Kids

బాలికపై భూతవైద్యుడి దాడి -TNI నేర వార్తలు

బాలికపై భూతవైద్యుడి దాడి  -TNI నేర వార్తలు

*వైద్యం పేరుతో బాలికను దారుణంగా కొట్టడంతోపాటు, కాల్చి గాయాలు చేసిన ఘటనలో భూతవైద్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఝార్ఖండ్‌లోని చాత్రా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చాత్రా జిల్లాకు చెందిన పద్నాలుగేళ్ల బాలిక.. హోలీ పండుగ తర్వాత అనారోగ్యం పాలైంది. దీంతో బాలిక తల్లిదండ్రులు దెయ్యం సోకిందేమోననే అనుమానంతో మౌలానా వాహిద్ అనే భూతవైద్యుడికి చూపించారు. అతడు బాలికకు దెయ్యం పట్టిందని, అది వదలాలంటే తను చెప్పినట్లు చెయ్యాలని నమ్మించాడు. తర్వాత నాలుగు రోజులపాటు అనేక క్షుద్రపూజలు నిర్వహించాడు. ఈ క్రమంలో బాలికను దారుణంగా కొట్టాడు. ముఖం, పెదవులు, చేతులపై కాల్చి వాతలు పెట్టాడు. దీంతో బాలిక అనారోగ్యం మరింత క్షీణించింది. మతిస్థిమితం కోల్పోయింది. బాలిక తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. భూతవైద్యుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు భూతవైద్యుడిని అరెస్టు చేశారు.

* తెలంగాణలో డ్రగ్‌ మాఫియా చాప కిందనీరులా విస్తరిస్తోంది. గంజాయి, డ్రగ్స్‌ వంటి ఇతర మత్తు పదార్థాలకు విద్యార్థులు, యువకులే ఎక్కువగా బానిసలవుతున్నారు.ఇటీవలే రాష్ట్రంలో తొలి డ్రగ్స్‌ మరణం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా సూర్యాపేట జిల్లా కోదాడలో గంజాయికి బానిసైన 15 ఏళ్ళ కొడుక్కి తల్లి ఘాటు ట్రీట్‌మెంట్‌ ఇచ్చిం ది. కొడుకుని స్తంభానికి కట్టేసి కళ్లల్లో కారం పోసి చితకబాదింది.పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన బాలుడు గత రెండు సంవత్సరాలుగా గంజాయికి బానిసయ్యాడు. తల్లి పలుమార్లు నచ్చజెప్పినా కుమారుడి తీరు మారలేదు. దీంతో మరోసారి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా మాట వినకపోవడంతో విసిగెత్తిన తల్లి కొడుకుని వీధుల్లోకి లాక్కొచ్చి విద్యుత్‌ స్తంభానికి కట్టేసింది. గంజాయి మత్తుతో చిత్తయిపోతున్న కొడకు కళ్లల్లో కారం కొట్టి దేహశుద్ధి చేసింది. ఈ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి..

* పూరీ క్షేత్రంలో వివాదం.. 40 పొయ్యిలు ధ్వంసం
పూరీ జగనాథ స్వామి మందిరంలోని వంటశాలలో దుండగులు విధ్వంసం సృష్టించారు! 40 పొయ్యిలను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపడుతున్నారు.ఒడిశా పూరీలోని జగన్నాథ స్వామి గుడిలో అనూహ్య ఘటన జరిగింది. ఆనంద్ బజార్లో ఉన్న మందిర వంటశాలలో మట్టితో చేసిన 40 పొయ్యిలను దుండగులు ధ్వంసం చేశారు. ఆర్థికపరమైన అంశాల్లో తలెత్తిన వివాదమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. పోలీసులు, ఆలయ అధికారులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ఆలయ వంటశాల ఆవరణలో ఎలాంటి సీసీటీవీ కెమెరాలు లేవు. ఈ నేపథ్యంలో ఎవరు ఈ చర్యకు పాల్పడ్డారనే విషయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.పూరీ ఆలయంవిచారణ కోసం ఇద్దరు సభ్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ సేవకులు, భద్రతా సిబ్బందిని వీరు విచారిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసి.. కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని పూరీ జిల్లా మేజిస్ట్రేట్ సమర్థ్ బర్మ తెలిపారు. రెండు రోజుల్లోగా దర్యాప్తు నివేదిక అందించాలని ఆదేశించినట్లు వెల్లడించారు. ధ్వంసమైన పొయ్యిల ద్వారా 15వేల మందికి పైగా భక్తులకు భోజనం తయారు చేయవచ్చు. ఈ గుడిలో రోజూ లక్ష మందికి స్వామివారి భోజన ప్రసాదాన్ని అందిస్తారు.

