NRI-NRT

అమెరికాలో వీధికి ‘గణేశ్​ టెంపుల్​’గా నామకరణం

అమెరికాలో వీధికి ‘గణేశ్​ టెంపుల్​’గా నామకరణం

అమెరికా న్యూయార్క్​లోని ఓ వీధికి హిందూ దేవాలయం పేరును పెట్టారు. గణేష్ టెంపుల్ స్ట్రీట్ అని నామకరణం చేశారు. మహా వల్లభ గణపతి దేవస్థానం వెలుపల ఉన్న వీధికి ఇప్పటికే బౌనీ స్ట్రీట్ అని పేరు ఉంది. అయితే ఇప్పుడు గణేష్ టెంపుల్ స్ట్రీట్ అనే పేరును జత చేశారు .అగ్రరాజ్యంలో భారతీయ సంస్కృతికి అరుదైన గౌరవం దక్కింది. హిందూ సమాజం గర్వపడే విధంగా అక్కడో వీధికి ‘గణేష్ టెంపుల్ స్ట్రీట్’ అని పేరు పెట్టారు. అక్కడ 1977లో ది హిందూ టెంపుల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా ఆధ్వర్యంలో మహా వల్లభ గణపతి దేవస్థానాన్ని స్థాపించారు. అప్పటినుంచి ఆ దేవాలయాన్ని గణేష్ టెంపుల్ అని పిలుస్తున్నారు. ఇది ఉత్తర అమెరికాలోని పురాతన హిందూ దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. అక్కడున్న తెలుగువారు ఆ ఆలయానికి వెళ్లి పూజలు, అర్చనలు చేయడం ఆనవాయితీగా మారింది.

ఈ దేవాలయం న్యూయార్క్‌లో క్వీన్స్ కౌంటీలోని ఫ్లషింగ్‌లో ఉంది. ఆ గుడి బయట ఉన్న వీధికి బౌనీ స్ట్రీట్ అని పేరు పెట్టారు. మత స్వేచ్ఛ, బానిసత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించిన ప్రముఖ అమెరికన్ మార్గదర్శకుడు జాన్ బౌనీ పేరు ఆ వీధికి పెట్టారు. అయితే ఈ వీధికి గణపతి ఆలయం పేరును కూడా జత చేశారు. శనివారం జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో గణేష్ ఆలయ గౌరవార్థం ఆ వీధికి ‘గణేష్ టెంపుల్ స్ట్రీట్‌’గా మారుస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. దీంతో అక్కడి తెలుగు ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.పేరును మారుస్తూ దానికి సంబంధించిన ఓ చిహ్నాన్ని న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్ రణధీర్ జైస్వాల్, క్వీన్స్ బోరో ప్రెసిడెంట్ డోనోవన్ రిచర్డ్స్, న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఇతర అధికారుల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీధి పేరు మారడం వెనుక ఎన్నో ఏళ్ల కృషి ఉందని, దీంతో ఇండో అమెరికన్ కమ్యూనిటీ గొప్పదనం గురించి ఇంకా బాగా తెలుస్తుందని భారత కాన్సుల్ జనరల్ రణధీర్ జైస్వాల్ అన్నారు. గత ఏడాది డిసెంబర్‌లో న్యూయార్క్ సిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలోని ఓ కమిటీ బౌన్ స్ట్రీట్‌కు గణేష్ టెంపుల్ స్ట్రీట్‌ అనే పేరు పెట్టడానికి ఆమోదించిందని ఆలయ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది. ఈ సందర్భంగా భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపింది. పూజారులు, పెద్ద సంఖ్యలో భక్తులు సమక్షంలో వీధి పేరును ఆవిష్కరించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు క్వీన్స్ బోరో ప్రెసిడెంట్ రిచర్డ్స్. డా.ఉమా మైసూర్కర్.. ఉత్తర అమెరికాలోని హిందూ టెంపుల్ సొసైటీలోని ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. ఆధ్యాత్మికంగా మద్దతు ఇచ్చినవారందరికీ ధన్యవాదాలు చెప్పారు. మైసూర్కర్ ప్రస్తుతం అమెరికాలో ప్రముఖ ప్రసూతి వైద్యుడు, గైనకాలజిస్ట్. హిందూ టెంపుల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.