NRI-NRT

అమెరికా ఎంబసీ బోర్డుపై బైడన్ వ్యతిరేక పోస్టర్లు

అమెరికా ఎంబసీ బోర్డుపై బైడన్ వ్యతిరేక పోస్టర్లు

చైనా చెలరేగితే రష్యా రక్షిస్తుందా? అంటూ భారత్‌ను ఉద్దేశించి అమెరికా జాతీయ భద్రతా ఉప-సలహాదారు దలీప్ సింగ్ బెదిరింపు తరహా వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటలకే ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం బోర్డుపై బైడెన్ వ్యతిరేక పోస్టర్లు వెలిసాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఈ పోస్టర్లు అంటించారు. వీరిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసినట్టు అధికారులు శనివారంనాడు తెలిపారు. యూఎస్ ఎంబసీ బోర్డుపై వెలిసిన పోస్టరులో…”నమ్మదగని బైడెన్ యంత్రాంగం. భారత్‌ను బెదరించడం ఆపండి. మీరు మాకు అక్కర్లేదు. చైనాకు వ్యతిరేకంగా ఇండియా అవసరమే అమెరికాకు ఉంది. క్రమశిక్షణ, సాహసవంతులైన భారత బలగాలను చూసి మేము గర్విస్తున్నాం. జై జవాన్ జై భారత్” అని రాసి ఉంది. శుక్రవారం రాత్రి 10.15 గంటలకు పోస్టర్ అంటించినట్టు సమాచారం తమకు అందిందని, దాంతో ఢిల్లీ ప్రివెన్షన్ ఆఫ్ డీఫేస్‌మెంట్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్‌లోని సెక్షన్ 3 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అమృత గుగులోథ్ తెలిపారు. అమెరికా ఎంబసీ గేట్ నెంబర్ 7 సమీపంలోని సైన్‌బోర్డుపై అగంతకులు ఈ పోస్టర్ అంటించారు. పోస్టర్ పైన హిందుసేన అనే లోగో ఉంది. ట్విట్టర్ ద్వారా ఆ సంస్థ కూడా దీనిని ధ్రువీకరించింది. హిందుసేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా రెండు పోస్టర్లు ట్వీట్ చేయగా, ఇందులో ఒకటి యూఎస్ ఎంబసీ వద్ద అంటించిన పోస్టర్ కనిపిస్తోంది. డెమోక్రాట్ వార్‌మాంగర్లకు నిధులు, సపోర్ట్ నిలిపేయాలని భారతసంతతి అమెరికన్లను రెండో ట్వీట్‌లో కోరారు.