Devotional

గోదావరి తీరాన భోళా శంకరుడి దివ్యధామం- TNI ఆధ్యాత్మికం

గోదావరి తీరాన భోళా శంకరుడి దివ్యధామం- TNI ఆధ్యాత్మికం

1. ఉజ్జయినిలో జ్యోతిర్లింగ క్షేత్రం.. గోదావరి తీరాన భోళా శంకరుడి దివ్యధామం
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కొత్తగా నిర్మించిన భోళా శంకరుడి దివ్యధామంతో.. గోదావరి తీరం పునీతమైంది. రెండు ఎకరాల విస్తీర్ణంలో మహాకాళేశ్వరుడి ఆలయాన్ని రోటరీ సంస్థ నిర్మించింది. ఉజ్జయినిలోని జ్యోతిర్లింగ క్షేత్రం మాదిరిగానే… ఈశ్వరుడికి ప్రీతిపాత్రమైన చితాభస్మం అభిషేకం ఈ ఆలయ ప్రత్యేకత. ప్రాకారాలు, రాజగోపురాలు, మండపాలతో కైలాసాన్ని తలపించే విధంగా ఉన్న ఈ దేవాలయం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని గోదావరి తీరంలో మరో దివ్య క్షేత్రం నిర్మితమైంది. ఇన్నీసుపేటలోని కైలాస భూమి దగ్గర.. రెండెకరాల విస్తీర్ణంలో మహాకాళేశ్వర ఆలయం అద్భుతంగా నిర్మించారు. రాజమహేంద్రవరంలో రెండు స్మశాన వాటికలను కైలాస భూమి పేరిట రోటరీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. రోటరీ సంస్థ నిర్వాహకుడు పట్టపగలు వెంకట్రావు మహేకాళేశ్వర్ ఆలయానికి రూపకల్పన చేశారు. ఉజ్జయిని ఆలయం మాదిరిగా.. ఇక్కడ భోళా శంకరుడికి చితాభస్మంతో అభిషేకాలు చేయాలని.. నిర్ణయించుకున్నారు. ఐదేళ్లపాటు శ్రమించి మహాకాళేశ్వర ఆలయాన్ని ఎంతో అందంగా నిర్మించారు.మహాకాళేశ్వర ఆలయం ప్రత్యేకతను కలిగి ఉండటం కోసం… చుట్టూ ప్రాకారం, రాజగోపురాలు నిర్మించారు. నాలుగు దిక్కులు, నాలుగు వేదాలు ప్రతిబింబించేలా.. నాలుగు దర్శన ద్వారాలు, నాలుగు మండపాలు, నాలుగు నందులను ఆలయ ప్రాగణంలో తీర్చిదిద్దారు. గర్భాలయంలో సుమారు 9 అడుగుల మహా శివలింగాన్ని ప్రతిష్ఠించారు. దక్షిణాన మహాకాళి అమ్మవారు, ఉత్తరాన చండికేశ్వర అమవార్లు కొలువుదిరారు.ఆలయ ప్రాకారం చుట్టూ.. 64 ఉపాలయాలను నిర్మించారు. శైవ, శక్తి స్వరూపాలు, అష్టలక్ష్ములు, దశావతారాలను ద్వైత, అద్వైత సిద్ధాంతాలకు అనుగుణంగా ఆలయం నిర్మాణం చేశారు. ఆలయ పైభాగంలో రాజస్థాన్‌ శిల్ప కళా వైభవంతో దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్టాపన చేశారు. ఈ దేవాలయంలో ఉన్న నవగ్రహ మండపం నాగ బంధాలతో నిర్మితమై ఉంది. రెండు కైలాస భూమి నుంచి నిత్యం చితాభస్మాలను సేకరించి..ఉజ్జయిని తరహాలో పరమేశ్వరుడికి అభిషేకం చేస్తామని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు.ఆలయ శిల్పాకళా నైపుణ్యం.. విశేషంగా ఆకట్టుకుంటోందని భక్తులు చెబుతున్నారు. ఏప్రిల్‌ 3వ తేదీన ఈ ఆలయ ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో ఆలయంలో భక్తులకు దర్శనం కల్పించనున్నారు

2. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న మంత్రులు
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రులకు దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. మొదట ధ్వజస్తంభం పూజలు చేశారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లను దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత అర్చకులు ఆశీర్వచనం చేయగా.. ఈవో గీత తీర్థ ప్రసాదాలను అందజేశారు.