* ఒక బస్సు అదుపుతప్పి కొండను ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌ మరణించగా అందులోని 34 మంది ప్రయాణికులు గాయపడ్డారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో సోమవారం ఈ ప్రమాదం జరిగింది. హిమాచల్ ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (హెచ్‌ఆర్టీసీ) బస్సు మనాలి నుంచి సిమ్లా వెళ్తోంది. చండీగఢ్-మనాలి జాతీయ రహదారి 3లోని మండి వద్ద ఘాట్‌ మలుపులో బస్సుపై డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయాడు. దీంతో ఆ బస్సు బలంగా కొండను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌ అక్కడికక్కడే మరణించాడు.కాగా, హిమాచల్‌ప్రదేశ్‌ ఆర్టీసీ బస్సులోని 34 మంది ప్రయాణిలు గాయపడ్డారు.

* హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. మరో ముప్పై మందికి పైగా గాయపడ్డారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ బస్సు సోమవారం మనాలి నుంచి షిమ్లా వెళ్తుండగా, చండీఘడ్-మనాలి హైవేపై ఈ ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పి పర్వతం పక్కనున్న గోడను ఢీకొంది. బస్సు ప్రమాదంలో గాయపడ్డవారిని స్థానిక ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తునట్లు మండి ఎస్పీ షాలిని అగ్నిహోత్రి చెప్పారు.

* పశ్చిమ గోదావరి: జిల్లాలోని పోలవరంలో విషాదం నెలకొంది. గోదావరి నదిలో స్నానానికి దిగి ముగ్గురు మృతి చెందారు. మృతులంతా కొవ్వూరుపాడుకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. పోలవరం ప్రాజెక్ట్‌లో పని చేయడానికి ఆరుగురు యువకులు వచ్చారు. పని పూర్తి చేసుకుని సరదాగా నదిలోకి స్నానానికి యువకులు దిగారు. మహేష్‌, సుబ్రహ్మణ్యంలను బయలకు తీశారు. రాజేష్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

*రెండు లారీల మధ్య చిక్కుకున్న ఒక కారు నుజ్జునుజ్జైంది. ఈ ఘటనలో కారు డ్రైవర్‌ మరణించాడు. ఒళ్లు జలదరింపజేసే ఈ ప్రమాదం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో జరిగింది. పలాసుని ప్రాంతంలోని జాతీయ రహదారి 16 వద్ద సోమవారం ఉదయం ట్రాఫిక్‌ సిగ్నల్‌ పడింది. దీంతో పలు వాహనాలు బారులు తీరాయి. ఒక లారీ వెనుక రెండు కార్లు ఆగి ఉన్నాయి. ఇంతలో లోడ్‌తో ఉన్న మరో లారీ వేగంగా ముందు ఆగిన కార్లపైకి దూసుకెళ్లింది. వైట్‌ కారు రోడ్డు డివైడర్‌ వైపునకు వెళ్లగా ముందున్న లారీ వెనుక ఉన్న నీలం రంగు కారు రెండు లారీల మధ్య ఇరుక్కుని నుజ్జునుజ్జైంది. అలాగే ముందున్న కారును లారీ, ముందున్న మరో లారీని ఆ కారు బలంగా ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో నుజ్జైన నీలం రంగు కారులోని డ్రైవర్‌ మరణించాడు. ఈ వరుస ప్రమాదాల్లో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

*జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాజీవ్‌నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. మద్యం సేవించి ఇంటికి ఆలస్యంగా వచ్చాడని బావమరిదిని బావ మందలించాడు. మద్యం మత్తులో ఉన్న బావమరిది.. బావను అనుచిత పదజాలంతో దూషించాడు. కోపంతో రగిలిపోయిన బావ కూరగాయలు కోసే కత్తితో బావమరిదిపై దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితున్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

*తూర్పుగోదారి జిల్లా జగన్నాధపురం పద్మనాభ నగర్‌లో కనకదుర్గ ఆలయం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఆలయం ఆవరణలోని ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దుండగులు మురుగు కాలువలో పడేశారు. చుట్టూ ఉన్న పలు మట్టి విగ్రహాలను రాళ్ళతో కొట్టి విరగ్గొట్టే ప్రయత్నం చేశారు. దీనిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. స్థానికుల ఆందోళనతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.

