DailyDose

అధికారంలోకి వచ్చాక.. జిల్లాలు సరిచేస్తాం – TNI రాజకీయ వార్తలు

అధికారంలోకి వచ్చాక.. జిల్లాలు సరిచేస్తాం  – TNI రాజకీయ వార్తలు

*పార్టీ నేతలతో పలు అంశాలపై తెదేపా అధినేత చంద్రబాబు చర్చలు జరిపారు. జగన్ విధానాలతో ఏపీ కూడా శ్రీలంకలా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని వద్ద ఉన్నతాధికారులు చేసిన వ్యాఖ్యలే.. రాష్ట్ర పరిస్థితికి దర్పణమన్నారు. ఇక, అశాస్త్రీయంగా, రాజకీయ కోణంలో కొత్త జిల్లాల ఏర్పాటు చేశారన్న చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక కొత్త జిల్లాలను సరిదిద్దుతామన్నారు.పార్టీ నేతలతో తెదేపా అధినేత చంద్రబాబు వ్యూహ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. జగన్ పాలనపై ఆయన సొంత సామాజికవర్గం కూడా సంతృప్తిగా లేదన్న చంద్రబాబు.. వైకాపాకు ఓటేసి తప్పుచేశామనే భావన ఆయన సొంత వర్గంలోనే ఉందన్నారు. జగన్ విధానాలతో ఏపీ కూడా శ్రీలంకలా మారే ప్రమాదం ఉందన్నారు. ప్రధాని వద్ద ఉన్నతాధికారుల వ్యాఖ్యలే.. రాష్ట్ర పరిస్థితికి దర్పణమన్నారు. కొత్త జిల్లాలు సరిదిద్దుతాం: అశాస్త్రీయంగా, రాజకీయ కోణంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారన్న చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక కొత్త జిల్లాలను సరిదిద్దుతామన్నారు. జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై ప్రజల అభ్యంతరాలను, నిరసనలను కనీసం పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని తప్పు పట్టారు. కరెంట్ చార్జీల మోత, పన్నుల భారంపై బాదుడే బాదుడు పేరుతో ఇంటింటికీ తెలుగుదేశం నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కరెంట్ ఎందుకు పోతోందో.. బిల్లు ఎందుకు పెరిగిందో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ వ్యక్తిగత ఆదాయం కోసమే.. ప్రజలపై తీవ్ర భారం మోపుతున్నారని మండిపడ్డారు.వారికి సంఘీభావం: అమరావతిలో 80 శాతం కంప్లీట్ అయిన పనులను కూడా పూర్తి చెయ్యలేని జగన్.. ఇప్పుడు మరో ఐదేళ్ల సమయం కోరడాన్ని తెదేపా నేతలు తప్పుబట్టారు. సీపీఎస్ రద్దు కోసం ఆందోళనలు చేస్తున్నవారికి సంఘీభావం తెలపాలని సమావేశంలో నిర్ణయించారు.

*అమరావతికి భూములిచ్చిన రైతులకు జగన్ అన్యాయం చేస్తున్నారు – జీవీఎల్
రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు, ప్రణాళిక లేకుండా 26 జిల్లాల పునర్విభజన చేస్తూ హడావుడిగా గెజిట్ ఇచ్చిందని భాజపా రాజ్యసభ సభ్యుడు జి.వి.ఎల్ విమర్శించారు. కలెక్టరేట్లు ఏర్పాటు చేస్తే.. అక్కడ అనువైన సౌకర్యాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. అమరావతిని‌ పూర్తిగా నిర్వీర్యం చేసేలా జగన్ చర్యలు ఉన్నాయని.. భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.ఒక ప్రణాళిక అన్నది లేకుండా జిల్లాల పునర్విభజన చేస్తూ.. ప్రభుత్వం హడావుడిగా గెజిట్ ఇచ్చిందని భాజపా నేత జి.వి.ఎల్ విమర్శించారు. కలెక్టరేట్లలో అనువైన సౌకర్యాలు ఉన్నాయా అని ప్రశ్నించిన ఆయన.. జిల్లాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు కేటాయించాలని సూచించారు. విజయవాడ భాజపా రాష్ట్ర కార్యాలయంలో జి.వి.ఎల్ నరసింహారావు మీడియాతో మాట్లాడారు.

