Politics

ఏపీలో త్వరలో మరో కొత్త జిల్లా! – TNI రాజకీయ వార్తలు

ఏపీలో త్వరలో మరో కొత్త జిల్లా! – TNI రాజకీయ వార్తలు

*ఏపీలో త్వరలో మరో కొత్త జిల్లా ఏర్పాటు కానుందని మంత్రి పేర్ని నాని అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలన్నీ కలిపి పోలవరం కేంద్రంగా కొత్త జిల్లా కానుందని, 26 జిల్లాలకు అదనంగా మరో జిల్లా వచ్చే అవకాశముందన్నారు. ఇప్పటికే గిరిజన ప్రాంతాల్లో రెండు జిల్లాలు ఏర్పాటయ్యాయని, మరో గిరిజన జిల్లా ఏర్పాటుపై సీఎం జగన్ ఆలోచన చేస్తున్నారన్నారు. పోలవరం, రంపచోడవరం నియోజకవర్గాలు కలిపి 27వ జిల్లా అవుతుందని, పోలవరం ప్రాజెక్టుకు సమీపంలో రెండు నియోజకవర్గాలను కలిపి బ్రిడ్జి నిర్మాణం చేపట్టే అవకాశం ఉందని మంత్రి పేర్నినాని తెలిపారు.

*అప్పులు తెస్తే తప్ప.. పూటగడవని దుస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారు: ఆనందబాబు
జగన్‌రెడ్డి ధనదాహానికి ఏపీ ప్రజలు బలవుతున్నారని నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. అప్పులు తెస్తే తప్ప.. పూటగడవని దుస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారన్నారు. శ్రీలంక పాలకుల అప్పుల దెబ్బకు ఆ దేశ ప్రజలు బలైపోయినట్లు.. జగన్‌ దోపిడీకి ఏపీ ప్రజలు రోడ్డుపాలయ్యే రోజు దగ్గరలోనే ఉందన్నారు. కేంద్ర మంత్రులతో అక్షింతలు వేయించుకోవడానికే జగన్ ఢిల్లీ పర్యటన అని ఆనందబాబు పేర్కొన్నారు.

*మాంసం అపవిత్రం కాదు, ఆహారం మాత్రమే: ఒవైసీ
నవరాత్రుల రోజుల్లో దక్షిణ ఢిల్లీలో మాంసం అమ్మకాలపై నిషేధం విధించడాన్ని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తప్పుపట్టారు. మాంసం అపవిత్రమైనదేమీ కాదని, ఉల్లి, వెల్లుల్లి ఎలాగో మాంసం కూడా కేవలం ఆహారమేనని అన్నారు. మాంసం కొనుగోలు చేయాలా వద్దా అనేది వంద శాతం ప్రజల ఇష్టాఇష్టాలపైనే ఆధారపడి ఉంటుందని, వద్దనుకుంటే కొనుగోలు చేయకపోతే సరిపోతుందని ఓ ట్వీట్‌లో ఒవైసీ అన్నారు.

*కడప పేరును తొలగించడం సరికాదు: టీడీపీ
కడప నగరంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా కడప జిల్లా టీడీపీ నేతలు మాట్లాడుతూ కడప లేకుండా వైఎస్సార్ జిల్లాగా ప్రభుత్వం పేరు మార్చడాన్ని అభ్యంతరం వ్యక్తం చేశారు. జిల్లా పేరు మార్పుకు నిరసనగా టీడీపీ నేతలు ప్రతులను దగ్ధం చేశారు. తిరుమల తొలి గడపైన కడప పేరును తొలగించడం సరికాదన్నారు. జిల్లా వాసుల మనోభావాలను ప్రభుత్వం దెబ్బతీసిందని టీడీపీ నేతలు మండిపడ్డారు.

*అతి త్వరలో ఏపీ మరో శ్రీలంక: బోండా ఉమ
ఏపీ ఇప్పుడు బీహార్ లాగా ఉంది.. అతి త్వరలో ఏపీ మరో శ్రీలంక కాబోతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ శ్రీలంక అధ్యక్షుడు ఇంటిని ముట్టడించినట్లే …. సీఎం జగన్మోహన్‌రెడ్డి ఇంటిని త్వరలో ప్రజలే ముట్టడిస్తారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి బాదుడే బాదుడు అనే కొత్త పథకాన్ని ప్రారంభించాడు. జిల్లాలు పెంచమని ఏ రాజకీయ పార్టీ అయిన జగన్‌ని ఆడిగిందా? వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే జిల్లాల పెంపు.కొత్త జిల్లాల్లో భూముల విలువ పెంచారంటే కొత్త పన్నులు వేయడానికి ప్రభుత్వం సిద్ధం అయినట్లు అర్థం. 6నెలల్లో 30 శాతం ఇంటి పన్ను పెంచిన ఏకైక ప్రభుత్వం జగన్ ప్రభుత్వం మాత్రమే.ఏపీ సర్కారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది.ఎందుకు భూముల విలువ పెంచారో ఒక కారణం ప్రభుత్వం చెప్పగలదా?.ఏపీని మూడేళ్లలో కుక్కలు చింపిన విస్తరి చేశారు.జగన్ బాదుడే బాదుడు అంశాన్ని గడపగడపకు తీసుకువెళ్తాం.జగన్ ఢిల్లీ పర్యటన సొంత ప్రయోజనాల కోసమే’’ అని బోండా ఉమ వ్యాఖ్యానించారు.

