WorldWonders

ఆ ఊర్లో మాంసాహారం వండరు.. తినరు!

ఆ ఊర్లో మాంసాహారం వండరు.. తినరు!

మాంసం అంటే లోట్టలేసుకుంటూ తినేవారిని చూసాం. ఆదివారం వచ్చిందంటే చాలు మాంసాహారం తినే ప్రతి ఇంట్లో చేపలు, చికెన్‌, మటన్‌ ఇలా వారి ఇష్టాన్ని బట్టి ఏదో ఒకటి తీసుకోవటం పరిపాటి అయ్యింది. కానీ ఇంకా మాంసం వండని గ్రామాలు, తినని ప్రజలు ఉన్నారంటే నమ్ముతారా? అంటే ఉన్నారనేదే నిజం. ఆ ఊర్లో మాంసాహారం వండరు, తినరు.. ఆ గ్రామ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

వివాహాలు, పుట్టిన రోజు ఇలా ఏ వేడుకైనా మాంసాహార వంటకాలు చేయడం మాములైపోయింది. తెలంగాణ ప్రాంతంలో అయితే ఇది ఒక ఆనవాయితీగా వస్తోంది. అలాంటి చోట మాంసం తినకుండా వేరే వారిని కూడా మాంసానికి, మద్యానికి దూరంగా ఉండాలని చెబుతున్నారు ఆ గ్రామ ప్రజలు. అదే నిర్మల్‌ జిల్లా ముధోల్‌ మండలం మచ్కల్‌ గ్రామం. ఈ గ్రామంలో సుమారు వెయ్యి మంది ఉంటారు. అన్ని కులాల వారు ఉండే ఈ గ్రామంలో… సుమారు 30, 40 సంవత్సరాల నుంచి ఏ విందు కార్యక్రమం నిర్వహించినా కేవలం శాకాహారమే తీసుకోవడం అలవాటైపోయింది. అది ఒక సాంప్రదాయంగా వస్తోంది. దీనిని ఆ గ్రామస్థులు అందరూ పాటిస్తున్నారు.

నా కళ్లతోటి చూడలేదు…
మా ఊరిలో మాంసం అసలే ముట్టరు. నా వయస్సు ఇప్పటివరకు 46 ఉంటుంది. నేను పుట్టిననాటి నుంచి మా ఊరిలో మేకను కోశారు అని నా కళ్లతోటి చూడలేదు. చాలా గ్రామాల్లో పిల్లలు వ్యసనాలకు లోనవుతున్నారు. దావత్​ల పేరుతో ఆరోగ్యాలను చెడగొట్టుకుంటున్నారు. ఇలా వెజిటేరియన్​గా ఉండి ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను.

ఈ గ్రామంలో జరిగే విందు కార్యక్రమాలలో ఎలాంటి మాంసం కానీ, మద్యాన్ని కానీ వీరు అతిథులకు అందించరు. దీంతో ఎలాంటి గొడవలు కూడా జరగవు. మా గ్రామంలాగే ఇతర గ్రామాల ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలని చెబుతున్నారు. ప్రస్తుత రోజుల్లో మాంసాహారంతో పోలిస్తే శాకాహారం తీసుకోవడం చాలా మంచిదని వైద్యులు సైతం సూచిస్తున్నారు. ఆరోగ్యానికి సంబంధించిన అన్ని విషయాల్లో కూరగాయలు, ఆకు కూరలు చాలా వరకు మేలు చేస్తాయని చెబుతున్నారు. వీటితో ఆరోగ్యానికి లాభం తప్ప నష్టం లేదని అంటున్నారు.