Food

దాల్చిన చెక్క పుట్టినిల్లు!

దాల్చిన చెక్క పుట్టినిల్లు!

ఇప్పుడు అందరి దృష్టి శ్రీలంకపైనే ఉంది. అక్కడ పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. ప్రజలు ధరలను నియంత్రించాలంటూ రోడ్లపైకి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆ దేశ విశేషాలు తెలుసుకుందాం.

రెండు రాజధాని నగరాలు ఉన్న దేశం ఇది. ఒకటి కొలంబో, రెండోది శ్రీజయవర్ధనపుర. శ్రీలంకలో అతి పెద్ద నగరం కొలంబో. కొలంబో నగరంలో ఉన్న లోటస్‌ టవర్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. శ్రీలంకలో ఎత్తైన నిర్మాణం ఇదే. అంతేకాకుండా ఆసియాలో ఉన్న అతి ఎత్తైన 50 ఆకాశహర్మ్యాలలో ఇదొకటి. శ్రీలంక, ఇండియా మధ్య ఉన్న సముద్ర భాగాన్ని పాక్‌ జలసంధి అంటారు. ఈ దేశంలో అతి పొడవైన నది ‘మహావేలి’ఇక్కడి ప్రజలు ప్రధానంగా సింహళ, తమిళ , ఇంగ్లీషు భాషలు మాట్లాడతారు. ఈ దేశ కరెన్సీ శ్రీలంకన్‌ రూపీ. ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగిస్తున్న దాల్చినచెక్కలో 90 శాతం ఈ దేశం నుంచి ఎగుమతి అవుతున్నదే! క్రీ.పూ2000 సంవత్సరంలో ఈజిప్టియన్లు శ్రీలంకలో దాల్చినచెక్కను కనుగొన్నారు.ఇక్కడున్న కొన్ని వందల ఏళ్ల క్రితం నాటి జయశ్రీ మహా బోధి వృక్షం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. గౌతమబుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయిన సంగతి తెలిసిందే. ఆ వృక్షం కొమ్మను తెచ్చి క్రీ.పూ 288లో శ్రీలంకలో నాటారు. ఆ తరువాత రాజులు, బౌద్ధ బిక్షువులు ఆ చెట్టును సంరక్షిస్తూ వచ్చారు. శ్రీలంక జాతీయ క్రీడ క్రికెట్‌ అనుకుంటారు. క్రికెట్‌ బాగా ప్రాచుర్యం పొందిన ఆట మాత్రమే. ఆ దేశ జాతీయక్రీడ వాలీబాల్‌. అక్షరాస్యతా శాతం ఎక్కువగా ఉన్న దేశాల్లో ఇదొకటి. ఇక్కడ అక్షరాస్యత 92 శాతంగా ఉంది.ఈ దేశానికి రెండు నిక్‌నేమ్‌లున్నాయి. ‘పెరల్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఓసియన్‌’ అని, ‘టియర్‌డ్రాప్‌ ఆఫ్‌ ఇండియా’ అని పిలుస్తుంటారు.