*కేంద్రం తెలంగాణ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది: మంత్రి Jagdish
తెలంగాణాను ఆదర్శంగా చూపాల్సిన కేంద్రం తెలంగాణ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ… సాంప్రదాయ పంటలను వదిలేసి ఆహార భద్రత కోసం ప్రభుత్వాలు చెప్పినందుకు రైతులు వరి పంటకు అలవాటు పడ్డారని తెలిపారు. రైతులకు అండగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతల నుండి తప్పుకుంటుందన్నారు. కేంద్ర సహకారం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు 100 శాతం న్యాయం చేయలేవని తెలిపారు. పంజాబ్‌లో 100 శాతం కొంటున్న కేంద్రం ఇక్కడ మాత్రం వివక్ష చూపుతుందని మంత్రి మండిపడ్డారు. కేంద్రం ఎటువంటి సహాయం చేయకున్నా రైతులకు సమృద్ధిగా నీరు అందించామని తెలిపారు. దేశంలోనే ఎక్కువ వ్యవసాయ ఉత్పత్తులు సాదించిన రాష్ట్రంగా తెలంగాణాను మొదటి స్థానంలో నిలిపామన్నారు. కోతల దశలో ఉన్న సమయంలో మెడ మీద కత్తి పెట్టి బాయిల్డ్ రైస్ ఇవ్వమని సంతకాలు పెట్టించుకున్నారని ఆగ్రహించారు. వరి వెయ్యొద్దని చెప్పినా ప్రతిపక్ష బీజేపీ నాయకులు రైతులను మోసం చేసేలా వరి వేయమని ప్రోత్సహించి మోసం చేశారని మంత్రి జగదీష్ రెడ్డి దుయ్యబట్టారు

*సీఎం జగన్… టీడీపీ కంటే ధరలు తగ్గించి చూపించాలి: Kanna
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నవరత్నాలు అమలు చేస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి జగన్ అధికారంలోకి వచ్చారని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ… 7వ సారి కరెంట్ చార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారం వేస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్క దానిపై ధరలు పెంచారని మండిపడ్డారు. చాక్లెట్ ఇచ్చి నక్లెస్ తీసుకున్నట్లు జగన్ ప్రభుత్వ పాలన ఉందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్… టీడీపీ కంటే ధరలు తగ్గించి చూపించాలని అన్నారు. కేంద్రం ప్రభుత్వం 130 సంక్షేమ కార్యక్రమాలు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల పేరుతో 9 తో సరిపెడుతున్నారని వ్యాఖ్యానించారు. పెంచిన విద్యుత్ చార్జీల తగ్గించే వరకు బీజేపీ పోరాటం చేస్తుందని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు

*హర్యానా వైపు చూసేంత ధైర్యం ఆప్‌కు లేదు: సీఎం ఖట్టర్
వివాదాలతో హర్యానాలోకి రావాలనుకుంటే సాధ్యం కాదని, ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని ఒప్పుకోరని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ అన్నారు. పంజాబ్, హర్యానా ఉమ్మడి రాజధానిపై రగడ తీవ్రమవుతోంది. చండీగఢ్‌ను తమకే ఇచ్చేయాలని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ డిమాండ్ చేస్తుండగా.. కావాలని వివాదాలు సృష్టించవద్దంటూ హర్యానా హెచ్చరిస్తున్నారు