*మోదీ, జగన్‌ ప్రజలపై భారం మోపుతున్నారు: నారాయణ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఏపీ సీఎం జగన్‌ ప్రజలపై భారం మోపుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పేద, మధ్య తరగతి ప్రజలకు జగన్ కరెంట్ షాక్ ఇచ్చారన్నారు. పోలవరం విషయంలో మోదీ, జగన్‌ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ఈనెల 19న ఛలో పోలవరం కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.జిల్లాల పునర్విభజన ప్రజాస్వామ్య పద్ధతిలో జరగలేదని నారాయణ ఆరోపించారు. ముఖ్యమంత్రి నియోజకవర్గ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరపలేదని, జిల్లాల ఏర్పాటు జగన్ సొంత వ్యవహారం అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. మంత్రి పేర్నినాని విపక్షంలో ఉన్నప్పుడు ఒకలా… అధికారంలోకి వచ్చాక మరోలా మాట్లాడితే ఎలా? అన్నారు. పేర్నినాని ఇకనైనా బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలని హితవుపలికారు. జగన్ పాలనపై వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాయని నారాయణ స్పష్టం చేశారు

*అంబేద్కర్ ఆలోచనలను జగ్జీవన్ రామ్‌ అమలు చేశారు: మంత్రి వెలంపల్లి
అంబేద్కర్ ఆలోచనలను తొలినాళ్లలో సక్రమంగా అమలు చేసింది జగ్జీవన్ రామ్‌ మాత్రమేనని మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ అన్నారు.114వ బాబు జగ్జీవన్ రామ్‌ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘ఉప ప్రధానిగా, ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పనిచేశారు. ఎన్నో కష్టాలు పడి బాబు జగ్జీవన్ రామ్‌ పోరాటం చేశారు.బతుకు, చదువు కోసం ఆయన చిన్నతనం నుంచి పోరాటం చేశారు. ఎన్నికల్లో ఓటమి ఎరుగని నాయకుడు జగ్జీవన్ రామ్‌.అంబేద్కర్, జగ్జీవన్ రామ్‌ ఎన్నో పోరాటాలు చేశారు.కార్మిక, వ్యవసాయ శాఖల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు.జగ్జీవన్ రామ్‌, బాబా సాహెబ్ అంబేద్కర్‌ల చరిత్ర పిల్లల పుస్తకాల్లో పాఠాలుగా చేర్చాలని ముఖ్యమంత్రిని కోరతాను’’ అని మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ అన్నారు.

*కాంగ్రెస్ పునరుజ్జీవం ప్రజాస్వామ్యానికి, సమాజానికి ముఖ్యం : సోనియా గాంధీ
కాంగ్రెస్‌లోని అన్ని స్థాయుల్లోనూ ఐకమత్యం చాలా అవసరమని ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చెప్పారు. పార్టీ పునరుజ్జీవం పొందడం కేవలం తమ కోసం మాత్రమే కాదని, ప్రజాస్వామ్యానికి, సమాజానికి ముఖ్యమని చెప్పారు. ప్రభుత్వం ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుంటోందని, భయాందోళనలను వ్యాపింపజేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని ఉద్దేశించి మంగళవారం సోనియా మాట్లాడుతూ, భవిష్యత్తు మునుపటి కన్నా సవాళ్ళతో కూడినదని చెప్పారు. ‘‘మన అంకితభావం, దృఢ సంకల్పం, తట్టుకుని నిలబడగలిగే సత్తా కఠిన పరీక్షకు నిలుస్తున్నాయి. మన విశాలమైన సంస్థలో అన్ని స్థాయుల్లోనూ ఐకమత్యం చాలా ముఖ్యం’’ అని తెలిపారు. ఐకమత్యాన్ని సాధించడం కోసం ఏం చేయడానికైనా తాను నిశ్చయించుకున్నానని చెప్పారు.

