DailyDose

డ్రగ్స్‌ కేసులో నాగబాబు కుమార్తెకు నోటీసులు – TNI తాజా వార్తలు

డ్రగ్స్‌ కేసులో నాగబాబు కుమార్తెకు నోటీసులు – TNI తాజా వార్తలు

*బంజారాహిల్స్లోని ర్యాడిసన్ బ్లూ హోటల్పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో పబ్‌ యజమానులతో సహా సుమారు 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పబ్‌లో డ్రగ్స్‌(కొకైన్‌)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, పోలీసుల రాకతో పబ్‌లోని యువతీ యువకులు డ్రగ్స్‌ను కిటికీ నుంచి కింద పడేశారు. కాగా, బయట పడేసిన మత్తుపదార్థాలను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ఈ కేసులో ప్ర‌స్తుతం పోలీసుల అదుపులో ఐదుగురు ఉన్నారు. పట్టుబడిన వారిలో నాగబాబు కుమార్తె నిహారిక, టీడీపీ ఎంపీ కుమారుడు, మాజీ ఎంపీ కుమారుడు తదితర ప్రముఖులు ఉన్నారు..కాగా, ఈ కేసులో నిహారికాను విచారించిన తర్వాత ఆమెకు నోటీసులు ఇచ్చారు. మరోసారి విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. అర్ధరాత్రి పబ్‌పై దాడులు.. పోలీసుల అదుపులో ప్రముఖ సింగర్‌..మరోవైపు.. పబ్‌ విషయంలో బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. పబ్‌పై గతంలో స్థానికులు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదు. అయితే, పబ్‌ మాజీ ఎంపీ కుమార్తెది కావడంతో పోలీసుల చూడనట్టు వదిలేశారని తెలుస్తోంది.

*లంగాణను డ్రగ్స్ కు అడ్డాగా తయారు చేశారని బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణలో డ్రగ్స్ విచ్చలవిడిగా వినియోగం, అమ్మకాలు జరుగుతున్నా పోలీసులు వాటిని అరికట్టలేకపోతున్నారని రాజాసింగ్ ఆరోపించారు. పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని, దీంతో డ్రగ్స్ అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ కట్టడికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలి ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. గతంలో నమోదైన డ్రగ్స్ కేసులు ఏమయ్యాయని రాజాసింగ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.కేసులో వీఐపీలు ఉంటే ఆ కేసును నీరుగారుస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని, పోలీసల దాడిలో దొరికిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

*శ్రీలంకలో కేజీ బియ్యం ధర 220.. ఒక గుడ్డు రూ.30
శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆహార పదార్థాలు, మందుల ధరలు చూసి శ్రీలంక ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రాజధాని కొలంబోలో కేజీ బియ్యం ధర మన కరెన్సీలో రూ.220కాగా, గోధుమల ధర రూ.190కి చేరింది. చక్కెర కేజీ రూ.240, కొబ్బరి నూనె లీటరు ధర రూ.850, ఒక కోడిగుడ్డు రూ.30, కేజీ మిల్క్ పౌడర్ ధర రూ.1,900గా ఉంది. ఆర్థిక మాంద్యం, శ్రీలంక కరెన్సీ క్షీణత వల్ల దేశంలో ధరల పెరుగుదల సంభవించింది. ఒకవేళ ధర చెల్లించి కొనుక్కుందామన్నా కొన్ని చోట్ల సరుకులు దొరకని పరిస్థితి నెలకొంది. చాలామంది షాపులు, సూపర్ మార్కెట్ల ముందు బారులు తీరి, చివరకు సరుకులు అయిపోయి ఖాళీ చేతులతో వెనుదిరుగుతున్న దృశ్యాలు చాలా కనిపిస్తున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ కొనసాగుతోంది. సోమవారం ఉదయం వరకు కర్ఫ్యూ విధించారు. నిత్యవసరాలు కొనుగోలు చేసేందుకు మాత్రమే పరిమితంగా ప్రజల్ని అనుమతిస్తున్నారు.

*తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న టెట్ (టీచర్స్ ఎల్జిబిలిటీ టెస్ట్) కోసం పోటీ పడే అభ్యర్థులకు టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు స్పెషల్ ట్రైనింగ్ క్లాసులు ఏర్పాటు చేసాయి. ఏప్రిల్ 4వ తేదీ సోమవారం నుండి జూన్ ఐదవ తేదీ వరకు రెండు నెలలు 60 రోజుల పాటు పాఠ్యాంశాలు ప్రసారం కానున్నాయి. టి-సాట్ నెట్వర్క్ ఛానళ్ల సీఈవో రాంపుపురం శైలేష్ రెడ్డి ఆదివారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో ప్రసారాలకు సంబంధించిన వివరాలు వెల్ల్లడించారు. సోమవారం నాల్గవ తేదీన ఉదయం ఎనిమిది గంటల నుండి ఎనిమిదిన్నర గంటల వరకు అరగంట పాటు మొదటి పేపర్, ఎనిమిదిన్నర నుండి తొమ్మిది గంటల వరకు మరో అరగంట పాటు రెండవ పేపర్ కు సంబంధించిన పాఠ్యాంశాలు టి-సాట్ విద్య ఛానల్ లో ప్రసారాలు ప్రారంభమై జూన్ 5వ తేదీన ముగుస్తాయన్నారు. సోమవారం నుండి వారం రోజుల పాటు ఉదయం 10 నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నాం రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు టెట్ మొదటి, రెండవ ప్రశ్న పత్రాలకు సంబంధించిన పాఠ్యాంశాలపై ప్రత్యేక ప్రత్యక్ష (స్పెషల్ లైవ్ లెసన్స్) ప్రసారాలుంటాయని శైలేష్ రెడ్డి వివరించారు. ఏప్రిల్ నాల్గవ తేదీ సోమవారం నుండి శనివారం వరకు ఆరు రోజుల పాటు 12 పేపర్లపై ప్రత్యేక అనుభవం కలిగిన ఉపన్యాకులచే అవగాహన పాఠ్యాంశ ప్రసారాలుంటాయని సీఈవో స్పష్టం చేశారు. తెలుగు, ఇంగ్లీష్, సోషల్ స్టడీస్, మెథడాలజీ, సోషల్ స్టడీస్ కంటెంట్, మ్యాథ్స్, సైన్స్, ఈవీఎస్, బయాలజీ, ఛైల్డ్ ఉడ్ డెవలప్ మెంట్ అండ్ పెడగాజీ సబ్జెక్టులపై పాఠ్యాంశాలు బోధిస్తారన్నారు. ఆరు రోజుల స్పెషల్ లైవ్ తో పాటు (రెండు నెలలు) 60 రోజులు, 120 పాఠ్యాంశ భాగాలు ప్రసారమౌతాయన్నారు.

*ఈనెల 10న జరిగే భద్రాచలం శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవానికి రావాల్సిందిగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి,భద్రాచల ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానించారు. ఈసందర్భంగా ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రిని కలిసి సీతారాముల కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు

*రంజాన్ ఉపవాస దీక్షలు పవిత్రమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఇస్లాం మతం పాటించే ప్రతి ఒక్క ముస్లిం సోదరుడికి తన తరఫునజనసేన పక్షాన పవన్‌ కల్యాణ్‌ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసాన్ని ముస్లింలు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ముస్లింలు నెల రోజుల పాటు ఉపవాస దీక్షలుప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఉదయం ఉపవాస దీక్షను ప్రారంభించి సాయంత్రం ఇఫ్తార్‌తో ఉపవాస దీక్షలను ముగిస్తారు. రంజాన్‌ మాసం సందర్భంగా మసీదులను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు

*ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఢిల్లీకి బయలు దేరారు. ఆయనతో పాటు ఆయన సతీమణి, సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మల, కూతురు, కుమారుడు ఉన్నారు. ఢిల్లీలో సోమవారం జరగనున్న తెలంగాణ కాంగ్రెస్‌ ముఖ్యనేతల సమావేశానికి రావాల్సిందిగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ నుంచి జగ్గారెడ్డికి పిలుపు వచ్చిన విషయం తెలిసిందే. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై ఇటీవలి కాలంలో తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన జగ్గారెడ్డి.. సోమవారం నాటి సమావేశంలో ఎలా వ్యవహరిస్తారోనన్న ఆసక్తి కాంగ్రెస్‌ వర్గాల్లో నెలకొన్నది.

*సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ బావాజీపేటలోని నవజీవన్ బాలభవన్‌లో అనాథ పిల్లల మధ్య కేక్ కట్ చేసి పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవజీవన్ బాల భవన్ సంస్థ తనకు మంచి స్పూర్తినిచ్చిందని, పిల్లలకు సేవ చేస్తూ వారి సన్మార్గంలో నడిపిస్తూ ఉన్నతికి నవజీవన్ సంస్థ కృషి చేస్తోందని కొనియాడారు. పిల్లలు చదువు కుంటే ఎవరైనా ఉన్నత స్థానానికి చేరుకోవచ్చునని అన్నారు. విద్యార్థులు శ్రద్దగా చదువుకుని జీవితంలో పైకి ఎదగాలని సూచించారు. విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు వెళ్లాలన్నారు. గొప్ప వ్యక్తుల జీవిత కథలను పిల్లలు చదవాలని.. వారి నుంచి స్పూర్తి పొంది గొప్ప స్థానానికి వెళ్లాలని కోరుకుంటున్నానని లక్ష్మి నారాయణ అన్నారు.

* జిల్లా పరిషత్‌ల విభజన ఇప్పట్లో లేనట్లేనని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జడ్పీల విభజనపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని తెలిపారు. ప్రస్తుతమున్న జిల్లా పరిషత్‌ల నుంచే పాలన కొనసాగిస్తామని చెప్పారు. అధ్యయనం తర్వాత జడ్పీల విభజనపై విధివిధానాలు ప్రకటిస్తామని బొత్స స్యతనారాయణ తెలిపారు. 13 జిల్లాల నవ్యాంధ్ర… ఇక 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌గా మారింది. కొత్త జిల్లాలను ఖరారు చేస్తూ శనివారం అర్ధరాత్రి తర్వాత ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌లు జారీ చేసింది. రెవెన్యూ శాఖ స్పెషల్‌ సీఎస్‌ జి.సాయిప్రసాద్‌ వీటిని విడుదల చేశారు. అంతకుముందు కొత్త జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు ఎస్పీలను నియమిస్తూ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ అయ్యాయి

*చిత్తూరు జిల్లా సదుం మండలం చెరుకువారిపల్లె సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి ఓ ఏనుగు మృతిచెందింది. ఈ విషయాన్ని శనివారం ఉదయం స్థానికులు గుర్తించారు. ఈ విషయం తెలిసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డిచింతల రామచంద్రారెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. పొలం గట్టున పచ్చని గరికను తింటూ ప్రమాదవశాత్తు గట్టుమీదుగా తీసిన విద్యుత్‌ వైరును నమలడంతో విద్యుత్‌షాక్‌తో ఏనుగు మృతి చెందినట్లు తెలుస్తోందని ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌ బాలకృష్ణారెడ్డి వివరించారు. తిరుపతి జూపార్కు డాక్టర్‌ తోషీబాత్‌సింగ్‌ ఆధ్వర్యంలో ఏనుగు మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించారు. సమీపంలోనే మృతదేహాన్ని ఖననం చేసి అటవీ సిబ్బంది గౌరవవందనం సమర్పించారు. గజరాజులు కదలికల పట్ల స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖాధికారులు హెచ్చరించారు. కాగామూడు రోజులుగా మండల పరిధిలోని జోగివారిపల్లెచెరుకువారిపల్లెయర్రాతివారిపల్లె తదితర పంచాయతీల్లోని అటవీ శివారు ప్రాంతాల్లో ఏనుగుల గుంపు పంటలను ధ్వంసం చేశాయి. వీటి దాడిలో ఎల్లప్ప అనే వ్యక్తి మృత్యువాత పడిన విషయం తెలిసిందే.