Politics

గతిలేక మీతో బేరం ఆడాల్సి వచ్చింది – TNI రాజకీయ వార్తలు

గతిలేక మీతో బేరం ఆడాల్సి వచ్చింది  – TNI రాజకీయ వార్తలు

* పీఆర్సీ బాగాలేకపోవడం కాదని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్ అసోసియేషన్ సర్ణోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ 50 ఏళ్లగా ఒక్కటే యూనియన్‌గా నడపటం అభినందనీయమని కొనియడారు. సీఎం జగన్‌కు మనసులేక కాదని, గతిలేక మీతో బేరం ఆడాల్సి వచ్చిందని తెలిపారు. వైసీపీ అధికారంలోకి రావడంతో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ఉద్యోగులపై ప్రేమ లేకపోతే 27 శాతం ఐఆర్ ప్రభుత్వం ఎందుకు ఇస్తుందని పేర్ని నాని ప్రశ్నించారు. వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్ అసోసియేషన్ సర్ణోత్సవ వేడుకల్లో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌తో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ పాలనకు రెవెన్యూ అవసరమన్నారు. మన దేశంలో ఎక్కువ మొత్తం పన్నులు పరోక్ష విధానంలో వస్తున్నాయన్నారు. ఇంటిలిజెన్స్, లిటిగేషన్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. అప్పుడే వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. 2019 నాటి అప్పల భారం ఇప్పటి ప్రభుత్వంపై పడుతోందని బుగ్గన తెలిపారు. పీఆర్సీ అమలు చేయగలగుతామనే సీఎం ఉద్యోగులకు హామీ ఇచ్చారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇప్పుడు కాకపోతే తర్వాతైనా తమ ప్రభుత్వం ఉద్యోగులకు న్యాయం చేస్తుందని పేర్కొన్నారు. ఎన్నికలు వస్తుండటంతో ఉద్యోగులను వాడుకునేందుకు పార్టీలు వస్తున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి తప్పుబట్టారు

*ఆ ఆరోపణలు నిజం కాదు: గడల
తనపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ రావు అన్నారు. క్షుద్రపూజలో పాల్గొనట్టు తనపై వచ్చిన ఆరోపణలను శ్రీనివాస్ రావు ఖండించారు. ఈ వివాదం పై ఆయన స్పందించారు. సుజాత నగర్ ఎంపీపీ చేపట్టిన పూజలో మాత్రమే తాను పాల్గొనట్లు ఆయన తెలిపారు. అక్కడ జరిగింది క్షుద్రపూజ కాదని, కేవలం హోమం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. తనకు ఎలాంటి రాజకీయాలు అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ వివాదంలో చిక్కుకున్నారు. ఖమ్మంలో డీహెచ్‌ శ్రీనివాస్‌ క్షుద్రపూజలు చేసినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దేవుడు కరుణిస్తాడంటూ డీహెచ్‌ విచిత్ర పూజలు నిర్వహించారు. దేవతనని ప్రకటించుకున్న టీఆర్‌ఎస్‌ ఎంపీపీ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అయితే విషయం బయటకు రావడంతో డీహెచ్‌ శ్రీనివాస్‌ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ ఎంట్రీ కోసమే క్షుద్ర పూజలంటూ ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా కొత్తగూడెంలో డీహెచ్‌ విస్తృతంగా పర్యటిస్తున్నారు. సుజాతనగర్ మండలం సింగభూపాలెంలో కొత్త దేవత వెలిసిన సంగతి తెలిసిందే. దేవత అవతారంలో సుజాతనగర్ ఎంపీపీ భూక్యా విజయలక్ష్మి ప్రత్యక్ష్యమయ్యారు. ప్రత్వంగిర మాత అనే కొత్త దేవత అవతారంలో ఎంపీపీ విజయలక్ష్మి దర్శనమిచ్చారు. దీంతో కొత్త దేవతకు ఎండు మిరపకాయలతో హోమాన్ని భక్తులు నిర్వహించారు. ఈ హోమంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడిల శ్రీనివాస్ రావు పాల్గొన్నారు. కొత్త దేవత చుట్టూ ఎంపీటీసీలు, సామాన్య ప్రజల ప్రదక్షిణలు చేస్తున్నారు