* జలం కోసం 7 నుంచి ఉత్తరాంధ్ర జనపోరు యాత్ర: సోము వీర్రాజు
ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టుల కోసం ఈ నెల ఏడో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు ‘ఉత్తరాంధ్ర జనపోరు యాత్ర’ నిర్వహించనున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ప్రకటించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ఎప్పుడూ పోలవరం జపమే తప్ప.. రాష్ట్రంలో ఇతర సాగు నీటి ప్రాజెక్టులను పట్టించుకోలేదని విమర్శించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో రెండు ఎకరాలున్న రైతు సంతోషంగా జీవిస్తుంటే…ఉత్తరాంధ్రలో అంతకంటే ఎక్కువ భూములున్న రైతులు కూడా వలస కూలీలుగా జిల్లా విడిచి వెళ్లిపోతున్నారని తెలిపారు. రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయం తామేనని వీర్రాజు స్పష్టంచేశారు.

*ధరల పెరుగుదలపై టీడీపీ నిరసన కార్యక్రమాలు: చంద్రబాబు
రాష్ట్రంలో కరెంట్ చార్జీల పెంపు, ప్రజలపై పన్నుల భారంపై “బాదుడే బాదుడు” పేరుతో టీడీపీ ఆధ్యర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర వ్యాప్త టీడీపీ నిరసన కార్యక్రమాలపై పార్టీ అధినేత చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెలాఖరు వరకు ప్రతి ఇంటికి వెళ్ళి కరపత్రాలు పంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలన్నారు. ఈ రోజు నుంచి మొదలైన ప్రోగ్రాంపై ఆయన రివ్యూ చేశారు. జగన్ ప్రభుత్వం ఏడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై 16 వేలకోట్ల భారం వేసిందన్నారు. విద్యుత్ ఛార్జీలు, చెత్త, ఇంటి పన్నులు, పెట్రో, గ్యాస్ ధరలతో ప్రజలపై తీవ్ర భారం పడిందన్నారు.జగన్ పెంచిన టాక్స్‌ల కారణంగా ఒక్కో ఇంటిపై 1.10 లక్షల భారం పడుతుందన్నారు. జగన్ విధానాల వల్లనే ఇప్పుడు కరెంట్ కొరత, కోతలు ఏర్పడ్డాయన్నారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలు తీవ్ర భారం కానున్నాయన్నారు. గ్రామ, మండల స్థాయిలో నెలాఖరు వరకు కార్యక్రమం జరపాలని ఆయన ఆదేశించారు. రాజకీయ కోణంలోనే జిల్లాల విభజన చేశారని ఆయన ఆరోపించారు. కొత్త జిల్లాల ఏర్పాటులో శాస్త్రీయత లేదన్నారు. కొత్త జిల్లాలు అన్నాడు….వెంటనే రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుతో బాదుడుకు తెర తీశాడని ఆయన ఆరోపించారు. జగన్ విధానాలను గ్రామ స్థాయిలో ఎండగట్టాలని పార్టీ నాయకులకు ఆయన సూచించారు.

*చండీగఢ్‌పై హరియాణా అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం
కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్‌పై వివాదం మరింత రాజుకుంటోంది. పంజాబ్‌, హరియాణాల ఉమ్మడి రాజధాని అయిన చండీగఢ్‌ను తమకు బదిలీ చేయాలని పంజాబ్ అసెంబ్లీ తీర్మానించిన నేపథ్యంలో హరియాణా సైతం కీలక నిర్ణయం తీసుకుంది. చండీగఢ్ను ఉమ్మడి రాజధానిగా యథాతథంగా కొనసాగించాలని హరియాణా అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ తీర్మానానికి మద్దతు తెలిపిన విపక్షాలకు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ధన్యవాదాలు తెలిపారు. పంజాబ్ తీసుకున్న నిర్ణయం సరైనది కాదని.. ఇది హరియాణా ప్రజలకు ఆమోదయోగ్యం కాదన్నారు.మూడు గంటల పాటు ఈ చర్చలు కొనసాగాయి. ఈ తీర్మానంతో పాటు సట్లెజ్- యమునా లేక్ నిర్మాణం, హిందీ మాట్లాడే రాష్ట్రాల జాబితాలో హరియాణాను చేర్చే అంశాలపై చర్చించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. చండీగఢ్పై పంజాబ్ తీర్మానం నేపథ్యంలో హరియాణా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. చండీగఢ్‌ కేంద్ర పాలిత ఉద్యోగులకు సెంట్రల్‌ సర్వీస్‌ నిబంధనలు వర్తిస్తాయంటూ గత ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రకటించారు. ఈ ప్రకటనతోనే ఇరు రాష్ట్రాల్లో ఈ వివాదం మొదలైంది.