Devotional

ఆంజనేయుడు లేని రామాలయం ….- TNI ఆధ్యాత్మికం

ఆంజనేయుడు లేని రామాలయం ….- TNI ఆధ్యాత్మికం

1. రామాలయం లేని ఊరూ రామాయణం వినని వారూ ఉండరంటారు. దేశంలో ఏ రామాలయానికి వెళ్లినా రాముడి కుడివైపున లక్ష్మణుడు, ఎడమ వైపున సీతాదేవి, పాదాల దగ్గర నమస్కార భంగిమలో హనుమంతుడి విగ్రహాలు ర్శనమిస్తాయి. కానీ ఈ ఆలయంలో ఆంజనేయుడి విగ్రహం ఉండదు. అలాంటి అరుదైన ఆలయమే ఒంటిమిట్ట రామాలయం. ఏకశిలపైన సీతారామలక్ష్మణ విగ్రహాలున్న ఈ ఆలయంలో రాముడు యోగముద్రలో దర్శనమివ్వడం విశేషం. ఆంధ్రా అయోధ్యగా పిలిచే ఈ ఆలయం కడప జిల్లాలో ఉంది.ఆంధ్రా అయోధ్యగా అపర భద్రాద్రిగా గుర్తింపు పొందిన కడప జిల్లా ఒంటిమిట్ట రామాలయంలోని గర్భగుడిలో మనకు ఏకశిలపైన సీతారామలక్ష్మణ విగ్రహాలు కనిపిస్తాయి తప్ప హనుమంతుడి విగ్రహం ఉండదు. ఈ ఆలయం బయట హనుమంతుడి గుడి విడిగా ఉంటుంది. కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో ఏటా జరిగే సీతారామ కల్యాణాన్ని చూసేందుకు రెండు కళ్లూ చాలవంటారు.
**స్థలపురాణం
ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి వివిధ కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒకప్పుడు ఒంటిమిట్ట కీకారణ్యంలా ఉండేదట. పద్నాలుగేళ్ల వనవాస సమయంలో రాముడు సీతా లక్ష్మణ సమేతుడై ఈ అరణ్యంలోనూ కొంతకాలం గడిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో మృకండు, శృంగి అనే మహర్షుల ఆశ్రమం ఇక్కడే ఉండేదట. వాళ్లు చేసే యజ్ఞయాగాలకు రాక్షసులు ఆటంకం కలిగించడంతో రాముడు వాళ్లను హతమార్చి యాగరక్షణ చేశాడట. అందుకు ప్రతిగా ఈ మహర్షులు ఏకశిలపైన సీతారామ లక్ష్మణుల విగ్రహాలను చెక్కించారనీ… అయితే ఆ తరువాత రాముడి భక్తుడైన జాంబవంతుడు ఆలయం నిర్మించి ఆ విగ్రహాలను అందులో ప్రతిష్ఠించాడనీ అంటారు.ఈ ఆలయానికి సంబంధించి మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది.
ఈ ప్రాంతంలో ఒంటడు, మిట్టడు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారట. బోయవాళ్లైన వీళ్లు ఈ అటవీప్రాంతాన్ని సంరక్షించేవారు. ఓసారి ఈ ప్రాంతానికి ఉదయగిరిని పాలించే కంపరాజు వచ్చాడు, ఈ అన్నదమ్ములు రాజుకు అన్నిరకాల సేవలు చేయడమే కాక చుట్టూ ఉన్న ప్రాంతాలనూ చూపించారు. ఆ రాజు ఆనందించి ఏదయినా కోరుకోమని చెప్పగా, ఇక్కడ రామాలయం కట్టించమని అడిగారట. రాజు ఈ ప్రదేశాన్ని మొత్తం పరిశీలించి గుడి కట్టేందుకు అవసరమైన నిధుల్ని అందించి ఆ బాధ్యతను వీళ్లకే అప్పగించి వెళ్లిపోయాడు. దాంతో వీళ్లిద్దరూ ఎంతో భక్తిశ్రద్ధలతో కొన్నేళ్లు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించారట. వాళ్లిద్దరూ కట్టించడం వల్లే ఈ ఆలయానికి ఒంటిమిట్ట రామాలయం అనే పేరు వచ్చిందని అంటారు. ఆ తరువాత ఉదయగిరి రాజు సోదరుడైన బుక్కరాయలు తన దగ్గరున్న నాలుగు సీతారామలక్ష్మణ ఏకశిల విగ్రహాల్లో ఒకదాన్ని ఈ ఆలయంలో ప్రతిష్ఠించాడని చెబుతారు. అలాగే ఈ ఆలయ నిర్మాణ సమయానికి రాముడికి హనుమంతుడు పరిచయం కాలేదనీ.. అందుకే ఇక్కడ హనుమంతుడి విగ్రహం లేదనే కథ కూడా ప్రచారంలో ఉంది. ఈ ఆలయంలోని రామతీర్థాన్ని రాముడే సీతకోసం ఏర్పాటుచేశాడని అంటారు. మొదట ఆ తీర్థాన్ని రామబుగ్గ అనేవారనీ.. క్రమంగా అదే రామతీర్థం అయ్యిందనీ చెబుతారు. ఎందరో రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినా… ఆంధ్రా వాల్మీకిగా గుర్తింపు పొందిన వావిలికొలను సుబ్బారావు అనే రామభక్తుడు ఈ రామాలయాన్ని పునరుద్ధరించినట్లు చరిత్ర చెబుతోంది. స్వామికి విలువైన ఆభరణాలను సమకూర్చేందుకు ఆ భక్తుడు టెంకాయ చిప్పను పట్టుకుని భిక్షాటన చేసి సుమారు పది లక్షల రూపాయలు సేకరించాడట.
**విశేష పూజలు
మూడు గోపుర ద్వారాలున్న ఈ ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులుంటుంది. ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహించడంతోపాటూ శ్రీరామనవమి సమయంలో తొమ్మిది రోజులపాటు ప్రత్యేక ఉత్సవాలను చేస్తారు.
చతుర్దశినాడు కల్యాణం, పౌర్ణమిరోజు రథోత్సవం నిర్వహిస్తారు. అదేవిధంగా నవమి రోజున పోతన జయంతి పేరుతో కవిపండితులను సత్కరించడాన్ని ఓ సంప్రదాయంగా పాటిస్తారు.