*ప్రజా సమస్యలపై పోరాడాలని రాహుల్‌ చెప్పారు: జగ్గారెడ్డి
ప్రజా సమస్యలపై పోరాడాలని ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీ చెప్పారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. బుధవారం రాహుల్‌తో జగ్గారెడ్డి భేటీ అయ్యారు. అనంతరం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎంలపై పోరాడాలన్నారని తెలిపారు. కాంగ్రెస్‌ అధికారమే లక్ష్యంగా పనిచేయాలన్నారని, పార్టీలో అంతా ఐకమత్యంగా ఉండాలని రాహుల్‌ చెప్పారని పేర్కొన్నారు. మనమంతా ఒక కుటుంబం అని ఆయన చెప్పారని, పార్టీలో విభేదాల గురించి తాను మాట్లాడలేదని వెల్లడించారు. రాహుల్‌ గైడ్‌లైన్స్‌ ప్రకారం ముందుకెళ్తామని జగ్గారెడ్డి ప్రకటించారు

*పవన్‌ క్లారిటీ లేని నాయకుడు: బాలినేని
జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ క్లారిటీ లేని నాయకుడని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఒంగోలు నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమలకు శంకుస్థాపనలు చేసేందుకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఇష్టమని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లకు ఏం చేయాలో అర్థం కావడం లేదన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో విద్యుత్‌ చార్జీలు పెంచామని, గతంలో రూ.68వేల కోట్లు చంద్రబాబు అప్పులు చేసి వెళ్లడం వల్లే భారం పడిందని తెలిపారు. తెలంగాణలో రూ.5వేలు కోట్లు ప్రజలపై భారం వేశారని, ఏపీలో రూ.1800 కోట్లు మాత్రమేభారం పడిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పోలవరం ప్రాజెక్టు గురించి చర్చించేందుకు ప్రధాని మోదీని సీఎం జగన్‌ కలిశారని బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు.

*2024 లో ఒక్క అవకాశం ఇవ్వండి: నారా లోకేష్వ
చ్చే 2024 అసెంబ్లీ ఎన్నికలలో తనకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండని మంగళగిరి నియోజకవర్గ ప్రజలను టీడీపీ నాయకుడు నారా లోకేష్ అభ్యర్థించారు. మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ మూడేళ్లలో జగన్ కేబినెట్ ఏం పీకిందని ఆయన మండిపడ్డారు. వచ్చే కొత్త క్యాబినెట్ ఏం పీకుతుందని ఆయన ప్రశ్నించారు. జగన్ రెడ్డి జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత ఆయనలో రౌడీ లక్షణాలు పెరిగాయని ఆరోపించారు.

*పాలనకు రెవెన్యూ అవసరం: మంత్రి బుగ్గన
పాలనకు రెవెన్యూ అవసరమని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. నగరంలో జరిగిన ఏపీ వాణిజ్య పన్నుల శాఖ స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. పాలనకు రెవిన్యూ అవసరమని, మొదట్లో ల్యాండ్ నుంచి ఇది వచ్చేదని ఆయన తెలిపారు. మన దేశంలో ఎక్కువ మొత్తం పన్నులు పరోక్ష విధానంలో వస్తున్నాయన్నారు. ఇంటిలిజెన్స్, లిటిగేషన్ల పై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. అప్పుడే వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి రాష్ట్రం లో మనం తీసుకోవడానికి అంతో ఇంతో మంచి పద్ధతులు ఉన్నాయన్నారు. ప్రతి ఉద్యోగి కనీసం ఒక నెల కమర్సియల్ టాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేయాలని ఆయన సూచించారు. అప్పుడే ఆ ఉద్యోగికి సంపాదన ఎంత కష్టమో తెలుస్తుందన్నారు. రియల్ బిజినెస్ డెవలప్మెంట్ అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కాలంలో ప్రారంభం అయిందని, శ్రీ సిటీ అప్పుడే వచ్చిందని ఆయన తెలిపారు. 2019 లో అప్పులు పెండింగ్ ఉండిపోవడంతో ఆ ప్రభావం ఇప్పటికీ పడుతోందన్నారు. 2019 తరువాత మనం ఎగుమతులలో 7 వ స్థానం నుంచి 4 వ స్థానానికి చేరుకున్నామన్నారు. సీఎం జగన్ నేతృత్వంలోని ఈ ప్రభుత్వం అందరి సంక్షేమం చూస్తుందని ఆయన అన్నారు.

