DailyDose

ఫేక్ కు బ్రేక్

ఫేక్ కు బ్రేక్

నకిలీ సమాచారం,
అసత్య వార్తల ప్రచారాన్ని కట్టడి చేసే దిశగా
కేంద్ర ప్రభుత్వం బలంగా కదులుతోంది.అందులో భాగంగా,తాజాగా
22 యూట్యూబ్ న్యూస్ చానెల్స్ పై నిషేధం విధించింది.
ఇలా.. యూట్యూబ్ ఛానల్స్ పై చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి కావడంతో ఈ అంశం వేడిగా మారింది.వీటిల్లో 18 భారతదేశానికి చెందినవి. మిగిలిన 4 పాకిస్థాన్ కేంద్రంగా నడిచే ఛానల్స్ గా తెలుస్తోంది. జాతీయ భద్రత,
విదేశీ వ్యవహారాలకు సంబంధించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నందుకు
ఈ నిర్ణయం తీసుకున్నట్లు
కేంద్ర సమాచార శాఖ వెల్లడించింది.భారత భద్రతా దళాలు,జమ్మూ కశ్మీర్ విషయాలు,మరికొన్ని సున్నితమైన అంశాలపై కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇష్టానుసారంగా వార్తలు ప్రసారం చేస్తున్నాయి,విపరీత ధోరణులతో వ్యాఖ్యానాలు చేస్తున్నాయి.భారత్ కు వ్యతిరేకంగా,పాకిస్థాన్ కేంద్రంగా ఛానల్స్ నడుపుతూ విషప్రచారం చేస్తున్న సామాజిక మాధ్యమాలు కొన్ని ఉన్నాయి. ఇటువంటివాటిపై
కేంద్ర ప్రభుత్వం బలమైన నిఘా పెట్టింది.గతంలో కేరళకు చెందిన ఒక శాటిలైట్ ఛానల్, డిజిటల్ మీడియాపై కూడా ఇదే తీరున కేంద్రం చర్యలు చేపట్టింది.ఆ మీడియా ప్రసారాల అనుమతికి సంబంధించిన రెన్యూవల్ ను కేంద్ర సమాచార శాఖ నిలిపి వేసింది.
కొత్త అనుమతులను మంజూరు చేయడంలోనూ, పాతవాటిని రెన్యూవల్ చేయడంలోనూ
కేంద్ర సమాచార ప్రసార శాఖ
గతం కంటే కఠినంగా వ్యవహారిస్తోంది.పత్రికలు, న్యూస్ ఛానల్స్,సామాజిక మాధ్యమాలపై గతంలో ఎన్నడూ లేనంతగా కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిఘాను ముమ్మరం చేశాయి.
యూట్యూబ్ ఛానల్స్ కు
ఇంకా అధికారికమైన మీడియా గుర్తింపు రాలేదు.’ మీడియా యక్రిడిటేషన్ కార్డ్స్’ ను కూడా
ఏ ప్రభుత్వం మంజూరు చేయడం లేదు.ఇవ్వేమీ లేకపోయినా,ఎవరికి ఇష్టమొచ్చిన రీతిలో వారు యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ నడుపుకుంటున్నారు.వాళ్ళకు నచ్చిన వ్యాఖ్యలు చేసుకుంటూ,వార్తలు ప్రసారం చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ఈ తీరుపై ప్రభుత్వాలతో పాటు సాధారణ వీక్షకులు కూడా మండిపడుతున్నారు. క్రమశిక్షణాయుతంగా ఉంటే? ఎవరైనా స్వాగతిస్తారు.
ఎక్కువమంది విశృంఖలంగా ప్రవర్తిస్తూ ఉండడం వల్లే ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి,నిఘాను పెంచుతున్నాయి.
కొన్ని సంస్థలు,కొందరు వ్యక్తులు ఎంతో హుందాగా నడపడమే కాక,
గొప్ప సమాచారాన్ని,
గొప్ప జ్ఞానాన్ని,
మంచి వినోదాన్ని అందిస్తున్నారు.అటువంటి యూట్యూబ్ ఛానల్స్ ప్రసారం చేసే కార్యక్రమాల వల్ల సమాజానికి మంచి జరుగుతోంది.
కొన్ని సంప్రదాయ న్యూస్ ఛానల్స్ కంటే కూడా
కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చాలా మంచి సమాచారాన్ని ప్రపంచానికి అందిస్తున్నాయి.
బాధ్యతగా మెలుగుతున్నాయి.
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న యూట్యూబ్ ఛానల్స్ పై నియంత్రణ ఉండడం అత్యవసరం.ఇప్పుడు నిషేధానికి గురైన ఈ 22 ఛానల్స్ కు 260 కోట్ల వ్యూస్ ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.ఈ తరహా ప్రమాదకరమైన ఛానల్స్ ఇంకా ఎన్ని ఉన్నాయో?
అనే అనుమానాలు చుట్టుముట్టుతున్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యక్తులు,వ్యవస్థలపై కఠినమైన చర్యలు తీసుకొని తీరాలి.
మాధ్యమం ఎన్ని రూపాలు ఎత్తినా… దేశ సమగ్రతకు, జాతీయ భద్రతకు ప్రమాదం కాకూడదు.చెడ్డ మీడియాపై చర్యలు తీసుకోవడం ఎంత ముఖ్యమో,మంచి మీడియాను ప్రోత్సాహించడం అంతే ముఖ్యం.సాంకేతిక విప్లవాన్ని స్వాగతించి తీరాలి.
ఈ క్రమంలో, బాధ్యతాయుతమైన యూట్యూబ్ ఛానల్స్ కు కేంద్ర, రాష్ట్ర సమాచార శాఖలు అధికారిక గుర్తింపును ఇవ్వాలి. మిగిలిన సంప్రదాయ మీడియాకు వలె ‘ అక్రిడిటేషన్ కార్డ్స్’ మంజూరు చెయ్యాలి. ప్రకటనల రూపంలో ఆదుకోవాలి.అన్నింటిని దృష్టిలో పెట్టుకొని,సమగ్రమైన విధివిధానాలను
రూపొందించాలి.
ఆన్ లైన్,డిజిటల్ మీడియా విషయంలో కొన్ని మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. యూట్యూబ్ ఛానల్స్ విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.అసలు! ఇంత వరకూ శాటిలైట్ న్యూస్ ఛానల్స్ కే, ‘ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియా’ నుంచి గుర్తింపు లేదు.
జర్నలిస్ట్ సంఘాలు ఎన్నో ఏళ్ళ నుంచి ఉద్యమాలు చేస్తున్నా… ఇంత వరకూ పరిష్కారం లభించలేదు.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం
ఈ విషయాలన్నింటిపై దృష్టి సారించాలి.అదే విధంగా,
ప్రామాణికత,విశ్వసనీయతకు పెద్దపీట వెయ్యాలి.
వాక్ స్వాతంత్య్రం,రాజ్యాంగ హక్కులకు రక్షణ కల్పించడం ఎంత ముఖ్యమో, అక్రమార్కుల అంతుచూడడం కూడా అంతే ముఖ్యం.
యూట్యూబ్ ఛానల్స్ చూసి నేరాలు ఘోరాలు చేసేవారు ఉన్నారు.జీవితాలను చక్కదిద్దుకున్నవారు ఉన్నారు. మొత్తం మీడియా వ్యవస్థపై ప్రభుత్వాలు సమగ్రమైన దృష్టిని కేటాయించాలి. సమస్యలకు పరిష్కార మార్గాలను కనిపెట్టాలి. ఇప్పటికైనా రథం కదులుతుందని ఆశిద్దాం.-