2. గోరఖ్‌నాథ్‌ ఆలయం వద్ద కలకలం
ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ గోరఖ్‌నాథ్‌ ఆలయం వద్ద దుండగుడి హల్‌చల్‌తో కలకలం రేగింది. ముర్తజా అబ్బాసీ అనే ఐఐటీ గ్రాడ్యుయేట్‌ సోమవారం సాయంత్రం ప్రధాన ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించాడు. అడ్డుకున్న ఇద్దరు భద్రతా సిబ్బందిని వెంట తెచ్చుకున్న కొడవలితో గాయపరిచాడు. భద్రతాసిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీనిని ఉగ్రకుట్రగా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఆ సమయంలో భక్తులతో ఆలయ ప్రాంగణం నిండి ఉందని పోలీసులు తెలిపారు. పథకం ప్రకారమే అక్కడికి చేరుకున్న ముర్తజా ఆలయం లోపలికి ప్రవేశించి ఉంటే జరిగే పరిణామాన్ని ఊహించలేమన్నారు. అతడి వద్ద లభ్యమైన పత్రాలు సంచలనం కలిగించేవిగా ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ముర్తజాను స్థానిక కోర్టు రెండు వారాల జ్యుడిషియల్‌ కస్టడీకి అనుమతించింది. ముర్తజా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని అతడి తండ్రి మునీర్‌ అంటున్నారు.

3.నేటినుంచి మదురైలో చిత్తిరై ఉత్సవాలు – 14న తిరుకల్యాణం, 15న రథోత్సవం
రెండేళ్ల అనంతరం ప్రపంచ ప్రసిద్ధి చెందిన మదుర మీనాక్షి అమ్మవారి ఆలయ చిత్తిరై ఉత్సవాలు మంగళవారం ధ్వజారోహణంతో ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకొని రథానికి మరమ్మతులు, మాఢవీధులు, ఆలయ ప్రాంగణాలను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. 12 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలు మంగళవారం ఉదయం ధ్వజారోహణంతో ప్రారంభం కానున్నాయి. ఆ రోజు నుంచి మీనాక్షి, సుందరేశ్వరస్వామి, పంచమూర్తులు ఉదయం, రాత్రి వేళల్లో వేర్వేరు వాహనాల్లో మాడ వీధుల్లో విహరించనున్నారు. ఉత్సవాల్లో ప్రధానాంశాలైన మీనాక్షి అమ్మవారి పట్టాభిషేకం 12న, అలాగే, 14వ తేదీ తమిళ సంవత్సరాది రోజున మీనాక్షి-సుందరేశ్వరర్‌ తిరుకల్యాణం నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం పశ్చిమ, దక్షిణ వీధుల కూడలిలోని కల్యాణమండపంలో అమ్మవారి కల్యాణోత్సవం జరుగనుంది. ఇందుకోసం భారీ పందిళ్లు ఏర్పాటుచేశారు. తిరుకల్యాణం రోజున భక్తుల సౌకర్యార్ధం రూ.200, రూ.500 దర్శన టిక్కెట్లతో పాటు, దక్షిణ గోపురం గుండా ఉచిత దర్శనానికి 12 వేల మందిని మాత్రమే అనుమతించనున్నారు. దర్శన టిక్కెట్లను భక్తులు www.maduraimeenakshi.Org అనే వెబ్‌సైట్‌ ద్వారా ఈ నెల 7వ తేది వరకు పొందవచ్చు. తిరుకల్యాణం అనంతరం మీనాక్షి అమ్మవారు పుష్ప పల్లకీలో విహరించనున్నారు. అనంతరం 15వ తేది రథోత్సవం, 16న తీర్థవారి జరుగుతుందని ఆలయ ట్రస్టీ కరుముత్తు కన్నన్‌, జాయింట్‌ కమిషనర్‌ చెల్లదురైలు తెలిపారు.

4. కోవెలమూడి రామాలయంలో శ్రీరామనవమి వేడుకలపై వివాదం
కోవెలమూడి రామాలయంలో శ్రీరామనవమి వేడుకలపై వివాదం రాజుకుంది. హోంమంత్రి సుచరిత సొంత నియోజకవర్గంలో వైసీపీ నేతలు, గ్రామస్తుల మధ్య ఈ వివాదం నెలకొంది. కోవెలమూడి రామాలయానికి వైసీపీ నేతలు తాళాలు వేశారు. ఇదేంటనీ ప్రశ్నించిన గ్రామస్తులపైకి వైసీపీ నేతలు దాడికి దిగారు. దాంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాల మధ్య వివాదంతో పోలీసులు గుడికి తాళాలు వేశారు. ఆలయంలో పూజలు చేయాలని తాళాలు అడిగినా పోలీసులు ఇవ్వడం లేదని గ్రామస్తులు అంటున్నారు.నవమి రోజు తామే తలంబ్రాలు పోయాలంటూ వైసీపీ నేతలు పట్టు బట్టారు.అందరం కలిసి పోసుకుందామన్న వైసీపీ నేతలు నిరాకరిస్తున్నారని గ్రామస్తులు చెప్పారు.