*అభివృద్ధి, సంక్షేమాల‌కు కేసిఆర్ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి వుంది: ఎర్రబెల్లి
అభివృద్ధి, సంక్షేమాల‌కు ముఖ్యమంత్రి కేసిఆర్ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అందులో భాగంగానే ప్ర‌భుత్వ స్థ‌లాల్లో ల‌బ్ధిదారుల‌కు ఇండ్లు నిర్మించి ఇచ్చార‌న్నారు. బుధవారం జిల్లాలోని ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గం ఆత్మ‌కూరు మండ‌లం క‌టాక్ష‌పూర్ గ్రామంలో నూత‌నంగా నిర్మించిన 60 డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల‌ను మంత్రి ఎర్రబెల్లి ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డితో క‌లిసి ప్రారంభించారు.ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే పేద వారికి సొంతింటి కల నిజమవుతోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు పేదలకు ఇండ్ల నిర్మాణం చేసి ఇస్తున్నారని అన్నారు

*సీఎం జగన్‌ది మూర్ఖత్వ నిర్ణయం: శరద్ పవార్
మహారాష్ట్రలో రెండు శాసన రాజధానులు ఉన్నాయి. వాటినే మేము వృధా అనుకుంటున్నాం. అలాంటిది కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి మూడు రాజధానులా? ఇదేలా సాధ్యం? ఇది మూర్ఖత్వ నిర్ణయం.. మూడు రాజధానుల నిర్ణయాన్ని జగన్ ఎలా సమర్ధించుకుంటారు? అని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రశ్నించారు. మూడు రాజధానులపై పార్లమెంట్‌లో చర్చకు వస్తే అమరావతికే మద్దతు పలుకుతామని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నేత కొప్పుల రాజుతోనూ అమరావతి జేఏసీ నేతలు సమావేశమయ్యారు. రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ ఇప్పించాలని కోరారు. దీనిపై రాహుల్‌తో చర్చిస్తానని రాజు హామీ ఇచ్చారు. పలువురు కేంద్రమంత్రులతో అమరావతి జేఏసీ నేతలు సమావేశమయ్యారు. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ రంగం సంస్థల కార్యాలయాలను ఏర్పాటు చేయాలని, బిల్డ్ అమరావతికి సహకరించాలని అభ్యర్ధించారు

*అవినీతి రహిత పాలనే మా ధ్యేయం: సోము వీర్రాజు
బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విశాఖ ఉత్తర నియోజక వర్గంలో పార్టీ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అవినీతి రహిత పాలనే తమ ధ్యేయమని ‘సబ్ కా సాత్…సబ్ కా వికాస్’ బీజేపీ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు, స్థానిక నేతలు పాల్గొన్నారు

*వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నాశనం: పురందరేశ్వరి
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాల వల్ల రాష్ట్రంలో వ్యవస్థలన్నీ సర్వనాశనం అవుతున్నాయని బీజేపీ నాయకురాలు పురందరేశ్వరి అన్నారు.పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగావిజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె పార్టీ పతాకాన్ని ఎగుర వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ .. స్టీల్‌ప్లాంట్‌ విషయంలో ప్రజల ఆకాంక్షలను కేంద్ర పెద్దలకు వివరిస్తామని వెల్లడించారు.ఏపీలో కార్యక్రమాలు వేరైనా బీజీపీ, జనసేన మధ్య పొత్తు కొనసాగుతుందని, బీజేపీ ప్రణాళికల మేరకు వాటికి అనుగుణంగా పనిచేస్తామని పేర్కొన్నారు. మిత్రపక్షంగా పవన్‌ కల్యాణ్‌ మాతో చర్చిస్తే.. తాము కూడా స్పందిస్తామని ఆమె స్పష్టం చేశారు

*చంద్ర‌బాబు హ‌యాంలోనే మ‌ధుర‌వాడ భూ కేటాయింపులు : బొత్స
మ‌ధుర‌వాడ ఐటీ హిల్స్ భూముల కేటాయింపు టీడీపీ హ‌యాంలోనే జ‌రిగింద‌ని, ఇప్పుడు అడ్డ‌గోలుగా మాట్లాడుతున్నార‌ని ఏపీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ తీవ్రంగా మండిప‌డ్డారు. ఎన్‌సీసీ కంపెనీకి 2005 అక్టోబ‌ర్ 10 న అప్ప‌టి టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలోనే ఈ నిబంధ‌న‌లు జ‌రిగాయ‌ని బొత్స స్ప‌ష్టం చేశారు. చంద్ర‌బాబు చేసిన త‌ప్పుల‌ను తాము స‌రిదిద్దుతున్నామ‌ని, అయినా టీడీపీ వాళ్లు త‌మ‌పైనే ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఫైర్ అయ్యారు. టీడీపీ ప్ర‌భుత్వ‌మే త‌ప్పులు చేసింద‌ని, పైగా వాళ్లే ధ‌ర్నాలు చేయ‌డం విడ్డూర‌మ‌ని ఎద్దేవా చేశారు. ఎన్‌సీసీకి సంబంధించిన భూముల వ్య‌వ‌హారంపై టీడీపీకి త‌లెత్తిన సందేహాల‌ను తీర్చ‌డానికి తాము సిద్ధంగా ఉన్నామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.ముందుగా జ‌రిగిన ఒప్పందాల‌కు విరుద్ధంగా 2013 సంవ‌త్స‌రానికి కూడా ఎన్‌సీసీ సంస్థ నిర్మాణాల‌ను ప్రారంభించ‌లేద‌ని, దీంతో ఒప్పందాలు ర‌ద్దు చేసుకోవాల‌ని అప్ప‌టి ప్ర‌భుత్వం భావించింద‌ని వివ‌రించారు. దీంతో స‌దురు కంపెనీ న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించింద‌ని వెల్లడించారు. అయితే అప్ప‌టి ప్ర‌భుత్వం ఆర్బిట్రేష‌న్‌కు వెళ్లాల‌ని అనుకుంద‌ని, ఎన్‌సీసీ కంపెనీ స్టేట‌స్ కో తెచ్చుకుంద‌న్నారు. ఇక ఈ భూముల‌పై చంద్ర‌బాబు హ‌యాంలోనే టూ మెన్ క‌మిటీని కూడా వేశార‌ని, ఈ భూముల విలువ 197 కోట్లుగా నిర్ధారించింద‌ని గుర్తు చేశారు. బిజినెస్ రూల్స్ ప్ర‌కారం ఓ కేబినెట్ తీసుకున్న నిర్ణ‌యాన్ని మ‌రో ప్ర‌భుత్వం ఏక‌ప‌క్షంగా రద్దు చేయ‌డం కుద‌ర‌ద‌ని మంత్రి తెలిపారు. అందుకే గ‌త ప్ర‌భుత్వంలో ద్విస‌భ్య క‌మిటీ నిర్ధ‌రించిన రేటు ప్ర‌కార‌మే జీవో నెంబ‌ర్ 67 జారీ చేశామ‌ని బొత్స స్ప‌ష్టం చేశారు.

