Business

దూసుకెళుతున్న స్టాక్ మార్కెట్లు – TNI వాణిజ్య వార్తలు

దూసుకెళుతున్న స్టాక్ మార్కెట్లు – TNI వాణిజ్య వార్తలు

*దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఈ వారం భారీ లాభాలతో మొదలయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 1290 పాయింట్లు పెరిగి.. 60 వేల 556 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 334 పాయింట్ల లాభంతో 18 వేల 004 వద్ద ఉంది. హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీన ప్రకటన వెలువడడం వల్ల ఆయా షేర్లు దూసుకెళ్తున్నాయి. సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన మొదటి గంటలోనే మదుపర్ల సంపద రూ. 3లక్షల కోట్లకు పైగా పెరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు 12.81 శాతం పెరిగి రూ. 2,765కి చేరుకోగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్టాక్ దాదాపు 10.22 శాతం పెరిగి రూ.1,660.20కి చేరుకుంది. బజాజ్ ఫైనాన్స్, ఎల్టీ, ఎన్టీపీసీ, భారత్ఎయిర్టెల్, కొటాక్ బ్యాంక్ లాభాల్లో ఉన్నాయి. ఐటీసీ, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, మారుతి, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫీ కంపెనీలు డీలాపడ్డాయి.ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. జపాన్ బెంచ్ మార్క్ నిక్కీ నష్టాల్లో ఉండగా.. హాంగ్కాంగ్, దక్షిణ కొరియా సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. వడ్డీ రేట్లపై ఏప్రిల్ 8న వెలువడనున్న ఆర్బీఐ పాలసీ ప్రకటనతో పాటు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ముడి చమురు తరలింపు, విదేశీ నిధుల ప్రవాహంతో పాటు తయారీ, సేవల రంగాలకు సంబంధించిన పీఎంఐ డేటాతో ముడిపడి ఉన్న పరిణామాలు మదుపర్లను ప్రభావితం చేస్తున్నాయని నిపుణులు అంటున్నారు.
*వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లలో సరికొత్త ఆల్‌టైం రికార్డు నమోదైంది. ఈ ఏడాది మార్చిలో జీఎస్‌టీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 15 శాతం వృద్ధితో రూ.1.42 లక్షల కోట్లు అధిగమించాయని కేంద్ర ఆర్థిక శాఖ శుక్రవారం ప్రకటించింది. ఆర్థిక సంవత్సరాంతం కావడంతో పాటు కొవిడ్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టడం తో ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక కార్యకలాపాలు జోరందుకోవడం, పన్ను ఎగవేతలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేయ డం ఇందుకు దోహదపడింది. గత ఆల్‌టైం రికార్డు ఆదాయమైన రూ.1.40 లక్షల కోట్లు ఈ ఏడాది జనవరిలో నమోదైంది. 2021-22 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి (జనవరి-మార్చి) జీఎస్‌టీ స్థూల వసూళ్ల సగటు రూ.1.38 లక్షల కోట్లుగా ఉండగా.. మూడో త్రైమాసికానికి (అక్టోబరు-డిసెంబరు) రూ.1.30 లక్షల కోట్లు, రెండో త్రైమాసికంలో (జూలై-సెప్టెంబరు) రూ.1.15 లక్షల కోట్లు, తొలి త్రైమాసికంలో (ఏప్రిల్‌-జూన్‌) రూ.1.10 లక్షల కోట్లుగా నమోదైంది.
*శంషాబాద్‌లోని జీఎంఆర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణికుల రద్దీ క్రమంగా పుంజుకుంటోంది. గత నెల 27న ఈ విమానాశ్రయం నుంచి ఒకే రోజు దాదాపు 53,000 మంది దేశీయ విమాన ప్రయాణికులు ప్రయాణించారు. ఇది కొవిడ్‌కు ముందున్న రోజువారీ సగటుతో పోలిస్తే 109 శాతం. అదేరోజు ఈ ఎయిర్‌పోర్టు నుంచి 374 ఎయిర్‌ ట్రాఫిక్‌ మూవ్‌మెంట్స్‌ (ఏటీఎం) నమోదయ్యాయి. కొవిడ్‌ తర్వాత శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఇంత పెద్దఎత్తున విమానాల మూవ్‌మెంట్స్‌ నమోదవడం ఇదే మొదటిసారని అధికార వర్గాలు తెలిపాయి.
*రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పైనా కనిపిస్తోంది. ఈ యుద్ధంతో అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు ధర భారీగా పెరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలోని ధర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు సరఫరా చేసే దిగుమతి చేసుకునే బొగ్గు ధరా గణనీయంగా పెరిగిపోయింది. దక్షిణాఫ్రికా నుంచి దిగుమతి చేసుకునే బొగ్గులో ఐదు లక్షల టన్ను లు.. టన్ను 526.50 డాలర్ల (సుమారు రూ.40,000) చొప్పున, మరో 7.5 లక్షల టన్నులు.. టన్ను 230.08 డాలర్ల (సుమారు రూ.17,480) చొప్పున ఈ కేంద్రాలకు అవసరమైన బొగ్గును సరఫరా చేసేందుకు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ రెండు టెండర్లు దాఖలు చేసింది. అలాగే అగర్వాల్‌ అనే కంపెనీ ఇంతకంటే ఎక్కువ ధర కోట్‌ చేసింది. దీంతో ఈ రెండు టెండర్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కే దక్కుతాయని భావించారు.
*నివాస గృహాలకు డిమాండ్‌ పెరిగినా, బిల్డర్లకు అమ్ముడుపోని ఇళ్ల (ఇన్వెంటరీ) భారం తప్పడం లేదు. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో బిల్డర్ల వద్ద 7,35,852 అమ్ముడుపోని ఇళ్లు, ఫ్లాట్లు ఉన్నాయి. ప్రస్తుత అమ్మకాల వృద్ది రేటు ప్రకారం వీటిని అమ్మేందుకు బిల్డర్లకు ఎంత లేదన్నా 42 నెలల సమయం పడుతుంది. ప్రాపర్టీ కన్సల్టెన్సీ, బ్రోకరేజీ సంస్థ ప్రాప్‌టైగర్‌ ఈ విషయం తెలిపింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది ఐదు నెలలు తక్కువ.
*మార్చితో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాబడుల విషయంలో చిన్న కంపెనీల షేర్లు (స్మాల్‌క్యాప్‌) పెద్ద, మిడ్‌క్యాప్‌ షేర్లను మించి పోయాయి. ఈ కాలంలో బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ సూచీ షేర్లు మదుపరులకు సగటున 36.64 శాతం లాభాలు పంచాయి. ఇదే సమయంలో మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ షేర్లు 19.45 శాతం, లార్జ్‌క్యాప్‌ షేర్లకు ప్రాతినిధ్యం వహించే సెన్సెక్స్‌ షేర్లు సగటున 18.29 శాతం లాభాలు పంచాయి. కొవిడ్‌, అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలోనూ స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ షేర్లు మంచి లాభాలు పంచడం విశేషం. ఈ నెలలో కూడా మార్కెట్లో స్మాల్‌ క్యాప్‌ షేర్ల ఇండెక్స్‌ ర్యాలీ కొనసాగుతుందని మార్కెట్‌ వర్గాల అంచనా.
*నిఫ్టీ గత వారం 17004- 17704 పాయింట్ల మధ్యన కదలాడి 517 పాయింట్ల లాభంతో 17670 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 17975 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది.జూ 30, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 16904, 17122, 17437, 17069 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైనే ఉండడం దీర్ఘకాలిక బుల్లిష్‌ ట్రెండ్‌ సంకేతం.
*మధుకాన్‌ ఇన్‌ఫ్రా అనుబంధ సంస్థ సింహపురి ఎనర్జీ లిమిటెడ్‌ విలువను తగ్గించి విక్రయించాలన్న ప్రతిపాదనపై హైకోర్టు శుక్రవారం స్టే విధించింది. ఈ సంస్థ గతంలో ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం నుంచి రుణాలు పొందించింది. ఈ మొత్తం రుణాలను వన్‌ టైం సెటిల్‌మెంట్‌ కింద రూ. 800 కోట్లు చెల్లిస్తామని ప్రతిపాదించింది.
*మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (ఎంఈఐఎల్‌) హైడ్రోజన్‌ ఇంధన రంగంలోకి అడుగు పెడుతోంది. వ్యాపార విస్తరణలో భాగంగా పర్యావరణ అనుకూల రంగాల్లోకి ప్రవేశించాలని ఎంఈఐఎల్‌ నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా గ్రూప్‌ కంపెనీ డ్రిల్‌మెక్‌ ఎస్‌పీఏ ద్వారా హైడ్రోజన్‌ ఇంధన ఉత్పత్తిలోకి అడుగు పెడుతున్నట్లు ఎంఈఐఎల్‌ తెలిపింది. హైడ్రోజన్‌ ఇంధన రంగంలో డ్రిల్‌మెక్‌ 3.5 కోట్ల యూరోల (దాదాపు రూ.300 కోట్లు) పెట్టుబడులు పెట్టనుంది. ఎలకా్ట్రలిసిస్‌, పైరోలిసిస్‌ వంటి అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీల ద్వారా హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త టెక్నాలజీల ద్వారా హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడానికి ‘ఐడ్రోజనా’ పేరుతో స్టార్టప్‌ కంపెనీని డ్రిల్‌మెక్‌ ప్రారంభించిందని డ్రిల్‌మెక్‌ ఎస్‌పీఏ సీఈఓ సిమన్‌ ట్రెవిసాని తెలిపారు.