3. చిన్నతిరుపతి ఆలయాన్ని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జి.శ్రీదేవి సందర్శించారు. కుటుంబసమేతంగా ఆలయానికి వచ్చిన ఆమెకు దేవస్థానం అధికారులుఅర్చకులు ఘనస్వాగతం పలికారు. స్వామిఅమ్మవార్లను దర్శించుకుని వారు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ముఖమండపంలో అర్చకులు స్వామివారి శేషవస్త్రాన్ని ఇచ్చి వేదాశీర్వచనం అందించారు. అనంతరం దేవస్థానం ఏఈవో రావిపాటి లక్ష్మణస్వామి శ్రీవారి మెమెంటోప్రసాదాలను అందజేశారు

4.సంబరం.. పిడకల సమరం
కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పలలో పిడకల సమరం ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. సంప్రదాయం ప్రకారం.. గ్రామస్థులు రెండువర్గాలుగా విడిపోయి పిడకలతో కొట్టుకోవడం అందరినీ అలరించింది. ఏటా ఉగాది మరుసటి రోజు పిడకల సమరం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా తొలుత.. కారుమంచి గ్రామం నుంచి పెద్దరెడ్డి వంశస్థుడైన నరసింహారెడ్డి గుర్రంపై మందీమార్బలం, తప్పెట్లు మేళతాళాలతో కైరుప్పల గ్రామానికి ఆదివారం సాయంత్రం వచ్చారు. వీరభద్రస్వామి, కాళికాదేవి ఆలయంలో పూజలు చేసి వెనుదిరగగానే పిడకల సమరం మొదలైంది. అక్కడ గుమిగూడిన జనం వీరభద్రస్వామి, భద్రకాళి వర్గీయులుగా విడిపోయారు. తమను తాము రక్షించుకుంటూ ఎదుటి వారిపై పిడకలు విసురుకున్నారు. సమరం ముగిసిన తర్వాత గ్రామ పెద్దలు పంచాయితీ చేసి దేవతామూర్తుల వివాహానికి అంగీకారం తెలిపారు. కాగా, ఈ వేడుక చూడ్డానికి చుట్టుపక్క గ్రామాల భక్తులు, ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. ఇదీ నేపథ్యం.. ప్రచారంలో ఉన్న కథ ప్రకారం వీరభద్రస్వామి, కాళికాదేవి ప్రేమించుకుంటారు. పెద్దల అంగీకారంతో పెళ్లి కుదురుతుంది. అయితే పెళ్లి విషయంలో వీరభద్రస్వామి ఆలస్యం చేయడంతో కాళికాదేవి ఆగ్రహిస్తుంది. వీరభద్రుడు సేదదీరేందుకు హంద్రీనది ఒడ్డుకు వస్తుండగా కాళికాదేవి వర్గీయులు ఆయనపై పిడికలతో దాడికి దిగుతారు. ఈ విషయాన్ని గమనించిన గ్రామ దేవతలైన కార్తికేయ, గిడ్డి ఆంజనేయస్వామి.. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చి పెళ్లి జరిపిస్తారు. అప్పటి నుంచి పిడకల సమరం ఆనవాయితీగా వస్తోందని పెద్దలు చెబుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున వీరభద్రస్వామి, కాళికాదేవి పెళ్లిని అంగరంగ వైభవంగా జరపనున్నారు.