Agriculture

ఆ పల్లెల్లో అంతా ప్రకృతి సేద్యమే!

ఆ  పల్లెల్లో అంతా ప్రకృతి సేద్యమే!

‘అమాయకమైన మనసుకే నిండైన ప్రేమ అంటే ఏమిటో తెలుస్తుంది..’’ అంటాడు ఓ తత్వవేత్త. విజయనగరం జిల్లా మారుమూల గ్రామాల్లోని గిరిజన రైతులను చూస్తే ఈ మాట ఎంత నిజమో తెలుస్తుంది. రసాయనిక వ్యవసాయం వల్ల మనకు, పశుపక్ష్యాదులకు, ప్రకృతికి ఎంత హాని జరుగుతోందో అర్థం చేసుకున్న ఆ అన్నదాతలు వెనువెంటనే ప్రకృతి వ్యవసాయంలోకి మారిపోయారు. ఒకరు, ఇద్దరు.. పది మంది కాదు.. ఊళ్లకు ఊళ్లే ఒకటి తర్వాత మరొకటి పూర్తిగా ప్రకృతి సేద్య గ్రామాలుగా మారిపోతున్నాయి (వీటినే అధికారులు ‘బయో గ్రామాలు’గా పిలుస్తున్నారు). కొండబారిడితో ప్రారంభమైన బయో గ్రామాల ప్రస్థానం మూడేళ్లలో 93కు చేరింది.

మరికొన్ని గ్రామాలు ఈ వరుసలో ఉన్నాయి. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు ఒక్క గ్రాము కూడా వాడకుండా నేల తల్లికి ప్రణమిల్లుతున్నాయి. బయో గ్రామాల చిన్న, సన్నకారు రైతులు ప్రకృతిని ప్రేమిస్తూ ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా, పర్యావరణ పరంగా దినదినాభివృద్ధి సాధిస్తుండటం చాలా గొప్ప సంగతి.

కొండబారిడి.. విజయనగరం జిల్లా కురుపాం మండలంలో మారుమూల పల్లె. నాడు నక్సల్‌బరి ఉద్యమానికి పురుడు పోసిన ‘కొండబారిడి’ గ్రామామే.. నేడు సంపూర్ణ ప్రకృతి వ్యవసాయ విప్లవానికి నాంది పలికింది. పెద్ద ఎత్తున ప్రకృతి వ్యవసాయం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్‌లో కొండబారిడి ‘తొలి బయో గ్రామం’గా మారటం విశేషం. ప్రకృతి వ్యవసాయ ప్రేమికులకు పాఠశాలైంది. కొండబారిడి స్ఫూర్తితో తదుపరి రెండేళ్లలో కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాల్లో మరో 92 (2019లో 51, 2020లో మరో 41) గిరిజన గ్రామాలు వంద శాతం ప్రకృతి వ్యవసాయ గ్రామాలుగా మారాయి.

వరితో పాటు రాగి తదితర చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు సాగు చేస్తున్నారు. జీడిమామిడి తదితర తోటల్లోనూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించి సత్ఫలితాలు సాధిస్తున్నారు. బయో గ్రామాల్లో వరి, రాగి పంటలను ‘శ్రీ’ విధానంలోనే రైతులు సాగు చేస్తున్నారు. ‘అన్నపూర్ణ’ నమూనాలో ఇంటింకి అరెకరం స్థలంలో కూరగాయలు, పండ్లు తదితర 20 రకాల పంటలు పండిస్తున్నారు. 365 రోజులూ భూమికి ఆకుపచ్చని ఆచ్ఛాదన కల్పిస్తున్నారు.

గతంలో సేంద్రియ కర్బనం 0.5 శాతం మేరకు ఉండేది ప్రకృతి సేద్యం వల్ల రెండేళ్ల క్రితం 120 జీడిమామిడి తోటల్లో రెండేళ్ల క్రితం భూసార పరీక్షలు చేసినప్పుడు 0.75 శాతానికి పెరిగిందని జట్టు కార్యనిర్వాహక ట్రస్టీ డా. పారినాయుడు చెప్పారు. పండించిన ధాన్యాన్ని మహిళా స్వయం సహాయక బృందాల మహిళా రైతులు రోకళ్లతో దంచి కిలో రూ. 65 రూపాయలకు నేరుగా ప్రజలకు అమ్ముతూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. మూడు చోట్ల వీరి ఆహారోత్పత్తులను విక్రయించేందుకు స్టాల్స్‌ను తెరిచారు.

కొండబారిడి సహా మొత్తం 93 బయోగ్రామాల్లోని 3,690 మంది రైతులు 10,455 ఎకరాల్లో రైతులు పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. వీరంతా కాయకష్టం చేసుకునే చిన్న, సన్నకారు రైతులే. అంతా వర్షాధార సేద్యమే. వరి సాగు ఖర్చు ఎకరానికి రూ. 3 వేల నుంచి 4 వేల వరకు తగ్గింది. అంతకు ముందు ఎకరానికి 20 బస్తాల (75 కిలోల) ధాన్యం పండేది ఇప్పుడు 30 బస్తాలకు పెరిగింది. అంటే.. దాదాపు 40 నుంచి 50 శాతం అధిక దిగుబడి పొందుతున్నారు. పొల్లు లేకపోవడం, గింజ బరువు పెరగడంతో నికర బియ్యం దిగుబడితో పాటు రైతు ఆదాయం కూడా పెరిగింది.

93 బయో గ్రామాల్లో రైతులతో పాటు ప్రజలంతా ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆరోగ్యదాయక ఆహారం తింటూ ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటున్నారు. ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం.. బయో గ్రామాల్లో 98 మంది కోవిడ్‌ బారిన పడినప్పటికీ ఏ ఒక్కరూ చనిపోలేదు. మలేరియా కేసులు నమోదు కాలేదు. గత పదేళ్ల గణాంకాలు సేకరించగా.. బీపీ, షుగర్, కీళ్ల నొప్పులు వంటి ఆరోగ్య సమస్యల తీవ్రత 30–40% మేరకు తగ్గిందని డా. పారినాయుడు వివరించారు. మరో 83 గ్రామాల్లో 80% మంది రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లారని, వచ్చే రెండేళ్లలో ఈ గ్రామాలు కూడా పూర్తి బయో గ్రామాలుగా మారనున్నాయని ఆయన సంతోషంగా చెప్పారు.