*తెలంగాణ పల్లెల్లో బెల్ట్ షాపులు ఎక్కువయ్యాయి: BJP leader
తెలంగాణ పల్లెల్లో బెల్ట్ షాపులు ఎక్కువ అయ్యాయని బీజేపీ సీనియర్ నేత రవీంద్ర నాయక్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ… గవర్నర్, రాజ్యాంగాన్ని సీఎం కేసీఆర్ అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. గిరిజనులకు రిజర్వేషన్లు రావొద్దని సీఎం కేసీఆర్ కుట్ర పన్నారని ఆరోపించారు. గిరిజనుల రిజర్వేషన్లు కేంద్రంపై నెపం నెట్టి కేసీఆర్ చేతులు దులుపుకుంటున్నారన్నారు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మినహా… అన్ని రాష్ట్రాలలో గిరిజనులకు ప్రత్యేక కమిషన్ ఉందని తెలిపారు. మద్యం దుకాణాలలో గిరిజనులకు రిజర్వేషన్లు ఇచ్చారని బీజేపీ నేత అన్నారు. ఈ విషయంలో అధికార నేతలు కేసీఆర్‌కు పాలాభిషేకాలు చేస్తుండటం దారుణమని మండిపడ్డారు. గవర్నర్ రాజ్యాంగాన్ని చేతిలోకి తీసుకుని గిరిజనులకు న్యాయం చేయాలని కోరారు. కులాల మధ్య గొడవలు పెట్టే నైజం కేసీఆర్‌ ది అని… రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ హామీలు ఇవ్వడం మినహా ఆచరణలో శూన్యమని బీజేపీ నేత రవీంద్ర నాయక్ వ్యాఖ్యానించారు

*పంటి నొప్పికి తుంటి మీద తన్నినట్టుంది జగన్ పాలన: Tulasi reddy
ముఖ్యమంత్రి జగన్ మోమన్ రెడ్డిపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పంటి నొప్పికి తుంటి మీద తన్నినట్టుంది జగన్ పాలన అని వ్యాఖ్యానించారు. 13 జిల్లాలను విడగొట్టి 26 జిల్లాలు చేసి, ఇదే అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ అని డబ్బా కొట్టుకోవడం హాస్యాస్పదమన్నారు. 73, 74 రాజ్యాంగ సవరణల మేరకు గ్రామ పంచాయితీలు, తదితర స్థానిక ప్రభుత్వాలకు విధులు, నిధులు, అధికారాలు బదలాయిస్తే అది నిజమైన పాలనావికేంద్రీకరణ అవుతుందని తెలిపారు. గాలేరు నగరి, పోలవరం తదితర సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి, ప్రత్యేక హోదా సాధించి ప్రతి జిల్లాలో పరిశ్రమలు సాధిస్తే అది నిజమైన అభవృద్ధి వికేంద్రీకరణ అవుతుందని అన్నారు. అవి చేయకుండా 13 జిల్లాలైనా, 26 అయినా,175 అయినా ప్రయోజనం లేదని తులసిరెడ్డి చెప్పుకొచ్చారు

*జగన్‌ వైఫల్యంతో ఏపీలో విద్యుత్ కోతలు: ఎంపీ Ram mohan
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైఫల్యంతోనే ఏపీలో విద్యుత్ కోతలు ఏర్పడ్డాయని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ… మూడేళ్లలో ఏడుసార్లు కరెంట్ బిల్లులు పెంచారని మండిపడ్డారు. పేదలు కరెంట్‌ కూడా వినియోగించుకోలేని విధంగా స్లాబ్స్ తయారు చేశారన్నారు. ప్రజల నుంచి డబ్బులు ఎలా లాక్కోవాలో జగన్‌కు బాగా తెలుసని వ్యాఖ్యలు చేశారు. జగన్‌ వచ్చిన తర్వాత పీపీఏలను రద్దు చేశారన్నారు. పేదలపై దాదాపు 3 వేల కోట్లకు పైగా విద్యుత్ భారం మోపారని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు

*నాలాలపై అక్రమ నిర్మాణాలు అన్ని తొలగిస్తాం: మంత్రి Talasani
వరద ముంపుకు ప్రధాన అడ్డంకిగా ఉన్న నాలాలపై అక్రమ నిర్మాణాలు అన్ని తొలగిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం నగరంలో ఎస్‌ఎన్‌డీపీ కార్యక్రమం క్రింద చేపట్టిన నాలాల అభివృద్ధి పనులు మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ… ప్రతి ఏటా వర్షాకాలంలో నాలాకు ఎగువ నుండి వచ్చే వరదతో నాలా పరిసర కాలనీలు, బస్తీలు ముంపుకు గురవుతున్నాయని తెలిపారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఎస్‌ఎన్‌డీపీ కార్యక్రమంతో శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. వరదలు వచ్చిన సమయాలలో జరుగుతున్న ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించేందుకు శాశ్వత చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఎన్ని కోట్ల నిధులైనా ఖర్చు చేస్తామని… ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం మంత్రి తలసాని శ్రీనివాస్ స్పష్టం చేశారు

*అంబేద్కర్ పేరు పెట్టలేకపోవడం దళిత వ్యతిరేకతకు నిదర్శనం: Devathoti
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త జిల్లాలో ఏ ఒక్క జిల్లాకు కూడా అంబేద్కర్ పేరు పెట్టలేకపోవడం దళిత వ్యతిరేకతకు నిదర్శనమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ… నిండు అసెంబ్లీలో దళితులకు దగా జరుగుతున్న దళిత నాయకులు మాట్లాడకపోవడం జగన్ రెడ్డి నియంతృత్వ పోకడకు పరాకాష్ట అని మండిపడ్డారు. 29 సంక్షేమ పథకాలను రద్దు చేసినా దళితుల హక్కులు దహించుకుపోతున్నా వైసీపీ దళిత నాయకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తప్పు జరిగినప్పుడు చట్టసభల్లో కూడా ప్రశ్నించలేని నాయకుడు జీవంలేని బండరాయితో సమానమని దేవతోటి నాగరాజు వ్యాఖ్యానించారు

*అనకాపల్లి జిల్లా అయినందుకు సంతోషంగా ఉంది: దాడి వీరభద్రరావు
కొత్త జిల్లాల ఏర్పాటుతో, అధికార వికేంద్రీకరణ ద్వారా, ప్రజలకు సత్వర న్యాయం జరుగుతుందని, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి సులువవుతుందని వైసీపీ నేత దాడి వీరభద్రరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా ఏర్పడిన నందుకు సంతోషంగా ఉందన్నారు. అయితే అనకాపల్లి కొత్త జిల్లా ఏర్పాటుపై ఇటు అధికారుల నుంచి అటు పార్టీ నుంచి కానీ, ఎలాంటి ఆహ్వానం తనకు అందలేదని, పెద్ద కార్యక్రమానికి ఆహ్వానం లేకపోవడం అసంతృప్తిగా ఉందన్నారు. పార్టీ పదవుల్లో ఉన్నవారిని భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు తీసుకువచ్చిన ఆన్ లైన్ విధానంతో, రెవెన్యూ అస్తవ్యస్తమైందని, అది ఇప్పటికీ కొనసాగుతోందని, దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని దాడి వీరభద్రరావు అన్నారు.