*గుత్తి పట్టణంలోని రైల్వే స్టేషన్‌లోకి మతిస్థిమితం లేని ఓ వ్యక్తి కాలిన గాయాలతో వచ్చాడని రైల్వే ఎస్‌ఐ నాగప్ప తెలిపారు. రైల్వే పోలీసుల వివరాల మేరకు రైల్వే స్టేషన్‌ పరిసర ప్రాంతంలో మతిస్థిమితం లేని వ్యక్తి భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తునాడన్నారు కాలిన గాయాలతో రైల్వే స్టేషన్‌ లోకి రావడంతో స్థానిక రైల్వే అధికారులు వెంటనే అతనిపై దుప్పటి కప్పి 108 వాహ నం ద్వారా గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. ఆ వ్యక్తి ఏ ప్రాతానికి చెంది న వాడో తెలియదన్నారు. మెరుగైన చికిత్స కోసం అతన్ని అనంతపురానికి తరలించారన్నారు. అతని శరీరం ఎలా కాలిందనే విషయం పోలీసుల దర్యాప్తు తేలాల్సి ఉంది.

*కృష్ణా జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వ్యాన్టేజ్ స్పిన్నర్స్ ప్రైయివేట్ లిమిటెడ్ స్పిన్నింగ్ మిల్లులో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో 5500 బ్లేడ్స్ అగ్నికి ఆహుతయ్యాయి. దాదాపు రూ.30 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లిన్నట్లు యాజమాన్యం తెలిపింది

*గుంటూరు జిల్లా చెరుకుపల్లి వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. టైర్ల లోడుతో వెళుతున్న లారీని బైక్ ఢీకొట్టింది. బైక్ పై ఉన్న ఇద్దరూ మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు అమృతలూరు మండలం గోవాడకు చెందిన నక్కా వసంతరావు, విజయ్‌లుగా గుర్తించారు. చెరుకుపల్లి నుంచి గోవాడ వస్తుండగా గత రాత్రి ప్రమాదం జరిగింది.

*ఉరవకొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళపై అదే ఊరికి చెందిన వలంటీర్‌ మల్లికార్జున అత్యాచారానికి యత్నించాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు శుక్రవారం రాత్రి తన ఇంటి ముందు మహిళ నిద్రిస్తుండగా మల్లికార్జున అత్యాచారానికి యత్నించాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చారు. దీంతో మల్లికార్జున పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు

*తెనాలిలో దారుణం జరిగింది. అక్రమ సంబందం నేపథ్యంలో రవి కిరణ్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. తెనాలికి చెందిన ఓ యువతితో రవి కిరణ్‌కు అక్రమ సంబంధం ఉంది. అయితే అదే యువతితో ఓ రౌడీ షీటర్ అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. విషయం తెలుసుకున్న రౌడీ పీటర్ ఓ ప్లాన్ ప్రకారం రవి కిరణ్‌ను హత్య చేశాడు. శవాన్ని మూట కట్టి సంగంజాగర్ల వద్ద కాలవలో పడేశాడు. రవి కిరణ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతదేహం కోసం కాలవలో గాలింపు చర్యలు జరుపుతున్నారు. రవి కిరణ్ అమృతలూరు మండలం, మూల్పూరు వాసి. కాగా హత్య చేసిన రౌడీ షీటర్ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలకు అనుచరుడుగా ప్రచారం జరుగుతోంది. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

*నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం టోల్‌ప్లాజా దగ్గర పోలీసుల తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా భారీగా గంజాయి పట్టుబడింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు లారీని సీజ్ చేశారు. స్మగ్లర్లను అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

*పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం కొవ్వాడలో తూటిగుంట అనిల్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. నాటు తుపాకీతో దుండగులు కాల్చి చంపేశారు. అక్రమ సంబంధం నేపథ్యంలో హత్య జరిగి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు విచారణ చేపట్టారు.

* జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని తుమ్మెనాల గ్రామంలో ఊరకుంట చెరువులో ఈత కోసం వెళ్లి మారంపెల్లి శరత్‌ (14), పబ్బతి నవదీప్‌ (11), గొలుసుల యశాంత్‌ (13) నీట మునిగి ఆదివారం మృతి చెందారు. ఆదివారం పాఠశాలకు సెలవు దినం కావటం వల్ల ఉదయమే ముగ్గురు బాలురు ఈత కోసం తుమ్మెనాలకు సమీపంలో ఉన్న ఊరకుంట చెరువు వద్దకు వెళ్లారు. స్నానం కోసం నీటిలో దిగిన బాలురు ఈత రాక పోవటం నీట మునిగి మృతి చెందారు. సెలవు దినం కావటం వల్లే ముగ్గురు ఈత కోసం చెరువు వద్దకు వెళ్లారని, ఈత రాక పోవడం వల్ల మునిగి మృతి చెందినారని భావిస్తున్నారు.