*టీడీపీపై కక్ష బోయలపై చూపొద్దు: లోకేశ్‌
టీడీపీపై ఉన్న కక్షను బోయలపై చూపొద్దని సీఎం జగన్‌కు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు. బోయలను ఎస్టీల్లో చేర్చేం‌‌‌‌ందుకు టీడీపీ ప్రభుత్వం చేసిన కృషిని కొనసాగించాలని కోరారు. ‘‘టీడీపీ హయాంలో వేసిన ప్రొఫెసర్‌ సత్యపాల్‌ కమిటీ నివేదిక ఆధారంగా బోయలను ఎస్టీల్లో చేర్చాలంటూ డిసెంబరు 1, 2017న కేంద్రానికి సిఫారసు చేస్తూ చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్‌ తీర్మానం ఆమోదించింది. బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఉభయసభలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేశాయి. ఆ సమాచారం 2018 సెప్టెంబరు 5నుంచీ కేంద్రం వద్దే పెండింగ్‌లో ఉంది’’ అని ఆ లేఖలో లోకేశ్‌ పేర్కొన్నారు. ‘‘టీడీపీ పంపిన తీర్మానాలపైనే చర్యలు తీసుకోవాలంటూ మీ ఎంపీలు ప్రధానిని కలిసి మూడేళ్లకు వినతిపత్రాలు ఇచ్చారు. చాలా సంతోషం. మీకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రం వద్దకు మీతోపాటు మేమూ వస్తాం’ అని జగన్‌కు లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు

*వైకాపా మరోసారి అధికారంలోకి రాదు: పవన్‌ కల్యాణ్‌
వైకాపా మరోసారి అధికారంలోకి రాదని, రాష్ట్రాన్ని 25 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిన ఆ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. మళ్లీ రాని ప్రభుత్వం కోసం అధికారులు తాపత్రయపడొద్దని పేర్కొన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో పవన్‌ మాట్లాడుతూ..‘‘ప్రభుత్వ వ్యతిరేక ఓట్లపై చాలా ఆలోచించే మాట్లాడా.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వం అంటే వైకాపాకు ఎందుకంత ఉలుకు? ఎవరి పల్లకీలు మోసేందుకు మేం లేం. జనసేన అంటే వైకాపా నేతలకు ఎందుకు భయం? మద్యాన్ని నిషేధిస్తామని చెప్పి ప్రత్యేక రేట్లకు ఎలా అమ్ముతారు? 2018లో కరెంటు ఛార్జీల పెంపును జగన్‌ వ్యతిరేకించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక మీరెందుకు కరెంటు ఛార్జీలు పెంచారు? ఇప్పుడున్నది కొత్త తరమని వైకాపా నేతలు అర్థం చేసుకోవాలి. చెత్తపన్ను పెంచారు. వేలాది మంది కౌలు రైతులు చనిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. విదేశాలకు వెళ్లే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ సదుపాయం రద్దు చేశారు. 100 మంది దగ్గర పన్నులు వసూలు చేసి మీరు అనుకున్న 35 నుంచి 40 మందికో ఇస్తే మిగతా 60.. 65 మంది ఏం కావాలి? కర్నూలు జిల్లాలోనే 353 మంది కౌలు రైతులు చనిపోయారు. అనంతపురంలో 170, ఉభయ గోదావరి జిల్లాల్లో 81 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అన్నం పెట్టే రైతుల్లో కులం చూడకూడదు. రైతులకు కులం లేదు.. వారికి అండగా నిలవాలి. రాష్ట్రంలో ఇన్ని వేల మంది రైతులు ఉన్నారు.. సాయం ఎలా చేస్తారని నన్ను అడిగారు. మనసు ఉండి కదిలించగలిగితే సాయం చేయెచ్చు. మొన్న సినిమా ద్వారా వచ్చిన డబ్బులో రూ.5 కోట్లు తీసుకొచ్చా. మనవంతు ఎంతో కొంత సాయం చేయాలి. గొప్ప గొప్ప చదువులు చదువుకున్న జాతీయ స్థాయి నాయకులు సొంత ఆస్తులు ఇచ్చేశారు. వైకాపా నేతల ధ్యాసంతా డబ్బు తీసుకోవడంపైనే ఉంది.. ఇవ్వడంలో లేదు. అన్నం తినే ప్రతి ఒక్కరూ రైతు కష్టం గురించి ఆలోచించాలి. ఈ నెల 12న అనంతపురం నుంచి కార్యక్రమం ప్రారంభిస్తాం.విభజన సమయంలో ఇంత మంది ఎంపీలు ఉండి విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనులు ఇవ్వాలని అడగలేదు. దాని ఫలితమే ఇవాళ ప్రైవేటీకరణ అంశం తెరపైకి వచ్చింది. ప్రైవేటికరణను జనసేన వ్యతిరేకిస్తుంది.. కార్మికుల తరఫున అండగా నిలబడతాం. క్రైమ్‌ రేట్‌ పెరుగుతుందంటే పాలనా వ్యవస్థ సరిగాలేదని అర్థం. పొత్తులో ఉన్నప్పుడు 70శాతం ఏకాభిప్రాయం ఉంటే చాలు. ఏకీభవించని అంశాలు చాలా ఉంటాయి. పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఉత్తరాంధ్రలో బలమైన ప్రాంతీయ కార్యాలయం ఉండాలని కోరుకుంటున్నా. ఇంత బలం ఉండి రాజాం పర్యటనకు వెళితే.. ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చారు. కానీ, వారిని ఉపయోగించుకోలేక పోయాం.. ముందుకు తీసుకెళ్లే నాయకత్వం ఇక్కడ లేదు. ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టి సారిస్తా’’ అని పవన్‌ పేర్కొన్నారు.

