DailyDose

ఎమ్మెల్యే ఆర్కే రోజా భర్తపై అరెస్టు వారెంట్‌

ఎమ్మెల్యే ఆర్కే రోజా భర్తపై అరెస్టు వారెంట్‌

పరువునష్టం కేసులో విచారణకు హాజరుకాకపోవడంతో ప్రముఖ దర్శకుడు, దక్షిణభారత చలనచిత్ర కార్మిక సంఘాల సమ్మేళనం అధ్యక్షుడు, ఎమ్మెల్యే రోజా భర్త ఆర్కే సెల్వమణిపై అరెస్టు వారెంట్‌ జారీచేస్తూ చెన్నై జార్జిటౌన్‌ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. 2016లో సెల్వమణి, కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే అరుళ్‌ అన్బరసు ఓ టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సమయంలో ఫైనాన్షియర్‌ ముకుంద్‌చంద్‌ బోద్రా గురించి పలు అభిప్రాయాలు వెల్లడించారు. దీంతో బోద్రా వారిద్దరిపై జార్జిటౌన్‌ కోర్టులో పరువునష్టం దావా వేశారు. బోద్రా మృతిచెందాక, కేసును అతని కుమారుడు గగన్‌ బోద్రా కొనసాగిస్తున్నారు. ఈ కేసు మంగళవారం విచారణకు రాగా, సెల్వమణి, అరుళ్‌ అన్బరసులు కోర్టుకు హాజరుకాలేదు. వారి తరఫున న్యాయవాదులు రాలేదు. దీంతో న్యాయమూర్తి వారిద్దరిపై బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీచేస్తూ విచారణను 23కు వాయిదా వేశారు.