కరెంట్‌ బుకింగ్‌
కరోనా కారణంగా నిలిపివేసిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఆఫ్‌లైన్‌లో లక్కీడిప్‌ ద్వారా భక్తులకు కేటాయించే కరెంట్‌ బుకింగ్‌ విధానం రెండేళ్ల విరామం తరువాత ఈ నెల 31న పునఃప్రారంభం కానుంది. ఇందుకోసం సీఆర్‌వో జనరల్‌ కౌంటర్లలో ఏర్పాట్లు పూర్తయ్యాయి.
***టికెట్ల కేటాయింపు ఇలా
నిర్దేశించిన వివిధ ఆర్జిత సేవా టికెట్ల కోసం తిరుమలలోని కరెంట్‌ బుకింగ్‌ కౌంటర్‌లో ఉదయం 11 నుండి సాయంత్రం 5 గంటల మధ్య నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రెండు అక్నాలెడ్జ్‌మెంట్‌ స్లిప్‌లు వస్తాయి. ఒక స్లిప్‌ యాత్రికునికి ఇస్తారు. ఇందులో వారి నమోదు , సేవ తేదీ, వ్యక్తి పేరు, మొబైల్‌ నంబర్‌ మొదలైనవి ఉంటాయి. మరో స్లిప్‌ను రిఫరెన్స్‌ కోసం కౌంటర్‌ సిబ్బంది ఉంచుకుంటారు. నమోదు చేసుకున్న గృహస్తుల సమక్షంలో సాయంత్రం 6 గంటలకు ఆటోమేటెడ్‌ ర్యాండమైజ్డ్‌ నంబరింగ్‌ సిస్టమ్‌ ద్వారా ఎల్‌ఈడీ స్క్రీన్లలో మొదటి డిప్‌ తీస్తారు. శుక్రవారం అడ్వాన్స్‌డ్‌ బుకింగ్‌ టికెట్లు కలిగి ఉన్న గృహస్తులు గురువారం రాత్రి 8 గంటలలోపు ఆర్జితం కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలి. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన గృహస్తులు వాటిని కొనుగోలు చేసేందుకు రాత్రి 11 గంటలలోపు మొబైల్‌ నంబర్లకు సమాచారం తెలియజేస్తారు. టికెట్లు పొందని వారికి కూడా ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలియజేస్తారు. యాత్రికులు డిప్‌ విధానంలో అవకాశాన్ని పొందడం కోసం ఆటో ఎలిమినేషన్‌ ప్రక్రియ అమలవుతుంది. యాత్రికులు డిప్‌ విధానంలో ఏదైనా ఆర్జిత సేవ పొంది ఉన్నట్టయితే 6 నెలల వరకు తిరిగి వారు ఆర్జిత సేవలను పొందేందుకు అనుమతించరు. సేవల నమోదు కోసం ఆధార్‌ తప్పనిసరి. ఎన్‌ఆర్‌ఐలైతే పాస్‌పోర్ట్‌ చూపాల్సి ఉంటుంది. యాత్రికులు ఒరిజినల్‌ ఫొటో గుర్తింపు కార్డుతో స్వయంగా హాజరుకావాలి. కొత్తగా పెళ్లయిన జంటలకు నిర్ణీత కోటా ప్రకారం వివాహ కార్డు, లగ్న పత్రిక, ఒరిజినల్‌ ఫొటో గుర్తింపు కార్డు సమర్పిస్తే కల్యాణోత్సవం టికెట్ల కేటాయింపు జరుగుతుంది. వివాహం జరిగి 7 రోజులు మించకుండా ఉండాలి. ముందుగా వచ్చిన వారికి ముందు అనే ప్రాతిపదికన టికెట్లు కేటాయిస్తారు.
*31 నుంచి అంగప్రదక్షిణం టోకెన్లు
అంగప్రదక్షిణం టోకెన్లను కూడా టీటీడీ పునరుద్ధరించింది. ఈ నెల 31వ తేదీ నుంచి ఈ టోకెన్లు జారీ చేస్తారు. తిరుమలలోని పీఏసీ–1లోని రెండు కౌంటర్లలో ప్రతిరోజూ 750 టోకెన్లు జారీ చేస్తారు. సాధారణంగా శుక్రవారాల్లో అభిషేకం కారణంగా భక్తులకు దర్శనం లేకుండా అంగప్రదక్షిణకు మాత్రమే అనుమతిస్తారు. ఈ కారణంగా ఏప్రిల్‌ 1న శుక్రవారం అభిషేకం కారణంగా అంగప్రదక్షిణ భక్తులకు దర్శనం ఉండదు