*కొబ్బరి చిప్పల దొంగకు దేవాదాయశాఖ ఇస్తే…: బుద్దా వెంకన్న
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కొబ్బరి చిప్పల దొంగకు దేవాదాయ శాఖ ఇస్తే.. కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ఆరోపించారు. వెల్లంపల్లిని మంత్రి పదవి నుంచి తొలగించే ముందు ఆయన దోచుకున్న రూ. 1525 కోట్లను సీఎం జగన్ రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. కొబ్బరి చిప్పలు దొంగిలించే వ్యక్తికి దేవాదాయశాఖ మంత్రి పదవి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయారని, దొంగలకు మంత్రి పదవులు ఇచ్చారని బుద్దా వెంకన్న ఆరోపించారు

*కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటాం..బాజాప్తా వరి వేయండి:ఇంద్రకరణ్ రెడ్డి
రాష్ట్రంలోని వ‌రి ధాన్యం కొనుగోలు చేసేవరకు కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుపై కొట్లాడుతామ‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. తెలంగాణ‌లో యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని పంజాబ్ త‌ర‌హాలో కేంద్ర ప్ర‌భుత్వ‌మే కొనుగోలు చేయాల‌ని డిమాండ్ చేస్తూ బుధ‌వారం నాగ్ పూర్ జాతీయ ర‌హదారిపై క‌డ్తాల్ జంక్ష‌న్ వ‌ద్ద రైతులు, టీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిదులు, కార్య‌క‌ర్త‌లు రాస్తారోకో నిర్వ‌హించారు. జాతీయ ర‌హ‌దారిపై బైటాయించి రైతుల‌ను అరిగోస పెడుతున్న కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. రైతుల ప‌క్షాతన ద‌ర్నా చేస్తున్న వారికి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సంఘీభావం తెలిపారు