*నిత్యం తాగి గొడవపడుతున్న భర్తను భార్య రాయితో మోది హతమార్చింది. మండలంలోని పల్లెవాండ్లపల్లికి చెందిన ముద్దిరెడ్డి వెంక టరెడ్డి (42) నిత్యం మద్యం తాగి భార్యను చితకబాదేవాడు. ఆదివారం రాత్రికూడా మద్యం తాగి భార్యతో గొడవపడ్డాడు. సహనం కోల్పోయిన భార్య భాగ్యమ్మ రాయితో ముఖం మీద, తలమీద బాదడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. విషయాన్ని గ్రామస్థులు తెలుపడంతో ఎస్‌ఐ వరలక్ష్మి సిబ్బంతో వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసునమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

*గుర్తుతెలియని వ్యక్తులు నాటు తుపాకీతో యువకుడిని హత్యచేసిన ఘటన ఆదివారం ఏలూరు జిల్లా కొవ్వాడ గ్రామంలో జరిగింది. పోలీసులుకుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇంటి వరండాల్లో పడుకున్న అనిల్‌కుమార్‌ను శనివారం అర్ధరాత్రి దాటాక గుర్తుతెలియని వ్యక్తులు నాటు తుపాకీతో కాల్చడంతో అక్కడికక్కడే మరణించాడు. మృతుడు సీఏ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. తెల్లవారుజామున రక్తపు మడుగులో కుమారుడు పడి ఉండడాన్ని గుర్తించిన అతని తల్లి కుమారి ఈ విషయాన్ని గ్రామస్థులకు తెలుపగా వారు పోలీసులకు సమాచారమిచ్చారు. డీఎస్పీ లతాకుమారిసీఐ విజయబాబుఎస్‌ఐ జయబాబు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

*భారత ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ ఫిషింగ్ బోటును బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్, కచ్ ప్రాంతం సమీపంలో ఉన్న అరేబియా సముద్రంలో హరామీ నాలా ఏరియాలోకి పాకిస్తాన్‌కు చెందిన రెండు చేపల బోట్లు ప్రవేశించాయి. ఇది భారత సరిహద్దు కావడంతో వెంటనే గమనించిన భారత సరిహద్దు భద్రతా దళ సిబ్బంది పాక్ బోట్లను వెంబడించారు. ఇది గమనించిన బోట్లు వెంటనే పాక్ జలాల్లోకి వెళ్లిపోయేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో ఒక బోటును పిల్లర్ నెంబర్ 1160 వద్ద స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రదేశం భారత్-పాక్ సరిహద్దుకు వంద మీటర్ల దూరంలోనే ఉంటుంది. హరామి నాలా ప్రాంతం భారత్-పాక్‌ల సరిహద్దు ప్రాంతం కావడంతో ఇక్కడ నిత్యం బీఎస్ఎఫ్ సిబ్బంది పహారా కాస్తుంటారు. మరోవైపు పాకిస్తాన్ జాలర్ల నుంచి స్వాధీనం చేసుకున్న బోటులో ఎలాంటి అనుమానాస్పద సామగ్రి లేదని అధికారులు చెప్పారు.

*రెండు లారీల మధ్య చిక్కుకున్న ఒక కారు నుజ్జునుజ్జైంది. ఈ ఘటనలో కారు డ్రైవర్‌ మరణించాడు. ఒళ్లు జలదరింపజేసే ఈ ప్రమాదం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో జరిగింది. పలాసుని ప్రాంతంలోని జాతీయ రహదారి 16 వద్ద సోమవారం ఉదయం ట్రాఫిక్‌ సిగ్నల్‌ పడింది. దీంతో పలు వాహనాలు బారులు తీరాయి. ఒక లారీ వెనుక రెండు కార్లు ఆగి ఉన్నాయి. ఇంతలో లోడ్‌తో ఉన్న మరో లారీ వేగంగా ముందు ఆగిన కార్లపైకి దూసుకెళ్లింది. వైట్‌ కారు రోడ్డు డివైడర్‌ వైపునకు వెళ్లగా ముందున్న లారీ వెనుక ఉన్న నీలం రంగు కారు రెండు లారీల మధ్య ఇరుక్కుని నుజ్జునుజ్జైంది. అలాగే ముందున్న కారును లారీ, ముందున్న మరో లారీని ఆ కారు బలంగా ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో నుజ్జైన నీలం రంగు కారులోని డ్రైవర్‌ మరణించాడు. ఈ వరుస ప్రమాదాల్లో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.