*ఎన్టీఆర్ పేరుతో జిల్లా ఏర్పడడం సంతోషంగా ఉంది: Laxmi parvathi
ర్గీయ ఎన్టీఆర్ పేరుతో జిల్లా ఏర్పడడం సంతోషంగా ఉందని తెలుగు అకాడెమీ ఛైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి అన్నారు. సోమవారం ఉదయం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌కు వచ్చిన లక్ష్మీపార్వతి… కొత్త కలెక్టర్ ఢిల్లీరావుకు శాలువా కప్పి సన్మానించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ఎన్టీఆర్ పేరు చెప్పి ఎంతో చేస్తున్నామన్న టీడీపీ.. చంద్రబాబు ఎన్టీఆర్ పేరు శాశ్వతంగా ఉండేలా ఒక్క చర్య తీసుకోలేదని విమర్శించారు. తన పార్టీ కాకున్నా.. ఎన్టీఆర్‌తో పరిచయం లేకున్నా జగన్ ఎన్టీఆర్ పేరు పెట్టారని అన్నారు. చంద్రబాబు చేయలేని పనిని జగన్ చేశారని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తరహాలోనే అల్లూరి సీతారామరాజు, సత్యసాయి, అన్నమయ్య వంటి పెద్దల పేర్లు పెట్టడం శుభ పరిణామమని పేర్కొన్నారు. పెద్దల ఆశీస్సులు జగనుకు లభిస్తాయన్నారు. ఎన్టీఆర్ పుట్టింది నిమ్మకూరైనా.. ఎన్టీఆర్ బాల్యమంతా విజయవాడలోనే గడిచిందని చెప్పారు. విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెట్టి ఆయనకు మరింత శోభనిచ్చారన్నారు. ఎన్టీఆర్ గుడివాడలోనే కాదు హిందూపూరం, టెక్కలి వంటి ప్రాంతాల్లో కూడా పోటీ చేశారని లక్ష్మీపార్వతి తెలిపారు.

*పార్లమెంటరీ ప్రజాస్వామ్యం బలోపేతంలో రాజ్యసభ కీలకం : ఉపరాష్ట్రపతి వెంకయ్య
పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో రాజ్యసభ కీలక పాత్ర పోషించిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. ఆదివారం రాజ్యసభ దినోత్సవం సందర్భంగా ఆయన ట్విటర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ‘‘అందరికీ రాజ్యసభ దినోత్సవ శుభాకాంక్షలు. సభ్యులందరూ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సభలో నిర్మాణాత్మక చర్చల్ని జరపాలని విజ్ఞప్తి చేస్తున్నా’’ అని ఉపరాష్ట్రపతి ట్వీట్‌ చేశారు. రాజ్యసభ వెబ్‌సైట్‌ వివరాల ప్రకారం.. 1946, డిసెంబరు 9న తొలిసారిగా సమావేశమైన రాజ్యాంగ అసెంబ్లీ, 1950 వరకూ కేంద్ర శాసనసభగా, అనంతరం తాత్కాలిక పార్లమెంటుగా రూపాంతరం చెందింది. 1952లో తొలి ఎన్నికలు జరిగే వరకూ ఇది ఒకే సభగా ఉంది. చర్చోపచర్చల అనంతరం.. భారత్‌కు రెండు సభలు అవసరమేనని అన్ని పక్షాలూ అంగీకరించడంతో రాష్ట్రాల మండలి(కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్స్‌) పేరిట రాజ్యసభ ఏర్పాటైంది.

*రాష్ట్రంలో గతి, మతి లేని పాలన: సోము వీర్రాజుt
రాష్ట్రంలో గతి, మతి లేని పాలన నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర పథకాలను తమ పథకాలుగా రాష్ట్రం ప్రచారం చేసుకుంటోందని, దానిని తాము ఖండిస్తున్నామన్నారు. ఉపాధి హామీ పథకంలో ఈ రాష్ట్రానికి వచ్చినన్ని నిధులు మరే రాష్ట్రానికీ రాలేదన్నారు. అలాగే ప్రత్యేక హోదాకు బదులుగా ఇచ్చిన కేంద్రం నిధులను సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని జగన్‌ అప్పుల పాల్జేస్తున్నారని, ఎటువంటి అభివృద్ధి చేయకుండా రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారని సోము వీర్రాజు దుయ్యబట్టారు.

*సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించినా హాజరుకాలేదు : కిషన్‌రెడ్డి
కేంద్ర సాంస్కృతిక శాఖ హైదరాబాద్‌లోని ఎన్‌టీఆర్‌ స్టేడియంలో నిర్వహించిన ‘జాతీయ సంస్కృతీ మహోత్సవాలు’ మూడోరోజైన ఆదివారం రాత్రి అట్టహాసంగా ముగిశాయి. చివరిరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, కేంద్ర సహాయమంత్రి మీనాక్షి లేఖి, మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు హాజరయ్యారు. ఈసందర్భంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జయప్రభ మీనన్‌ నాట్య ప్రదర్శన అలరించింది. ఈసందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘జాతీయ సంస్కృతీ మహోత్సవం’ ముగింపు కార్యక్రమానికి కేంద్ర మంత్రులతో పాటు సీఎం కేసీఆర్‌ను అధికారికంగా ఆహ్వానించినా హాజరుకాలేదన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం గురించి కొన్ని పత్రికలు రాయకపోగా, ఇష్టానుసారంగా విమర్శలు చేశాయని పేర్కొన్నారు. ఈ మహోత్సవాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన పత్రికలు, మీడియాకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

*రాష్ట్రంలోని ప్రతి మూలకూ నిరసనలు: రేవంత్‌రెడ్డి
సంగి వడ్ల కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దుర్మార్గాలను ఎండగడుతూ.. వడ్లు కొనేవరకూ వదిలేది లేదంటూ కాంగ్రెస్‌ శ్రేణులు కదం తొక్కుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు బాన్సువాడలో వడ్ల కుప్పల ముందు కాంగ్రెస్‌ నేతలు నిరసన తెలుపుతున్న ఫోటోను పోస్ట్‌ చేశారు. ఈ నిరసన కార్యక్రమాలు రాష్ట్రంలోని ప్రతి మూలకూ విస్తరిస్తాయన్నారు.

*కాంగ్రెస్‌ లేకుండా భాజపాపై పోరాడలేం: శరద్‌ పవార్‌
‘కేంద్రంలో భాజపా వ్యతిరేక కూటమికి నేను నాయకత్వం వహించలేను. యూపీఏ ఛైర్‌పర్సన్‌ కావాలని కూడా కోరుకోవడం లేదు. భాజపా వ్యతిరేక పోరాటంలో ప్రత్యామ్నాయ శక్తిగా మారాలంటే ఎట్టిపరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌ను మినహాయించలేం’ అని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్‌ పవార్‌ స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని కొల్హాపుర్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భాజపాకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ కూటమిని బలోపేతం చేసే చర్యలకు తన సహకారం, మద్దతు కొనసాగిస్తానని తెలిపారు. ‘ప్రతిపక్షాలన్నీ ఒకే వేదికపైకి రావాలన్నపుడు కొన్ని నిజాలు విస్మరించలేం. టీఎంసీ పశ్చిమ బెంగాల్‌లో బలీయమైన శక్తి. అదేవిధంగా ఆయా ప్రాంతీయ పార్టీలు కూడా తమ తమ రాష్ట్రాల్లో బలమైన శక్తులే’ అని పవార్‌ వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్‌ ఇపుడు అధికారంలో లేకపోయినా, అది అఖిల భారత పార్టీ. దేశంలో ఏ గ్రామానికి వెళ్లినా కార్యకర్తలు ఉంటారు. కాబట్టి, భాజపాపై పోరాటంలో విస్తృతమైన స్థాయి ఉన్న కాంగ్రెస్‌ పార్టీ అనివార్యం’ అని అన్నారు. కాంగ్రెస్‌ బలమైన ప్రతిపక్షంగా ఉండాలంటూ ఇటీవల కేంద్ర మంత్రి గడ్కరీ చేసిన వ్యాఖ్యలపై పవార్‌ స్పందిస్తూ.. ‘దేశంలో ఒకే పార్టీ బలంగా ఉంటే నాయకులు.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌లా మారతారు. భారత్‌కు అటువంటి ‘పుతిన్‌’ బెడద లేదనే నేను అనుకొంటా’ అని చెప్పారు. భాజపా పాలనలో ఈడీ సెటిల్మెంట్ల ఏజెన్సీగా మారిందని పవార్‌ ఆరోపించారు.